యురోపియన్ వర్తక స్థావరాలు
భారతదేశానికి యూరప్‌తో ప్రాచీన గ్రీకుకాలం నుంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. మధ్యయుగం నుంచి యూరప్, భారత్, ఆగ్నేయాసియా మధ్య అనేక సముద్ర మార్గాల ద్వారా వ్యాపారం జరిగింది. తూర్పు దేశాల్లో లభించే సుగంధ ద్రవ్యాలకు యూరప్‌లో బాగా డిమాండ్ ఉండటంతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగేది. ముందుగా పోర్చుగీసువారు భారత్‌లో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం ప్రారంభించారు. ఆ తర్వాత డేన్లు, డచ్చివారు, ఆంగ్లేయులు, ఫ్రెంచివారు ఒకరి తర్వాత ఒకరు భారత్‌కు చేరుకుని వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు.
డేన్లు:
1620లో డెన్మార్క్ వర్తక సంస్థను స్థాపించి, తంజావూరులోని ట్రాంక్విబార్లో స్థావరం ఏర్పర్చుకున్నారు. 1676లో శ్రీరామ్పూర్ను సాధించుకున్నారు. భారత్‌లో వ్యాపారం పెద్దగా లాభించని కారణంగా 1845లో తమ స్థావరాలను అంగ్లేయులకు అమ్మేశారు.
డచ్‌వారు:
వీరు హాలండ్ దేశస్థులు. ఐరోపాకు తూర్పు నుంచి వాడుకలో ఉన్న సముద్ర వర్తక మార్గాలు పోర్చుగల్ ఆధీనంలో ఉన్నందున.. డచ్‌వారు పడమటి నుంచి సముద్ర మార్గాలను కనుగొని 1595, 1597, 1598, 1602లలో 15 సార్లు భారత్‌ను సందర్శించారు. కానీ ఇది లాభదాయకంగా లేదనితలచి పోర్చుగీస్ వారిని ప్రతిఘటించి తూర్పు సముద్ర మార్గాల ద్వారానే వర్తకం చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో వీరితోపాటు ఇంగ్లిష్‌వారు కూడా కలిశారు.
-1602లో డచ్‌వారు ఈస్టిండియా కంపెనీని స్థాపించారు. 1604-1605లో గోల్కొండ నవాబ్ అనుమతితో మచిలీపట్నం దగ్గర, తంజావూరు రాజు అనుమతితో 1608-1609లో గంగపట్టణంలో, పులికాట్లోనూ వర్తక స్థావరాలను ఏర్పర్చుకున్నారు. తర్వాత జహంగీర్ అనుమతితో చిన్సూర్లో కూడా తమ స్థావరాన్ని ఏర్పర్చుకున్నారు.
-అయితే వీరు భారత్‌తో వ్యాపారం కంటే ఆగ్నేయ-ఆసియా దేశాలతో వ్యాపారం మంచిదని, సుగంధ ద్రవ్యాల ద్వీపాలపై తమ అధికారాన్ని స్థాపించాలని ఆగ్నేయాసియాలో వ్యాపారం చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపించారు.
ఆంగ్లేయులు:
డచ్‌వారి అనంతరం దేశంలో వర్తక వ్యాపారం కోసం ఆంగ్లేయులు వలస వచ్చారు. 1600, డిసెంబర్ 31న బ్రిటన్ రాణి ఎలిజబెత్ అనుమతి పొంది ఈస్టిండియా కంపెనీ ఆఫ్ ఇంగ్లండ్‌ను నెలకొల్పారు. ఈ కంపెనీ 1608లో సూరత్వద్ద ఒక వర్తక స్థావరం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకుని కెప్టెన్ విలియం హాకిన్స్‌ను మొఘల్ చక్రవర్తి జహంగీర్ దర్బార్‌కు పంపించింది. ఇంగ్లండ్ రాజు జేమ్స్ పంపిన లేఖతో వచ్చిన కెప్టెన్ హాకిన్స్‌కు మొదట దర్బారులో ఉచిత మర్యాదలన్నీ జరిగాయి. మన్సబ్ హోదాతోపాటు జాగీరు కూడా ప్రసాదించబడింది. కానీ మొఘల్ దర్బార్‌లో మంచి పలుకుబడి కలిగిన పోర్చుగీస్ వారి కుతంత్రాలవల్ల జహంగీర్.. హాకిన్స్‌ను ఆగ్రా నుంచి బహిష్కరించాడు. దాంతో మొఘల్ ప్రభుత్వం నుంచి రాయితీలు రాబట్టడం సాధ్యం కాదని ఇంగ్లిష్‌వారికి అర్థమైంది. 1612లో ఒకసారి, ఆ తర్వాత 1614లోనూ ఇంగ్లిష్‌వారు సూరత్ సమీపంలో పోర్చుగీస్ నౌకాదళాన్ని ఓడించారు. సముద్ర జలాల్లో పోర్చుగీసుల బలాన్ని తిప్పికొట్టడానికి ఇంగ్లిష్వారిని ఉపయోగించుకోవచ్చనే భావం మొఘలులకు కలుగడానికి ఇంగ్లిష్‌వారి ఈ విజయాలు దోహదం చేశాయి. పైగా విదేశీ కొనుగోలుదార్ల పోటీ భారతీయ వర్తకులకు తప్పకుండా లాభిస్తుందనే భావంతో ఈస్టిండియా కంపెనీకి పడమటి తీరంలో అనేకచోట్ల వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి చక్రవర్తి ఫర్మానా లభించింది.
-అయితే ఈ ఫర్మానాతో ఆంగ్లేయులు తృప్తిపడలేదు. 1615లో సర్ థామస్ రో అనే రాయబారి మొఘల్ దర్బార్ చేరుకుని జహంగీర్‌తో చర్చించి, జహంగీర్ ఆర్థికశాఖ మంత్రి అసఫ్‌ఖాన్‌కు లంచం ఇచ్చి సూరత్‌లో వర్తక స్థావరం ఏర్పాటు చేశాడు. థామస్ రో 1615 నుంచి 1618 వరకు మొఘల్ దర్బార్‌లోనే ఉన్నాడు. అతడు ఈ సమయంలో ఎడ్వర్డ్ టెర్రీ అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథం జహంగీర్ కాలంనాటి భారతదేశ పరిస్థితులను వివరిస్తుంది. థామస్ రో భారత్ నుంచి వెళ్లిపోయే నాటికి ఇంగ్లిష్ వర్తక స్థావరాలు ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్లలో ఉన్నాయి. ఈ వర్తక స్థావరాలన్నీ సూరత్ స్థావర కౌన్సిల్ అధ్యక్షుడి ఆధీనంలో ఉన్నాయి. 1668లో బొంబాయిని కూడా ఆంగ్లేయులు సాధించారు. ఇంగ్లిష్ రాజు రెండో చార్లెస్‌కు పోర్చుగీస్ రాకుమారి కేథరిన్‌తో వివాహం సందర్భంగా పోర్చుగీస్ రాజు చార్లెస్‌కు కట్నంగా బొంబాయిని ఇచ్చారు. రెండో చార్లెస్ బొంబాయిని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చాడు.
-అయితే మొదటి నుంచి ఇంగ్లిష్ వర్తక సంస్థ తన వ్యాపారాన్ని, రాజకీయ చతురతని యుద్ధం, భూభాగ ఆక్రమణతో జతచేసింది. నిజానికి 1619లోనే సర్ థామస్ రో ఇంగ్లిష్ అధికారులకు ఒక సలహా చెప్పాడు. భవిష్యత్తులో భారత్‌తో బ్రిటిష్ సంబంధాలు రూపుదిద్దుకోవాల్సిన నమూనాకు ఆ సలహా ప్రాతిపదిక వేసింది. ఆ సలహా ఏమిటంటే ఒక చేత ఖడ్గం, మరో చేత రాజదూత దండం పట్టుకుని ఈ ప్రజలను బుద్ధిగా ఉంచవచ్చని నాకు తెలుసు. ఈ విషయంలో నేను మీకు హామీ ఇస్తున్నాను అని ఆయన రాశాడు. మనం ఏ ఆధారం నమ్ముకుని పని ప్రారంభించామో, ఏ ఆధారంతో మనం మనగల్గుతున్నామో దాని మీదనే ఇంగ్లిష్‌వారు ఆధారపడాలి అన్నాడాయన. దానిపేరే భయం. తామంటే భయమనేది ఉంటేనే నెగ్గుకు రాగలమని ఆయన భావం. దీనికి అనుగుణంగా ఆంగ్లేయులు 1625లో సూరత్‌లో తమ ఫ్యాక్టరీ చుట్టూ కోట కట్టుకోవాలని ప్రయత్నం చేశారు. మొఘల్ సామ్రాజ్యంలోని స్థానిక అధికారులు తక్షణం కంపెనీ ముఖ్య అధికారులకు సంకెళ్లు వేసి కారాగారంలో పెట్టారు. అదేవిధంగా వాళ్లు మొఘల్ నౌకల మీద దారిదోపిడీకి తెగించినప్పుడు దానికి ప్రతీకారంగా మొఘల్ అధికారులు కంపెనీ అధ్యక్షుడిని, ఆయన కౌన్సిల్ సభ్యులను జైల్లో వేశారు. 18,000 పౌండ్లు జరిమానా చెల్లించాక వారిని విడుదల చేశారు.
-ఇలాంటి సమయంలో ఆంగ్లేయులకు దక్షిణాదిన పరిస్థితులు అనుకూలంగా కనిపించాయి. ఎందుకంటే అక్కడ శక్తిమంతమైన స్వదేశీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన ఇబ్బంది లేదు. క్రీ.శ.1565లో విజయనగర మహాసామ్రాజ్యం అస్తమించింది. దాని స్థానంలో అనేక చిన్న, చితక రాజ్యాలు అవతరించాయి. వాళ్లని ప్రలోభ పెట్టడంగానీ, ఆయుధ బలంతో హడలగొట్టడంగానీ తేలిక. ఆంగ్లేయులు దక్షిణాదిన తమ మొదటి ఫ్యాక్టరీని క్రీ.శ.1611లో మచిలీపట్నంలో గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీకుతుబ్‌షా అనుమతితో ప్రారంభించారు. తర్వాత 1621లో పులికాట్లో, 1626లో ఆర్ముగాన్లో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. 1639లో మద్రాసును చంద్రగిరి పాలకుడి నుంచి గుత్తకు తీసుకున్నారు. ఆంగ్లేయులకు అక్కడ కోట కట్టుకోవడానికి, పరిపాలన జరుపుకోవడానికి, ఓడరేవు మీద సుంకాల ద్వారా వచ్చే రాబడిలో సగభాగం తనకు చెల్లించే షరతు మీద నాణేలు ముద్రించుకోవడానికి చంద్రగిరి రాజు సర్వాధికారాలు ఇచ్చాడు. ఇక్కడే ఆంగ్లేయులు తమ ఫ్యాక్టరీ చుట్టూ సెయింట్ జార్జ్ కోటను కట్టుకున్నారు. వీటితోపాటు కడలూరు, పోర్టోనోవా, విశాఖపట్నాల్లో కూడా ఆంగ్లేయులు వలసలను ఏర్పర్చుకున్నారు. కడలూరులో పోర్ట్ సెయింట్ డేవిడ్ కోటను నిర్మించారు.
-1645లో గేబ్రియల్ బౌటన్ అనే ఇంగ్లిష్ వైద్యుడు షాజహాన్ దర్బార్‌కు వచ్చి మెప్పు పొంది, బెంగాల్లో ఆంగ్లేయులు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి పొందాడు. ఫలితంగా పాట్నా, కాశీంబజార్, రాజ మహల్లో ఆంగ్లేయుల వర్తక స్థావరాలు ఏర్పడ్డాయి. కానీ బెంగాల్లో వ్యాపారంవల్ల ఆశించిన లాభాలను ఆంగ్లేయులు పొందలేకపోయారు. నాడు బెంగాల్, బీహార్, ఒడిశాలోని ఇంగ్లిష్‌వారి స్థావరాలు పోర్ట్ సెయింట్ జార్జి ఆధిపత్యం కింద పనిచేశాయి.
-1686లో ఔరంగజేబ్‌కు ఇంగ్లిష్‌వారికి మధ్య సంబంధాలు క్షీణించాయి. బెంగాల్‌లోని మొఘల్ గవర్నర్ షయిస్తఖాన్ వీరిపట్ల కఠినంగా వ్యవహరించాడు. దీంతో ఇంగ్లిష్‌వారు హుగ్లీని కొల్లగొట్టి, చక్రవర్తి మీద యుద్ధం ప్రకటించారు. ఈ విషయంలో ఇంగ్లిష్‌వారు మొఘల్‌ల బలాన్ని తక్కువ అంచనా వేశారు. ఔరంగజేబ్ మొఘల్ సామ్రాజ్యం ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ బలగం పరిస్థితి బ్రహ్మాస్త్రం బారినపడ్డ పిచ్చుక గుంపులా తయారైంది. ఆ యుద్ధం ఇంగ్లిష్వారిని విధ్వంసం చేసింది. మొఘల్లు ఇంగ్లిష్వారిని బెంగాల్లో వారి ఫ్యాక్టరీల నుంచి తరిమికొట్టారు. వారు గంగా ముఖద్వారంలో రోగాల పుట్టగా మారిన ఒక దీవిలో తలదాచుకోవాల్సి వచ్చింది. సూరత్, మచిలీపట్నం, విశాఖపట్నంలలోని ఇంగ్లిష్‌వారి ఫ్యాక్టరీలను మొఘల్లు ఆక్రమించుకున్నారు. బొంబాయి కోటను ముట్టడించారు. దీంతో మొఘల్ శక్తిని ఎదుర్కోగలిగే సత్తా తమకింకా రాలేదని ఆంగ్లేయులు గ్రహించి మళ్లీ ఆర్జీదార్ల అవతారమెత్తారు. తాము చేసిన నేరాలను క్షమించమని చేతులు జోడించారు. స్వదేశీ రాజుల రక్షణ కింద తాము మళ్లీ వ్యాపారం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకున్నారు. మొఘల్ చక్రవర్తి నుంచి వ్యాపార రాయితీలు పొందడానికి మళ్లీ వెనుకటి నాటకం మొదలు పెట్టారు. చక్రవర్తి ఉబ్బిపోయేలా తీపిమాటలు చెప్పి, అతి వినయం నటించారు.
-మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఇంగ్లిష్‌వారి తప్పులను అప్పటికప్పుడు క్షమించాడు. పైకి అమాయకంగా, నిరపాయకరంగా కనిపించే ఈ విదేశీ వర్తకులు ఏదోఒకనాడు దేశానికి పెద్ద పీడగా మారుతారనే విషయాన్ని ఔరంగజేబ్ ఊహించలేకపోయాడు. 1690 ఫిబ్రవరిలో జరిగిన ఒప్పందం ప్రకారం ఇంగ్లిష్‌వారు ఏడాదికి రూ.1,50,000 చెల్లించేలా, వారి వ్యాపారానికి మొఘలులు అనుమతించేలా అంగీకారం కుదిరింది. 1691లో బెంగాల్లో ఆంగ్లేయులకు వాణిజ్య సుంకాల నుంచి మినహాయింపు లభించింది. ఈ రాయితీకి ప్రతిఫలంగా వారు మొఘల్ ప్రభుత్వానికి ఏటా రూ.3000 కట్టడానికి ఒప్పుకున్నారు. 1698లో సుతానతి, కాలికట్, గోవిందపూర్ అనే మూడు గ్రామాల మీద ఆంగ్లేయులు రూ.1200కు జమీందారీ హక్కు పొందారు. ఈ మూడు గ్రామాలు క్రమేణా పెరిగి మహా పట్టణమై కలకత్తా మహానగరంగా రూపొందింది. ఇక్కడ ఆంగ్లేయులు సెయింట్ విలియం కోటను నిర్మించుకున్నారు. 1700లో బెంగాల్‌లోని ఆంగ్లేయుల వర్తక స్థావరాలన్నీ ప్రత్యేక పాలన కిందకు వచ్చాయి. బెంగాల్ పాలన కౌన్సిల్ ఆధీనంలోకి వచ్చింది. ఈ విధంగా ఆంగ్లేయులు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకుని వస్ర్తాలు, ఆహార ధాన్యాలు, వజ్రాలు, కలప, చందన ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, నీలి, నల్ల మందులు మొదలైన వస్తువులను దేశం నుంచి ఎగుమతి చేశారు.
ఫ్రెంచివారు:
దేశానికి వర్తక వ్యాపారం కోసం వచ్చిన చివరి యూరోపియన్ వర్తక సంఘం ఫ్రెంచి దేశపు వర్తక సంఘం. 1664లో 14వ లూయీ చక్రవర్తి ఆర్థికమంత్రి అయిన కోల్బర్ట్ ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించాడు. 1668లో దేశంలో ఫ్రెంచ్‌వారి మొదటి వర్తక స్థావరం సూరత్‌లో వెలిసింది. 1669లో మచిలీపట్నంలో వర్తక స్థావరం ఏర్పర్చుకోవడానికి గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్‌షా నుంచి అనుమతి పత్రాన్ని పొందారు. తర్వాత మద్రాస్ సమీపంలోని శాన్ధోమ్ను, సింహళంలోని టింకామలైను వశపర్చుకోవడానికి ఫ్రెంచివారు చేసిన ప్రయత్నాలన్నింటిని డచ్చివారు వమ్ముచేశారు. 1674లో తూర్పు తీరం వెంబడి కొంత స్థావరాన్ని సంపాదించుకుని అక్కడ పుదుచ్చేరి పట్టణాన్ని నిర్మించుకున్నారు. ఈ పుదుచ్చేరి ఫ్రెంచివారి వర్తక స్థావరాలకు కేంద్ర స్థానమైంది. కలకత్తాకు ఇరవై మైళ్ల దూరంలో బెంగాల్ నవాబు షయిస్తఖాన్ ఇచ్చిన చంద్రనాగూర్ ప్రాంతంలో వర్తక స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. అయితే 1693లో డచ్చివారు ఇండియాలోని ఫ్రెంచివారి స్థావరమైన పుదుచ్చేరిని ఆక్రమించుకుని ఆరేండ్లు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. 1697లో యూరప్‌లో జరిగిన రిస్వక్ సంధివల్ల పుదుచ్చేరి తిరిగి ఫ్రెంచివారి వశమైంది.
-1701లో ఫ్రాన్సిస్ మార్టిన్ దేశంలోని ఫ్రెంచివారి స్థావరాలకు డైరెక్టర్ జనరల్ అయ్యాడు. అప్పటికి సూరత్, మచిలీపట్నం, చంద్రనాగూర్, ఢక్కా, ఖాసీం బజార్, బాలాసోర్, పాట్నా, కాలికట్లలో ఫ్రెంచి స్థావరాలున్నాయి. వాటిని అభివృద్ధి చేయడంలో మార్టిన్ చాలా కృషిచేశాడు.1706లో ఫ్రాన్సిస్ మార్టిన్ మరణించిన తర్వాత దేశంలో ఫ్రెంచివారి పరిస్థితి కొంతకాలం క్షీణించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు