News Highlights | వార్తలు-విశేషాలు
తెలంగాణ…
రాష్ట్రంలో HCCB పెట్టుబడులు
హిందుస్థాన్ కోకకోలా బేవరేజెస్ (HCCB) కంపెనీ రాష్ట్రంలో రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సిద్దిపేట సమీపంలోని బండ తిమ్మాపూర్‌లో శీతల పానీయాలు, పండ్ల రసాలు, శుద్ధిచేసిన నీటి ప్యాకెట్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నది. అంతేగాక ఘన వ్యర్థాలు, వృథా జలాల నిర్వహణ, నైపుణ్య శిక్షణలో ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు ఏప్రిల్ 7న హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందంపై HCCB చైర్మన్, సీఈవో నీరజ్‌గార్గ్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ సంతకాలు చేశారు.
ఆరోగ్య శాఖలో 104 మందికి ప్రతిభా పురస్కారాలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 104 మందికి ఏప్రిల్ 6న ప్రతిభా పురస్కారాలను ప్రకటించారు. మెడికల్ కాలేజీలు మొదలు ఆశా కార్యకర్తల వరకు అన్ని స్థాయిల్లో వివిధ కేటగిరీల్లో ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ఉత్తమ ఆస్పత్రుల విభాగంలో గాంధీ ఆస్పత్రి నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, టిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ విమలా థామస్ ఎంపికయ్యారు.
వార్తల్లో వ్యక్తులు
డాక్టర్ అజయ్‌కుమార్
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్‌గా డాక్టర్ అజయ్‌కుమార్ నియమితులయ్యారు. కామారెడ్డి ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయన రెండు వారాల కిందట వైద్యవిధాన పరిషత్ ఇన్‌ఛార్జి సంయుక్త కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆ పదవిలో కొనసాగుతుండగానే కమిషనర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఏప్రిల్ 4న ఉత్తర్వులు జారీచేశారు.
మాండాజి నర్సింహాచారి
నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి వినూత్న ఆవిష్కరణ చేశారు. కరోనా, సార్స్, ఒమిక్రాన్, డెల్టా మొదలైన బ్యాక్టీరియాలు, వైరస్‌లను ఎలక్టాన్ల సాయంతో సంహరించే పరికరాన్ని రూపొందించారు. కరోనా మూలాన్ని తెలుసుకుని పలు ప్రయోగాలు చేసి ఈ పరికరాన్ని తయారుచేశారు. స్వల్ప సమయంలోనే ఇది వైరస్‌ను సంహరిస్తుంది. ఈ పరిశోధనకు సీసీఎంబీ, టీఎస్ఐసీ సహకరించాయి.
జాతీయం
తెలంగాణ అర్బన్ ఫారెస్ట్ లకు అంతర్జాతీయ గుర్తింపు
హరితహారంలో భాగంగా అమలుచేస్తున్న పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలకుగాను రాష్ట్రానికి ఏప్రిల్ 6న అంతర్జాతీయ గుర్తింపు లభించింది. హరితహారం కింద రాష్ట్రంలో 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేశారు. కేవలం హెచ్ఎండీఏ పరిధిలోనే 59 పార్కులున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిని అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించింది.
భారత్‌లో రికార్డు స్థాయికి కుబేరుల సంఖ్య
భారత్‌లో కుబేరుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ఏడాది క్రితం 140 మంది మాత్రమే ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 166కు పెరిగింది. వారి సంయుక్త సంపద దాదాపు 26 శాతం వృద్ధిచెంది 750 బిలియన్ డాలర్లకు (రూ.56.25 లక్షల కోట్లు) చేరుకుంది. ముకేశ్ అంబానీ సంపద కేవలం 7 శాతమే వృద్ధిచెందినా ఆసియాలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అయితే, ప్రపంచంలో పదోస్థానంలో ఉన్న ఆయన సంపద 90.7 బిలియన్ డాలర్లు. అంటే రూ.6.8 లక్షల కోట్లు. ఆ తర్వాత రూ.6.75 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు.
22 యూట్యూబ్ చానళ్లపై నిషేధం
అసత్య వార్తల వ్యాప్తికి పాల్పడుతున్న 22 యూట్యూబ్ చానళ్లపై కేంద్రం ఏప్రిల్ 5న నిషేధం విధించింది. దేశభద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. విదేశాలతో భారత సంబంధాలు, ప్రజాభద్రతపై ఆయా చానళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నది. కాగా, నిషేధానికి గురైన 22 యూట్యూబ్ చానళ్లలో 18 మనదేశంలోనే కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, నాలుగు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. పై వాటితోపాటు మూడు ట్విట్టర్ ఖాతాలు, ఓ ఫేస్బుక్ ఖాతా, ఓ వార్తా వెబ్‌సైట్‌ను కూడా నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దేశభద్రత సమగ్రత, సార్వభౌమత్వానికి ముప్పుగా మారుతున్నాయంటూ గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 78 యూట్యూబ్ చానళ్లు, పలు ఇతర సామాజిక మాధ్యమాలపై కేంద్రం నిషేధం విధించింది.
770 కిలోమీటర్ల రైల్వేలైన్ల విద్యుదీకరణ
డీజిల్ ఇంజిన్లతో పెరుగుతున్న వ్యయాన్ని, కాలుష్య సమస్యను తగ్గించడం కోసం మిషన్ ఎలక్టిఫికేషన్కు ప్రాధాన్యం ఇస్తున్న దక్షిణమధ్య రైల్వే (ఎస్సీఆర్) తాజాగా ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. 2021-22లో మొత్తం 770 కిలోమీటర్ల మేర రైల్వేలైన్లను విద్యుదీకరించింది.తెలంగాణలో 326 కిలోమీటర్లు, ఏపీలో 331 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 86.5 కిలోమీటర్లు, కర్ణాటకలో 26.5 కిలోమీటర్లు విద్యుదీకరించిన రైల్వే మార్గాలున్నట్లు ఏప్రిల్ 3న ఎస్సీఆర్ ప్రకటించింది.
వాయుసేన అమ్ములపొదిలో 500 కేజీల బాంబు
భారత వాయుసేన అమ్ములపొదిలో ఏప్రిల్ 3న దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 500 కేజీల జీపీ బాంబు చేరింది. జబల్పూర్లోని ప్రభుత్వరంగ ఆయుధ కర్మాగారం దీన్ని తయారు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన బాంబుల్లో ఇదే అతిపెద్దది. వాయుసేన పోరాట సామర్థ్యాన్ని ఇది మరింత పెంచుతుందని ఆయుధ కర్మాగార జనరల్ మేనేజర్ ఎస్కే సిన్హా తెలిపారు. తొలివిడత కింద ఎయిర్‌ఫోర్స్‌కు 48 బాంబులను అందించినట్లు చెప్పారు. వీటి అభివృద్ధిలో రక్షణ రంగానికి చెందిన పలు సంస్థలు పాలుపంచుకున్నట్లు వెల్లడించారు.
అంతర్జాతీయం
99 శాతం మంది పీల్చేది కలుషిత గాలినే
భూమిపై కాలుష్య భూతం కోరలు చాస్తున్న తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ప్రపంచ జనాభాలో 99 శాతం మంది కలుషిత గాలినే పిలుస్తున్నారని ఏప్రిల్ 4న వెల్లడించింది. అధిక స్థాయిలో కాలుష్య కారకాల విడుదలకు కారణమవుతున్న శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాల్సిన ఆవశ్యకతను క్కిచెప్పింది. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు, ప్రాంతాలు, గ్రామాల్లో గాలి నాణ్యతకు సంబంధించిన డేటాబేస్‌ను డబ్ల్యూహెచ్‌వో అప్డేట్ చేసింది. అందులో ఆరు వేలకుపైగా మున్సిపాలిటీల వివరాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రధాని పదవిని కోల్పోయిన ఇమ్రాన్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కోల్పోయారు. ఆయనపై పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 9న సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం అర్ధరాత్రి ఓటింగ్ నిర్వహించగా.. తీర్మానం నెగ్గింది. దాంతో ఇమ్రాన్ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నూతన ప్రధాని ఎన్నికల కోసం కసరత్తు జరుగుతున్నది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు సెహ్బాజ్ షరీఫ్ పాకిస్థాన్ 23వ ప్రధానిగా ఎన్నిక కానున్నట్లు సమాచారం.
శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత
శ్రీలంకలో ఏప్రిల్ 1న విధించిన ఎమర్జెన్సీని ఎత్తివేస్తూ ఆ దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అక్కడి ప్రజలు ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో ఏప్రిల్ 1న ఎమర్జెన్సీ విధించారు. అయితే ఏప్రిల్ 5న ఆ ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు లంక అధ్యక్షుడు ప్రకటించారు.
క్రీడలు
ఆస్ట్రేలియాకే మహిళల వన్డే ప్రపంచకప్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఐదు సార్లు టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియా.. ఏప్రిల్ 3న జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ జట్టుపై 71 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా ఆరో ప్రపంచకప్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ ప్రపంచకప్ టోర్నీలో ఆడిన 9 మ్యాచ్‌లలో ఒక్క ఓటమి లేకుండా ఆస్ట్రేలియా నెగ్గింది. గతంలో 1982, 1988, 1997, 2005, 2013 సంవత్సరాల్లో జరిగిన ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా టీమ్ విజయం సాధించింది.
హకీలో ముంతాజ్ హ్యాట్రిక్
జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్‌లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన భారత జట్టు.. పూల్ దశను విజయంతో ముగించింది. ఏకపక్షంగా సాగిన పూల్-డి ఆఖరి మ్యాచ్‌లో భారత్ 4-0 తేడాతో మలేషియాను చిత్తుచేసింది. ఏప్రిల్ 5న జరిగిన ఈ మ్యాచ్‌లో ముంతాజ్ హ్యాట్రిక్ గోల్స్ సాధించి విజయంలో కీలకపాత్ర పోషించింది. ముంతాజ్ కొట్టిన మూడు గోల్స్ ఫీల్డ్ గోల్సే కావడం గమనార్హం.
అంతర్జాతీయ క్రికెట్‌కు రాస్ టేలర్ గుడ్‌బై
పదహారేండ్లపాటు క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో అద్భుత ఆటతీరు కనబర్చిన న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ రాస్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఏప్రిల్ 4న నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే మ్యాచ్ చివరిది. ఆ మ్యాచ్‌తో టేలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 450 మ్యాచ్‌లు ఆడినట్లయ్యింది. టేలర్ 236 వన్డే మ్యాచ్‌లు ఆడి 8,607 పరుగులు చేశాడు. అందులో 21 సెంచరీలు ఉన్నాయి. ఇక 112 టెస్టు మ్యాచ్‌లలో 7,683 పరుగులు చేశాడు. 102 టీ20 మ్యాచ్‌లలో 1909 పరుగులు సాధించాడు.
డిస్కస్ త్రోలో 22 ఏండ్ల రికార్డు బద్దలు
జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో డిస్కస్ త్రో విభాగంలో కృపాల్ సింగ్ బాత్ రికార్డు నెలకొల్పుతూ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. పురుషుల డిస్కస్ త్రో ఫైనల్లో కృపాల్ డిస్క్‌ను 61.83 మీటర్ల దూరం విసిరి 22 ఏండ్ల క్రితం అనిల్‌కుమార్ నెలకొల్పిన రికార్డును (59.55 మీటర్లు) బద్దలు కొట్టాడు. నాలుగు త్రోల్లోనూ అతడు 60 మీటర్ల మార్కు దాటాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?