Name the first artificial heart | మొదటిసారి కనుగొన్న కృత్రిమ గుండె పేరు?
హృదయం (గుండె)- రక్తనాళాలు
రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యమైనవి హృదయం (గుండె), రక్తం, రక్తనాళాలు. హృదయం ఎల్లప్పుడు స్పందనలు చేస్తుండటంతో జీవులు సజీవంగా ఉంటాయి. శరీరంలో అతి ముఖ్య అవయవం ‘హృదయం’. ఇది రక్తనాళాల ద్వారా శరీరంలోని భాగాలకు ఆమ్లజని సహిత (మంచి) రక్తాన్ని సరఫరా చేయడంతో పాటు శరీర భాగాల్లోని ఆమ్లజని రహిత (చెడు) రక్తాన్ని సేకరించి ఊపిరితిత్తులకు పంపుచేయడంలో ముఖ్యప్రాత వహిస్తుంది. వివిధ జీవుల్లో దీని నిర్మాణం వేర్వేరుగా ఉంటుంది. మానవునిలో ఇది ఉరఃపంజరంలో ఊపిరితిత్తుల మధ్య ‘శంఖు ఆకారం’లో పిడికిలి పరిమాణంలో ఉంటుంది.
– హృదయం అధ్యయనాన్ని ‘కార్డియాలజీ’ అంటారు.
-సకశేరుకాల హృదయం ‘మయోజనిక్’ హృదయం.
-హృదయాన్ని చుట్టి రెండు పొరలు ఉంటాయి. దీనిని ‘హృదయ వరణం లేదా పెరికార్డియం’ అంటారు.
– వెలుపలి పొరను ‘ఎపికార్డియం’ అని లోపలి పొరను ‘ఎండోకార్డియం’ అని అంటారు.
– ఎపి, ఎండోకార్డియం మధ్య ‘హృదయావరణ కుహరం’ ఉంటుంది. దీనిలో హృదయవరణ కుహరద్రవం ఉంటుంది. ఇది గుండెను బాహ్య అఘాతాల నుంచి రక్షిస్తుంది.
– మానవ హృదయంలో నాలుగు గదులుంటాయి. పై రెండు గదులను కర్ణికలు (Auricles) అని, కింది రెండు గదులను జఠరికలు (Ven-tricles) అంటారు.
– గుండె గోడలకు అంటిపెట్టికుని ఉన్న రక్తనాళాలను ‘కరోనరి రక్తనాళాలు’ అంటారు. ఇవి గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి.
– జఠిరికల కుడ్యం, కర్ణికల కుడ్యం కంటే మందంగా కండరయుతంగా ఉంటుంది.
– కర్ణికలు, జఠరికలను వేరుచేస్తూ కర్ణికా – జఠిరికా విభాజకం ఉంటుంది.
– కుడి కర్ణిక పెద్దదిగా, ఎడమ కర్ణిక చిన్నదిగా, కుడి జఠరిక చిన్నదిగా, ఎడమ జఠరిక పెద్దదిగా ఉంటాయి.
– కుడి కర్ణిక పూర్వ, పర మహా సిరల ద్వారా, ఎడమ కర్ణిక పుపుస సిరల ద్వారా రక్తాన్ని గ్రహిస్తాయి.
– కుడి జఠరిక నుంచి పుపుస మహాధమని, ఎడమ జఠరిక నుంచి దైహిక మహాధమని బయలు దేరుతాయి.
– కర్ణికలు, జఠరికల సంకోచ, సడలికల వల్ల రక్తం సరఫరా అవుతుంది.
– కర్ణికల సంకోచానికి పట్టే సమయం 0.11 నుంచి 0.14 సెకన్లు, జఠరికల సంకోచానికి 0.27 నుంచి 0.35 సెకన్ల సమయం పడుతుంది.
– మానవునిలో ఒక మిల్లీలీటరు రక్తం గుండె నుంచి కాలి చివరికి వెళ్లి తిరిగి గుండెను చేరడానికి 60 సెకన్లు పడుతుంది (సుమారుగా 2 మీటర్ల దూరం).
హృదయంలోని కవాటాలు (Valves): కవాటాలు కర్ణికలు, జఠరికలకు మధ్య ఉండే చీలిక వంటి రంధ్రాలు.
– ఇవి రక్తాన్ని కర్ణికల నుంచి జఠరికలకు ఏక మార్గంలో సరఫరా చేస్తాయి.
– కవాటాలను వాటి స్థానంలో ఉంచే బంధన కణజాల తంతువులు ఉంటాయి. వీటిని ‘స్నాయురజ్జువు (Chordae tendineae)’ అంటారు.
– మానవ శరీరంలో నాలుగు రకాల కవాటాలు ఉంటాయి. అవి..
1. అగ్రత్రయ కవాటం (త్రిపత్ర కవాటం- Tricuspid valve). ఇది కుడి కర్ణికా – జఠిరికా రంధ్రం వద్ద ఉంటుంది.
2. అగ్రద్వయ కవాటం (ద్విపత్ర లేక మిట్రల్- Bicuspid valve). ఇది ఎడమ కర్ణికా – జఠిరికా రంధ్రం వద్ద ఉంటుంది.
3. పుపుస కవాటాలు (Pulmonary valves) – ఇవి కుడి జఠరిక నుంచి పుపుస మహాధమని బయలుదేరే చోటులో ఉంటాయి.
4. మహాధమని కవాటాలు (Semilynar valves). ఇది ఎడమ జఠరికలో మహాధమని బయలుదేరే చోట ఉంటుంది.
– కుడి కర్ణికా జఠరికా రంధ్రాన్ని అగ్రత్రయ కవాటం రక్షిస్తుంది.
– ఎడమ కర్ణికా జఠిరికా రంధ్రాన్ని అగ్రద్వయ లేదా మిట్రల్ కవాటం రక్షిస్తుంది.
-హృదయ స్పందన (Hert Beat): హృదయంలోని కండరాలు చేసే సంకోచ సడలికలను ‘గుండె కొట్టుకోవడం లేదా హృదయస్పందన’ అంటారు.
-హృదయ సంకోచ దశని ‘సిస్టోల్’ అని, సడలే దశని ‘డయాస్టోల్’ అని అంటారు.
– హృదయ స్పందనలో సిస్టోల్‌లో ‘లబ్’,
‘డయాస్టోల్‌లో ‘డబ్’ అనే శబ్దం వస్తుంది.
– హృదయంలో రక్తం ప్రవహించే మార్గాన్ని ‘ప్రసరణ వలయం’ అంటారు.
– రక్త ప్రసరణ రెండు వలయాలుగా ఉంటుంది. అవి.. ఊపిరితిత్తులకు- హృదయానికి మధ్య జరిగే ప్రసరణను ‘పుపుస వలయం’ అని, హృదయానికి – శరీర అవయవాలకు మధ్య జరిగే ప్రసరణను ‘దైహికవలయం’ అంటారు.
-రెండు వలయాల్లో రక్తాన్ని పంపు చేసే హృదయాన్ని ‘ద్వివలయ ప్రసరణ హృదయం’ (Double Circuit Heart) అంటారు.
– వ్యక్తుల వయస్సు, చేసే పని బట్టి హృదయస్పందన రేటు మారుతుంది. ఇది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది.
– ఆరోగ్యవంత మానవుని హృదయ స్పందనల రేటు నిమిషానికి 72 సార్లు
– హృదయ స్పందనలను ‘స్టెతస్కోపు’తో పరిశీలిస్తారు.
– రక్తపీడనం (Blood Pressur): రక్తనాళాల్లో రక్తం ప్రవహించే పీడనాన్ని ‘రక్తపీడనం’ అంటారు. దీనినే సాధారణంగా బీపీ అంటారు.
– రక్త పీడనాన్ని ‘సిగ్మోమానోమీటర్’ పరికరంతో కొలుస్తారు.
– ఆరోగ్యవంతుడైన మానవుని రక్తపీడనం 120/80 (దీనిలో పై సంఖ్య 120 సిస్టోలిక్ పీడనాన్ని, కింది సంఖ్య 80 డయాస్టోలిక్ పీడనాన్ని తెలుపుతుంది)
– బీపీ రెండు రకాలు: 1. హై బీపీ (Hypertension)– రక్తనాళాల గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల వాటి వ్యాసం తగ్గి రక్తం కలిగించే ఒత్తిడి పెరగడాన్ని హై బీపీ అంటారు.
2. Low B.P– రక్త పరిమాణం తక్కువగా ఉండే వ్యక్తుల్లో బీపీ తక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా 80 కంటే తక్కువగా ఉంటుంది.
– గుండె పోటు (Heat Attack): గుండె కండరాలకు తగిన మోతాదులో ఆహారం, ఆక్సిజన్ అందనట్లయితే హృదయస్పందన తాత్కాలికంగా నిల్చిపోవడాన్ని ‘గుండెపోటు’ అంటారు.
– గుండెపోటును గుర్తించడానికి ECG ఉపయోగపడుతుంది.
-ఇది నాలుగు రకాలుగా ఉంటుంది. అవి
1. ఆర్టరియోస్ల్కీరోసిస్ – హృదయ ధమని గోడలు గట్టిపడటం వల్ల ఇది కలుగుతుంది
2. అథెరోస్ల్కీరోసిస్ – హృదయ ధమనిలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కలుగుతుంది.
3. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్- హృదయ కండరాలకు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల
కలుగుతుంది.
4. కార్డియో మెగాలి- గుండెలో అసాధారణంగా కండరం పెరగడం వల్ల వస్తుంది.
n హృదయం పనిచేసే వేగాన్ని కొలిచే పరికరం ‘ECG’ (Electro Cardiogram)
రక్తనాళాలు (Blood Vassels)
– రక్తాన్ని సరఫరా చేసే గొట్టాలను ‘రక్తనాళాలు’ అంటారు.
– వీటి అధ్యయనాన్ని ‘Angeology’ అంటారు.
– ఇవి మూడు రకాలు
1. ధమనులు (Arteries)
2. సిరలు (Veins)
3. రక్తకేశనాళికలు (Blood Capillaries)
ధమనులు
– ఇవి హృదయం నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్తాయి.
– ధమనుల అన్నింటిలో ఆమ్లజని సహిత (మంచి) రక్తం ఉంటుంది.
– హృదయం నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసేది ‘పుపుస ధమని’ దీనిలో మాత్రమే ‘చెడు’ రక్తం ఉంటుంది.
-హృదయం నుంచి రక్తాన్ని తీసుకొనిపోయే అతి పెద్ద ధమని మహాధమని (Aorta)
– ధమనుల్లో రక్తపీడనం అధికంగా ఉంటుంది.
– ధమనిలో రక్తం ప్రవహించేటప్పుడు దాని ఒత్తిడి మనకు తెలుస్తుంది. దీనినే ‘నాడి కొట్టుకోవడం (Pulse)’ అంటారు.
– నాడీ స్పందన రేటు, హృదయ స్పందన రేటుకు సమానంగా ఉంటుంది.
సిరలు
-శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయానికి తీసుకువచ్చే నాళాలు ‘సిరలు (VEINS)’.
– గుండె పై భాగం తల, మెడ నుంచి రక్తాన్ని సేకరించే పెద్ద సిరను ఊర్ధ (పూర్వ) బృహత్సిర (Superior Venecava) అని, గుండె కింది భాగంలోని ఉదరం, కాళ్లు, చేతుల నుంచి రక్తాన్ని సేకరించే సిరలను అధో (పర) బృహత్ సిర (InferiorVenecava) అని అంటారు.
– ఊర్ధ, అధో సిరలు కుడి కర్ణికలోకి తెరుచుకుంటాయి.
– మూడవ సిరను పుపుస మహాసిర (pul monary Vein) అంటారు. ఇది ఊపిరితిత్తుల నుంచి ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెలోని ఎడమకర్ణికలోకి పంపుతుంది.
– సిరలన్నీ హృదయంలో కుడి కర్ణికలోకి తెరుచుకుంటాయి. వీటిలో ఆమ్లజని రహిత (చెడు) రక్తం ఉంటుంది.
రక్తకేశ నాళికలు
– ఇవి అతి సూక్ష్మమైనవి
-ధమనులు వీటితో అంతమవుతాయి.
– సిరలు వీటితో ప్రారంభమవుతాయి.
వివిధ వయస్సుల్లో హృదయ స్పందనలు
వయస్సు హృదయ స్పందనలరేటు (నిమిషానికి)
0-3 నెలలు (నవజాత శిశువు) 100-150
3-6 నెలలు శిశువు 90-120
6-12 నెలలు శిశువు 80-120
1-10 సం. పిల్లలు 70-130
14 సం. పిల్లలు 80-85
21 సం. పైబడిన వారిలో 70-80
వృద్ధాప్యంలో 60-70
ప్రాక్టీస్ బిట్స్
1. హృదయావరణం దేనికి సంబంధించింది?
ఎ) మూత్రపిండం బి) హృదయం
సి) ఊపిరితిత్తులు డి) మెదడు
2. అసంపూర్ణ జఠరిక గల జీవులు?
ఎ) సరీసృపాలు బి) క్షీరదాలు
సి) చేపలు డి) ఉభయచరాలు
3.దేనిలో అడ్డంకులేర్పడితే గుండెపోటు వస్తుంది?
ఎ) పుపుస ధమని బి) హృదయ సిర
సి) హృదయ ధమని డి) పుపుస సిర
4. ఎడమ కర్ణిక, ఎడమ జఠరికల మధ్య గల కవాటం?
ఎ) మిట్రల్ బి) అగ్రత్రయ
సి) పుపుస డి) మహాధమని
5. మొదటి సారి కనుగొన్న కృత్రిమ గుండె పేరు?
ఎ) జార్విక్-2 బి) లిల్లీ
సి) మైయలిన్ డి) జార్విక్-7
6. మానవుని కుడి కర్ణికకు చేరేది?
ఎ) ఆమ్లజనిసహిత రక్తం
బి) ఆమ్లజని రహిత రక్తం
సి) మిశ్రమ రక్తం డి) లింఫ్ ద్రవం
7. పుపుస సిర ఏ అవయవం నుంచి రక్తాన్ని సేకరిస్తుంది?
ఎ) ఊపిరితిత్తులు బి) హృదయం
సి) మెదడు డి) మూత్రపిండాలు
8. మానవుని సామాన్య రక్తపీడనం?
ఎ) 80/120 బి) 100/120
సి) 120/100 డి) 120/80
9. స్టెతస్కోప్‌ను కనుగొన్నది ఎవరు?
ఎ) లెమార్క్ బి) మాల్ఫీజీ
సి) రెని లెన్నెక్ డి) పాశ్చర్
10. హృదయంలో గదులు సడలే స్థితిని ఏమంటారు?
ఎ) సిస్టోల్ బి) డయాస్టోల్
సి) రక్తపీడనం డి) ఏదీకాదు
11. ప్రపంచంలో మొదటిసారిగా గుండె మార్పిడి చికిత్స చేసింది?
ఎ) క్రిస్టియన్ బెర్నార్డ్
బి) వేణుగోపాల్
సి) గైరోలమాఫాబ్రిసి
డి) విలియం హార్వే
12. బీపీ ని కొలిచే పరికరం?
ఎ) గాల్వనోమీటర్
బి) ధర్మామీటర్
సి) బారోమీటర్
డి) స్పిగ్మోమానోమీటర్
13. Angeology అంటే?
ఎ) గుండె అధ్యయనం
బి) రక్తనాళాల అధ్యయనం
సి) రక్తం అధ్యయనం
డి) మూత్రపిండాల అధ్యయనం
14. తిమింగలం హృదయం బరువు ?
ఎ) 300 గ్రా బి) 267 గ్రా
సి) 750 గ్రా డి) 12 గ్రా
15. బొద్దింక హృదయంలో గదులు?
ఎ) 8 జతలు బి) 3 గదులు
సి) 4 గదులు డి) 13 గదులు
సమాధానాలు
1. బి 2. ఎ 3. సి 4. ఎ
5. డి 6. బి 7. ఎ 8. డి
9. సి 10. బి 11. ఎ 12. డి
13. బి 14. సి 15. డి
బొడ్డుపల్లి రామకృష్ణ
అసిస్టెంట్ ప్రొఫెసర్
డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
నల్లగొండ
- Tags
- Biology
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?