Goravayya dance performed | గొరవయ్యల నృత్యాన్ని ఏ ఉత్సవంలో ప్రదర్శిస్తారు?
గ్రూప్స్ ప్రత్యేకం
గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-2, ఎస్ఐ, గ్రూప్-4, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇలా వివిధ రకాల ఉద్యోగాలకు జనరల్ స్టడీస్‌లో తెలంగాణ సమాజం-సంస్కృతి అంశం నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం నుంచి పోటీపరీక్షల్లో వచ్చే ప్రశ్నల సరళి, అందులోని వివిధ అంశాలను పరీక్షల కోణంలో ఎలా ప్రిపేర్ కావాలో తెలుసుకుందాం.
– తెలంగాణ ప్రాంతానికి సంపన్నమైన చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ఈ సుసంపన్న నాగరికత తెలంగాణ భాషలో, మాండలికంలో, సంస్కృతి సంప్రదాయాల్లో, జీవన విధానాల్లో, అలవాట్లు, అభిరుచుల్లో ప్రతిబింబిస్తుంది. ఒక ప్రాంత జీవన విధానాన్ని ఆ ప్రాంత సంస్కృతిగా వ్యవహరిస్తారు. పండుగలు, ఆట-పాటలు, మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, వివిధ రకాల కట్టుబాట్లు, విలువలు, జానపద కళలు ఇవన్నీ సంస్కృతిలో అంతర్భాగమే.
– తెలంగాణ ప్రాంతంలో హిందూ-ముస్లిం సంస్కృతులు, ఉత్తర-దక్షిణ భారతదేశ సంస్కృతులు, గ్రామీణ-గిరిజన సంస్కృతులు వైవిధ్యంగా సహనంతో సహజీవనం చేసేవి. ఈ సంస్కృతుల సమాహారమైన మిశ్రమ సంస్కృతి తెలంగాణకు గల సాంస్కృతిక వైవిధ్యతను తెలియజేస్తుంది.
తెలంగాణ నృత్యాలు
– తెలంగాణ సమాజం- సంస్కృతి అనే అంశానికి సంబంధించి మొదట మనం నృత్యకళల గురించి తెలుసుకుందాం.
1. పేరిణి తాండవం
-కాకతీయుల కాలంలో యుద్ధవీరులు ఉత్తేజాన్ని నింపుకోవడానికి ప్రత్యేకంగా ఈ నాట్యాన్ని ప్రదర్శించేవారు.
-శివుడికి ప్రేరణగా ప్రదర్శించే ఈ నృత్యం వీర రస ప్రధానమైనది.
-పేరిణి శివతాండవ నృత్యం లక్షణాలు, సాధన క్రమాన్ని కాకతీయరాజు అయిన గణపతి దేవుని బావమరిది, గజసేనాధ్యక్షుడు జాయపసేనాని తాను రాసిన నృత్యరత్నావళిలో వివరించారు.
-గణపతిదేవుని మతగురువైన విశ్వేశ్వర శివాచార్యుడు ఈ కళకు రూపం ఇచ్చాడు.
-అదేవిధంగా శైవ సంప్రదాయానికి చెందిన పేరిణి నృత్య వర్ణనలు పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో కనిపిస్తాయి.
-ఆధునిక యుగంలో పేరిణి నృత్యాన్ని పునరుద్ధరించింది నటరాజ రామకృష్ణ.
-పేరిణి నృత్య ప్రదర్శనను సంపూర్ణంగా తిలకించడానికి నాలుగైదు గంటల సమయం పడుతుంది.
-ఈ నృత్యానికి సంబంధించిన మృదంగ వాయిద్యం ద్రుపద బాణీలో ఉంటుంది.
-ఈ పేరిణి నృత్యరీతులను వరంగల్ జిల్లా రామప్ప దేవాలయం శిల్ప భంగిమల్లో చూడవచ్చు.
-ఇది సాధారణంగా వీరావేశంతో పురుషులు మాత్రమే ప్రదర్శించే నృత్యకళ.
-శివుడిని ఆరాధ్యదైవంగా భావించి నటరాజ విగ్రహం ముందుగాని, శివాలయాల్లోగాని ఊపిరి సలపనంత ఉత్కంఠతతో కన్నుల పండువగా ఈ నృత్యం ప్రదర్శిస్తారు.
-పేరిణి నృత్యాన్ని డ్యాన్స్ ఆఫ్ వారియర్స్/ యుద్ధవీరుల నృత్యం/యోధుల నృత్యంగా పేర్కొంటారు.
-మగవారి పేరిణి నృత్యానికి ప్రతిచర్యగా ఆనందంతో పురుషులను రంజింపజేయడా నికి స్త్రీలు చేసే నృత్యం- లాస్యం
-పేరిణి లాస్యం నృత్యంలో కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నర్తకి- మాచల్దేవి.
-ఈ నృత్యంలో ప్రాచుర్యం పొందిన వ్యక్తులు – పేరిణి శ్రీనివాస్, పేరిణి రమేశ్, కళాకృష్ణ, శ్రీధర్.
-పేరిణి శివతాండవానికి సంబంధించి పోటీ పరీక్షల్లో వివిధ కోణాల్లో ప్రశ్నలను అడిగే విధానాన్ని పరిశీలిద్దాం.
1. పేరిణి శివతాండవం అనే నాట్యకళ కింది ఎవరి కాలానికి సంబంధించింది?
ఎ) శాతవాహనులు బి) కాకతీయులు
సి) ఇక్ష్వాకులు డి) చాళుక్యులు
సమాధానం: బి
l పేరిణి శివతాండవం గురించి తెలుసుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం సులువుగా గుర్తించవచ్చు.
2.పేరిణి నృత్యాన్ని ఇంకా ఏ విధంగా
పేర్కొంటారు?
1. యుద్ధవీరుల నృత్యం,
2. యోధుల నృత్యం,
3. వీరనాట్యం
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
సమాధానం: ఎ
-ఈ నాట్యాన్ని వీరావేశంతో ప్రదర్శిస్తారు. కాబట్టి వీరనాట్యం కూడా సరైనదే అని అభ్యర్థులు పొరబడే అవకాశం ఉంది. వాస్తవానికి వీరభద్రుడి ఆలయాల్లో ప్రదర్శించే నాట్యాన్ని వీరనాట్యం అంటారు. కాబట్టి అన్ని నృత్యరీతుల గురించి సమగ్రంగా తెలుసుకుంటే ఇలాంటి ప్రశ్నలకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సమాధానం గుర్తించవచ్చు.
3. పేరిణి శివతాండవానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
1. ఈ నాట్యకళ భంగిమలను రామప్ప దేవాలయ గోడలపై చూడవచ్చు.
2. ఈ నాట్యాన్ని పూర్తిగా తిలకించడానికి సుమారు 2-3 గంటల సమయం పడుతుంది.
3. ఈ నాట్యకళతో సంబంధంగల వ్యక్తులు జాయపసేనాని, విశ్వేశ్వర శివాచార్యుడు, గోన బుద్ధారెడ్డి.
4. సాధారణంగా పురుషులు మాత్రమే ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు.
ఎ) 1, 2 బి) 2, 3
సి) 3, 4 డి) 1, 4
సమాధానం: డి
వివిధ నృత్యరీతుల గురించి సవివరంగా తెలుసుకుంటే పైన పేర్కొన్న ప్రశ్నకు సమాధానం సరిగ్గా గుర్తించడం సాధ్యపడుతుంది.
2. గుస్సాడి నృత్యం
-ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని రాజగోండు తెగకు చెందిన పురుషులు గుస్సాడి నృత్యం ప్రదర్శిస్తారు.
-ఈ జానపద నృత్యాన్ని గోండులు దీపావళికి ముందు ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమినాడు మొదలుపెట్టి ఆశ్వయుజ బళ చతుర్దశి వరకు కొనసాగిస్తారు.
-20 నుంచి 40 మంది కలిసి ఒక గుంపుగా ఏర్పడి చుట్టుపక్కల పల్లెల్లో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ గుంపులను దండారి గుంపులు అంటారు.
-ఈ పెద్ద గుంపు నుంచి అంతర్భాగంగా ఇద్దరుగాని, ఐదుగురుగాని మరో గుంపు కడతారు. ఈ అంతర్భాగ గుంపునే గుస్సాడి అంటారు.
-గుస్సాడి నృత్యం చేసేవారు పొడవాటి నెమలి ఈకలు, రంగుల అద్దాలు మొదలైన వాటితో టోపీ తయారు చేసి, దాని ముందు భాగంలో మేక లేదా గొరె కొమ్ములను అమర్చి తలపాగా ధరిస్తారు. వీరు ధరించే టోపీని మాల్జిలన టోపీ అంటారు.
-నాగోబా జాతర సమయంలో గోండులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు.
-గుస్సాడి నృత్యానికి సంబంధించి ప్రముఖ కళాకారుడు గుస్సాడి కనకరాజు.
-55 ఏండ్లుగా గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తూ, నేర్పుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కనకరాజుకు భారత ప్రభుత్వం 2021కు గాను పద్మశ్రీ పురస్కారం అందజేసింది. ఇతనిది మర్లవాయి గ్రామం, జైనూర్ మండలం, కుమ్రంభీం జిల్లా. ఇతడిని గుస్సాడి రాజుగా కూడా పిలుస్తారు.
-ఇతని పేరుమీదుగానే రాష్ట్రంలో తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పద్మశ్రీ కనకరాజు స్కూల్ ఆఫ్ గుస్సాడి డ్యాన్స్‌ను ప్రారంభించారు.
-ఇలా అభ్యర్థులు వర్తమాన అంశాలను జోడించి చదువుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
నృత్యం సాధారణంగా ప్రదర్శించే సమయం
1. లంబాడా నృత్యం తీజ్ ఉత్సవాల్లో
2. కోయ, కురు నృత్యాలు సమ్మక్క, సారక్క జాతరలో
3. గుస్సాడి నృత్యం దీపావళి పండుగకు ముందు(నాగోబా జాతర సమయంలో)
4. గరగ నృత్యం బోనాల పండుగ సందర్భంగా
5. మదిలీ నృత్యం పీర్ల పండుగ సందర్భంగా
నృత్యం ప్రదర్శించే ప్రాంతం
1. గుస్సాడి ఆదిలాబాద్, నిజామాబాద్
2. కోయ నృత్యం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోయలు
3. సిద్దీ నృత్యం హైదరాబాద్
4. మయూరి నృత్యం ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతం ,గిరిజన తెగలు (ఖోండ్)
5. కొండరెడ్ల మామిడి కొత్త నృత్యం ఖమ్మం జిల్లా అటవీ ప్రాంత గిరిజనులు
నమూనా ప్రశ్నలు
1. తళతళ మెరిసే కత్తులతో ఉద్రేకపూరితమైన అడుగులు వేస్తూ ప్రదర్శించే నృత్యం ఏది?
1) గరగ నృత్యం
2) ఉరుముల నృత్యం
3) వీర నాట్యం 4) సిద్దీ నృత్యం
2. ఏ నృత్యంలో దండారి గుంపులుగా ఏర్పడి నృత్య ప్రదర్శన చేస్తారు?
1) సిద్దీ 2) గుస్సాడి
3) గరగ 4) మయూరి
3. ధోల్, పెప్రె, కాలికోమ్ అనే సంగీత పరికరాలను ఏ నృత్యంలో ఉపయోగిస్తారు?
1) థింసా నృత్యం 2) వీరనాట్యం
3) కోయ నృత్యం 4) మదిలీ నృత్యం
4. సమ్మక్క-సారలమ్మ జాతరలో ఏ నృత్యాన్ని ప్రదర్శిస్తారు?
1) కోయ నృత్యం 2) పేరిణి నృత్యం
3) వీరనాట్యం 4) థింసా నృత్యం
5. కింద పేర్కొన్న జానపద నృత్యాలు, ఆ నృత్యాలను ప్రదర్శించే తెగలను జతపర్చండి.
ఎ. పెరమ్ కోకీ ఆట
1. కోయతెగ పురుషులు, మహిళలు
బి. థింసా నృత్యం
2. రాజగోండు పురుషులు, మహిళలు
సి. గుస్సాడి నృత్యం
3. గోండు పురుషులు మాత్రమే
డి. కురు నృత్యం
4. కోయతెగ పురుషులు మాత్రమే
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
6. తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ సందర్భంగా మట్టికుండలు నెత్తిన పెట్టుకుని చేసే నృత్యం ఏది?
1) జోగువారి నృత్యం 2) సిద్దీ నృత్యం
3) గరగ నృత్యం 4) గుస్సాడి నృత్యం
7. దొరల సట్టమ్, బైసన్ హార్న్ డ్యాన్స్ అనే పదాలు ఏ నృత్యంతో సంబంధం కలిగి ఉన్నాయి?
1) గుస్సాడి నృత్యం 2) రేలా నృత్యం
3) గరగ నృత్యం 4) కోయ నృత్యం
8. గొరవయ్యల నృత్యాన్ని ఏ ఉత్సవంలో
ప్రదర్శిస్తారు?
ఎ. అయినవోలు మల్లన్న జాతర
బి. కొమురవెల్లి మల్లన్న జాతర
సి. ఓదెల మల్లన్న జాతర
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
9. పూర్వ వరంగల్ జిల్లాలోని కొరవిలో, కొత్తకొండలో ఉన్న వీరభద్ర ఆలయాల్లో ప్రదర్శించే నృత్యం?
1) గొరవయ్యల నృత్యం
2) వీరనాట్యం
3) యోధుల నృత్యం
4) ఏదీకాదు
10. ఆఫ్రికా నుంచి నిజాంకు అంగరక్షకులుగా వచ్చినవాళ్లు వివాహాలు, పండుగల సమయాల్లో ప్రదర్శించే నృత్యం?
1) జోగువారి నృత్యం
2) ఉరుముల నృత్యం
3) పెరమ్కోకీ ఆట
4) సిద్దీ నృత్యం
Answers
1-4, 2-2, 3-1, 4-1, 5-4,
6-3, 7-4, 8-4, 9-2, 10-4.
గందె శ్రీనివాస్
2016 గ్రూప్-2 విజేత
సిద్దిపేట
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?