కాకతీయుల సైనికశక్తి
పాలనా విభాగాలు: కాకతీయులు రాజ్యాన్ని అనేక నాడులుగా విభజించారు. క్రీ.శ. 1313 నాటికి ప్రతాపరుద్రుని శ్రీశైల శాసనంలో పేర్కొన్న కొన్ని ముఖ్యమైన నాడులు కన్నాడు, పెడకల్లు, కమ్మనాడు, మింగలనాడు, పాకనాడు, రేనాడు, ములికినాడు మొదలైనవి.
స్థలాలు: నాడులను స్థలాలుగా విభజించారు. స్థలం సుమారు ఇరవై గ్రామాల సమూహం. అందువల్ల రాజ్యంలో స్థలాల సంఖ్య చాలా ఎక్కువ. వరంగల్లు శాసనాల్లో అనుమకొండ, మట్యవాడ, ఓరుగల్లు ఒక స్థలంగా పేర్కొని ఉంది. గురిందాల స్థలం, పింగలి స్థలం, మన్ననూరి స్థలం, తంగెడ స్థలం, కైలాసం కోట స్థలం ఇతర ముఖ్య స్థలాలు.
-నాడుల పరిపాలన బాధ్యత అమాత్య, ప్రెగ్గడ స్థాయి అధికారుల చేతిలో ఉండగా స్థలాధికారులుగా కిందిస్థాయి స్థల కరణాలు, స్థల సుంకర్లు, స్థల తీర్పర్లు ఉండేవారు.
గ్రామ పరిపాలన: గ్రామం అన్నిటికంటే చిన్న పరిపాలనా విభాగం. గ్రామ పరిపాలన ఆయగార్లు అనే అధికారుల చేతిలో ఉండేది. వీరి సంఖ్య పన్నెండు. గ్రామాధికారుల్లో కరణం, రెడ్డి, తలారి, పురోహితుడు, కమ్మరి, కంసాలి, వడ్రంగి, కుమ్మరి, చాకలి, మంగలి, వెట్టి, చర్మకారుడు, నీరుడుకాడు మొదలైన పేర్లు శాసనాల్లో ఉన్నాయి. వీరందరికీ గ్రామసేవ చేసేందుకు పన్నులేని భూములు ఇచ్చారు. కరణం, రెడ్డి, తలారి ప్రభుత్వ సేవకులు వారికి పంటలో కొంత వాటా కూడా ఇచ్చేవారు.
సైనిక పాలన: కాకతీయులు సమర్థవంతమైన భారీ సైన్యాన్ని పోషించారు. సమకాలీన యాదవ, హొయసాల, పాండ్య, ముస్లిం సుల్తానుల సేనలతో అనేక విజయాలు సాధించడం వారి సైనిక శక్తికి నిదర్శనం.
-బద్దెన రచించిన నీతిశాస్త్ర ముక్తావళి, మడికి సింగన రచించిన సకలనీతి సమ్మతం మొదలైనవి కాకతీయుల సైనిక వ్యవస్థను తెలుపుతున్నాయి.. రాజ్య భద్రత కోటల సముదాయంపై ఆధారపడిన విషయం అని ప్రతాపరుద్రుని నీతిసారం చెప్పింది. నీతిసారంలో చెప్పినట్లే కాకతీయ రాజ్యంలో నాలుగు రకాల స్థల, జల, వన, గిరి దుర్గాలు ఉన్నట్లు శాసన సాక్ష్యం ఉంది. కాకతీయులు నిర్మించిన ఓరుగల్లు, రాయచూరు, గోలకొండ, భువనగిరి, రాచకొండ, దేవరకొండ, నల్లగొండ, పానగల్లు కోటలు దుర్బేధ్యమమైనవి.
నాయంకర విధానం: సైన్య పాలనలో నాయంకర వ్యవస్థను రుద్రమదేవి ప్రారంభించింది. ప్రతాపరుద్రుడు దీన్ని మరింత పటిష్ఠంగా వ్యవస్థీకరించాడు. నీతిసారాన్ని అనుసరించి రాజు తన ఉపయోగం కోసం కొంత సైన్యాన్ని నిర్వహించడానికి జీతానికి బదులుగా నాయకులకు కొన్ని గ్రామాలను ఇస్తాడు. నాయకునికి ఇచ్చిన గ్రామాలను నాయక స్థల లేదా నాయక స్థలవృత్తి అనేవారు.
-అప్పటివరకు సామంతులుగా ఉన్న వారంతా ఈ వ్యవస్థలో యుద్ధ సమయంలో రాజసేవకు తప్పనిసరిగా కొంత సైన్యాన్ని పోషించాలి. చతురంగ బలాలను పోషించడానికి, కోశాగారం నింపడానికి ఆదాయం ఇచ్చే పెద్ద ఊళ్లను ఉంచి, సామంతులకు చిన్న ఊళ్లను మాత్రమే ఇవ్వాలని ప్రతాపరుద్రుని నీతిసారం తెలుపుతుంది.
-వారికిచ్చిన మాన్యం ఆధారంగా వారు పోషించాల్సిన ఏనుగులు, గుర్రాలు, కాల్బలాన్ని నిర్ణయిస్తారు. నాయకుల్లో ఎవరైనా నిర్ణయించిన సంఖ్య కంటే ఎక్కువ సైన్యాలను పోషించరాదని బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి తెలుపుతుంది. రాజుకు సైన్యాన్ని సరఫరా చేయడమేకాకుండా వీరు క్రమబద్ధంగా కప్పం కూడా కట్టాలి. ఒక పద్యం ప్రతాపరుద్రున్ని నవలక్ష ధనుర్ధాధీశునిగా వర్ణిస్తుంది.
-ఆ నాటి రాజనీతి గ్రంథాలు రథ, గజ, తురగ, పదాతి దళాలను పేర్కొన్నాయి. ప్రతాపరుద్రుని సైన్యంలో వెయ్యి ఏనుగులు, ఇరవై వేల గుర్రాలు, తొమ్మిది లక్షల కాల్బలం ఉన్నట్లు తెలుస్తుంది. వీటి సేనాధిపతులను గజ సాహిణి, అశ్వ సాహిణి అని పిలిచేవారు.
-గణపతిదేవునికి చెందిన నల్లగొండలోని శాసనం ప్రకారం ఉత్తర దేశానికి చెందిన కాయస్థ గంగయ సాహిణిని తన అశ్వదళానికి రక్షణ కోసం గణపతిదేవుడు తీసుకువచ్చాడని తెలుస్తుంది. ఇందలూరి అన్నయ్య 5 లక్షల కాల్బలానికి అధ్యక్షుడు. గణపతిదేవుని కాలంలో జాయపసేనాని గజసాహిణి, ప్రతాపరుద్రుని కాలంలో బెండపూడి అన్నయ్య గజబలాధ్యక్షుడు.
-కాకతీయుల సైనిక వ్యవస్థలో మూలబలం లేదా స్థిరసైన్యం, సామంత సైన్యం అని రెండురకాల సైన్యాలు ఉండేవి. మూలబలం పాలకుని ప్రత్యక్ష పర్యవేక్షణ కింద లేదా పాలకుని చేత నియమితులైనవారి ఆధీనంలో, పోషణలో ఉండేది. గజసాహిణి, అశ్వసాహిణి అటువంటివారే.
-ఆ నాడు వన, గిరి, స్థల, జల దుర్గాలున్నాయి. నీతిసారం దుర్గ రక్షణకి ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తుంది. పురుషార్థసారం కూడా దుర్గాల ప్రాధాన్యాన్ని తెలుపుతుంది.
న్యాయవ్యవస్థ: కాకతీయులు దక్షిణ భారతదేశంలో ఆచరణలో ఉన్న న్యాయస్మృతిని అమలుచేశారు. దుగ్గిరాలలో లభించిన గణపతిదేవునికి చెందిన క్రీ.శ. 1214 నాటి శాసనం గ్రామహద్దుల వివాదాన్ని వివరిస్తుంది.
-ఈ శాసనంలోని వివరాల ప్రకారం.. గణపతిదేవుడు వెలనాడును జయించి ఆ ప్రాంతంలో విడిది చేయగా పూండి, మొరమపూండి, ఈవని గ్రామాల ప్రజలు తమ సరిహద్దు తగాదాను పరిష్కరించాలని కోరారు. అప్పుడు గణపతిదేవుడు తన మంత్రులైన మల్లవ రాజు, రుద్రరాజులను ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా ఆదేశాలిచ్చాడు.
-మంత్రులు మూడు గ్రామాల ప్రజల వాదనలు విన్న తర్వాత, మహాజనుల అభిప్రాయాన్ని వారు అడిగారు. వారు ఈవని గ్రామానికి చెందిన సూరపరాజు (కరణం)ను ఎంపికచేసి సరిహద్దుపై నడువమన్నారు. సరిహద్దు రక్షకుడు ముందు నడుస్తూ ఉండగా సూరపరాజు హద్దును గుర్తిస్తూ గీతగీశాడు. ఈ పద్ధతిని అనుసరించి సరిహద్దు రేఖను గుర్తించి అన్ని ముఖ్యమైన స్థలాల్లో రాళ్లు పాతించారు. ఈవిధంగా సరిహద్దు సమస్యను పరిష్కరించారు.
-క్రీ.శ. 1246 నాటి కరీంనగర్ శాసనం రెండు గ్రామాల మధ్య తలెత్తిన చెరువు వివాదంలో గణపతి దేవుడు ఇచ్చిన తీర్పును వివరిస్తున్నది. నేఢవూర అనే గ్రామంలో గొనుగు కాల్వ మీద హక్కు గురించి వివాదం తలెత్తింది. రవిదత్తుడు, నాథదేవుడు, హింగదేవుడు అనే స్థానిక అధికారులు ఈ వివాదాన్ని గణపతిదేవుని దృష్టికి తీసుకెళ్లగా ఆయన జాయపసేనాని మంత్రి మంచిరాజును నియమించాడు. రాజాజ్ఞను అనుసరించి మంచిరాజు ఈ గ్రామాన్ని దర్శించి, సంబంధిత గ్రామాలైన చామనపల్లి, కుమ్మరికుంట, దేవనపల్లి, కట్యకోలపల్లి గ్రామాల మహాజనులను, పెద్దలను సమావేశపర్చి వారి అభిప్రాయాలను సేకరించాడు. ఈ అభిప్రాయాలను గణపతి దేవుడికి నివేదించాడు. రాజు ఆ ప్రాంత రాజ ప్రతినిధి అయిన అక్షయ చంద్రదేవుని సమక్షంలో మంచిరాజు నివేదికను ఆధారం చేసుకొని తన తుది తీర్పును ప్రకటించి, స్థానికాధికారులకు, గ్రామ ప్రజలకు ఈ తీర్పును తెలియజేయడానికి ప్రాడ్వివాకుడయిన శ్రీపాఠకుని మేనల్లుళ్లు అయిన నారాయణ, మహారూక అనే అధికారులను చామనపల్లికి పంపాడు.
-వీరు మళ్లీ విచారణ జరిపి మంచిరాజు నివేదిక సరైనదని నిర్ధారించుకొని రాజు తీర్పును తామ్రశాసన రూపంలో ప్రకటించారు. కాలువ మీద అధికారం చామనపల్లి మహాజనులదేనని, ఇతర గ్రామాల వారికి దానిపై ఎటువంటి హక్కు లేదని ఈ తీర్పు ప్రకటించింది. ఈ రెండు తీర్పులు ఆనాటి న్యాయ నిర్ణయాలు ఎంత ధర్మబద్ధంగా ఉండేవో తెలుపుతున్నాయి.
-రాజనీతి రత్నాకరం వంటి రాజనీతి సంబంధమైన శాస్ర్తాలు ప్రతిష్ఠిత, అప్రతిష్ఠిత, సుముద్రిత, శాసిత అని నాలుగు రకాల న్యాయసభలను పేర్కొన్నాయి. పురం లేదా రాజధాని నగరంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన న్యాయస్థానం ప్రతిష్ఠిత సభ, ఇతర గ్రామాల్లో ఏర్పాటుచేసిన న్యాయస్థానాలు అప్రతిష్టిత సభలు. ఈ రెండు సుముద్రిత, శాసిత అని మళ్లీ రెండు రకాలు. ప్రాడ్వివాకులు, మంత్రుల వంటి అధికారులు అధ్యక్షత వహించే న్యాయస్థానాలు సుముద్రిత సభలు. రాజు స్వయంగా తీర్పు చెప్పే సభలు శాసిత సభలు.
సామాజిక పరిస్థితులు
-కాకతీయుల కాలంలో సామాజిక అవసరాలను తీర్చేందుకు అనేక వృత్తులు అవసరమయ్యాయి. వృత్తులు వంశపారంపర్యంగా రావడం వల్ల అవి కులాలయ్యాయి. మొత్తం సమాజాన్ని అష్టాదశ ప్రజగా పేర్కొనవచ్చు.
-విజయనగర సామ్రాజ్య కాలానికి సంబంధించిన ఒక శాసనం ప్రకారం చతుర్వర్ణాలతోపాటు వ్యవహారికులు, పంచాణం (లోహకారులు, వడ్రంగులు), కుంభాలికులు, తంతువాయులు (నేత పనివారు), వస్త్ర భేదకులు (బట్టలకు రంగు వేసేవాళ్లు), తిల ఘాతకులు (నూనె తీసేవాళ్లు), కురంటకులు, వస్త్ర రక్షకులు (దర్జీలు), దేవాంగులు (దారం తీసేవాళ్లు), పెరికలు (వస్తువులు రవాణా చేసేవాళ్లు), గోరక్షకులు, కిరాతులు, రజకులు, క్షురకులు ఉండేవారు.
-ఈ పద్దెనిమిది వర్ణాలూ తమ సభ్యుల సంక్షేమం కోసం సంఘాలుగా ఏర్పడ్డాయి. వీటినే సమయాలంటారు. ఇవన్నీ సమయాచారాలను పాటించేవాళ్లు తమ సమయాలకు ధర్మపరులైన వారిని కుల పెద్దలుగా ఎన్నుకునేవారు. ఈ పెద్దలకు దేవాలయ నిర్మాణాలు, అఖండ దీపానికి నెయ్యి ఇవ్వడం వంటి సామాజిక కార్యక్రమాల కోసం, సమయ నిర్వహణ కోసం సభ్యుల నుంచి పన్ను వసూలు చేసే అధికారం కూడా ఉండేది.
-బ్రాహ్మణ సమాజాన్ని మహాజనులు అనే వాళ్లు. శైవ పూజారులను అసంఖ్యాతులని, వైష్టవులను వైష్ణవ సమయం అని అనేవాళ్లు. ఆయినూర్వురు, నకరులు, ఉభయ నానాదేశి పెక్కండ్రు, స్వదేశీ-పరదేశీ బేహారులు అనేవి ముఖ్యమైన వర్తక సంఘాలు. ఈ సమయాలన్నింటిని కలిపి అయ్యావళి అంటారు. ఆనాడు తీవ్రమైన మత ఘర్షణలు, సామాజిక వర్గ వైష్యమాలు, సామాజిక వ్యవస్థలో చోటు చేసుకున్నాయని ప్రతాప చరిత్ర తెలుపుతుంది. ప్రతాపరుద్రుడు విద్యాధికులైన కొందరు బ్రాహ్మణులకు బంగారు ఆవులను,
ద్రవ్యాన్ని దానం చేశారు.
-విశ్వబ్రాహ్మణులు, శైవ బ్రాహ్మణులు, వైదిక బ్రాహ్మణులు జ్యోతిషంపై అధికారం తమ ప్రత్యేకత అని చెప్పుకోవడానికి రాజుముందే ఘర్షణ పడి ఎవరికి వారు తాము అధికులమని రుజువు చేయడానికి ప్రయత్నించారు. నాలుగో కులానికి చెందిన మొల్ల రామాయణాన్ని రచించగా దాన్ని రాజుకు కృతిగా ఇవ్వడానికి బ్రాహ్మణులు అడ్డుపడ్డారు. ప్రతాపరుద్రుడు అశక్తుడై మొల్లను గౌరవించి, ఆ కావ్యాన్ని తనకు కృతి భర్తృత్వం లేకుండా చేసుకున్నాడు. ప్రతాప చరిత్రం, సిద్దేశ్వర చరిత్రం జైన, బౌద్ధ మత పండితులకు, వీరశైవ బ్రాహ్మణ పండితులకు మధ్య ఘర్షణలు జరిగాయని చెబుతున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు