కాకతీయుల ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవి?
బరౌనీ, ఇసామి, పెరిస్టా, మార్కోపోలో మొదలైన విదేశీ యాత్రికుల రచనలు కాకతీయుల ఆర్థిక స్థితిగతులను వివరిస్తున్నాయి. కాకతీయ రాజ్యం వాస్తవంగా దక్కన్ పీఠభూమిలోని నీటి వనరులు తక్కువగా ఉండి, భూసారం అంతగా లేని తెలంగాణ కేంద్రంగా స్థాపితమైంది. గణపతిదేవుని సైనిక విజయాల ఫలితంగా సారవంతమైన తీరాంధ్రపై వీరు అధికారం ప్రదర్శించారు. కోశాగారానికి వ్యవసాయ, వర్తక పన్నులు, సుంకాల ద్వారా ఆదాయం వచ్చేది. కాకతీయ చక్రవర్తులు, వారి సామంతులు వ్యవసాయాభివృద్ధికి చెరువులు, కాల్వలను నిర్మించారు.
వ్యవసాయం
వ్యవసాయ భూమిని మాగాణి, మెట్ట అని రెండు రకాలుగా, మాగాణిని నీరు నేల, తోట అని మళ్లీ రెండు రకాలుగా విభజించారు. మెట్టలో వర్షాధార పంటలు మొక్కజొన్న, నీలిమందు, ఆముదాలు, నువ్వులు పండించే వారు. సేద్యపు భూములను అచ్చుకట్టు భూములనేవాళ్లు. ఇందులో మాగాణి, మెట్ట భూములు రెండూ చేరుతాయి. అచ్చుకట్టు భూములంటే ప్రభుత్వానికి అరి చెల్లించాల్సిన అంటే పన్ను చెల్లించాల్సిన భూములు. అచ్చుకట్టు భూమి లో చేరిన ప్రతి మత్తరు భూమికి రూకలో 16వ వంతు అంటే ఒక వీసం చొప్పున దేవుని భాగంగా చేసిన దానాన్ని క్రీ.శ. 1225 నాటి కటకూరు శాసనం తెలుపుతున్నది.
-ఈ పన్ను ఒక్కొక్క కారుకు అది కార్తీకం కానీ, వైశాఖంకానీ విధిస్తారు. దీన్ని బట్టి అచ్చుకట్టు భూములంటే పన్ను వసూళ్లకు క్రమబద్ధంగా సర్వే చేసిన సేద్యభూములని తెలుస్తుంది. వరంగల్ జిల్లా కొండపర్తి శాసనంలో తాంబూలస్రవ ప్రసక్తి ఉంది. భూమిని కౌలుకు ఇచ్చేటప్పుడు భూమి యజమాని కౌలుదార్ల మధ్య ఒప్పందం తాంబూలాలు మార్చుకోవడం ద్వారా జరిగేదని ఇది తెలుపుతుంది. బహుశా ఆ సమయంలో కౌలుదారు భూమి యజమానికి ఏమైనా చెల్లించేవాడు కావచ్చు. అడపము అంటే తాంబూలం, అడపగట్టు అంటే ప్రభుత్వం కౌలుకు ఇచ్చిన భూమి.
-వీరు మంథెన, చెన్నూరు, కాళేశ్వరం, నర్సంపేట, అచ్చంపేట, ఖమ్మంమెట్టు, కొత్తగూడెం మొదలైన గ్రామాలను యోగ్యంగా నిర్మించినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. ఆనాటి వ్యవసాయ పంటలో వరి, పత్తి, ఉలవలు, నూనె గింజలు, జొన్నలు, కూరగాయలు, మిర్చి, మినుములు, పెసలు, చెరుకు, గోధుమలు, ఉల్లిగడ్డలు, అల్లం, నీలిమందు ముఖ్యమైనవి. పూలు, పండ్లు ప్రత్యేకంగా తోటల్లో పండించేవారు. వ్యవసాయ పన్నులను సిద్ధాయం లేదా పంగము, పన్ను, కానిక, దరిశనము, వెన్నుపన్ను, నీరువిడి, అర్ధాయం, పుల్లరి (గడ్డి భూములపై వసూలు చేసే పన్ను) మొదలైన పేర్లు శాసనాల్లో కనిపిస్తాయి. పన్నును ధన లేదా ధాన్య రూపంలో చెల్లించేవారు. దేవాలయాలకు, బ్రాహ్మణులకు, గ్రామ సేవకులకు దానంగా ఇచ్చిన భూములపై ప్రత్యేకంగా పన్ను మినహాయింపు ఉండేది. రాజ పురోహితుడైన మంచిభట్టుకు రాజు విశాల భూమిని దానం చేశాడని మంథెన శాసనంలో ఉంది.
-ఇదేవిధంగా గణపతిదేవుని కాళేశ్వర శాసనం రుద్రుని కుమారుడైన బుద్ధదేవ ప్రభువు, బుద్దాపురంలోని చెరువు పక్కన కాళేశ్వరదేవునికి నాలుగు నివర్తనాల భూమిని దానం చేసినట్లు తెలుపుతుంది. రాజులు, రాణుల పేర వెలిసిన గ్రామాల్లో గణపతి దేవుని పేర వెలిసిన గణపవరం, ఘన్పూర్, మహాదేవుని పేర వెలిసిన మహాదేవపురం, రుద్రదేవుని పేర వెలిసిన రుద్రవరం, బయ్యాలదేవి పేరున వెలిసిన బయ్యారం, ముప్పమాంబ పేర వెలసిన ముప్పవరం మొదలైన గ్రామాలు పేరుగాంచినవి.
-కాకతీయుల కాలంలో భూమిపై వాస్తవ హక్కు రాజుదా లేక యజమానిదా అన్నదానిపై చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. నల్లగొండ జిల్లా మేళ్లచెరువు శాసనం (క్రీ.శ. 1311) ప్రకారం రాచపోలం, రేగడి, లేదా వెలిగడు లేదా ఇసుక నేల వీటన్నింటిపై రాజే సర్వాధికారి అని గ్రహించవచ్చు.
-పీవీ పరబ్రహ్మశాస్త్రి ప్రకారం ప్రజలు వ్యక్తిగత భూములు కలిగి ఉన్నారని, ఒకవేళ రాజు వ్యక్తిగత భూములను ఏ అవసరానికైనా తీసుకుంటే దానికి నష్టపరిహారం చెల్లించేవాడని పేర్కొన్నారు. గణపతి దేవుని సోదరి కుందమాంబ నేటి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు తాలుకాలోని కుందవరం గ్రామాన్ని నిర్మించి అక్కడ కుందసముద్రం అనే తటాకాన్ని తవ్వించినట్లు అక్కడ లభించిన శాసనం తెలియజేస్తుంది. అదేవిధంగా గణపతిదేవుని గురువు విశ్వేశ్వర శివాచార్యుడు 850 గద్యాణాలకు కొంత అడవి ప్రాంతాన్ని కొని, ఆ ప్రాంతంలోని చెట్లను నరికించి తన పేరు మీద విశ్వనాథ పురం అనే గ్రామాన్ని నిర్మించి, తటాకాన్ని తవ్వించాడు.
-కొత్తగా నిర్మించిన గ్రామాలకు అనుబంధంగా ఉన్న భూములను సాగు చేసిన రైతాంగానికి కొన్ని ప్రత్యేక పన్నుల నుంచి పాలకులు మినహాయింపు ఇచ్చారు. కాకతీయులు వారి నాయకులకు, మంత్రులకు, సేనాధిపతులకు, కరణాలకు, గ్రామ సేవకులకు, ఆయగార్లకు కొన్ని గ్రామాల్లోని భూములను పన్ను మినహాయింపుతో సేవాభృతులుగా ఇచ్చినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. గణపతిదేవుని కుమార్తె గణపాంబ వేయించిన మొగలుట్ల శాసనం కమ్మర్లు, కుమ్మర్లు, చాకళ్లు మొదలైన గ్రామ సేవకులందరికీ వారు సాగు చేస్తున్న భూమిలో వచ్చే ఆదాయంలో సగభాగాన్ని మాత్రమే దానస్వీకర్తకు చెల్లించాలని పేర్కొంది.
వ్యవసాయ పండుగలు
మాగాణి భూముల్లో గాని, మెట్ట భూముల్లో గాని పంట వేసే తరుణంలో పండుగ చేసేవారు. క్రీ.శ. 935 నాటి కొరవి శాసనం.. వరిపంట, మెట్ట పంట వేసే ఆమని పున్నమి సందర్భంలో వసూలు చేసే కొన్ని సుంకాలను పేర్కొంటున్నది. ఆమని పున్నమి అంటే వైశాఖ పౌర్ణమి. వరి, మెట్ట పంటలు వేయడం సాధారణంగా ఏరువాక పున్నమి రోజున జరుగుతుంది. జ్యేష్ట పౌర్ణమి ఏరువాక పున్నమి. అప్పుడే నైరుతి రుతు పవనాలు ప్రారంభమై విత్తనాలు చల్లడానికి సరైన సమయం ఏర్పడుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో రైతులకు ఇది చాలా ముఖ్యమైన పండుగ. ఒక చెరువు కట్ట మీదో, కొండ మీదో, దేవాలయం దగ్గరో అందరూ కలిసి పూజ చేస్తారు.
-గణపతి దేవుని పరిపాలనా కాలానికి చెందిన క్రీ.శ. 1235 నాటికి ఉప్పరపల్లి శాసనం.. గ్రామస్తులు ఏరువాక పూజ చేసే ఏరువాక గుబ్బలి అనే గుట్టను పేర్కొంటున్నది. రైతులు తమ ఎద్దులు, నాగళ్లు అలంకరించి విత్తనాలు తీసుకొని ఆలయంలో పూజలు చేసి నేరుగా పొలాల్లో విత్తనాలు చల్లడానికి వెళ్తారు. అలాగే ఆగ్రహాయణ మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున మొదలవుతుంది. అప్పుడే కొత్త పంటను ఇంటికి తీసుకువస్తారు. ఈ సందర్భంలో కూడా పూజ చేస్తారు. కోతల సమయంలో నామమాత్రపు పూజ జరిగినప్పటికీ ఈ పండుగ ఆంధ్ర దేశంలో ఉత్తరాయణ- సంక్రాంతిన పెద్ద ఎత్తున జరుగుతుంది.
పరిశ్రమలు- దేశీయ, విదేశీయ వాణిజ్యం
-వ్యవసాయంతోపాటు అనేక పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్రలో 20కి మించిన వస్ర్తాల రకాలను పేర్కొన్నాడు. మార్కోపోలో మైసోలియా లేదా మచిలీపట్నంలో మహారాజులు సైతం మెచ్చుకొనే వస్ర్తాలు తయారు చేశారన్నాడు. వరంగల్లులో రత్న కంబళ్లు, మఖమల్ వస్ర్తాలను నేసేవారు. పంచలోహాలతో అనేక వస్తువులను తయారుచేసేవారు. ఆనాటి శాసనాల్లో, దేవాలయాల్లో తరచూ ఉపయోగించే లోహ దివ్వెలు, కంచు కరదీపికలు, పళ్లాలు, గంటలు, పిడి గంటలు వీటికి నిదర్శనం.
-పల్నాటి వీరచరిత్ర ప్రకారం బ్రహ్మనాయుడు త్రిపురాంతకంలో పంచలోహ స్తంభాన్ని నెలకొల్పాడు. గుత్తికొండ, పల్నాటి సీమలు ఇనుప పరిశ్రమకు కేంద్రాలు.
ఆనాటి యుద్ధాల్లో ఉపయోగించిన ఆయుధ సామగ్రి స్థానికంగా తయారయ్యేవి. నిర్మల్లో తయారైన కత్తులు డమాస్కస్కు ఎగుమతి అయ్యేవి. గోల్కొండ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నట్లు మార్కోపోలో తెలిపారు. కాకతీయుల కాలంలో ప్రముఖ వర్తక కేంద్రాలు ఓరుగల్లు, పానగల్లు, జడ్చర్ల, అలంపూర్, మక్తల్, మంథెన, పెరూరు, వేల్పూరు, పెద గంజాం, ఘంటసాల, దుర్గి, మాచర్ల మొదలైనవి. గణపతి దేవుని వరంగల్ దుర్గ శాసనం మార్కెట్ యార్డులో వివిధ వర్తకులు చేసే వర్తకం గురించి వివరిస్తుంది. దేశీయ వ్యాపారంతోపాటు విదేశీ వ్యాపారం బాగా కొనసాగింది. కాకతీయుల కాలంనాటి వాణిజ్య కేంద్రాలను, రేవు పట్టణాలైన మోటుపల్లి, మచిలీపట్టణాలతో కలుపుతూ రహదారులు ఉన్నాయి. ఆంధ్ర, కర్ణాటకలను మోటుపల్లి నుంచి త్రిపురాంతకం మీదుగా, బళ్లారి మార్గం కలిపేది. పల్నాడు నుంచి నల్లగొండ, నకరికల్లుల మీదుగా ఓరుగల్లుకు ఉన్న మార్గాన్ని క్రీడాభిరామం పేర్కొంటుంది.
-మోటుపల్లి ప్రధాన కేంద్రం కాగా కృష్ణపట్నం, హంసలదీవి, మచిలీపట్నం రేవులు కూడా విదేశీ వాణిజ్యాన్ని జరుపుతుండేవి. ఏనుగులు, గుర్రాలు, బంగారం, రత్నాలు, చందనం, జవ్వాజి, కర్పూరం, కర్పూర తైలం, పన్నీరు, దంతం, రాగి, తగరం, సీసం, పాదరసం, పట్టు, పగడాలు, సుగంధ ద్రవ్యాల్లో విదేశీ వ్యాపారం జరిగేది. చైనా, పర్షియా, అరేబియా దేశాలతోనూ సింహళం, తూర్పు ఇండియా దీవులతోనూ వాణిజ్యం సాగేది.
శ్రేణులు
కాకతీయుల కాలంలో వృత్తి శ్రేణులు, వర్తక శ్రేణులు ఆర్థిక కార్యకలాపాల్లో వర్తక, వ్యాపారాల్లో కీలక పాత్రను పోషించాయి. క్రీ.శ. 1282 నాటి త్రిపురాంతకం శాసనం ప్రకారం నానాదేశీ పెక్కండ్రు అనే వర్తక శ్రేణి వర్తకం చేసుకోవడానికి అనుమతి పత్రం పొందింది. కాకతీయుల కాలంలో వృత్తి శ్రేణులు, వర్తక శ్రేణులు ఐక్యంగా వ్యవహరించేవారు. ప్రతి శ్రేణి ఒక పెద్దను ఎన్నుకొనేవారు. ఇతడిని శ్రేష్టి లేదా సెట్టి అనేవారు. వారివారి శ్రేణి సభ్యుల సమస్యలను ఆ శ్రేణి పరిష్కరించేది. ప్రతి శ్రేణికి ఒక అధికార లాంఛనం ఉండేది. ప్రతి శ్రేణి తన రక్షణ కోసం సేనలను పోషించేది. వర్తకుణ్ని బేమరి అని వ్యాపార వ్యవహారమని పేర్కొన్నారు. వ్యాపారాలు స్వదేశీ, పరదేశీ అని రెండు రకాలు. మొదటి వర్గం వారిని నకరం అని రెండో రకం వారిని నానాదేశీ పెక్కండ్రు, ఉభయ నానాదేశీ పెక్కండ్రు అని పిలిచినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి.
కాకతీయుల కాలంనాటి వివిధ రకాల పన్నులు
-వివిధ రకాల పన్నులను, సుంకాలను వసూలు చేయడానికి ప్రత్యేక అధికారులను, ఉద్యోగులను, అంగడి అధికారులను నియమించారు. ముఖ్యంగా అమ్మకం, కొనుగోలు జరిగే అంగడిలో ఈ ప్రత్యేకాధికారులుండేవారు. సుంకమాన్యగాడు, తీర్పరి, కొలగాడు, కరణం ఈ అంగడి అధికారుల్లో ముఖ్యులు. కాకతీయుల కొన్ని శాసనాల్లో బుర్ర సుంకం, మడిగ సుంకం, పెండ్లి పన్ను, గాండి సుంకం (మోట బావి మీద), పుట్టు పేరు సుంకం (పుట్టిన బిడ్డకు నామకరణం చేసే సందర్భంలో), రేవు సుంకం, ఆలిము (కూరగాయల మీద పన్ను), అంతరాయం (పోక తోటల మీద), కిళరము (గొర్రెల మంద మీద), ఇల్లరి (ఇంటిపై) మొదలైన పన్నులు లేదా సుంకాలను పేర్కొన్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు