Lokpal, Lokayukta | లోక్‌పాల్, లోకాయుక్త
వ్యక్తి, కుటుంబం, సమూహం, రాజ్యంగా పరిణామం చెందుతూ వచ్చిన మానవ రాజకీయ చరిత్రలో అనేక రకాల రాజ్యవ్యవస్థలు అవతరించి కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా సర్వామోదాన్ని పొందింది. ప్రజల హక్కులను, స్వేచ్ఛను కాపాడుతూ శ్రోయోరాజ్య స్థాపనే ప్రజాస్వామ్య పరమావధిగా కొనసాగుతున్నది. అయితే, అధికార నిర్వహణలో ఉన్న వ్యక్తుల్లో రానురాను నిరంకుశత్వం, ఆశ్రిత పక్షపాతం, అవినీతి పెరిగిపోతుండటంతో వాటిని కట్టడి చేసేందుకు నియంత్రణ వ్యవస్థల అవసరం ఏర్పడింది. ఆ విధంగా ఉద్భవించినవే అంబుడ్స్మన్లు. భారత్‌లో వీటినే లోక్‌పాల్, లోకాయుక్త పేరుతో పిలుస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చాక సుదీర్ఘకాలం పార్లమెంటు ఆమోదానికి నోచుకోకుండా నాన్చివేతకు గురైన బిల్లుల్లో లోక్‌పాల్ బిల్లు ఒకటి. 2011లో గాంధేయవాది అన్నాహజారే నేతృత్వంలో అవినీతిపై ప్రజా ఉద్యమం ఉప్పెనలా రావటంతో ఎట్టకేలకు 2013లో లోక్‌పాల్ బిల్లు పార్లమెంటు ఆమోదంపొంది 2014 జనవరి 16న అమల్లోకి వచ్చింది. లోక్‌పాల్ చట్టం గురించి నిపుణ పాఠకులకోసం ప్రత్యేకం..
-ప్రజల ఫిర్యాదులను పరిశీలించి, వారి సమస్యలను తగ్గించడంపైనే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు దృష్టిసారించాలి. అందుకే వివిధ దేశాల్లో ప్రజాసమస్యలను తగ్గించడానికి వివిధ నివారణోపాయ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అవి.. 1) అంబుడ్స్‌మన్ వ్యవస్థ 2) పాలనా న్యాయస్థానాల వ్యవస్థ 3) ప్రొక్యూరేటర్ వ్యవస్థ
-ప్రజల సమస్యలను, ఇబ్బందులను తొలగించడానికి ప్రపంచంలోని ప్రాచీన ప్రజాస్వామ్య దేశాలు ఏర్పాటు చేసిన వ్యవస్థే స్కాండినేవియా అంబుడ్స్‌మన్. ఈ అంబుడ్స్‌మన్ వ్యవస్థపై అంతర్జాతీయ నిష్ణాతుడైన డొనాల్డ్ సీ రోవత్ అనుచిత పాలనా విధానాలపై సాధారణ పౌరుడు చేసే ఫిర్యాదులను పరిష్కరించడానికి అంబుడ్స్‌మన్ అద్వితీయమైన, సముచితమైన వ్యవస్థ అని పేర్కొన్నాడు. ఈ వ్యవస్థను మొదటిసారిగా 1809లో స్వీడన్లో నెలకొల్పారు. అంబుడ్ అనే స్వీడిష్ భాషా పదానికి ప్రతినిధిగా వ్యవహరించే వ్యక్తి లేదా మరో వ్యక్తి తరఫున మాట్లాడే వ్యక్తి అని అర్థం.
1. అనుచిత పాలన విచక్షణ (పాలనాధికారాలను దుర్వినియోగం చేయడం)
2. పాలనా వైఫల్యం (పాలనా లక్ష్యాల సాధనలో అసమర్థత)
3. పాలనాపరమైన అవినీతి (పనులు చేయడానికి లంచం తీసుకోవడం)
4. ఆశ్రిత పక్షపాతం (బంధువులు, స్నేహితులకు ఉద్యోగం ఇవ్వడంలో ప్రాధాన్యం ఇవ్వడం)
5. అమర్యాద (దుర్భాషలాడటం) వంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ స్వీడిష్ అంబుడ్స్‌మన్ కృషిచేస్తుంది.
-స్కాండినేవియా దేశాలైన ఫిన్లాండ్ (1919), డెన్మార్క్ (1955), నార్వే (1962) దేశాల్లో కూడా ఈ స్కాండినేవియా అంబుడ్స్‌మన్ వ్యవస్థ మొదలైంది.
-ఈ వ్యవస్థను 1962లో పార్లమెంటరీ కమిషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ పేరుతో మొదటగా ఏర్పాటు చేసుకున్న కామన్వెల్త్ దేశం న్యూజిలాండ్.
-ఈ వ్యవస్థను 1967లో పార్లమెంటరీ కమిషన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో యునైటెడ్ కింగ్డమ్ ఏర్పాటు చేసుకుంది.
-ఇలా అంబుడ్స్‌మన్ వ్యవస్థను వివిధ దేశాల్లో, వివిధ పేర్లతో ఏర్పాటు చేసుకున్నారు. అలా భారత్‌లో కూడా ఏర్పాటైన ఈ వ్యవస్థను లోక్‌పాల్, లోకాయుక్తగా వ్యవహరిస్తారు.
-దేశంలోని అవినీతిని అదుపు చేయడానికి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చట్టపరంగా కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అవి..
1) ప్రభుత్వ ఉద్యోగుల విచారణ చట్టం-1850
2) భారత శిక్షాస్మృతి-1860
3) స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్-1941
4) ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం-1946
5) అవినీతి నిరోధక చట్టం-1988
6) కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ (రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులకు వ్యతిరేకంగా) చట్టం-1952
7) అఖిల భారత సర్వీసుల (ప్రవర్తన) చట్టం-1968
8) కేంద్ర సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) చట్టం-1964
9) రైల్వే సర్వీసుల (ప్రవర్తన) చట్టం-1966
10) మంత్రిత్వ శాఖలు/డిపార్ట్మెంట్లు, అనుబంధ, ఉప విభాగ ఆఫీసులు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏర్పాటుచేసిన విజిలెన్స్ సంస్థలు
11) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)-1963
12) కేంద్ర విజిలెన్స్ కమిషన్-1964
13) రాష్ట్ర విజిలెన్స్ కమిషన్-1954
14) రాష్ర్టాల్లో అవినీతి నిరోధక శాఖలు
15) రాష్ర్టాల్లో లోకాయుక్త (అంబుడ్స్‌మన్)
16) డివిజనల్ విజిలెన్స్ బోర్డు
17) జిల్లా విజిలెన్స్ అధికారి
18) జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్
19) షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్
20) షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్
21) సుప్రీంకోర్టు, హైకోర్టులు
22) పరిపాలనా ట్రిబ్యునళ్లు (పాక్షిక న్యాయసంబంధమైనవి)
23) క్యాబినెట్ సచివాలయంలో ప్రజా ఫిర్యాదుల సంచాలక కార్యాలయం-1988
24) పార్లమెంటు, వాటి కమిటీలు
25) కేరళ వంటి కొన్ని రాష్ర్టాల్లో ఫైల్ టు ఫీల్డ్ కార్యక్రమం ఉంది. ఈ వినూత్న విధానంలో పాలనాధికారే గ్రామం/ప్రాంతానికెళ్లి ప్రజల ఫిర్యాదులను విని వీలైతే అక్కడికక్కడే సమస్యను పరిష్కరిస్తాడు.
లోక్‌పాల్
-ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి లోక్‌పాల్, లోకాయుక్త అనే రెండు ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలని భారత పాలనా సంస్కరణల కమిషన్ (1966-1970) సిఫారసు చేసింది. వీటిని స్కాండినేవియా దేశాల్లోని అంబుడ్స్‌మన్, న్యూజిలాండ్‌లోని పార్లమెంటరీ కమిషనర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ తరహాలో ఏర్పాటు చేయాలని సూచించింది.
-లోక్‌పాల్ కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో మంత్రులు, కార్యదర్శులపై ఫిర్యాదులు, లోకాయుక్త (కేంద్రంలో ఒకటి, ప్రతి రాష్ర్టానికి ఒకటి) ఇతర నిర్దిష్ట ఉన్నతాధికారులపై ఫిర్యాదులను స్వీకరించి విచారణ జరపాలి. న్యాయవ్యవస్థను లోక్‌పాల్, లోకాయుక్తల పరిధికి రాకుండా పాలనా సంస్కరణల కమిషన్ (ఏఆర్సీ)ను ఏర్పాటు చేసింది.
-ఏఆర్సీ ప్రకారం లోక్‌పాల్‌ను రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లను సంప్రదించిన అనంతరం నియమిస్తారు.
2011 లోక్‌పాల్ బిల్లులు
-పాలనా యంత్రాంగంలోని ఉన్నతస్థానాల్లో ఉన్న ప్రముఖులపై వచ్చే అవినీతి ఆరోపరణలను విచారించడానికి ఒక పటిష్ట వ్యవస్థను రూపొందించడానికి 2011 ఏప్రిల్ 8న ఒక జాయింట్ డ్రాఫ్టింగ్ కమిటీని లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను తయారుచేయడానికి ఏర్పాటు చేసింది.
-ఇందులో ప్రభుత్వం నుంచి ఐదుగురు నామినీ మంత్రులు, అన్నాహజారే నామినేట్ చేసిన (హజారేతోపాటు) ఐదుగురు సభ్యులుగా ఉన్నారు. వీరు చేసిన పరిశీలనలు, ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నుంచి అందిన సమాచారం ఆధారంగా ప్రభుత్వం ఒక సవరించిన లోక్‌పాల్ బిల్లు 2011ను తయారుచేసింది. ఈ బిల్లును 2011 ఆగస్టు 4న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
-ఈ బిల్లును పరిశీలించి నివేదిక అందజేయాలని కోరుతూ 2011 ఆగస్టు 8న పార్లమెంటరీ స్థాయీసంఘానికి పంపారు.
-కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం అప్పటికే పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న లోక్‌పాల్ బిల్లు-2011ను ఉపసంహరించుకుంది. దాని స్థానంలో కొత్త లోక్‌పాల్, లోకాయుక్త-2011 బిల్లును 2011, డిసెంబర్ 22న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రంలో లోకాయుక్త వ్యవస్థలు ఏర్పాటు కావాలి. ఈ బిల్లు దేశమంతటా అమలయ్యేలా ఒకే విధమైన విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ రోడ్ మ్యాప్‌ను సూచించింది. విచారణ నుంచి దర్యాప్తును వేరుచేస్తూ వాటిని సంస్థాగతం చేయాలని బిల్లు సూచించింది. కమిటీ సలహాను దృష్టిలో పెట్టుకొని లోక్‌పాల్, లోకాయుక్తలను రాజ్యాంగబద్ధ సంస్థలుగా మార్చేందుకు 116వ రాజ్యాంగ సవరణ బిల్లు-2011ను ప్రవేశపెట్టింది.
-ఈ బిల్లును 2011 డిసెంబర్ 11న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌పాల్, లోకాయుక్త బిల్లు-2011ను డిసెంబర్ 27న కొన్ని సవరణలతో లోక్‌సభ ఆమోదించింది. 116వ రాజ్యాంగ సవరణ బిల్లు-2011 రాజ్యాంగ సవరణకు తగిన మెజారిటీ లేనందున ఆమోదం పొందలేదు. లోక్‌పాల్, లోకాయుక్త బిల్లు-2011ను ఆమోదించడానికి రాజ్యసభ 2011, డిసెంబర్ 29న ప్రారంభించిన చర్చలు అర్థరాత్రి అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత 2012 మే 21న బిల్లును రాజ్యసభలో అభిప్రాయ సేకరణకు సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపారు. సుదీర్ఘ సంప్రదింపులు, చర్చల తర్వాత ఈ బిల్లును 2013 డిసెంబర్ 17న రాజ్యసభ ఆమోదించింది. అయితే, పాత బిల్లులోని అనేక అంశాలపై సవరణలు చేశారు. ఈ బిల్లును లోక్‌సభ డిసెంబర్ 18న ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి 2014 జనవరి ఒకటోతేదీన ఆమోద ముద్ర వేశారు. దాంతో లోక్‌పాల్, లోకాయుక్త చట్టం 2013 పేరుతో 2014 జనవరి 16 నుంచి అమల్లోకి వచ్చింది.
లోక్‌పాల్, లోకాయుక్త బిల్లు-2011
-ప్రభుత్వ ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలను, దానికి సంబంధించిన అవినీతి వ్యవహారాలను విచారించడానికి కేంద్రంలో లోక్‌పాల్, రాష్ర్టాల్లో లోకాయుక్త వ్యవస్థలను ఏర్పాటు చేయడమే ఈ లోక్‌పాల్, లోకాయుక్త బిల్లు-2011 ఉద్దేశం.
ముఖ్యాంశాలు
1) లోక్‌పాల్‌కు ఒక చైర్మన్, 8 మంది వరకు సభ్యులు ఉంటారు. ఈ సభ్యుల్లో 50 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు ఉండాలి.
2) చైర్మన్, సభ్యులను ఎంపిక చేయడానికి ఒక సెలక్షన్ కమిటీ, సెర్చ్ కమిటీ ఉంటుంది. ఇందులో ఏడుగురికి తగ్గకుండా సభ్యులు ఉండాలి. వీరిలో 50 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళలు ఉండాలి.
3) లోక్‌పాల్ విచారణ పరిధిలోకి ప్రధానమంత్రి (విషయపర అంశాల ఆవల, ఇతర ప్రత్యేక రక్షణలు), కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు, గ్రూప్-ఎ, బి, సి, డి సర్వీసులకు సంబంధించి అవినీతి నిరోధక చట్టం-1988 నిర్వచించిన ప్రభుత్వ ఉద్యోగి, పార్లమెంటు చట్టం అనుసరించి ఏర్పాటైన ఏదేని సంస్థ, బోర్డు, కార్పొరేషన్, అథారిటీ, కంపెనీ, సొసైటీ, ట్రస్టు, స్వతంత్ర సంస్థలో పనిచేస్తున్నవారు, కేంద్రప్రభుత్వం నోటిఫై చేసిన మొత్తం కంటే ఎక్కువ వార్షికాదాయం కలిగి ప్రభుత్వం నుంచి పూర్తిగా లేదా పాక్షికంగా ఆర్థికసాయం అందుకున్న సంస్థలు, ప్రజల నుంచి డొనేషన్లు అందుకుంటున్న సంస్థల్లో పనిచేస్తున్నవారు, FCRA (చట్టం) కింద ఏడాదికి రూ. 10 లక్షల కంటే ఎక్కువ విరాళాలు అందుకుంటున్న సంస్థల ఉద్యోగులు.
4) లోక్‌పాల్‌కు తన కింద స్వతంత్రంగా పనిచేసే దర్యాప్తు, విచారణ విభాగం ఉండాలి.
5) విచారణ నుంచి దర్యాప్తును వేరుచేయాలి. దీనివల్ల ప్రయోజనాల సంఘర్షణ తొలగి, వృత్తిపరమైన నైపుణ్యాలు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది.
6) లోక్‌పాల్‌కు తాను అప్పగించిన కేసుల విషయంలో సీబీఐతో పాటు దేశంలోని ఏ దర్యాప్తు సంస్థపై అయినా పర్యవేక్షణకు అదేశాలు జారీచేయడానికి అధికారం ఉండాలి.
7) కేసులకు సంబంధించి లోక్‌పాల్ ప్రారంభించిన దర్యాప్తునకు లేదా లోక్‌పాల్ అనుమతితో, మార్గదర్శకత్వంలో జరుపుతున్న దర్యాప్తునకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.
8) దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పటికీ అవినీతి మార్గాల ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేయడానికి స్వాధీనం చేసుకోడానికి తగిన ప్రొవిజన్ ఉండాలి.
9) ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటైన ఒక ఉన్నతాధికార కమిటీ సిఫారసు మేరకే సీబీఐ డైరెక్టర్‌ను నియమించాలి.
10) ప్రాథమిక విచారణ, దర్యాప్తు, న్యాయవిచారణలకు నిర్దిష్టమైన కాలపరిమితి ఉండాలి.
11) అవినీతి నిరోధక చట్టం కింద ప్రస్తుతం ఉన్న 6 నెలల కనీస శిక్షను రెండేండ్లకు, ఏడేండ్ల గరిష్ట శిక్షను పదేండ్లకు పెంచాలి.
12) అవినీతి ఆరోపణలతో సంబంధం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయడానికి లేదా తాత్కాలికంగా తొలగించడానికి లోక్‌పాల్‌కు అధికారం ఉండాలి.
13) అవసరమైనన్ని ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయడానికి లోక్‌పాల్‌కు అదికారం ఉండాలి.
14) లోక్‌పాల్ లాగానే రాష్ర్టాల్లో లోకాయుక్త వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.
ఏఆర్సీ సిఫారసు చేసిన లక్షణాలు
1) స్వతంత్రతను, నిష్పాక్షికతను ప్రదర్శించాలి
2) వీటి దర్యాప్తు, విచారణలు వ్యక్తిగతంగా, లాంఛనరహితంగా జరగాలి
3) వీరి నియామకాలు వీలైనంతవరకు రాజకీయాలకు అతీతంగా జరగాలి
4) హోదా దేశంలోని అత్యున్నత న్యాయాధికారులతో పోల్చదగినదిగా ఉండాలి
5) విచక్షణకు అవకాశం ఉన్న అన్యాయం, అవినీతి, పక్షపాతం వంటి అంశాలను విచారించాలి
6) న్యాయవ్యవస్థ జోక్యానికి అవకాశం లేనివిధంగా దర్యాప్తు సాగాలి
7) తమ విధులకు సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు వీరికి పూర్తి స్వాతంత్య్రం, అధికారం ఉండాలి
8) అధికారంలో ఉన్న ప్రభుత్వం నుంచి వారు ఎటువంటి ప్రయోజనాలను లేదా ఆర్థికపరమైన లాభాలను ఆశించరాదు
-ప్రభుత్వం ఈ సిఫారసులను ఆమోదించింది. వీటిపై చట్టాన్ని తెచ్చేందుకు అధికారికంగా 10 సార్లు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు. వీటిలో పదో బిల్లు 2013 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోద ముద్రతో 2014 జనవరి 16 నుంచి లోక్‌పాల్ చట్టం-2013 అమల్లోకి వచ్చింది
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?