విద్యావిధానంపై ముసాయిదా కమిటీ
జాతీయ నూతన విద్యావిధానం తుది ముసాయిదా రూపకల్పనకు ఇస్రో మాజీ చైర్మన్ కే కస్తూరిరంగన్ నేతృత్వంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ జూన్ 26న కమిటీని ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది ప్రముఖులను సభ్యులుగా నియమించింది. నూతన విద్యావిధానం రూపకల్పనకు గాను మానవ వనరుల అభివృద్ధి శాఖ గతంలో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరింది. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, నిపుణులు, విద్యార్థులు, ఇతర భాగస్వాములు దాదాపు 26 వేల మంది అభిప్రాయాలను పంపారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో సంప్రదింపులు కూడా జరిగాయి. ప్రాంతీయస్థాయి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయాలను వెల్లడించాయి. రాజ్యసభలో కూడా దీనిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా 48 మంది ఎంపీలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొందరు లిఖితపూర్వకంగా అందజేశారు. వీటి ఆధారంగా టీఎస్ఆర్ సుబ్రహ్మణియం కమిటీ పూర్తిస్థాయి సమాచారాన్ని అందజేసింది. ఆ సమాచారాన్ని, వివిధ వర్గాల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను కస్తూరిరంగన్ కమిటీ పరిశీలించి తుది ముసాయిదాను రూపొందిస్తుంది.
కమిటీలో సభ్యులు
1. వసుధ కామత్: ప్రముఖ విద్యావేత్త. పాఠశాల విద్యారంగానికి విశేష సేవలందించారు. ప్రస్తుతం ముంబైలోని ఎస్ఎన్డీటీ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా సేవలందిస్తున్నారు.
2. కేజే అల్ఫోన్సె: పాఠశాల విద్యా సంస్కరణల అమలులో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులన్నీ వాస్తవంగా తెలిసిన వ్యక్తి. కేరళలోని కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో 100 శాతం అక్షరాస్యత సాధనలో కీలకపాత్ర పోషించారు.
3. మంజుల్ భార్గవ: అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో గణితం ప్రొఫెసర్. గాస్ నంబర్ థియరీకి అందించిన సేవలకుగాను యుక్త వయసులోనే అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు.
4. రామ్‌శంకర్ కురీల్: అంబేద్కర్ జన్మస్థలం మహూలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా సేవలందిస్తున్నారు.
5. టీవీ కట్టమణి: మధ్యప్రదేశ్ అమర్‌కంఠక్‌లోని గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతి.
6. కృష్ణమోహన్ త్రిపాఠి: సర్వశిక్ష అభియాన్‌లో విశేష అనుభవం ఉంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ పరీక్షల మండలి అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.
7. మజర్ ఆసిఫ్: గువాహటి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ఈయన పరిశోధన పర్యవేక్షణలో తొలి పర్షియన్- అస్సామి, ఇంగ్లిష్ నింఘంటువు రూపుదిద్దుకున్నది.
8. ఎంకే శ్రీధర్: కర్ణాటక నాలెడ్జి కమిషన్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ మాజీ సభ్యకార్యదర్శి. దివ్యాంగ మేధావి. సీఏబీఈ సభ్యుడిగా ఉన్నారు.
ప్రపంచ వారసత్వ నగరం అహ్మదాబాద్
గుజరాత్లో 60 ఏండ్ల చరిత్ర కలిగిన అహ్మదాబాద్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. దీంతో అహ్మదాబాద్.. పారిస్, వియన్నా, కైరో, బ్రసెల్స్, రోమ్ వంటి ప్రఖ్యాత నగరాల సరసన చేరింది. పొలండ్‌లోని క్రాకౌలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో ఢిల్లీ, ముంబై నగరాలను వెనక్కినెట్టి అహ్మదాబాద్ ఈ గౌరవాన్ని అందుకుంది. మన దేశంలో ఈ ఘనత దక్కించుకున్న తొలి నగరంగా అహ్మదాబాద్ నిలిచింది. భారత్‌లోని చారిత్రాత్మక అహ్మదాబాద్‌ను ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటిస్తున్నామని యునెస్కో 2017, జూలై 8న తెలిపింది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో 1000కి పైగా విశ్వఖ్యాతికి అర్హమైన ప్రాంతాలు ఉన్నాయి. స్మారక ప్రదేశాలు, ప్రకృతిసిద్ధ స్థలాలు, నగరాలు, నిర్మాణాలు, క్షేత్రాలు తదితరాలు ఎన్నో ఇందులో చోటుచేసుకున్నాయి. భారత్‌లోని తాజ్‌మహల్, ఆస్ట్రేలియాలోని గ్రేట్ బేరియర్ రీఫ్, పెట్రా (జోర్దాన్)లోని రాతి కట్టడాల నగరం వంటివి ఉన్నాయి. తాజాగా బ్రిటన్‌లోని లేక్ డిస్ట్రిక్, రియో డీ జెనీరియోలోని వలోంగో నౌకాశ్రయం, పసిఫిక్ మహాసముద్ర దక్షిణ ప్రాంతంలో ముక్కోణాకారంలో కలిసే మూడు ద్వీపాల సమూహం (పొలినేసియన్ ట్రెయాంగిల్)లనూ జాబితాలో చేర్చారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు