Epic poets | పురాణ కవులు
పురాణం అంటే పాత కథ. వ్యాసుడు పురాణాలకు కూడా ఒక రూపం తీసుకొచ్చాడు. భారతీయ సంస్కృతిలో అష్టాదశ (18) పురాణాలు ఉన్నాయి. వేదాలు, పురాణాలు సమానస్థాయి కలిగినవని మనకు మార్కండేయ పురాణంవల్ల తెలుస్తుంది. మద్వయం, భద్వయం, చైవ బ్రత్రయం, వచతుష్టయం అ.నా.ప.లిం.గ.కూ.స్కాని పురాణాని పృథక్ పృథక్ అని ఉంది. మద్వయం- మత్స్య, మార్కండేయ పురాణాలు. భద్వయం- భాగవత, భవిష్య పురాణాలు, బ్రత్రయం – బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వచుతుష్టయం- విష్ణు, వరాహ, వామన, వాయు పురాణాలు, అ- అగ్ని పురాణం, నా- నారద పురాణం, ప- పద్మపురాణం, లిం- లింగ పురాణం, గ- గరుడ పురాణం, కూ- కూర్మ పురాణం, స్కా- స్కాందపురాణం. మొత్తం 18 పురాణాలు. వీటికి 18 ఉప పురాణాలు, మరో 18 ఔప పురాణాలు ఉన్నాయని బృహద్వివేకం అనే గ్రంథం పేర్కొంటుంది.
-18 ఉప పురాణాలు: ఆది, నరసింహ, స్కాంద, శివధర్మ, దుర్వాస, నారదీయ, కపిల, ఔషశన, బ్రహ్మాండ, వరుణ, కాళికా, మహేశ్వర, శాంబ, సౌర, పారాశర, మారీచ, భాస్కర పురాణాలు.
-18 ఔప పురాణాలు: సనత్కుమార, బృహన్నారదీయ, ఆదిత్య, సౌర, నందకేశ్వర, కౌర్మ, భాగవత, వాసిష్ట, భార్గవ, ముద్గల, కల్కి, దేవీమహాభాగవత, బృహద్ధర్మ, పరానంద, వహ్వి, పశుపతి, హరివంశ పురాణాలు.
-పురానవం భవతీతి పురాణమ్: ప్రాచీనమైనదే అయినా నిత్యం కొత్తది కావడం పురాణం. పురాపూర్వస్మిన్ భూతమితి పురాణమ్- పూర్వం జరిగినది కాబట్టి పురాణం. అమరకోశం ప్రకారం పురాణానికి 5 లక్షణాలున్నాయి. అవి.. సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరిత.
-మడికి సింగన (క్రీ.శ.1350): ఈయన కరీంనగర్ జిల్లా రామగిరి వాసి. 11 ఆశ్వాసాల పద్మ పురాణాన్ని తెనుగించాడు. కందనామాత్యుని కోరిక మేరకు వాటిని తెనుగించాడని తెలుస్తున్నది.
-పశుపతి నాగనాథ కవి (క్రీ.శ.1340-1415): ఈయన రాచకొండ గ్రామానికి చెందినవారు. రాచకొండను పాలించిన పద్మనాయక ప్రభువు అనపోతానాయకుని ఆస్థానంలోనివారు. సంస్కృతంలో ఉన్న విష్ణు పురాణాన్ని తెనుగించినవారిలో ఈయన ప్రథములు. ఈ కవి విశ్వేశ్వర కవి చంద్రుని శిష్యుడని చెప్పడానికి ఆధారం ఉంది.
-కామినేని మల్లారెడ్డి: నిజామాబాద్ జిల్లా (పాత) బిక్కనూరుకు చెందినవారు. దోమకొండ సంస్థానాధీశులు. కుతుబ్షాహీ కాలానికి చెందినవారు. గణనాథ కవీశ్వరుని సలహాపై పద్మ పురాణాన్ని తెనుగించాడు. లింగ పురాణం కూడా రాశారు.
-రంగరాజు కేశవరావు (1830-1904): వరంగల్ జిల్లా (పాత) ఖిలాషాపురం గ్రామానికి చెందినవారు. వీరికి కవి శిరోమణి బిరుదు ఉంది. కల్కి పురాణం రాశారు.
-ఏర్చూరి సింగన: నల్లగొండ జిల్లా ఏర్చూరు గ్రామానికి చెందినవారు. ఈయన భాగవతంలోని 6వ స్కందాన్ని మాత్రమే అనువదించినట్లు తెలుస్తుంది. ఈ స్కందంలో 40 కథలున్నాయి. వాటిలో అజామీళోపాఖ్యానం, చిత్రమీళోపాఖ్యానం మొదలైన కథలు ముఖ్యమైనవి.
-హరిభట్టు (1475-1533): బహుశా ఖమ్మం వాసియై ఉండవచ్చు. వరాహ పురాణం రాశారు.
-మారన: కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో 1291లో మార్కండేయ పురాణం రాశారు. ఈయన తిక్కన శిష్యుడు. ఎనిమిది ఆశ్వాసాల మార్కండేయ పురాణంలో మార్కండేయ మహర్షిని జైమిని ప్రశ్నించడం గురించి ఉంది.
-ఎలకూచి బాలసరస్వతి: ఈ కవి జటప్రోలు సంస్థాన సురభి మాధవరాయల ఆశ్రయంలో (1620-1670) ఉన్నారు. ఈయన అసలు పేరు ఎలకూచి వెంకటకృష్ణయ్య. వామన పురాణంను తెనుగించారు. ఈయనకు మహామహోపాధ్యాయ బిరుదు ఉంది.
-హరిభట్టు: మత్స్య పురాణం రాశారు. నారాయణ అనే ముని.. శౌనకుడు మొదలైన వారికి వైష్ణవ ధర్మం గురించి చెప్పడం ఇందులో ఉంది. నారసింహ పురాణం కూడా ఈయనే రాశారు.
-కాణాదం పెద్దన సోమయాజి: గద్వాల సంస్థానాధీశుడైన చిన సోమభూపాలుని (1762-93) ఆస్థాన కవి. ఈయన రాసిన మత్స్య పురాణం అలభ్యం.
-పాల్కురికి సోమనాథుడు: ఈ కవి పేరు వినగానే బసవ పురాణం గుర్తుకొస్తుంది. ఈయన శైవకవి. తెలుగులో మొట్టమొదటి దేశీ పురాణం. దీనిపై జైన పురాణం ప్రభావం ఉన్నదని ఆచార్య జీవీ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. బసవ పురాణంలో నంది బసవేశ్వరుడిగా జన్మించడం గురించి ఉంది. దీనిలో మడివేలు మాచయ్య కథ, బెజ్జమహాదేవి కథ ఉన్నాయి.
-ఎలకూచి పిన్నయామాత్యుడు: జటప్రోలు సంస్థానం. ఆదిత్య పురాణాన్ని తెనుగించారు.
-పాతకోట పుల్లయ్య: వనపర్తి సంస్థానం. బ్రహ్మోత్తర ఖండం రాశారు. ఇది అలభ్యం.
-శరభాంక కవి (14వ శతాబ్దం): వేములవాడకు చెందినవారు. చెన్నబసవ పురాణం రాశారు.
-వాడపల్లి ఆగయ్య: ఈయన వరంగల్ వాసి. అచలపరిపూర్ణ సిద్ధాంత-శివరామ దీక్షితీయ సాంప్రదాయానికి చెందినవారు. మేరు వంశ పురాణం రాశారు. వాడపల్లి ఆగదాసు కుమారుడైన వాడపల్లి ఆనందం కూడా మంచి కవి. గురు సాంప్రదాయికులు.
-ములుగు పాపయ్య: 1750లో జన్మించారు. అచ్చ తెనుగు కావ్యమైన దేవీ భాగవతం రాశారు.
-ఠంయ్యాల లక్ష్మీనరసింహాచార్యులు: వరంగల్ వాసి. సూర్యరాజ పురాణం రాశారు. దీనికి కాటిక పురాణం అనే మరో పేరు కూడా ఉంది.
-రాఘవ భూపాలుడు: ఎనిమిది ఆశ్వాసాల భార్గవ పురాణం రాశారు.
-పిడమర్తి బసవయ్య: 14వ శతాబ్దానికి చెందినవారు. బ్రహ్మోత్తర ఖండం రాశారు. ఇది దొరకడం లేదు.
-పట్టమెట్ట సోమనాథుడు: కామారెడ్డి – ఆస్థాన కవి. బ్రహ్మోత్తర ఖండం రాశారు. దీనిలో స్కాంద పురాణం నుంచి తీసుకున్న ఐదు ఆశ్వాసాలు ఉన్నాయి.
-బారి కుడుపుల ధర్మయ్య: నృసింహ పురాణం రాశారు. ద్విపదలో రచించారు.
-నాగలింగ శివయోగి: నీలకంఠ పురాణం రచయిత. మహబూబ్నగర్ వాస్తవ్యులు.
-మల్లికార్జున సిద్ధయోగి: యాదాద్రి జిల్లాలోని కొలనుపాక గ్రామం. గౌడ పురాణం రచయిత. ద్విపదలో రాశారు. గౌండ్ల కులస్థుల వృత్తి విధానం, కథలు ఇందులో ఉన్నాయి.
-నిర్మల శంకరశాస్త్రి: శివ పురాణం రాశారు.
-సంపన్ముడుంబై సింగరాచార్యులు: భాగవత పురాణం రాశారు.
-బమ్మెర పోతన: భాగవతాన్ని తెనుగించిన వారిగా అందరికీ సుపరిచితమే.
-గిరిలక్ష్మీ కందాళ: సూర్యాపేట జిల్లా, చందుపట్ల. భీమేశ్వర పురాణ పరిశీలనపై సిద్ధాంత వ్యాసం రాశారు.
-మల్లారెడ్డి ధరాధినాథుడు: బ్రహ్మాండ పురాణాన్ని తెనుగించారు.
-పంపకవి: కన్నడ ఆదికవి అయినా తెలంగాణవారు. ఈయన ఆదిపురాణం (కన్నడ), జ్ఞానేంద్ర పురాణం (తెలుగు) రాశారు.
-వేములవాడ భీమకవి: నృసింహ పురాణాన్ని తెనుగించారు. కన్నడంలో బసవ పురాణం రాశారు.
-పిడమర్తి సోమనాథుడు: బసవ పురాణాన్ని పద్య కావ్యంగా రాశారు. ఈయనకు ప్రబంధ నిబంధన శక్తియుక్త అనే బిరుదు ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు