Towards planned economic progress | ప్రణాళికాబద్ధమైన ఆర్థిక ప్రగతివైపు..
ఐదో పంచవర్ష ప్రణాళిక (1974-79)
-ఐదో పంచవర్ష ప్రణాళికలో సంఘటిత పరిశ్రమలు, గనుల తవ్వకం రంగానికి రూ. 10,135 కోట్లు కేటాయించింది. ఈ ప్రణాళికలో మొత్తం వ్యయంలో 26 శాతం కేటాయించారు. ఈ ప్రణాళికకాలంలో పారిశ్రామిక వార్షిక వృద్ధిరేటు లక్ష్యం 8.1 శాతం, సాధించిన పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక సగటు వృద్ధిరేటు 5.3 శాతం మాత్రమే. ఉక్కు, నాన్ ఫెర్రస్ లోహాలు ఎరువులు, ఖనిజాలు, బొగ్గు, యంత్ర నిర్మాణ పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంవల్ల కీలక పరిశ్రమల వృద్ధి, సేలం, విజయనగర్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లలో అదనపు సామర్థ్యం పెంచడానికి నిర్ణయించారు. ఔషధాల తయారీ, నూనె రిఫైనింగ్, రసాయనిక, ఫర్టిలైజర్, భారీ ఇంజినీరింగ్ పరిశ్రమలు స్థిరమైన ప్రగతిని చూశాయి.
ఆరో పంచవర్ష ప్రణాళిక (1980-85)
-ప్రణాళికలు ప్రారంభించిన తర్వాత 30 ఏండ్లలో పారిశ్రామిక ఉత్పత్తి ఐదు రెట్లు పెరిగిందని భావించారు. అయితే అది అభిలషణీయ ఉత్పత్తిస్థాయి కంటే తక్కువగానే ఉంది. ఈ ప్రణాళిక కాలంలో పారిశ్రామిక వ్యత్యాసాలు కనిపించాయి. ఆరో పంచవర్ష ప్రణాళిక కాలంలో గ్రామీణ, చిన్నతరహా పరిశ్రమలతోసహా పరిశ్రమలకు కేటాయించిన మొత్తం రూ. 22,000 కోట్లు. ఇది ప్రణాళిక మొత్తం వ్యయంలో 22.8 శాతం. ఈ ప్రణాళికలో పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యం 7 శాతం. కానీ సాధించిన వార్షిక వృద్ధిరేటు 5.5 శాతం.
ఏడో పంచవర్ష ప్రణాళిక (1985-90)
-ఈ ప్రణాళికలో ప్రభుత్వరంగంలో పెద్ద పరిశ్రమల కోసం రూ. 19,710 కోట్లు, గ్రామీణ చిన్న పరిశ్రమల కోసం రూ. 2,750 కోట్లు కేటాయించారు. ఇది ప్రణాళిక మొత్తం వ్యయంలో 12.5 శాతం. ఈ ప్రణాళికలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి లక్ష్యం సాలీనా 8.0 శాతం. కానీ సాధించిన వార్షిక వృద్ధిరేటు లక్ష్యానికి మించి 8.5 శాతంగా నమోదైంది. ఈ ప్రణాళికలో అవస్థాపనాపరమైన అడ్డంకులను తొలగించడానికి, పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాలను సరళతరం చేయడానికి, అతి ముఖ్యమైన పరిశ్రమల సత్వర అభివృద్ధిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రాల్లో పరిశ్రమలను నెలకొల్పడం, వాతావరణ కాలుష్య నివారణ సామగ్రిని ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవడం మొదలైన అంశాలకు ఈ ప్రణాళికలో ప్రాధాన్యమిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం, మహరాష్ట్ర గ్యాస్, క్రేకర్, నాల్కో అల్యూమినియం కాంప్లెక్స్, జే గ్యాస్ పైప్‌లైన్ అనే నాలుగు భారీ ప్రాజెక్టులను ఈ ప్రణాళిక కాలంలోనే పూర్తి చేశారు. బొంబాయిగాన్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, కొచ్చి అరోమేటిక్ కాంప్లెక్స్ ఈ ప్రణాళికకాలంలోనే పూర్తయ్యాయి.
ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక (1992-97)
-ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఎనిమిదో పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. ఎనిమిదో పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమలు, ఖనిజాల రంగంలో మొత్తం పెట్టుబడి రూ. 38,083 కోట్లు (1991-92 ధరల్లో), వాస్తవిక వ్యయం రూ. 31,382 కోట్లు (1991-92 ధరల్లో). ఆశించిన పెట్టుబడిలో ఇది 82 శాతం. పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక వృద్ధి లక్ష్యం 7.4 శాతం. కాగా సాధించిన వాస్తవిక వృద్ధిరేటు 7.3 శాతం. ప్రభుత్వరంగంలో ప్రధాన సంస్కరణల్లో భాగంగా కింది సమగ్ర వ్యూహాలను ప్రతిపాదించారు.
1. ప్రభుత్వరంగ సంస్థల ఆధునీకరణ, స్థ్థాపిత శక్తి హేతుబద్ధీకరణ, ఉత్పత్తుల మిశ్రమంలో మార్పులు, ఎంపికతో కూడిన నిష్క్రమణ, అధికస్థాయిలో ప్రైవేటీకరణ
2. స్వయంప్రతిపత్తి, జవాబుదారీతనం పెంచడం
3. సంస్థ సామర్థ్యాన్ని పెంచే యాజమాన్య పద్ధతులను అనుసరించడం
4. రాష్ట్రస్థాయిలోని ప్రభుత్వ సంస్థల పనితీరు పెంచడానికి చర్యలు తీసుకోవడం
-ఈ ప్రణాళిక కాలం ఎక్కువగా సూచనాత్మకం అయ్యింది. పరిమాణాత్మక లక్ష్యాలకు ప్రాధాన్యమిచ్చారు. ఎగుమతులు, దిగుమతులపై పరిమాణాత్మక పరిమితులు తొలగించడం, లైసెన్సింగ్ విధానం కంటే పారిశ్రామిక, విత్తవర్తక విధానాలను సరళీకృతం చేయడం, పన్నురేట్లు తగ్గించడం మొదలైన మార్పుల ద్వారా వివిధ రంగాల్లో ఆశించిన వృద్ధి సాధించవచ్చని విశ్వసించారు.
తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక (1997-2002)
-తొమ్మిదో పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమలు, ఖనిజాల రంగంలో మొత్తం పెట్టుబడి రూ. 65,148 కోట్లు. ప్రణాళిక మొత్తం వ్యయంలో ఇది 7.6 శాతం. అయితే వాస్తవిక వ్యయం రూ. 44,695 కోట్లు. అంటే మొత్తం వ్యయంలో 4.7 శాతం. ఈ ప్రణాళికలో పారిశ్రామిక ఉత్పత్తిలో వార్షిక వృద్ధి లక్ష్యం 8.2 శాతం. కానీ సాలీనా 5 శాతం వృద్ధిరేటు సాధించారు. దీన్ని సాధించడానికి కొన్ని లక్ష్యాలను పేర్కొన్నారు.
1. నాణ్యమైన అవస్థాపన సౌకర్యాలు తగినంత పరిమాణంలో సమకూర్చడం
2. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం
3. ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టడం
4. BIFR పనితీరును సమీక్షించి, ఖాయిలాపడిన పరిశ్రమలను పునరుద్ధరించడానికి అవసరమైన మార్పులు చేయడం
5. పునరుద్ధరణ సాధ్యంకాని పరిశ్రమలను మూసివేయడం
6. సాంకేతిక స్థాయిని పెంచడం, చాలినంత పరపతి సౌకర్యం కల్పించడం ద్వారా చిన్న పరిశ్రమల ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచడం
-ఈ ప్రణాళికలో సిమెంట్, బొగ్గు, ముడిచమురు, వినియోగ వస్తువులు, విద్యుచ్ఛక్తి, అవస్థాపన సౌకర్యాలు, రిఫైనరీ, నాణ్యతగల ఉక్కు ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చారు.
పదో పంచవర్ష ప్రణాళిక ( 2002-2007)
-ఈ ప్రణాళికలో పరిశ్రమలు, ఖనిజాల రంగంలో మొత్తం పెట్టుబడి రూ. 58,939 కోట్లు. ప్రణాళిక మొత్తం వ్యయంలో ఇది 3.9 శాతం. ప్రైవేటు రంగం కార్యకలాపాల విస్తరణకు అధిక అవకాశం ఇవ్వడంవల్ల ప్రభుత్వరంగ కేటాయింపులు తగ్గించారు. పారిశ్రామికరంగ వృద్ధి లక్ష్యం 10 శాతం. ఈ లక్ష్యం సాధించడంలో ప్రభుత్వరంగం కంటే ప్రైవేటురంగం బాధ్యత ఎక్కువ. పదో పంచవర్ష ప్రణాళికలో ఆధునీకరణ, సాంకేతిక పరిజ్ఞానం పెంచడం, రవాణావ్యయాలు తగ్గించడం, ఎగుమతులను పెంచడం, విస్తరింపజేయడం, పోటీతత్వాన్ని పెంచడం, ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించడం మొదలైనవి ప్రధాన లక్ష్యాలు.
11వ పంచవర్ష ప్రణాళిక (2007-2012)
-పరిశ్రమలు, ఖనిజాల రంగంలో మొత్తం పెట్టుబడి రూ. 50,452 కోట్లు. ప్రణాళిక మొత్తం వ్యయంలో ఇది 4.31 శాతం. పరిశ్రమలకు, అవస్థాపనలకు, ఉపాధికి అధిక ప్రాధాన్యమిచ్చారు. సమాజంలో అన్నివర్గాల ప్రజల పేదరికాన్ని వేగంగా తగ్గించి, అధిక ఉపాధిని సృష్టించడం, ఆరోగ్యం, విద్య వంటి తప్పనిసరి సేవలు అందరికి అందేలా చూడటం, పారిశ్రామికాభివృద్ధి త్వరితగతిన సాధించడం వంటి అంశాలకు పదకొండో పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యమిచ్చింది. ఈ ప్రణాళిక కాలంలో అంచనాల దృష్ట్యా పారిశ్రామికాభివృద్ధి రేటు 10-11 శాతం కాగా, సాధించిన వృద్ధిరేటు 8 శాతంగా ఉంది.
12వ పంచవర్ష ప్రణాళిక (2012-17)
-వేగం మరింత సమ్మిళతం నిరంతర వృద్ధి అనేవి 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు. సమ్మిళిత వృద్ధి, సత్వర ఉద్యోగావకాశాలను కల్పించడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. పారిశ్రామికరంగ వ్యూహానికి సంబంధించినంత వరకు తయారీరంగం పనితీరు బలహీనంగా ఉందని ప్రణాళిక అంగీకరించింది. ప్రతి ఏడాది అదనంగా రెండు మిలియన్ల ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పారిశ్రామికరంగం 11-12 శాతం వృద్ధి సాధించాలి. వ్యవస్థీకృత/క్రమబద్ధీకరణ విధానంలో మెరుగుదల, నిర్వహణ వ్యయం తగ్గింపు, పారదర్శకత, నూతన పద్ధతులు 12వ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యాంశాలు. ఈ ప్రణాళికలో పరిశ్రమలు, ఖనిజాల రంగంలో మొత్తం పెట్టుబడి రూ. 1,20,372 కోట్లు. ప్రణాళిక మొత్తం వ్యయంలో ఇది 4.4 శాతం.
నీతి ఆయోగ్:
మనదేశంలో 65 సంవత్సరాల పాటు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించి, దేశానికి దిశదశా నిర్దేశం చేసిన ప్రణాళిక సంఘానికి స్వస్తి పలికి, దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే కొత్త సంస్థకు, కొత్త సంవత్సరంలో స్వాగతం పలికారు. కేంద్ర కేబినేట్ తీర్మానం ద్వారా దీనికి జనవరి 1, 2015న ఆమోదం తెలిపింది. దీనిని మేధో(సమూహం) నిధి (Think Tank) గా పేర్కనడం జరిగింది. నీతి ఆయోగ్‌కి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి, ఒక ఉపాధ్యక్షుడు, ముఖ్యకార్య నిర్వహణాధికారి ఉంటారు. దీనిలో అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు, పాలకమండలిలో ఎక్స్అఫిషియో సభ్యులుగా ఉంటారు. ఇద్దరు పూర్తికాల సభ్యులు ఉంటారు. వీరిని విశ్వవిద్యాలయా ల నుంచి లేదా పరిశోధన సంస్థల నుంచి తీసుకుంటారు. నలుగురు కేంద్ర మంత్రులు పదవీరిత్యా ఎక్స్అఫిషియో సభ్యులుగా ఉంటారు. పలు రంగాలకు చెందిన మేధావులు, నిపుణులను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రధాని నియమిస్తారు. నీతి ఆయోగ్‌కి అనుబంధంగా ప్రాంతీయ మండళ్లు ఉంటాయి. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగారియను తొలి ఉపాధ్యక్షుడిగా, అతనితోపాటు పాటు ఇతర సభ్యులను జనవరి 5, 2015న నియమించారు.
నీతి ఆయోగ్, సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ సాధికారత, సమానత్వమే లక్ష్యంగా ప్రజానుకూల, ప్రగతిశీల, సమ్మిళిత అభివృద్ధి అజెండాను అమలు చేసేందుకు, కేంద్ర రాష్ట్రాలకు ఒకేఎజెండా ఖరారు చేయడమే నీతి ఆయోగ్ లక్ష్యం.
పారిశ్రామిక విధాన తీర్మానాలు
-ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి, అభివృద్ధికి తగిన వాతావరణం కల్పించడానికి పారిశ్రామిక విధాన తీర్మానాలు ప్రవేశపెట్టారు. పారిశ్రామికాభివృద్ధి కోసం చేసిన తీర్మానాలను పారిశ్రామిక విధాన తీర్మానాలు అంటారు. దేశ సత్వర ఆర్థికాభివృద్ధికి 1948 ఏప్రిల్ 6న మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని చేశారు. 1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది. ఈ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని దేశ పరిశ్రమల శాఖ తొలి మంత్రి శ్యామ్‌ప్రసాద్ ముఖర్జి ప్రవేశ పెట్టారు.
భారత పారిశ్రామిక విధాన ప్రధాన లక్ష్యాలు
1. జాతీయాదాయాన్ని శీఘ్రగతిన పెంచి ఆర్థికవృద్ధి, అభివృద్ధి సాధించడం
2. ప్రజల జీవన ప్రమాణాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం
3. సంతులిత పారిశ్రామిక నిర్మాణం
4. ఆర్థికశక్తి కేంద్రీకరణ నివారణ
5. సంతులిత ప్రాంతీయాభివృద్ధి
1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం లక్ష్యాలు
1. న్యాయమైన, సమానమైన అవకాశాలను అందరికీ కలిపిస్తాయనే నమ్మకంగల సామాజిక వ్యవస్థను స్థాపించడం
2. సహజవనరులను సద్వినియోగపర్చుకోవడం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం
3. ఉత్పత్తిని పెంచడం
4. సమాజ సేవలో అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించడం
1948 పారిశ్రామిక విధాన తీర్మాన కాలంలో పరిశ్రమలను నాలుగు రకాలుగా విభజించారు. అవి..
-ప్రభుత్వపరమైన పరిశ్రమలు: ఆయుధాలు, మందుగుండు సామగ్రిలను తయారు చేయడం, అణుశక్తి ఉత్పత్తి నిర్వహణ, రైల్వే రవాణా, యాజమాన్యం నిర్వహణ.
-ప్రభుత్వ నియత్రణలో పనిచేసే పరిశ్రమలు: బొగ్గు, ఇనుముఉక్కు, విమానాల ఉత్పత్తి, నౌకానిర్మాణం, టెలిఫోన్, టెలీగ్రాఫ్, వైర్లెస్ పరికరాల ఉత్పత్తి, ఖనిజ నూనెలు మొదలైనవి. వీటిని ప్రభుత్వమే స్థాపిస్తుంది. ఈ పరిశ్రమల్లో అప్పటికే ఉన్న ప్రైవేటు సంస్థలు మరో పదేండ్ల వరకు వారి ఆధీనంలో ఉంటాయి. ఆ తర్వాత జాతీయంచేసే అధికారం ప్రభుత్వానికే ఉంటుంది.
-ప్రైవేటురంగంలో ఉండి ప్రభుత్వం నిబంధనలతో పనిచేసే పరిశ్రమలు: మోటారు కార్లు, ట్రాక్టర్లు, ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్, భారీ యంత్రాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, రబ్బరు, వస్ర్తాలు, చక్కెర, కాగితం, నౌకాయానం, కొన్ని రక్షణ పరిశ్రమలు మొదలైన 28 పరిశ్రమలు ప్రైవేటురంగంలో ఉంటాయి. ప్రైవేటురంగంలో నిర్వహిస్తున్న పరిశ్రమలు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తాయి.
-ప్రైవేటురంగంలో ఉన్న పరిశ్రమలు: పైన పేర్కొన్న పరిశ్రమలన్నీ ప్రైవేటురంగానికి చెందుతాయి. ఇవి సంతృప్తికరంగా పనిచేయకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
-ఈ పారిశ్రామిక విధానం ప్రభుత్వరంగ పరిశ్రమలు, ప్రైవేటురంగ పరిశ్రమలు అని విడదీసింది. పారిశ్రామికాభివృద్ధిలో కుటీర, చిన్నతరహా పరిశ్రమల ప్రాధాన్యతను గుర్తించింది. స్థానికవనరుల సద్వినియోగం, ఉపాధి సామర్థ్యత పరిశ్రమగా గుర్తించింది. పారిశ్రామికాభివృద్ధిలో విదేశీ మూలధనం ప్రాధాన్యతను ఈ తీర్మానం గుర్తించింది. విదేశీ మూలధనం కలిగిన పరిశ్రమల్లో ఆయా పరిశ్రమల యాజమాన్యం, నియంత్రణ అధికారం భారతీయులే కలిగి ఉండాలని ఈ తీర్మానం పేర్కొన్నది. ఈ పారిశ్రామిక తీర్మానం ఏ సంస్థనైనా జాతీయంచేసే హక్కు ప్రభుత్వానికి ఉందని ప్రకటించడంతో ప్రైవేటురంగం అభివృద్ధి చెందలేదు. 1948 పారిశ్రామిక విధానాన్ని అమలుచేయడానికి 1951లో పరిశ్రమల అభివృద్ధి చట్టం చేశారు. 1951లో పారిశ్రామిక లైసెన్స్ విధానం-పరిశ్రమల అభివృద్ధి చట్టం చేశారు. ఈ చట్టం 1952 మే 8 నుంచి అమల్లోకి వచ్చింది.
-1951 పారిశ్రామిక విధాన తీర్మానం: 1956, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన నూతన రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రాథమిక హక్కులను కల్పించింది. ఈ తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించింది కాబట్టి దీన్ని ఆర్థిక రాజ్యాంగం అంటారు. ఈ ప్రణాళిక పారిశ్రామిక రంగానికి విస్తృత ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ మార్పులకు రెండో పంచవర్ష ప్రణాళికకు అనుగుణంగా 1956 ఏప్రిల్ 30న నూతన పారిశ్రమిక విధానం ప్రకటించారు. ఈ తీర్మానం కాలంలో పరిశ్రమలను మూడు రకాలుగా విభజించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు