Method of measuring inflation | ద్రవ్యోల్బణం కొలిచే విధానం
ద్రవ్యం అంటే ఏమిటి? ద్రవ్య రకాలేవి? ద్రవ్య విలువ అంటే ఏమిటి? ద్రవ్యం సరఫరా అంటే ఏమిటి? ద్రవ్య సరఫరాను ఎలా కొలుస్తారు? ద్రవ్యోల్బణం నిర్వచనం, దాని మంచి, చెడు పరిణామాలు, అది వివిధ వర్గాలపై చూపే ప్రభావం, దాని రకాలను చర్చించాం.. ద్రవ్యోల్బణాన్ని ఎలా కొలుస్తారు? దాన్ని కొలిచే విధానంలో ఎదురయ్యే సవాళ్లేంటి? ద్రవ్యోల్బణ రకాలేంటి? ద్రవ్యోల్బణం నిరోధించడానికి తీసుకునే చర్యలేంటో? తెలుసుకుందాం..
ద్రవ్యోల్బణాన్ని ఎలా కొలుస్తారు?
-సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి కొన్ని పద్ధతులను వాడుతారు. అవి..
1) టోకు ధరల సూచీ (Wholesale Price Index)
2) వినియోగదారుల ధరల సూచీ
(Consumer Price Index)
3) జీడీపీ డిఫ్లేటర్ (GDP Deflator)
-జీడీపీ డిఫ్లేటర్న మూణ్నెళ్లకోసారి లెక్కించడం వల్ల అది విధానాల రూపకల్పనలకు, ద్రవ్యోల్బణ కట్టడిలకు పనికిరాదు. అంటే ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి సమర్థసూచీగా జీడీపీ డిఫ్లేటర్ను వాడవచ్చు. కానీ దాని సమయం వల్ల వాడలేకపోతున్నారు.
-మిగతా రెండు సూచీల గురించి చర్చిస్తే WPI, CPIలు ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి అత్యంత ముఖ్యమైనవే.
1) జనాభా ప్రాతిపదికగా ద్రవ్యోల్బణాన్ని కొలవడం: అంటే ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు.
-ఉత్పత్తిదారులకు —> ఉత్పత్తి ధరల సూచీ (Producer Price Index)
-వినియోగదారులకు -> వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index)
-పై రెండింటిలో CPIనే ఎక్కువగా వాడుతారు.
2) ఏయే వస్తువులను కవర్ చేస్తుందో దాన్నిబట్టి
-అత్యధిక వస్తువులను పరిగణలోకి తీసుకొని ఈ సూచీని ప్రకటిస్తారు. ఉదా: టోకు ధరల సూచీ.
-దీన్నే హెడ్లైన్ ద్రవ్యోల్బణ సూచీ అని అంటారు.
మీన్ ద్రవ్యోల్బణం
-ఆహార, ఇంధన వస్తువులే కాకుండా వస్తువుల ధరలు తీవ్రంగా మారే మరిన్ని వస్తువులను కూడా హెడ్లైన్ ద్రవ్యోల్బణం నుంచి తీసివేస్తే మీన్ ద్రవ్యోల్బణం వస్తుంది.
టోకు ధరల సూచీ
(Wholesale Price Index-WPI)
-ఇది ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి అత్యంత ప్రధాన సూచీ.
-ఈ సూచీని మరో మూడు ఉప సూచీలుగా విభజించారు. అవి..
1) ప్రాథమిక వస్తువులు
2) ఇంధన వస్తువులు
3) తయారీ వస్తువులు
-ఈ సూచీ సేవలను పరిగణలోకి తీసుకోదు.
-దీన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు ప్రచురిస్తారు.
-2009, అక్టోబర్ వరకు దీన్ని వారానికోసారి ప్రచురించేవారు. కానీ ఇప్పుడు దీన్ని నెలకోసారి ప్రచురిస్తున్నారు.
-ఆధార సంవత్సరం- 2004-05
-దీనిలో 676 వస్తువులు ఉంటాయి
(సేవలు ఉండవు)
-వివిధ రకాల వస్తువులకు రకరకాల నిష్పత్తి ఉంటుంది. అంటే ప్రాథమిక వస్తువులకు- 20.12%, ఇంధన వస్తువులకు- 14.19%, తయారీ వస్తువులకు-64.97%.
-అంటే WPIలో ఏదైనా మార్పు రావాలంటే అది తయారీరంగంలో ఉండే వస్తువుల ధరల్లో ఎక్కువ హెచ్చుతగ్గులు ఉంటే వస్తుంది.
-అంటే తయారీరంగ వస్తువుల ధరలు పెరిగితే WPI పెరుగుతుంది.
-ఇంకా ఇది వినియోగదారుల
వాస్తవ ధరల స్థాయిని తెలుపదు.
-2012 వరకు విధానాల రూపకల్పనకు, WPIనే వాడేవారు. కానీ ఆ తరువాత దీన్ని మార్చి CPI ద్వారా విధానాలను రూపొందించాలని ఉర్జిత్ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు CPIని ప్రామాణికంగా విధానాల రూపకల్పనలకు వాడుతున్నారు.
-వినియోగదారుల ధరల సూచీ
(Consumer Price Index-CPI)
-ఇది తీసుకునే జనాభా గ్రూపును బట్టి దీన్ని మరో 4 ఉప సూచీలుగా విభజించారు.
1) CPI- ఇండస్ట్రియల్ వర్కర్స్ (CPI-IW)
2) CPI- వ్యవసాయ కూలీలు (CPI-AL)
3) CPI- రూరల్ లేబర్ (CPI-RL)
4) CPI- అర్బన్ నాన్మాన్యువల్ ఎంప్లాయీస్ (CPI-UNME)
-పై నాలుగింటిలో మొదటి మూడింటిని
లేబర్ బ్యూరో విడుదల చేస్తుంది.
-నాలుగోది మాత్రం కేంద్ర గణాంక సంస్థ విడుదల చేస్తుంది.
-పై నాలుగింటిలో మొదటి మూడు ఇప్పటికీ విడుదలవుతాయి. కానీ నాలుగోది ఆచరణలో లేకుండాపోయింది.
-పై నాలుగింటిలో కేవలం ఒక రకమైన ప్రజలు, కొద్దిమంది జనాభాస్థాయి మాత్రమే పరిగణలోకి తీసుకోవడం వల్ల ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి దీన్ని ప్రామాణికంగా తీసుకోవడంలేదు.
-అందుకని ఉర్జిత్ పటేల్ సిఫారసుల మేరకు 2012 నుంచి మరో మూడు కొత్త CPI సూచీలను లెక్కిస్తున్నారు.
-ఇది జనాభా మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తుంది.
కొత్త సూచీలు
1) CPI- రూరల్
2) CPI- అర్బన్
3) CPI- కంబైన్డ్ (రూరల్+అర్బన్ కలిపి)
-పై మూడు మొత్తం జనాభాను పరిగణలోకి తీసుకొని ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు.
-CPIలో మొత్తం 200 వస్తువులను పరిగణలోకి తీసుకుంటారు.
-దీనిలో సేవలను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
-విధానాల రూపకల్పనలకు వాడుతారు.
-దీన్ని కేంద్ర గణాంక సంస్థ (సీఎస్ఓ) స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విడుదల చేస్తుంది.
హెడ్లైన్ ద్రవ్యోల్బణం
-ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి పరిగణలోకి తీసుకొనే అన్ని వస్తువులు ఉండే సూచీని హెడ్లైన్ ద్రవ్యోల్బణం అంటారు.
-కోర్ ద్రవ్యోల్బణం: హెడ్లైన్ ద్రవ్యోల్బణం నుంచి అస్థిరంగా ఉండే ఆహార, ఇంధన పదార్థాలను తీసివేస్తే వచ్చే ద్రవ్యోల్బణమే కోర్ ద్రవ్యోల్బణం.
-అంటే ఆహార, ఇంధన ధరలు ప్రతిసారి తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతాయి. కాబట్టి వాటిని తీసివేస్తే నిజమైన ద్రవ్యోల్బణం ఎంతో కనుక్కోవచ్చు.
-కోర్ ద్రవ్యోల్బణం= హెడ్లైన్ ద్రవ్యోల్బణం-ఆహార, ఇంధన వస్తువులు
ద్రవ్యోల్బణ రేటును బట్టి ద్రవ్యోల్బణ రకాలు
-ద్రవ్యోల్బణ పెరుగుదల రేటును బట్టి ద్రవ్యోల్బణాన్ని వివిధ రకాలుగా విభజించవచ్చు.
1) క్రీపింగ్ ద్రవ్యోల్బణం
-ధరల పెరుగుదల రేటు 3 శాతం కంటే తక్కువగా ఉంటే దాన్ని క్రీపింగ్ ద్రవ్యోల్బణం అంటారు.
-ఇదే ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ద్రవ్యోల్బణం.
2) వాకింగ్ లేదా ట్రోటింగ్ ద్రవ్యోల్బణం
-ధరల పెరుగుదల 3 శాతం నుంచి 10 శాతం మధ్యలో ఉంటే దాన్ని వాకింగ్ ద్రవ్యోల్బణం అంటారు.
-ఇది ప్రభుత్వానికి హెచ్చరిక లాంటివి.
-ఈ లిమిట్ దాటితే చాలా తీవ్ర ఒడిదొడుకులు ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటాయి.
3) రన్నింగ్ ద్రవ్యోల్బణం
-ఒకవేళ ధరల పెరుగుదల స్థాయి 10 శాతం నుంచి 20 శాతం మధ్యలో ఉంటే అది రన్నింగ్ ద్రవ్యోల్బణం. ఇది ప్రమాదకరమైన స్థితి.
4) హైపర్ లేదా రన్అవే లేదా గ్యాలాపింగ్ద్రవ్యోల్బణం
-ఒకవేళ ధరల పెరుగుదల స్థాయి 20 శాతం నుంచి 100 శాతం లేదా దానికంటే ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ ద్రవ్యోల్బణం అంటారు.
-ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టివేస్తుంది.
-ఇది మొత్తం ద్రవ్య విలువను తగ్గించి ద్రవ్యానికి, కాగితానికి ఏమాత్రం తేడాలేకుండా చేస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు