Breakdown of Rachakonda | రాచకొండ విచ్ఛిన్నానికి కారకులు?
కుమార సింగమనాయుడు (క్రీ.శ. 1383-1399)
-అనపోతానాయుడి తర్వాత రాచకొండ సింహాసనం అధిష్టించాడు.
-ఇతనికి కుమార సింగమనాయుడు (రెండో), సర్వజ్ఞ, సింగమభూపాలుడు అనే పేర్లు కూడా ఉన్నాయి.
-ఇతడు గొప్ప యోధుడు. యువరాజుగా ఉన్నప్పుడే కళ్యాణదుర్గంను (గుల్బార్గా జిల్లాలోని కల్యాణి) జయించి, అక్కడ విజయస్తంభం నాటి కల్యాణ భూపతి అనే బిరుదు పొందినట్లు ఆయన అస్థాన కవి విశ్వేశ్వరుని చమత్కార చంద్రిక అనే గ్రంథంలో వివరించబడింది.
-ఇతని కాలంలో వెలమలకు, విజయనగర రాజులకు మధ్య తీవ్రస్థాయిలో యుద్ధాలు జరిగాయి.
-విజయనగర రాజైన రెండో హరిహర రాయలు యువరాజైన బుక్కరాయల్ని వెలమలపైకి పంపగా, వెలమలకు సహాయంగా బహమనీ సుల్తానులు విజయనగర సామ్రాజ్యంలోని కొత్తకొండను ముట్టడించి విజయనగర సేనాధిపతి అయిన సాళువరాయ దేవుణ్ని వధించడంతో వెలమలు విజయం సాధించారు. ఈ యుద్ధాన్నే కొత్తకోట యుద్ధం అంటారు.
-తర్వాత కుమార సింగమనాయుడు దేవరకొండ పాలకుడైన పెద వేదగిరితో కలిసి కళింగపై దండెత్తి రెడ్డిరాజుల ఆధీనంలో ఉన్న గోదావరి ప్రాంతాన్ని ఆక్రమించినట్లు అతని సింహాచల శాసనం తెలుపుతుంది.
-బెండపూడి మొదలైన దుర్గాలను పెదవేదగిరి నాయకుడు జయించినట్లు వెలుగోటి వారి వంశావళి వర్ణిస్తున్నది.
-1397లో మళ్లీ విజయనగర రాజు రెండో హరిహరరాయలు కొత్తకోట పరాజయానికి ప్రతీకారం తీర్చుకొని కృష్ణా-తుంగభద్ర అంతర్వేదిని సాధించే ఉద్దేశంతో బహమనీ రాజ్యంపైకి దండెత్తగా సుల్తాన్ ఫిరోజ్‌షాకు సహాయంగా వెలమ సైన్యాలు విజయనగర రాజ్యంపై దండెత్తాయి.
-ఈ సైన్యాలను వేదగిరి నాయకుని కుమారుడైన రామచంద్రుడు నడుపుతూ కందనవోలు (కర్నూలు) రాజ్యాన్ని కొల్లగొట్టాడు.
-దీంతో వెలమలను శిక్షించడానికి రెండో హరిహరరాయలు తన కుమారుడు బుక్కరాయల్ని పంపగా, ఇతడు రామచంద్రుని ఓడించి ఓరుగల్లు నుంచి మెదక్ వరకు గల ప్రాంతాన్ని జయించినట్లు తెలుస్తుంది.
-ఈ ఓరుగల్లు దండయాత్రను బుక్కరాయని ఆస్థాన కవి లక్ష్మణాచార్యుని వైద్యరాజ వల్లభం వర్ణిస్తుంది.
-చివరకు పానగల్లు దుర్గాన్ని కూడా బుక్కరాయలు ఆక్రమించాడు. ఫిరోజ్‌షా సహాయంతో సింగమనాయుడు పానగల్లు దుర్గం రక్షణకు శక్తికొద్ది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
-విజయనగర-బహమనీ, వెలమ-రెడ్డి రాజ్యాల మధ్య గల సంబంధాల్లో పానగల్లు దుర్గం కీలకపాత్ర
కుమార సింగమనాయుని సాహిత్యసేవ
-గొప్పకవి, పండితుడు, పోషకుడు. ఇతనికి సర్వజ్ఞ చూడమణి అనే బిరుదాంకితుడు. ఇతడే రసార్ణవ సుధాకరం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని, సర్వజ్ఞ దేవుని సంగీత రత్నాకరానికి సంగీత సుధాకరం అనే వ్యాఖ్యానం, కుమలయావళి అనే నామాంతరం గల రత్నపాంచాలిక అనే నాటకాన్ని రచించాడు. ఇతని అస్థాన పండితులైన విశ్వేశ్వరకవి, చమత్కార చంద్రికను, బొమ్మకంటి అప్పయామాత్యుడు అమరకోశానికి వ్యాఖ్యానం రాశాడు. ఈ రచనలు సంస్కృత భాషలో ఉన్నాయి.
రెండో అనపోతానాయుడు (క్రీ.శ. 1399-1421)
-కుమార సింగమనాయుని మరణాంతరం అతని పెద్ద కుమారుడు రెండో అనపోతానాయుడు రాచకొండ సింహాసనాన్ని అధిష్టించాడు.
-ఇతనికి కుమార అన్నవోతనీడు, అన్నమనాయుడు, ఇమ్మడి అనపోతానాయకుడు అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి.
-ఇతడు గొప్ప పరాక్రమవంతుడు. అనేక యుద్ధాల్లో విజయం సాధించిన వీరుడు.
-ఇతడు విజయనగర సైన్యాలను ఎదురించి మెదక్ దుర్గాన్ని రక్షించడమే కాకుండా, వారి ఆధీనంలో ఉన్న పానగల్లు దుర్గాన్ని సైతం కొల్లగొట్టాడు.
-కర్నూలు పాలకులు విజయనగర సామంతులైన నంబెట వారిని నాశనం చేశాడు.
-విజయనగర రాజుల ఆధీనంలో ఉన్న బోయ, తిగుళ రాజ్యాలను చావుదెబ్బ తీశాడు. అనంతరం రాజమహేంద్రవరంపై దాడి నిర్వహించి, రెడ్డి రాజ్యాన్ని కొల్లగొట్టడమేకాక, గజపతుల సామంతులైన సర్వేపల్లి తిమ్మారెడ్డిపై ఘనవిజయం సాధించాడు.
-ఈ విజయాలు వెలుగోటివారి వంశావళిలో సవివరంగా వివరించబడ్డాయి.
-ఇతని కాలంలోనే కాటమ వేమారెడ్డి రాజమండ్రిలో స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు.
-ఈ విధంగా రెడ్డిరాజ్యం కొండవీడు, రాజమహేంద్రవరం రాజ్యాలుగా విడిపోయింది.
-అయితే పెదకోమటి వేమారెడ్డి (కొండవీటి) బహమనీల సహాయంతో రెడ్డిరాజ్యాన్ని సమైక్యం చేయడానికి ప్రయత్నించగా దీనికి సుల్తాన్ ఫిరోజ్‌షా బహమనీ మద్దతు ప్రకటించాడు.
-దీంతో తమ చిరకాల శత్రువులైన రెడ్లతో తమ మిత్రులైన బహమనీలు మైత్రి వహించడం గిట్టక రెండో అనపోతానాయుడు విజయనగర రాజులతో జట్టుకట్టాడు.
-ఇలా రెండో అనపోతానాయుని కాలంలో వెలమలు, బహమనీల మధ్య సంబంధాలు చెడిపోయాయి.
-ఇతను క్రీ.శ. 1417లో పానగల్లు యుద్ధంలో విజయనగర రాజులతో కలిసి బహమనీలను ఓడించాడు.
-ఇతని కాలంలోనే దేవరకొండ రాజు పినవేదగిరి నాయుడు ధరణికోటపై దాడిచేసి పెదకోమటి వేమారెడ్డి సోదరుడైన మాచారెడ్డిని హతమార్చాడు.
-దీనికి ప్రతీకారంగా పెదకోమటి వేమారెడ్డి దేవరకొండపై దాడి చేసి పినవేదగిరిని హతమార్చాడు.
-దీంతో రెండో అనపోతానాయుడు, పిన వేదగిరి సోదరుడైన లింగమనీడుతో కలసి కొండవీడుపై దండెత్తి పెదకోమటి వేమారెడ్డిని హతమార్చి అతని శిరస్సును తమ్మపడగ (గంప)లో భూస్థాపితం చేశాడు.
-ఈ యుద్ధం తర్వాత కొండవీడు రాజ్యం ఆంధ్రదేశ రాజకీయ చరిత్ర నుంచి అదృశ్యమైపోయింది.
రావు మాదానాయుడు (క్రీ.శ. 1421- 1430)
-రెండో అనపోతానాయుడి కుమారులు యుక్తవయస్కులు కాకపోవడంతో అతని తమ్ముడు మాదానాయుడు సింహాసనం అధిష్టించాడు.
-ఇతని కాలంలో బహమనీలతో శతృత్వం తీవ్రరూపం దాల్చి వెలమ రాజ్యానికి అపార నష్టం సంభవించింది.
-క్రీ.శ. 1424లో రెండో దేవరాయులు, సుల్తాన్ అహ్మద్ షా బహమనీ మధ్య జరిగిన యుద్ధంలో మాదానాయుడు దేవరాయలకు సహాయం చేశాడు.
-దీంతో వెలమనాయకులను శిక్షించే ఉద్దేశంతో బహమనీ సుల్తాన్ ఓరుగల్లుపైకి క్రీ.శ. 1425లో ఆజమ్‌ఖాన్ అనే సేనానిని పంపాడు.
-ఆజమ్‌ఖాన్ ఓరుగల్లునే కాక వెలమల రాజ్యంలోని కొన్ని దుర్గాలను ఆక్రమించి అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి వెలమలకు అపార నష్టం కలిగించాడు.
-దీంతో గత్యంతరం లేక మాదానాయుడు అహ్మద్షాతో 1425లో సంధి చేసుకొని వరంగల్ని తిరిగి పొందాడు.
-అయితే, ఈ సంఘర్షణలో రాచకొండ పద్మనాయక రాజ్యం విచ్ఛిన్నం ప్రారంభమై తెలంగాణలో అధికభాగం బహమనీ రాజ్యంలో కలిసిపోయింది.
-మాదానాయుని సాహిత్య సేవ: ఇతడు కూడా తన తండ్రి కుమార సింగమనాయుని లాగా గొప్ప పండితుడు. ఇతడు వైష్ణవ మతాభిమాని. ఇతను రామానుజాచార్యుని కుమారుడైన వెంకటాచార్యుని శిష్యుడు. మాదానాయుడు రామాయణానికి రాఘవీయం అనే వ్యాఖ్యానం రాసి శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. ఇతను క్రీ.శ. 1421లో తొర్రూరు గ్రామానికి శ్రీరంగాపురం అని నామకరణం చేసి శ్రీరంగనాథస్వామికి దానం చేశాడు. క్రీ.శ. 1429లో ఇతని భార్య నాగాంభిక రాచకొండ సమీపంలో నాగసముద్రం అనే చెరువును తవ్వించారు.
-మూడో సర్వజ్ఞరావు సింగమనాయుడు (1430- 1475): మాదానాయుని అనంతరం రెండో అనపోతానాయుని కుమారుడు మూడో సింగమనాయుడు రాచకొండ పాలకుడయ్యాడు.
-ఇతనికే సర్వజ్ఞ బిరుదు ఉండటంతో సర్వజ్ఞరావు సింగమనాయుడు అని పిలువబడ్డాడు.
-ఇతను రాచకొండ వంశీయుల్లో చివరివాడు. ఇతనికి సమకాలికంగా దేవరకొండలో లింగమనేడు పాలన చేసేవాడు. దేవరకొండ పాలకుల్లో ఇతడు కూడా చివరివాడు.
-లింగమనేడు, మూడో సింగమనాయుడు ఇద్దరు ధైర్య సాహాసాలు కలవారైనా బహమనీల దాడులను ఎదుర్కోవడంలో విఫలమై తమ రాజ్యాన్నే కోల్పోయి గజపతులకు, విజయనగర రాజులకు సామంతులయ్యారు.
-బహమనీ సుల్తానులు గుజరాత్, మాళ్వ ప్రాంతాలపై దాడి చేసినప్పుడు వెలమలు అజమ్ఖాన్ను ఓడించి ఓరుగల్లు సహా తెలంగాణలో అనేక దుర్గాలను వశపర్చుకున్నాడు.
-కానీ, క్రీ.శ. 1433లో బహమనీ సుల్తాన్ అహ్మద్‌షా ఓరుగల్లు, రామగిరి దుర్గాలను ఆక్రమించి భువనగిరి దుర్గం కేంద్రంగా ఒక జాగీరును ఏర్పాటు చేసి సంజర్‌ఖాన్‌ను ప్రతినిధిగా చేశాడు.
-సుల్తాన్ ఆజ్ఞ మేరకు సంజర్ఖాన్ క్రీ.శ. 1435లో నాటి రాచకొండతో సహా తెలంగాణలోని అధికభాగాన్ని ఆక్రమించాడు.
-బహమనీ రాకుమారుల్లో ఒకరైన దాసూర్‌ఖాన్ రాచకొండలో రాజప్రతినిధి అయ్యాడు. దీంతో దేవరకొండ మినహా తెలంగాణ మొత్తం బహమనీల వశమైంది.
-తర్వాత వచ్చిన బహమనీరాజు హుమాయున్ దేవరకొండను కూడా ఆక్రమించాడు. దీంతో తెలంగాణలో వెలమల పాలన అంతమైంది. క్రీ.శ. 1475 నాటికి తెలంగాణ బహమనీల ఆధీనంలోకి వచ్చింది.
-ఆ తర్వాత సర్వజ్ఞ సింగమనాయుడు విజయనగర కొలువులో చేరి చివరకు కంఠమ రాజవంశీయుడైన తమ్మభూపాలుని చేతిలో హతుడయ్యాడు.
-సర్వజ్ఞ సింగమనాయుని మరణంతో పద్మనాయక చరిత్ర పరిసమాప్తం అయిందనవచ్చు. ఈ విధంగా క్రీ.శ. 1475 నాటి వెలమల రాచకొండ, దేవరకొండ రాజ్యాలు బహమనీ సామ్రాజ్యంలో అంతర్భాగాలయ్యాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు