Constitution of India- Challenges | భారత రాజ్యాంగం- సవాళ్లు
ఎన్నో పోరాటాల తర్వాత బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నాం. కానీ స్వతంత్ర భారతదేశంలో ప్రతి పౌరుడికీ సమాన హక్కులు, సంక్షేమం కల్పించే అంశం నాటి జాతీయ నేతల ముందు పెద్దసవాలుగా నిలిచింది. ప్రపంచంలోని అత్యుత్తమ పాలనా వ్యవస్థలను, రాజ్యాంగాలను వడపోసి, భారత దేశానికి సరిపడేవిధంగా ఎన్నో అంశాలను క్రోడీకరించి తర్కించి, సుదీర్ఘంగా చర్చించిన తర్వాత భారత రాజ్యాంగానికి తుదిరూపునిచ్చారు మన రాజ్యాంగకర్తలు. కాలక్రమంలో దేశంలో ఎన్నో మార్పులు సంభవించాయి. అందుకు అనుగుణంగా రాజ్యాంగానికి కూడా అనేక సవరణలు జరిగాయి. అయినప్పటికీ మన రాజ్యాంగం ముందు అనేక సవాళ్లు నిలిచి ఉన్నాయి. పోటీ పరీక్షల్లో ఈ అంశంపైనే ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకులకోసం ప్రత్యేక వ్యాసం..
– రాజ్యాంగం అనేది భావి తరాలకోసం రూపొందించబడుతుంది. కానీ దాని నిర్ధిష్ట క్రమం ఎప్పుడూ ఒడిదొడుకులు లేకుండా ఉండదు.
– రాజ్యాంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నది. వాటి పరిష్కారానికి వివిధ వ్యవస్థల మధ్య సదవగాహన, నాయకత్వం అవసరం ఉంటుంది.
రాజ్యాంగ ప్రవేశిక
– రాజ్యాంగ నిర్ణయసభ సభ్యులకు రాజ్యాంగంలో సామ్యవాదాన్ని చేర్చడం కంటే సామ్యవాద భావాలతో కూడిన ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రూపొందించడమే అత్యంత ప్రాధాన్యతాంశం. భవిష్యత్తులో పౌరులు కోరుకున్నప్పుడు లేదా పరిస్థిలు నిర్ధేశించినప్పుడు భారతదేశం సామ్యవాద దేశంగా మారేందుకు వీలు కల్పిస్తుందనేది వారి ఉద్దేశం.
– కేశవానంద భారతి కేసు (1973)లో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసుకు పూర్వం ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదనే అభిప్రాయం ఉండేది.
– 42వ సవరణ సామ్యవాదం, లౌకిక, సమగ్రత అనే పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చింది. దీనికి అనుగుణంగా భూసంస్కరణలు చేపట్టడం, బ్యాంకుల జాతీయీకరణ, వివిధ వర్గాలకు ప్రయోజనం చేకూర్చే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కానీ ప్రవేశికలో చేర్చిన సామ్యవాదం సమాజంలో ఇప్పటికీ ఆచరణలో లేదని విమర్శకుల అభిప్రాయం.
– 2015, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పత్రికల్లో ప్రకటన ఇస్తూ సామ్యవాద, లౌకిక పదాలు లేని మౌలిక రాజ్యాంగంలోని ప్రవేశికను ఇచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.
ప్రాథమిక హక్కులు-ఆదేశిక సూత్రాలు
– చట్టం ముందు అందరూ సమానమని చాటే ప్రాథమిక హక్కుల నిబంధనలకు, వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలనే వాదనలకూ మధ్య వైరుధ్యం ఉంటుంది.
– రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకూ, రాజ్యాంగ సూత్రాలకూ మధ్య పుట్టుకతోనే ఆ వైరుధ్యం ఉన్నట్టు సుప్రీంకోర్టు తీర్పువల్ల స్పష్టమవుతున్నది. ఆ వైరుధ్యాన్ని నిర్మూలించి ఆదేశిక సూత్రాల అమలుకు ప్రాథమిక హక్కులు దోహదపడేట్టు చేయాలి.
– రాజ్యాంగం.. పౌరులు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి, ఇష్టమైన వృత్తి వాణిజ్య వ్యాపారాలను అనుసరించడానికి స్వేచ్ఛనిస్తుంది. ఒక ప్రాంత ప్రజలు మరో ప్రాంతానికి వెళ్లి స్థిరనివాసం ఏర్పరచుకోవడం వృత్తి, ఉద్యోగాలు చేపట్టడం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఒక ప్రాంతం వారిపై మరో ప్రాంతం వారు దాడులు చేయడం రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి సవాలుగా మారింది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఈశాన్య రాష్ర్టాలవారిపై, బీహార్-అసోం తదితర రాష్ర్టాల నుంచి వచ్చి ముంబైలో స్థిరపడిన వారిపై హింసాత్మకంగా దాడులు జరగడం రాజ్యాంగ స్ఫూర్తికి సవాలుగా చెప్పవచ్చు.
– రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో సమంజసమైన అన్న పదాన్ని వాడలేదు. ఆ పొరపాటును ఏడాది తర్వాత మొదటి రాజ్యాంగ సవరణ జరిగేటప్పుడు సరిదిద్దారు.
– సుప్రీంకోర్టును ఆశ్రయించలేని నిరుపేదలైన పౌరులకు సరైన రక్షణలను కల్పించేందుకు ప్రాథమిక హక్కుల విషయంలో ప్రభుత్వ ఖర్చులతో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించాలని ఎన్జీ రంగా సూచించారు.
– ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ప్రజలకు హక్కు ఉంటుంది.
– సమాచార హక్కు అమలు విషయంలో రాజ్యాంగ సవాళ్లు ఎదురవుతున్నాయి.
– కులతత్వాన్ని, మత తత్వాన్ని నిర్మూలించడం రాజ్యాంగానికి పెద్ద సవాలుగా పరిణమించింది.
– భారత రాజ్యాంగ లౌకికత్వాన్ని సవాలు చేస్తున్నాయి.
– బహుసంస్కృతి సమాజం వంటి భారతదేశంలో అల్ప సంఖ్యాక వర్గాలకు రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన ప్రత్యేక హక్కులు ఎంతో ఆలోచనతో రూపొందించినవి.
– రాజస్థాన్‌లోని గుజ్జర్లు, గుజరాత్‌లోని పటేళ్లు, కాపులు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేస్తున్నారు. ఇలాంటి ఉద్యమాలు రాజ్యాంగ స్ఫూర్తికి సవాలుగా మారాయి.
– అమెరికాలో సామాజిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) మాదిరిగా ప్రతి వయోజన భారతీయుడికి జీవిత బీమా ఉండాలనే వాదన ఉంది.
– పనిహక్కు కల్పించలేకపోవడం, దేశంలో కామన్ సివిల్ కోడ్ లేకపోవడం రాజ్యాంగానికి సవాల్‌గా మారింది. ఆదేశిక సూత్రాల అమలు విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
– కేరళ, కర్ణాటక హైకోర్టులు దేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరం అని పేర్కొన్నాయి.
కేంద్ర ప్రభుత్వం
– దేశానికి బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏ రూపంలో ఉండాలి?
1. అమెరికన్ అధ్యక్ష తరహా వ్యవస్థ
2. స్విడ్జర్లాండ్ తరహా ఎన్నికైన కార్యనిర్వహణ వ్యవస్థ
3. బ్రిటిష్ మంత్రిమండలి ప్రభుత్వం
– రాజ్యాంగ నిర్ణయసభ బ్రిటిష్ మంత్రిమండలి తరహా ప్రభుత్వం ఉత్తమం అని నిర్ణయించింది.
– ప్రజలతో ఎన్నికైన లోక్‌సభ తరచుగా ఐదేండ్ల పూర్తికాలం కొనసాగలేకపోతుంది. ఇది కూడా రాజ్యాంగానికి నూతన సవాల్‌గా మారింది.
– 1990లో వీపీ సింగ్, చంద్రశేఖర్, 1997లో దేవెగౌడ, ఇంద్రకుమార్ గుజ్రాల్, 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి తదితరులు అవిశ్వాస తీర్మానం ద్వారా రాజీనామా చేశారు.
– రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 13వ లోక్‌సభను కాలపరిమితికన్నా ముందుగా రద్దు చేస్తూ రాజ్యాంగంలో 85 (2-బి) అధికారాన్ని ఉపయోగించుకోవడం చర్చకు దారితీసింది. సరైన కారణం లేకుండా ప్రధాని అధ్యక్షతనగల మంత్రిమండలి లోక్‌సభ రద్దును సిఫార్సు చేసినప్పుడు రాష్ట్రపతి ఆ సలహాను పాటించాలా లేక తిరస్కరించాలా అనే అంశం రాజ్యాంగానికి సవాలుగా మారింది.
– ఏ ఒక్క రాజకీయ పార్టీ లేదా పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేనప్పుడు రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది.
– ఈ సంక్షోభాన్ని నివారించడానికి జాతీయ ప్రభుత్వం ఏర్పాటును సూచిస్తున్నారు.
– రాజకీయ పార్టీలు, పార్టీల వ్యవస్థ అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
– తక్కువ శాతం ఓట్లతో గెలుస్తున్న పార్టీలు ప్రభుత్వాలను ఏర్పరచడం పార్లమెంటరీ వ్యవస్థకు సవాల్‌గా మారింది.
రాష్ట్రపతి, గవర్నర్లు జారీచేసే ఆర్డినెన్సులు
– రాష్ట్రపతి, గవర్నర్లు పదేపదే ఆర్డినెన్సులు జారీచేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్డినెన్స్‌లను తిరిగి జారీ చేయడం రాజ్యాంగాన్ని వంచించడమే అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వం ఆర్డినెన్సును చట్టసభల ముందు ఉంచకపోవడం అంటే ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన చట్టబద్ధ ప్రక్రియను దెబ్బతీయడమే అని వ్యాఖ్యానించింది. ఆర్డినెన్సులను పునర్జారీచేయడం రాష్ట్రపతి, గవర్నర్ల సంతృప్తి అన్నది న్యాయసమీక్షకు అతీతం కాదని పేర్కొంది.
– ఆర్డినెన్స్ పునర్జారీకి రాజ్యాంగం అనుమతించదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్డినెన్సు జారీకి రాష్ట్రపతి, గవర్నర్లకు రాజ్యాంగం పరిమితమైన అధికారాన్నే ఇచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొంది.
– ప్రజాస్వామ్యంలో శాసనాలు చేసేది అంతిమంగా చట్టసభలే కాబట్టి ఆర్డినెన్స్‌లను పునర్జారీ చేయడాన్ని రాజ్యాంగం అనుమతించదని పేర్కొంది.
– పార్లమెంటు, శాసనసభలు సమావేశంలో లేనప్పుడు దైనందిన పరిపాలన వ్యవహారాలకు అంతరాయం కలుగకుండా ఉండటానికి అత్యవసరంగా శాసనం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ప్రకరణ 123 ప్రకారం రాష్ట్రపతి, ప్రకరణ 213 ప్రకారం గవర్నర్లు మంత్రిమండలి సలహాతో ఆర్డినెన్సులు జారీ చేస్తారు. ఇది రాజ్యాంగ నిర్మాతల అపూర్వ సృష్టి. అయితే ఒక శాసనాన్ని తీసుకురావడానికి ప్రభుత్వాలకు ఆర్డినెన్స్ ఒక దొడ్డిదారిగా మారింది. ఇది రాజ్యాంగానికి ఒక సవాల్‌గా మారింది. రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్కాలంలో అత్యధిక ఆర్డినెన్సులు జారీ అయ్యాయి. 1969, జూలై 19న బ్యాంకుల జాతీయీకరణకు సంబంధించిన ఆర్డినెన్సును పార్లమెంటు వర్షాకాలపు సమావేశానికి రెండు రోజుల ముందు జారీ చేశారు. ఇటీవల భూసేకరణ, పునరావాస ఆర్డినెన్స్‌ను మూడుసార్లు జారీచేశారు. ఒకసారి రాజ్యసభను ప్రోరోగ్ చేసి మరీ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
భారత న్యాయవ్యవస్థ
– న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు రావడం న్యాయవ్యవస్థకు, రాజ్యాంగానికి సవాళుగా పేర్కొనవచ్చు.
– జస్టిస్ వీ రామస్వామి, జిస్టిస్ సౌమిత్రసేన్, జస్టిస్ పీడీ దనకరణ్ తదితరులపై అవినీతి, అనుచిత ప్రవర్తన ఆరోపణలు వచ్చాయి.
– ఇటీవల కూడా ఒక న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చాయి. అభివృద్ధితో పాటే న్యాయవ్యవస్థ సామర్థ్యం ముడిపడి ఉంటుంది. మున్సిఫ్ జడ్జి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు సగటున ఏడాదికి పరిష్కరిస్తున్న కేసులు 2,600. అమెరికాలో ఈ సంఖ్య 81. న్యాయమూర్తుల సంఖ్య పెరగలేదంటే అది ప్రభుత్వ నిష్క్రియా పరత్వమే అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అన్నారు. న్యాయస్థానాల్లో పూర్తి స్థాయిలో న్యాయమూర్తుల నియామకం జరగడం లేదు.
– ఆదేశిక సూత్రాల్లోని 39 (ఏ) ప్రకరణ న్యాయం పొందడాన్ని అత్యంత ముఖ్యమైన మానవ హక్కుగా పేర్కొంటుంది. దురదృష్టవశాత్తు ఢిల్లీ దాక వెళ్లిపోరాడే స్తోమత గలవారికే దేశంలో ఇప్పుడు న్యాయం అందుబాటులో ఉంది.
– ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడానికి దేశంలోని కోర్టులకు మరో 350 ఏండ్లు పడుతుందని అంచనా.
– ఇటీవల 99వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు చెల్లదని పేర్కొంది. దీనిపై జయప్రకాష్ నారాయణ్ సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం అని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే నిర్ణయం అని ఇది రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించారు.
– సుప్రీంకోర్టును రాజ్యాంగపరమైన, చట్టపరమైన విభాగాలుగా వర్గీకరించాలి.
– సామాన్యుడికి న్యాయవ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లుతోంది.
– స్పష్టమైన అధికార విభజన ఉన్నప్పటికీ శాసన నిర్మాణశాఖ, న్యాయశాఖల మధ్య వివాదాలు రాజ్యాంగ సమస్యగా మారాయి.
– నిర్భయ కేసులో బాల నేరస్థుడిని 2015, డిసెంబర్ 20న విడుదల చేశారు. నేరానికి పాల్పడిన వారందరిలో అతనే అత్యంత క్రూరంగా వ్యవహరించాడు. నేరం చేసిన నాటికి అతని వయస్సు బాలల వర్గం కిందికి వస్తుంది. తద్వారా అతనికి మూడేండ్ల జువైనల్ హోం శిక్ష పడింది. బాల నేరస్థుడి విడుదల మన చట్టాల్లోని లొసుగులను ఎత్తి చూపుతుంది. అతని విడుదలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. చివరికి సుప్రీంకోర్టు కూడా అతని విడుదల నిలుపుదలకు నిరాకరించింది. ఈ సంఘటన న్యాయవ్యవస్థ, చట్టాల్లోని లోసుగులను తెలుపుతుంది. ఇలాంటి సంఘటనలు దేశ చట్టాలకు రాజ్యాంగానికి ఒక సవాలుగా మారాయి.
జాతీయ అత్యవసర పరిస్థితి అధికారాలు- ప్రకరణ 352
– ఒక ప్రధానమంత్రి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతీయ అత్యయిక పరిస్థితి దుర్వినియోగానికి పాల్పడటం. వీటిని ఊహిస్తే రాజ్యాంగంలో అత్యయిక పరిస్థితి నిబంధనను అసలు చేర్చి ఉండేవారు కాదు. ఒకవేళ చేర్చినా 44వ రాజ్యాంగ సవరణలో మాదిరిగానే దానికి తగిన పరిమితులు ఏర్పర్చి ఉండేవారు.
– 1971 లోక్‌సభ ఎన్నికలో రాయ్‌బరేలీ నియోజకవర్గంలో ఇందిరాగాంధీ అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారన్నా అభియోగాలతో రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో ఆమెపై కేసు వేశారు. ఆ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగ్మోహన్లాల్ సిన్హా ఇందిరాగాంధీపై అవినీతి ఆరోపణలు నిజమేనని తేల్చిచెప్పారు. పార్లమెంటుకు ఆమె ఎన్నిక చెల్లదని తీర్మానించి, ఆరేండ్లపాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.
– సుప్రీంకోర్టు న్యాయమూర్తి వీఆర్ కృష్ణ అయ్యర్ ఇందిర అప్పీల్‌ను విచారించి ఆమెకు షరతులతో కూడిన స్టేను జారీచేశారు. దానిప్రకారం ఆమె ప్రధాని పదవిలో కొనసాగవచ్చు కానీ పార్లమెంటులో జరిగే చర్చల్లోగాని, ఓటింగ్లోగాని పాల్గొనకూడదని నిషేధించారు.
– జూన్ 12న న్యాయమూర్తి సిన్హా తీర్పు ప్రకటించింది మొదలు ఇందిర రాజీనామా చేయాల్సిందేనంటూ కాంగ్రెసేతర పక్షాలు దేశవ్యాప్తంగా గళం వినిపించడం మొదలు పెట్టాయి.
– ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్ నుంచి జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్‌తోపాటు ఇతర నాయకులు జూన్ 25న ర్యాలీ తీశారు.
– అప్పుడు ఇందిర అనుంగుడు సిద్దార్ధ శంకర్ రే రాజ్యాంగంలోని ప్రకరణ 352 ప్రకారం దేశంలో అంతర్గత అత్యయిక స్థితిని ప్రకటించవచ్చని ఇందిరాగాంధీకి సలహా ఇచ్చారు.
– 1975, జూన్ 25న రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌ను కలిశారు. మంత్రివర్గాన్ని కూడా సంప్రదించకుండా ఇందిర తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి ఆమోదించారు.
– తరువాత రోజు ఉదయాన్నే మంత్రివర్గాన్ని సమావేశపరిచిన ఇందిర తన నిర్ణయాన్ని వారికి వెల్లడించారు.
– ఆ తరువాత పార్లమెంటు వేదికగా రాజ్యాంగానికి 39 నుంచి 42 వరకు సవరణలు తీసుకువచ్చారు.
భారత సమాఖ్య, కేంద్ర రాష్ట్ర సంబంధాలు
– 1950-67 వరకు కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో ఎలాంటి వివాదాలు ఏర్పడలేదు. కేంద్ర, రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటమే దీనికి కారణం.
– 1967-72 వరకు కేంద్ర, రాష్ర్టాల మధ్య అధికారాల విషయాల్లో వనరుల పంపిణీ వరకు తరుచు వివాదాలు తలెత్తాయి. 1967 సాధారణ ఎన్నికల్లో అనేక రాష్ర్టాల్లో కాంగ్రెస్‌పార్టీ అధికారాన్ని కోల్పోవడం ఇందుకు కారణం.
– 1972-77 మధ్యకాలంలో కేంద్ర, రాష్ర్టాల మధ్య ఎలాంటి వివాదాలు ఏర్పడలేదు. 1967లో ఓడిపోయిన కాంగ్రెస్‌పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఇందుకు కారణం.
– 1977-80 మధ్య కాలంలో మరోసారి దేశ రాజకీయాల్లో నూతన పరిణామాలు ఏర్పడ్డాయి. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ దేశవ్యాప్తంగా ఓడిపోయింది. జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది.
– 1983 తరువాత అనేక రాష్ర్టాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడటంతో కేంద్ర, రాష్ర్టాల మధ్య ఆర్థిక వనరుల విషయంలో రాష్ర్టాల అంతరంగిక విషయాల్లో కేంద్ర జోక్యం, గవర్నర్లు తమ బాధ్యతలను నిర్వహించే విషయంలో అనేక వివాదాలు ఏర్పడ్డాయి.
– బలహీనమైన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది. దేశంలో శాంతిని కాపాడటంలో, కీలకమైన విషయాలను సమన్వయ పరచడంలో విఫలమవుతుంది. అంతర్జాతీయ వేదికలమీద దేశం తరపున సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహించలేకపోతుంది. మన రాజ్యాంగానికి పటిష్టమైన కేంద్రంతో కూడిన సమాఖ్య విధానమే అత్యంత ఆరోగ్యవంతమైన పద్ధతి అని రాజ్యాగ పరిషత్ భావించింది.
– కేంద్రం, రాష్ట్రం పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడటంలోనే ఈ వ్యవస్థ మనుగడ కొనసాగుతుంది. ఒకవేళ రాష్ర్టాలు తమ అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర శాసనానికి సహకరించాల్సిందే అని ఆశిస్తే మాత్రం అది నెరవేరదు అని పంత్ పేర్కొన్నారు.
– 1964లో ఉత్తరప్రదేశ్ శాసనసభకు, ఆ రాష్ట్ర హైకోర్టుకు మధ్య వివాదం ఏర్పడింది. శాసన ధిక్కారానికి పాల్పడి జైలుశిక్ష అనుభవిస్తున్న ఒక వ్యక్తిని హెబియస్ కార్పస్ పిటిషన్‌కు ప్రతిస్పందనగా విడుదల చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. శాసన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య తలెత్తిన ఈ అధికారాల వివాదం ఎంతో ఉద్రిక్తతని, ఆసక్తిని కలిగించింది. న్యాయ సలహా కోసం రాష్ట్రపతి ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకు పంపించారు. అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు తీసుకున్న చర్య సరైనదే అని నిర్ధారించింది. ఆ విధంగా రాజ్యాంగమే ఈ సమస్యకు పరిష్కారం చూపింది.
కొత్త రాష్ర్టాలు -ప్రకరణ -3
– రాజ్యాంగసభలో రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రాజ్యాంగ పరిషత్ సభ్యులు ముఖ్యమైన ప్రతిపాదనలు చేశారు. కొత్త రాష్ర్టాల ఏర్పాటులో సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి కూడా నిర్ణయాధికారం ఉండాలన్న ఆలోచనను రాజ్యాంగ పరిషత్సభ్యులు తిరస్కరించారు. అసెంబ్లీకి నిర్ణయాధికారం ఇస్తే, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ఎప్పుడూ ఆ సభ అంగీకరించదని రాజ్యాంగపరిషత్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందువల్ల తక్కువమంది ఎమ్మెల్యేలున్న ప్రాంతాల ఆకాంక్షలు పరిపూర్తి చెందవు. అందుకే రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణలో అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకుంటే చాలని సూచించారు. అసెంబ్లీ సమ్మతి అనవసరమని ప్రతిపాదించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 రూపకల్పన చేశారు. రాజ్యాంగపరిషత్ సభ్యులు దూరదృష్టితో ఆలోచించి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదు.
– 1955లో జరిగిన ఐదో సవరణ చట్టం ప్రకరణ 3లోని నిబంధనను స్వల్పంగా మార్చింది. అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్రపతి ఈ బిల్లును రాష్ట్ర శాసనసభకు తప్పనిసరిగా పంపాలని చేర్చారు.
– తెలంగాణ ఏర్పాటు సందర్భంలో దేశవ్యాప్తంగా మూడో ప్రకరణపై చర్చ జరిగింది. కొంతమంది ప్రకరణ 3కు సవరణ చేయాలని డిమాండ్ చేశారు. నూతన రాష్ర్టాల ఏర్పాటు రాజ్యాంగానికి సవాలుగా మారింది.
– రాష్ట్రపతి, గవర్నర్ల క్షమాభిక్ష అధికారాలు తరచుగా వివాదానికి కారణమవుతున్నాయి.
– ప్రకరణ 72 ప్రకారం రాష్ట్రపతికి, ప్రకరణ 161 ప్రకారం గవర్నర్లకు ఉన్న క్షమాభిక్ష అధికారాలు రాజ్యాంగానికి సవాల్‌గా పరిణమించాయి.
– 24 ఏళ్లుగా జైలులో ఉన్న నళిని ప్రకరణ 161 ప్రకారం రాష్ట్ర మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ క్షమాభిక్ష ప్రసాదించవచ్చని హైకోర్టులో రిట్‌పిటిషన్ వేసింది.
– యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేస్త్తూ జయలలిత నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
– భారత మాజీ ప్రధాని హంతకుల పట్ల జయలలిత వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
– తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
– తద్వారా కేంద్ర, రాష్ట్ర అధికారాలపై చర్చకు దారితీసింది.
– సుప్రీంకోర్టు ఈ కేసును విచారించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నది. అవి.. సీబీఐ, ఎన్ఐఏ, ఐబీ వంటి కేంద్ర సంస్థలు దర్యాప్తు చేసిన కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్నవారికి క్షమాభిక్ష మినహాయింపులు ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది.
– 14 ఏండ్లకు పైబడి యావజ్జీవం అనుభవిస్తున్నవారు స్వయంగా ధరఖాస్తు చేసుకుని శిక్షాకాలం తగ్గించమని కోరితే తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?