సైకాలజీలో 30/30 మార్కులు రావాలంటే..?
ఒక తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఎవరయినా చెప్పగలరు. విద్యార్థి మనస్సులో ఏముందో మాత్రం ‘సైకాలజీ’ తెలిసిన ఉపాధ్యాయుడు మాత్రమే చెప్పగలడు. అంతటి శక్తిమంతమైన విషయాన్ని ముందుగా నేర్చుకొని, తర్వాత తరగతిలో అనుప్రయుక్తం చేసేలా చేసేదే సైకాలజీ సబ్జెక్ట్. టెట్ సైకాలజీలో 30కి 30 ఎలా సాధించాలో తెలుసుకుందాం.
టెట్‌లో సిలబస్‌ను పరిశీలిస్తే 3 యూనిట్లు ఉన్నాయి.
1) శిశువికాసం (చైల్డ్ డెవలప్మెంట్)
2) అభ్యసనం (లెర్నింగ్)
3) అధ్యాపన శాస్త్రం (పెడగాగీ)
గత ప్రశ్నపత్రాల సరళిని గమనిస్తే జ్ఞానపరమైన ప్రశ్నల కంటే అవగాహన, అనుప్రయుక్తం (అప్లికేషన్)తో కూడిన ప్రశ్నలను ఎక్కువగా ఇచ్చారు. కాబట్టి సైకాలజీలో ఏ ఒక్క అంశాన్నీ విడిచిపెట్టకుండా అధ్యయనం చేస్తేనే ప్రశ్న ఎలా అడిగినా సమాధానం గుర్తించగలరు.
శిశు వికాసం
- శిశు వికాసం అంటే శిశువుల్లో శారీరంగా, మానసికంగా, సాంఘికంగా, ఉద్వేగంగా, నైతికంగా, భాషాపరంగా జరిగే అభివృద్ధి. కాబట్టి వీటికి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం (బేసిక్ నాలెడ్జ్) ముందుగా తెలుసుకోవాలి. అలా అయితేనే అనుప్రయుక్త ప్రశ్నకు సమాధానం గుర్తించవచ్చు.
- పెరుగుదల, వికాసం, పరిపక్వతలు చాలామంది ఒకటే అనుకుంటారు. కానీ వాటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.
ఉదా: 1) కాళ్లు, చేతులు, గుండె, ఎదగడం- పెరుగుదల
2) చదవడం, రాయడం, ఈదడం- వికాసం
3) పాకడం, నిలబడటం, నడవటం, పరిగెత్తడం- పరిపక్వత - 1. వ్యక్తి పెరుగుదల, వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి? (2017, పేపర్-1)
1) పెరుగుదల, వికాసంలో లీనమై ఉంటుంది
2) వికాసం, పెరుగుదలలు వ్యక్తి జీవితకాలం కొనసాగుతాయి
3) వికాసం, పెరుగుదలల్లో వైయక్తిక భేదాలు ఉండవు
4) వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం
సమాధానం గుర్తించాలంటే కింది వివరణ తెలిసి ఉండాలి.
- ఆప్షన్-1: వికాసంలో పెరుగుదల ఎల్లప్పుడూ అంతర్భాగంగా ఉంటూ ఇవి రెండూ పరిపక్వతకు దారితీస్తాయి.
- ఆప్షన్-2: పెరుగుదల జీవితాంతం కొనసాగక శారీరక అవయవాలు పరిపక్వత చెందగానే ఆగిపోతుంది. కానీ వికాసం జీవితాంతం కొనసాగుతుంది.
- ఆప్షన్-3: పెరుగుదల, వికాసం, పరిపక్వత, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా వ్యక్తికి వ్యక్తికి మధ్య కచ్చితంగా భేదాలుంటాయి.
- ఆప్షన్-4: పెరుగుదలను కచ్చితంగా కొలవగలం. కాబట్టి పరిమాణాత్మకం/గుణాత్మకం. వికాసాన్ని కచ్చితంగా కొలవలేం. కాబట్టి గుణాత్మకం
- ఈ విధంగా విశ్లేషణ చేయగలిగేలా ప్రతి టాపిక్‌ను చదివితే సులభంగా సమాధానాలు గుర్తించగలరు. కాబట్టి పై ప్రశ్నకు సమాధానం 1. అభ్యసనం
- సాధారణంగా నేర్చుకోవడాన్నే అభ్యసనం అంటారు. చాలా మంది అభ్యాసం, అభ్యసనం ఒక్కటే అనుకుంటారు. కానీ వాటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.
- ఏదైనా ఒక కృత్యాన్ని
- పదే పదే చేయడం- అభ్యాసం
- అభ్యాసం చేయడం ద్వారా
- వచ్చిన ఫలితమే- అభ్యసనం
- అతి అభ్యాసం చేయడం
- ద్వారా పొందేది- నైపుణ్యం
1. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి, తన ఉపాధ్యాయుడి రాతపనిని గమనించి తాను అదే విధంగా రాయడాన్ని అలవర్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం? (2017, పేపర్-2)
1) యత్నదోష అభ్యసనం
2) అంతరదృష్టి అభ్యసనం
3) సాంఘిక అభ్యసనం
4) కార్యక్రమయుత అభ్యసనం
ఈ ప్రశ్నకు సమాధానం గుర్తించాలంటే కింది వివరణ తెలిసి ఉండాలి.
- ఆప్షన్-1: మానవుని శారీరక అవయవాల్లో కాళ్లు, చేతులను ఎక్కువగా ఉపయోగించి మెదడును తక్కువగా ఉపయోగించడం ద్వారా అభ్యసనం జరిగే విధానాన్ని సూచించేదే ‘యత్నదోష అభ్యసన సిద్ధాంతం’.
- ఆప్షన్-2: మానవుని శారీరక అవయవాల్లో మెదడును ఎక్కువగా, కాళ్లు, చేతులను తక్కువగా ఉపయోగించడం ద్వారా అభ్యసనం జరిగే విధానాన్ని సూచించేదే ‘అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం’.
- ఆప్షన్-3: మానవుడు తన ప్రారంభ పాఠాలను చిన్నప్పుడు ఎక్కువగా పరిసరాల్లోని విషయాలను పరిశీలిస్తూ, వాటిని అనుకరిస్తూ, అనుసరిస్తూ అభ్యసనం చేస్తాడని తెలిపేదే ‘సాంఘిక అభ్యసన సిద్ధాంతం’.
- ఆప్షన్-4: ఉపాధ్యాయుని ప్రమేయం లేకుండా బోధనాయంత్రం సహాయంతో విద్యార్థి స్వయంగా నేర్చుకునే పద్ధతే ‘కార్యక్రమయుత అభ్యసనం’. పై విశ్లేషణ ఆధారంగా పై ప్రశ్నకు సమాధానం 3. అధ్యాపన శాస్త్రం
- ఈ యూనిట్ పూర్తిగా బోధన, అభ్యసన ప్రక్రియ తరగతిలో ఎలా జరగాలి? ఎలా జరుగుతుంది? ఎలా బోధించాలి? ఎలా బోధించకూడదు? అని తెలుపుతుంది.
1. ప్రధానోపాధ్యాయుడు తనంతట తానే నిర్ణయాలు తీసుకునే నాయకత్వ లక్షణం? (2017, పేపర్-2)
1) జోక్య రహిత 2) ప్రజాస్వామ్య 3) అనుజ్ఞ 4) నిరంకుశ
ఈ ప్రశ్నకు సమాధానం గుర్తించాలంటే కింది వివరణ తెలిసి ఉండాలి.
- ఆప్షన్-1: లక్ష్యాలు, నిర్ణయాలు తీసుకోవడంలో నాయకుడికి కాకుండా సమూహంలో సభ్యులకే స్వేచ్ఛ ఉండేదే ‘జోక్య రహిత/అనుజ్ఞ నాయకత్వం’.
- ఆప్షన్-2: అభిప్రాయాలు తెలపడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో అందరికీ ఆమోదయోగ్యమైన/మెజారిటీ సభ్యుల ఆమోదంతో ప్రవర్తించడమే ‘ప్రజాస్వామిక నాయకత్వం’.
- ఆప్షన్-3: అనుజ్ఞ నాయకత్వాన్నే, జోక్య రహిత/అనుమతించే నాయకత్వం అంటారు.
- ఆప్షన్-4: సమూహంలో సభ్యుల ప్రమేయం లేకుండానే నాయకుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేదే ‘నిరంకుశ నాయకత్వం’. పై విశ్లేషణ ఆధారంగా పై ప్రశ్నకు సమాధానం 4.
- ఈ విధంగా ప్రతి టాపిక్‌ను పైపైన కాకుండా లోతుగా విశ్లేషణ చేసి, నేర్చుకుంటే టెట్ సైకాలజీలో 30 మార్కులు సాధించగలరు.
గత టెట్‌లో ఈ యూనిట్లను గమనిస్తే కింది ప్రశ్నలు వచ్చాయి.
యూనిట్ 2017 పేపర్-1 – 2017 పేపర్-2 – 2016 పేపర్-1 – 2016 పేపర్-2
1) శిశువికాసం 13 ప్రశ్నలు 11 ప్రశ్నలు 13 ప్రశ్నలు 12 ప్రశ్నలు
2) అభ్యసనం 10 ప్రశ్నలు 11 ప్రశ్నలు 10 ప్రశ్నలు 10 ప్రశ్నలు
3) అధ్యాపన శాస్త్రం 7 ప్రశ్నలు 8 ప్రశ్నలు 7 ప్రశ్నలు 8 ప్రశ్నలు
మొత్తం 30 ప్రశ్నలు 30 ప్రశ్నలు 30 ప్రశ్నలు 30 ప్రశ్నలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు