హైదరాబాద్ రాష్ట్రంలో తొలి ఎన్నికలు
- హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ మొత్తం 175 స్థానాలకు గాను 173 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితి ఎదురైంది.
- కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడే ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. పోటీ చేసిన 173 స్థానాల్లో 93 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 42 స్థానాలతో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రతిపక్ష కూటమిగా నిలిచింది. పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు 41.86 శాతం ఓట్లు రాగా పీడీఎఫ్‌కు 20.76 శాతం ఓట్లు వచ్చాయి.
- జిల్లాల వారీగా చూస్తే నల్లగొండ జిల్లాలోని మొత్తం 14 శాసనసభ స్థానాల్లో అన్నింటిని పీడీఎఫ్ గెలుచుకుంది. వరంగల్‌లోని 14 స్థానాల్లో 9 పీడీఎఫ్‌కు, 2 కాంగ్రెస్‌కు వచ్చాయి. కరీంనగర్లో 15 స్థానాల్లో పీడీఎఫ్‌కు 7, కాంగ్రెస్‌కు 2 దక్కాయి. పీడీఎఫ్‌కు లభించిన 42 శాసనసభ స్థానాల్లో 30 నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచే వచ్చాయి. కమ్యూనిస్టులు 1944 నుంచి తెలంగాణలో ప్రధానంగా నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో నిర్వహించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, మిలిటరీకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటానికి పెద్ద ఎత్తున ప్రజలు నైతిక మద్దతు తెలిపినట్లు ఈ ఓటింగ్ సరళి ద్వారా వెల్లడవుతుంది.
బూర్గుల రామకృష్ణారావు సారథ్యంలో మంత్రివర్గం
- 1952, మార్చి 6న బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌లో తొలి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. పూర్వపు వెల్లోడి ప్రభుత్వంలో బూర్గుల రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి బూర్గుల శాసనసభకు ఎన్నికయ్యారు.
- ముఖ్యమంత్రి బూర్గుల మరో 12 మంది మంత్రులు జూబ్లీహాల్లో ప్రమాణం చేశారు. వీరిని రాజ్‌ప్రముఖ్ నిజాం నియమించారు.
- బూర్గుల ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలమంతా రాజ్‌ప్రముఖ్‌గా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉన్నారు. కొంతకాలం తర్వాత తన దగ్గరున్న ల్యాండ్ రెవెన్యూ శాఖను కేవీ రంగారెడ్డికి ముఖ్యమంత్రి బూర్గుల బదిలీ చేశారు.
బూర్గుల పరిపాలనా సంస్కరణలు
- హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు తన పరిపాలనలో భూ సంస్కరణలకు ప్రధాన స్థానాన్ని కల్పించాడు. అప్పటికే రాష్ట్రంలో రక్షిత కౌలుదార్ల చట్టం 1950 జనవరి నుంచి అమల్లో ఉంది. ఈ చట్టంలో కౌలుదార్లకు రక్షణ ఉన్నప్పటికీ భూస్వామ్యం పెద్దగా ఉన్న వారి నుంచి భూములు స్వాధీనం చేసుకొని శ్రామికులకు ఇప్పించే ఏర్పాటు యోచన లేదు. ఆ ఏర్పాటు ఈ సవరణ ద్వారా చేశారు. దీనివల్ల భూములను ఆక్రమించి సేద్యం చేయకుండా ఉన్న భూములను మధ్యవర్తుల నుంచి స్వాధీనం చేసుకొని సేద్యానికి వీలుగా చేయడం జరిగింది.
- ఇంకా కౌలుదార్ల నుంచి భూస్వాములు హెచ్చు పన్నులు తీసుకోకుండా ఈ చట్టం నిరోధించగలిగింది. చివరికి ఆ నాటి ప్రభుత్వం పెద్ద భూస్వాములు సేద్యం చేయకుండా ఉన్న భూములను ఆక్రమించి శ్రామికులకు పంచగలమని తీవ్రంగా హెచ్చరించింది. అది బూర్గుల రామకృష్ణారావు రాజనీతిజ్ఞతతోనే తన పరిపాలనలో సాధ్యపడింది. దేశంలో భూ కమతాలపై గరిష్ట పరిమితిని విధించిన ప్రథమ శాసకుడిగా బూర్గుల రామకృష్ణారావు పేరుపొందారు.
- విద్యా సంస్కరణల్లో భాగంగా ప్రతి 500 జనాభా గల గ్రామానికి పాఠశాల ఏర్పాటు చేశారు. మొదటి తరగతి నుంచి మాతృభాషలో బోధన ప్రవేశపెట్టారు. దీనికి తోడుగా 5వ తరగతి నుంచి ఇంగ్లిష్‌ను ప్రవేశపెట్టారు. మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం హైదరాబాద్ కాగా, మొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు చరిత్రలో నిలిచారు.
- 1953, అక్టోబర్ 1న వరంగల్ జిల్లా నుంచి కొన్ని భాగాలను వేరుచేసి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు. 1955, జూలై 1న అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేయడంతో రాష్ర్టాభివృద్ధి ముందుకు సాగింది. 1955, డిసెంబర్ 10న ముఖ్యమంత్రి బూర్గుల స్వయంగా నాగార్జున సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు.
ఆర్థిక సుస్థిరత-గోర్వాల కమిటీ నివేదిక అమలు
- నిజాం హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమయ్యే సమయంలో సంస్థాన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. విలీనానికి పూర్వం నిజాం సంస్థానం దాదాపు రూ.22 కోట్లు ఆయుధాల కొనుగోలుకు, ప్రచారానికి ఉపయోగించినట్లు విమర్శకులు పేర్కొంటారు. దీంతో హైదరాబాద్ మంత్రివర్గం 1950లో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మాజీ ఐపీఎస్ అధికారి ఏడీ గోర్వాల అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
- పరిపాలన వ్యవస్థను, ఆర్థిక పరిస్థితిని పునర్వ్యవస్థీకరించడానికి సిఫారసులు చేయాల్సిందిగా ఈ కమిటీని కేంద్రం కోరింది. ఈ కమిటీ అనేక అంశాలను అధ్యయనం చేసి 1950, అక్టోబర్‌లో అనేక సిఫారసులతో నివేదికను అందజేసింది. గవర్నర్ల ప్రావిన్స్‌లో జరిగే పాలనకు దీటుగా హైదరాబాద్ రాష్ట్రంలో పరిపాలనను ఆధునీకరించడానికి రాష్ట్రంలో పాలనా సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు సూచించింది. రాష్ట్రంలో సంస్కరణల అమలు ఫలితంగా ఆర్థిక వ్యవస్థ బాగుపడి సంవత్సరానికి రూ.350 లక్షల మిగులు ఏర్పర్చుకోవచ్చని తెలిపింది.
- ఈ కమిటీ నివేదికను హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసింది. వెల్లోడి మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు పరిపాలన-ఆర్థిక సంస్కరణల విషయంలో క్రియాశీలంగా వ్యవహరించారు. 1952 నాటికి బడ్జెట్లో సమతౌల్యతను సాధించగలిగారు.
భూదానోద్యమం-1951
- స్వాతంత్య్రానంతరం దేశంలో అతి క్లిష్టమైన భూ సమస్యను పరిష్కరించడానికి గాంధేయవాది ఆచార్య వినోబా భావే భూదానోద్యమాన్ని ప్రారంభించారు. వినోబా ఈ ఉద్యమాన్ని నల్లగొండ జిల్లాలోని పోచంపల్లిలో వెదిరె రామచంద్రారెడ్డి దానం చేసిన 100 ఎకరాల భూమితో ఆరంభించారు.
హింస, శాసనం, దానం అనే ఈ మూడు పద్ధతుల ద్వారా ఏ సమస్యనయినా పరిష్కరించవచ్చు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రెండో పద్ధతిని అనుసరించి కొద్ది మేరకు భూ సంస్కరణల ద్వారా భూ సమస్యను పరిష్కరించింది. కానీ ఈ సంస్కరణల వల్ల సమస్య పూర్తిగా పరిష్కారం కాదని, అప్పటి వరకు వేల ఎకరాలకు హక్కుదారులైన భూస్వాములు పెద్ద మనసుతో, ప్రేమతో తమ విద్యుక్త ధర్మంగా భూదానం చేయాలని సర్వోదయ ఉద్యమంలో భాగంగా వినోబా భావే ప్రచారం చేశారు. - ఈ సందర్భంలోనే 1951, మార్చిలో హైదరాబాద్‌కు దగ్గరలోని శివరాంపల్లిలో జరుగనున్న సర్వోదయ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానాన్ని అందుకున్న వినోబా భావే వార్ధా నుంచి దాదాపుగా 300 మైళ్లు కాలినడకతో హైదరాబాద్ వచ్చారు. ఆ తరువాత వరుసగా హయత్ నగర్, బాట సింగారంల మీదుగా జీఎస్ మేల్కోటే, మర్రి చెన్నారెడ్డి వంటి ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలతో 1951, ఏప్రిల్ 18న భూదాన్ పోచంపల్లి చేరుకుని ఆ గ్రామ దేశ్‌ముఖ్ వెదిరె రామచంద్రారెడ్డి అందించిన 100 ఎకరాల భూదానంతో ఈ మహత్తర ఉద్యమాన్ని ఆరంభించారు.
- ఆ నాటి నుంచి రోజుకు 200 నుంచి 300 ఎకరాల భూమిని దానంగా స్వీకరించాలనే ఉద్దేశంతో తన ఉద్యమాన్ని తెలంగాణ ప్రాంతానికి విస్తరించారు. అదేవిధంగా వినోబా భావే తన యాత్రను నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ తాలూకాల నుంచి సూర్యాపేట వరకు కొనసాగించారు. ఈ యాత్రను కమ్యూనిస్టులు కూడా స్వాగతించారు. మొదటి విడతగా తెలంగాణలో వినోబా భావే పర్యటన ఫలవంతమయ్యి వేల ఎకరాల భూమి దానంగా స్వీకరించి పేద, బలహీన వర్గాలు, భూమి లేని ప్రజలకు పంచారని, ఇంకా దాని ఫలితాలు సర్వోదయాన్ని అందిస్తాయని పార్లమెంట్లో ఈ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రధాని నెహ్రూ కొనియాడారు. తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు 50,000 సైన్యం చేయని పనిని ఒకే ఒక్క మనిషి వినోబా భావే చేస్తున్నారని పేర్కొన్నారు.
- అదేవిధంగా 1955లో రెండోసారి హైదరాబాద్‌ను సందర్శించిన వినోబా భావే, మం త్రి పల్లెర్ల హనుమంతరావు కోరిక మేరకు పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, వనపర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, గద్వాల తాలూకాలు పర్యటించి దాదాపుగా లక్ష ఎకరాల భూమిని దానంగా తీసుకొని పేద ప్రజలకు పంచారు. మొత్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని అనేక తాలూకాల్లో పర్యటించిన వినోబా భావే దాదాపుగా 2 లక్షల ఎకరాల భూమిని దానంగా గ్రహించారు.
- ఆ భూమి మొత్తాన్ని పేద ప్రజలకు పంచడంలో ఆ నాటి వెల్లోడి, బూర్గుల ప్రభుత్వా లు కొంతమేరకు కృతకృత్యమైనప్పటికీ అది పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదనే ఒక విమర్శ ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద భూస్వాములు పేరు కోసం మాత్రమే దానం చేసినట్టు చేసి, కొంతకాలం తరువాత పట్టా హక్కులు లేని ఆ పేద ప్రజల నుంచి భూము లను లాక్కోవడమో లేదా అమ్ముకోవడమో జరిగేది. అయినా ప్రభుత్వాలు భూసంస్కరణ చట్టాల ద్వారా భూములు క్రమబద్ధీకరణ చేయడం వల్ల పేద ప్రజలు, రైతుల భూ హక్కులను కొంతమేరకు కాపాడటంలో ఆచార్య వినోబా భావే నడిపించిన ఈ భూదానోద్యమం మంచి ఫలితాలనిచ్చింది.
బూర్గుల మంత్రివర్గ కూర్పు
- బూర్గుల రామకృష్ణారావు- ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, ల్యాండ్ రెవెన్యూ
- ఫూల్‌చంద్ గాంధీ- విద్య, ఆరోగ్యం
- పండిట్ వినాయక రావు విద్యాలంకార్- వాణిజ్యం, పరిశ్రమలు
- వీబీ రాజు- కార్మిక, పునరావాసం
- దిగంబర రావు బిందూ- హోం
- జీఎస్ మేల్కోటే- ఆర్థిక శాఖ
- చెన్నారెడ్డి- ఆహార, వ్యవసాయం
- కేవీ రెడ్డి- కస్టమ్స్, ఆబ్కారీ, అడవులు
- నవాజ్ మెషీ నవాజ్ జంగ్ బహదూర్- పబ్లిక్ వర్క్స్
- అన్నారావు- స్థానిక స్వపరిపాలన
- దేవీసింగ్ చౌహాన్- సాంఘిక సేవ
- శంకర్ దేవ్- హరిజనాభ్యుదయం
- జగన్నాథరావు- న్యాయ శాఖ
జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
పోటీపరీక్షల్లో జీఎస్ పాత్ర చెప్పనక్కర్లేదు. గ్రూప్-1 నుంచి కానిస్టేబుల్ వరకు అని పరీక్షల్లో ఇది కీలకం. సమగ్రంగా అన్ని అంశాలను కవర్ చేస్తూ విజేత కాంపిటీషన్స్ ‘జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్’ బుక్‌ను విడుదల చేసింది. దీనితోపాటు టీఎస్పీస్సీ నిర్వహించిన పరీక్షల్లో నుంచి 91ఋ ప్రీవియస్ పేపర్స్‌ను బుక్‌గా విడుదల చేసింది. అన్ని బుక్ సెంటర్లలో లభిస్తాయి. జనరల్ స్టడీస్ (ఇ.మీ), ప్రీవియస్ పేపర్స్ (ఇం.మీ, తె.మీ) బుక్స్ అందుబాటులో ఉన్నాయి. జనరల్ స్టడీస్ బుక్స్ (రెండు బుక్స్)-1099/-. పూర్తి వివరాల కోసం బండ్ల పబ్లికేషన్స్, బతుకమ్మకుంట, హైదరాబాద్. సెల్: 9963293399, 040-274229494.
మాదిరి ప్రశ్నలు
1. స్వతంత్ర భారతదేశంలో జరిగిన తొలి ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుచుకున్న అసెంబ్లీ స్థానాలు?
1) 175 2) 93 3) 42 4) 173
2. కింది వాటిలో ఏ జిల్లాలోని మొత్తం శాసనసభ స్థానాలు ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) గెలుచుకుంది?
1) నల్లగొండ 2) వరంగల్
3) కరీంనగర్ 4) ఖమ్మం
3. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గానికి సంబంధించి కింది వాటిలో సరైనవి?
1) పండిట్ వినాయకరావు విద్యాలంకార్- వాణిజ్యం, పరిశ్రమలు
2) చెన్నారెడ్డి- ఆహార, వ్యవసాయం
3) ఫూల్‌చంద్ గాంధీ- విద్య, ఆరోగ్యం
4) పైవన్నీ
4. తెలంగాణలో రక్షిత కౌలుదార్ల చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం?
1) 1952 2) 1953
3) 1950 4) 1956
5. కింది వాటిలో సరైనవి?
1)మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం- హైదరాబాద్
2) ఘనత సాధించిన మొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు చరిత్రలో నిలిచారు
3) 1 సరైనది 4) 1, 2 సరైనవి
6. పరిపాలన వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించడానికి హైదరాబాద్ రాష్ట్రంలో నియమించిన కమిటీ?
1) గోర్వాల కమిటీ
2) పండిట్ సుందర్ లాల్ కమిటీ
3) జయభారత్ కమిటీ
4) వాంఛూ కమిటీ
7. ఆచార్య వినోబా భావే భూదానోద్యమాన్ని ప్రారంభించింది?
1) 1951, ఏప్రిల్ 19
2) 1951, ఏప్రిల్ 18
3) 1952, ఏప్రిల్ 18
4) 1951, ఏప్రిల్ 20
8. తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు 50,000 సైన్యం చేయని పనిని ఒకే ఒక్క మనిషి చేశాడని నెహ్రూ ఎవరిని ఉద్దేశించి పేర్కొన్నాడు?
1) వినోబా భావే
2) బూర్గుల రామకృష్ణారావు
3) వెల్లోడి
4) మీర్ ఉస్మాన్ అలీఖాన్
జవాబులు
1-2, 2-1, 3-4, 4-3,
5-4, 6-1, 7-2, 8-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు