Telugu Preparation Plan | తెలుగు ప్రిపరేషన్ప్లాన్
-ఎస్జీటీ పరీక్షలో తెలుగు కంటెంట్‌కు సంబంధించి 18 ప్రశ్నలకు అరమార్కు చొప్పున 9 మార్కులు ఉంటాయి. ప్రశ్నలస్థాయి పదో తరగతి వరకు అని సిలబస్ ఇచ్చారు. టీచింగ్ మెథడాలజీలో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌లో ఒక్కో విభాగం నుంచి ఆరు ప్రశ్నల చొప్పున మొత్తం 30 ప్రశ్నలకుగాను 15 మార్కులు కేటాయించారు. ఇందులో తెలుగు విషయానికొస్తే ఆరు ప్రశ్నలకు అరమార్కు చొప్పున మొత్తం 3 మార్కులు ఉంటాయి. మొత్తంగా ఎస్జీటీ పరీక్షలు తెలుగు కంటెంట్, మెథడాలజీలకు 12 మార్కులు ఉంటాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో తెలుగు కంటెంట్‌కు 88 ప్రశ్నలకు అరమార్కు చొప్పున 44 మార్కులను కేటాయించారు. కంటెంట్ ప్రశ్నలస్థాయి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. టీచింగ్ మెథడాలజీకి సంబంధించి 32 ప్రశ్నలకు అరమార్కు చొప్పున 16 మార్కులను కేటాయించారు. స్కూల్ అసిస్టెంట్‌కు సంబంధించి తెలుగు కంటెంట్, మెథడాలజీలకు మొత్తం 60 మార్కులు ఉంటాయి. తెలుగు కంటెంట్‌కు సంబంధించి ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ సిలబస్‌లో కామన్‌గా ఉన్న చాప్టర్లను సమన్వయపర్చుకుంటూ కిందివిధంగా సన్నద్ధమవ్వాలి.
-మొదటి అధ్యాయం కవులు, రచనలు, కావ్యాలు, రచయితలకు సంబంధించింది. ఇందులో ఎస్జీటీ అభ్యర్థులు 2015లో రూపొందించిన 2 నుంచి 10వ తరగతి వరకు తెలంగాణ పాఠ్య పుస్తకాల్లోని తెలంగాణ కవులు, వారి రచనలు, కావ్యాలు, రచయితలు, ఇతర తెలుగు కవులు, రచయితల గురించి క్షుణ్ణంగా చదవాలి. దీనికి అదనంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఇంటర్మీడియట్ స్థాయి పుస్తకాలను చదవాలి.
దృష్టిపెట్టాల్సిన కీలకాంశాలు
-కవుల కాలం, జన్మస్థలం, బిరుదులు, ఆస్థాన పదవులు, సమకాలికులు.
-కలం పేర్లు, అంకితాలు, ప్రశసంలు
-కవితారీతులు, కావ్యాల్లోని పాత్రలు, పూర్వపరాలు
-కావ్యాల్లోని కొటేషన్లు
-ఈ అధ్యాయానికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు పై పాఠ్యపుస్తకాలతో పాటు వేమూరి శ్రీనివాసరావు రాసిన పూర్వగాథాలహరి చదివితే అదనపు ప్రయోజనం కలుగుతుంది.
-రెండో అధ్యాయంలో పురాణం, ఇతిహాసం, ప్రబంధం, శతకం, కథ, కథానిక, స్వీయ చరిత్ర/ఆత్మకథ, జీవిత చరిత్ర, యాత్రాచరిత్ర, లేఖ, వ్యాసం, సంపాదకీయం, దినచర్య, నవల, నాటిక, పీఠిక, విమర్శ మొదలైన ప్రాచీన, ఆధునిక ప్రక్రియలు ఉన్నాయి. ఎస్జీటీ అభ్యర్థులు కొన్ని ప్రక్రియలను సిలబస్‌లో పేర్కొనపోయినప్పటికీ చదివితే మంచిది. ఈ ప్రక్రియలను చదివేటప్పుడు ముఖ్యంగా వీటికి సంబంధించిన లక్షణాలు, వివరణలు, పరిశోధనలు చేసిన వ్యక్తులు, తొలి రచనలు, ప్రత్యేకతలు, మారుపేర్లు మొదలైనవి క్రమపద్ధతిలో చదవాలి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఈ అధ్యాయానికి సంబంధించి ఆచార్య జీ నాగయ్య రాసిన తెలుగు సాహిత్య సమీక్ష రెండు సంపుటాలు, డా. ద్వా.నా శాస్త్రి తెలుగు సాహిత్య చరిత్ర పుస్తకాలను తప్పక చదవాలి.
-మూడో అధ్యాయంలో భాషారూపాల్లో భాగంగా శాసన, గ్రాంథిక, వ్యవహారిక, మాండలిక భాష, ఆధునిక ప్రమాణ భాష, ప్రసార మాధ్యమాల భాషను చదవాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా మాండలికాల చరిత్రను అధ్యయనం చేస్తూ వృత్తిపద పరిశోధన ఆధారంగా తెలుగునాడును నాలుగు భాషా మండలాలుగా విభజించిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారి పూర్వ, దక్షిణ, ఉత్తర, మధ్య మండలాల్లోని పదాలను పరీక్షల కోణంలో చదవడం ముఖ్యం. గ్రాంథిక భాషావాదులు, వ్యవహారిక భాషావాదుల రచనలు, స్థాపించిన పత్రికలు, సంస్థలు మొదలైనవి చదవాలి. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి సంపాదకత్వంలో వెలువరించిన తెలుగు భాషాచరిత్ర, ప్రొఫెసర్ సిమ్మన్న తెలుగు భాషా చరిత్ర పుస్తకాలు ఈ అధ్యాయానికిగాను చదవాలి.
4వ అధ్యాయంలో ఎస్జీటీ వారు భాషాంశాల్లో భాగంగా భాషా భాగాలు, నానార్థాలు, పర్యాయపదాలు, వ్యుత్పత్యర్థాలు, ప్రకృతి-వికృతి, సామెతలు, పొడుపు కథలు, నుడికారాలు, జాతీయాలు, సంధులు, సమాసాలు, అలంకరాలు, ఛందస్సు, వాక్య భేదాలు, కర్తరి, కర్మణి, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలు చదవాలి. వీటికి సంబంధించి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల చివర్లో ఉన్న అంశాలను చదివితే సరిపోతుంది. అయితే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు వీటితోపాటు అదనంగా గ్రామ్యం, దేశ్యం, అన్యదేశ్యం, పదం, ప్రాతిపదిక, ప్రత్యయం, అర్థపరిణామం, ధ్వని పరిణామం, వ్యాకరణ పారిభాషిక పదాలు, ధ్వని, ఉచ్ఛారణ, ధ్వని ఉత్పత్తి స్థానాలు చదవాలి. అర్థపరిణామం, ధ్వని పరిణామాల్లోని రకాలు, ధాతువాదం, భాషోత్పత్తి వాదం, భౌభౌవాదం, డింగ్డాంగ్వాదం, స్వతఃసిద్ధవాదం, యెహహవాదాలు, ప్రతిపాదకులు పరీక్షల కోణంలో అతిముఖ్యమైనవి. వాక్య భేదాలు సామాన్య, సంయుక్త వాక్యాల గురించి చదువుతూ సంక్లిష్ట వాక్యాల్లోని చేదర్థక, క్త్యార్థక, శత్రర్థక గురించి ప్రత్యేకంగా చదవాలి. దీనికిగాను ఆచార్య చేకూరి రామారావు రాసిన తెలుగు వాక్యం పుస్తకాన్ని చదవాలి.
-కామన్‌గా ఉన్న ఈ అధ్యాయాలు కాకుండా కేవలం స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఆధునిక సాహిత్యం ఉద్యమాలు-ధోరణులు అధ్యాయాలు ప్రధానంగా భావ కవిత్వం మొదలుకొని స్త్రీవాదం, అభ్యుదయవాదం, దిగంబర, విప్లవ, దళితవాద, మైనార్టీవాద, అనుభూతివాద కవిత్వాలను వరుసక్రమంలో చదవాలి. ఉద్యమ కవిత్వంలోని కవులు, వారి రచనలు, కొటేషన్లపై తప్పకుండా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. తెలుగు అకాడమీకి చెందిన తెలుగులో కవిత్వోద్యమాలు పుస్తకాన్ని తప్పకుండా చదవాలి. జానపద సాహిత్యం అధ్యాయానికి సంబంధించి ప్రధానంగా జానపద సాహిత్య విభాగం గురించి పూర్తిగా చదవాలి. జానపద సాహిత్యంలో కృషి చేసిన తెలుగు, ఆంగ్లేయ పరిశోధకుల వివరాల జాబితాను రూపొందించుకొని చదవాలి. దీనికి సంబంధించి ఉపయుక్త గ్రంథాలు ప్రధానంగా..
-జానపద గేయ వాజ్ఞయం- ఆచార్య బిరుదురాజు రామరాజు
-అంధుల జానపద విజ్ఞానం – ఆచార్య ఆర్వీఎస్ సుందరం
-జానపద విజ్ఞానాధ్యయనం – ఆచార్య జీఎస్ మోహన్
-తెలుగు భాషా సాహిత్యాలపై ఇతర భాషా సాహిత్యాల ప్రభావం అనే అధ్యాయంలో భాగంగా తెలుగు భాషలో చేరిన పోర్చుగీసు, ఫ్రెంచి, డచ్, పర్షియన్, అరబిక్, సంస్కృతం, తమిళం, కన్నడం, మరాఠీ, ఒరియా, ఉర్దూ పదాలను, ఆగత మిశ్రాలు, ఆగత పరివృత్తాల గురించి చదవాలి. దీనికిగాను ఆచార్య భద్రిరాజుగారి తెలుగు భాషాచరిత్రలోని వీ స్వరాజ్యలక్ష్మి రాసిన తెలుగులో అన్యదేశ్యాలు వ్యాసం చదవాలి.
-సాహిత్య విమర్శ అనే అధ్యాయం అభ్యర్థులకు కఠినంగా అనిపిస్తుంది. కానీ ఎక్కువసార్లు పునశ్చరణ చేస్తే ఇందులో పట్టు సాధించవచ్చు. ఇందులో భాగంగా నాయకా, నాయికా భేదాలు, కావ్య నిర్వచనాలు (భారతీయులు), కావ్య ప్రయోజనాలు, కావ్యాత్మ, కావ్య హేతువులు, వక్రోక్తి భేదాలు, రస-ధ్వని సిద్ధాంతం-ప్రవర్తకులు, రీతులు, ప్రసిద్ధ విమర్శకులు, వీరి రచనలు, అలంకార శాస్త్రం, అలంకారికులు, వారి కాలాలు, ఆధునిక సాహిత్య విమర్శ ధోరణులు ప్రధానంగా నైతిక, కళా, రూప, సాంఘిక, మార్క్సిస్టు, మనోవైజ్ఞానిక, ఆర్కిటైపల్, శైలీశాస్ర్తాలను
ఉపయుక్త గ్రంథాలు చదవాలి.
1. సాహిత్య సోపానాలు- ఆచార్య దివాకర్ల వెంకటావధాని
2. సాహిత్య విమర్శ సిద్ధాంతం-సూత్రాలు- ప్రొఫెసర్ వీ సిమ్మన్న
-భాష పరస్పర ప్రభావాలు, సంస్కృతి, సమాజం అనే అధ్యాయానికి సంబంధించి పైన పేర్కొన్న ఉపయుక్త గ్రంథాలు చదివితే సరిపోతుంది.
-అనువాదం రీతులు-అవశ్యకత అనే అధ్యాయంలో అనువాదం ముఖ్య లక్షణాలు, అనువాదం రకాలు, సమస్యలు, తెలుగు భాషా సంస్కృతంలో అనువాద ప్రాముఖ్యం, పరిభాషా పదాల కల్పనలు ముఖ్యమైనవి. దీనికిగాను రాచమల్లు రామచంద్రారెడ్డి అనువాద సమస్యలు అనే గ్రంథం ఉపయుక్తమైనది.
-ఇక కంటెంట్‌లో చివరగా పఠనావగాహనం అధ్యాయంలో అపరిచిత పద్య, అపరిచిత గద్య భాగాలు ఇస్తారు. దీనికిగాను అభ్యర్థులు ఇచ్చిన వాటిని పలుమార్లు చదివి పఠనావగహన చేసుకుంటే ప్రశ్నలకు త్వరగా, సులభంగా సమాధానాలను గుర్తించవచ్చు.
తెలుగు భాషాబోధన పద్ధతులు
-టీఆర్టీ అభ్యర్థుల విజయాన్ని ఈ విభాగమే నిర్ణయిస్తుందని చెప్పొచ్చు. అభ్యర్థులు అత్యంత కష్టంగా భావించే విభాగం కూడా ఇదే. మెథడాలజీలోని ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా ఉంటాయి. కారణం ఇందులో ప్రతి ప్రశ్నకు ఇచ్చే 4 ఆప్షన్లు ఒకే విధంగా ఉంటాయి. దీంతో అభ్యర్థులు ఈ విభాగంలో చాలా తప్పులు చేస్తుంటారు. ఇందులో భాష-వివిధ భావనలు, భాషా నైపుణ్యాలు, ప్రణాళిక రచన, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు, మూల్యాంకనం మొదలైనవి కీలకాంశాలుగా పేర్కొనవచ్చు. ముఖ్య విషయం ఏమిటంటే మెథడాలజీలోని అంశాలను కంటెంట్‌లోని పాఠ్యాంశాలకు అన్వయించుకొని (ఉదా : సాహిత్య ప్రక్రియలు-బోధనా పద్ధతులు) ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. మెథడాలజీ చదివేటప్పుడు అర్థమైనట్లే ఉంటుంది. కానీ ప్రశ్నలు సాధిస్తున్నప్పుడే క్లిష్టత తెలుస్తుంది. దీనిలోని నమూనా ప్రశ్నలు సాధించడానికి కూడా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలి. భావనలను తరగతి ఉపాధ్యాయుడు, విద్యార్థికి అనుప్రయుక్తం చేసుకొని అధ్యయనం చేయాలి. అవగాహన, అన్యప్రయత్నం, విశ్లేషణ, తార్కిక పద్ధతికి చెందిన ప్రశ్నలకు కూడా సమాధానాలిచ్చేలా సన్నద్ధమై ఉండటం అవసరం. మెథడాలజీకి సంబంధించి ఎస్జీటీ అభ్యర్థులకు డీఈడీ, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు బీఈడీ తెలుగు అకడామీకి చెందిన గ్రంథాలు రిఫరెన్స్ పుస్తకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని అభ్యర్థులు అనేకసార్లు చదివితే మెథడాలజీలో పట్టు సాధించి గరిష్ట మార్కులు పొందవచ్చు.
విజేతలు కావాలంటే
– ప్రశ్నలస్థాయిలో మార్పులు ఉండవచ్చు. కాబట్టి ఈసారి అభ్యర్థుల ప్రిపరేషన్ వ్యూహాత్మకంగా ఉండాలి.
-కఠినాంశాలు అయిన సాహిత్య విమర్శ, వ్యాకరణాంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి.
-సమయాన్ని దృష్టిలో ఉంచుకొని సరైన ప్రణాళికను రూపొందించుకోవాలి.
-గత పరీక్ష పత్రాలను పరిశీలించి అంశాలవారీగా ప్రాధాన్యాన్ని గుర్తించి ఎక్కువ ప్రశ్నలు వస్తున్న చాప్టర్లకు అధిక సమయం కేటాయించాలి.
-ప్రిపరేషన్లో భాగంగా వివిధ అంశాలను అధ్యయనం చేస్తున్నప్పుడు ముఖ్యాంశాలకు సొంతంగా నోట్స్ రూపొందించుకోవాలి. దీనివల్ల రివిజన్ చాలా తేలికవుతుంది.
-సాధ్యమైనన్ని టెస్టులు రాసి ఫలితాలను విశ్లేషించుకోవాలి. ఎక్కడ సమాధానాలను సరిగ్గా గుర్తించలేకపోతున్నామో ఆ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదవాలి.
-ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలి.
మాదిరి ప్రశ్నలు
1. A Study of Telugu Semantics అనే అంశంపై పరిశోధన చేసినవారు- జీఎన్ రెడ్డి
2. కప్పి ఉంచితే కవిత్వం, విప్పి చెబితే విమర్శ అని పేర్కొన్నవారెవరు- ఆచార్య సి. నారాయణరెడ్డి
3. విగ్రహతంత్ర విమర్శనం గ్రంథకర్త- కందుకూరి వీరేశలింగం
4. భాషలోని ధ్వని మార్పులను మొదటిసారి వివరంగా తెల్పినవారు- టాలెమీ (ఇటలీ)
5. వ్యాకరణ బోధనలు ఉపయోగించే ఉత్తమ పద్ధతి- అనుమానోపపత్తి పద్ధతి
6. పిల్లల్లో ఆలోచనాశక్తి, సమస్యా పరిష్కార మార్గాన్ని, లోకజ్ఞానాన్ని కలిగించేవి- పొడుపు కథలు
7. భారతదేశంలో మాండలికాలపై తొలిసారిగా పరిశోధన చేసినవారు- జార్జ్ గ్రియర్సన్
8. చిన్న పిల్లలు భాష నేర్చుకోవడం దేనివల్ల సాధ్యమవుతుంది- ఉత్పాదకతశక్తి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?