బాలల తొలి పత్రిక ఏది?
జాతి, కుల మతాలకు అతీతంగా తెలంగాణ సమాజాభివృద్ధి, సాహిత్య కృషి లక్ష్యాలుగా గోలకొండ పత్రిక పనిచేసింది. ఇది హైదరాబాద్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరుతూ ఉండేది. ఇక్కడ జరిగే రాజకీయ వ్యవహారాలను, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక విశేషాలను వార్తలుగా, వ్యాఖ్యలుగా ప్రచురించేది.
నిజాం రాష్ట్రంలో పత్రికలు
-1920లో తెలుగులో వారపత్రికలు ప్రారంభమయ్యాయి. వరంగల్ జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తి గ్రామానికి చెందిన ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఆయన సోదరుడు రాఘవరంగారావు కలిసి 1922, ఆగస్టు 27 ఆదివారంనాడు తెనుగు పత్రిక అనే వార పత్రికను ప్రారంభించారు.
-ఒద్దిరాజు సోదరులుగా పేరుగాంచిన వారిద్దరు అనేక నవలలు, నాటకాలు రాసి సాహితీ ప్రముఖులుగా ప్రసిద్ధి చెందారు.
-అయితే 1927లో ఈ పత్రిక మూతపడింది. దీంతో ఒద్దిరాజు సోదరులు అదే కాలంలో స్థాపించిన సుజాత పత్రికలో తమ రచనలు ప్రచురించారు. తెలంగాణ గ్రంథాలయాలు, పత్రికలపై వారు రాసిన వ్యాసాలు చాలా విలువైనవి.
-దాదాపు ఇదే సమయంలో వెలుగులోకి వచ్చిన నీలగిరి వారపత్రిక ప్రభుత్వ నియంతృత్వ పోకడలను తీవ్రంగా నిరసించింది. ఈ పత్రికకు షబ్నవీసు వెంకటరామ నరసింహారావు సంపాదకుడు. ఈ పత్రికలో వృత్తాంతాలను, నిజాం దేశ వార్తలను క్లుప్తంగా ప్రచురించేవారు.
-అయితే 1926లో నీలగిరి పత్రిక కూడా మూతపడింది.
-హన్మకొండ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో తెలుగు పండితులుగా ఉన్న గుండు రాఘవదీక్షితులు 1922లో ప్రకటన ప్రతులను స్థాపించారు. ఇందులో కేవలం వ్యాపార ప్రకటనలు మాత్రమే ప్రచురించేవారు.
-తరువాత 1923 జూన్లో కోకల సీతారామశర్మ హన్మకొండ నుంచి సర్వవిషయక మాసపత్రిక, ఆంధ్రాభ్యుదయంను ప్రారంభించారు. ఇందులో ఆనాటి చారిత్రక పరిస్థితులను వర్ణిస్తూ వ్యాసాలు ప్రచురించారు.
-శైవమత ప్రచారం కోసం 1923లో కొడిమెల రాజలింగయ్య, ముదిగొండ వీరేశలింగశాస్త్రి సంపాదకత్వంలో శైవమత ప్రచారిణి అనే పత్రిక వరంగల్లో ప్రారంభమైంది. ఇందులో శైవమత సంబంధమైన సాహిత్యం, సమకాలీన వార్తలు, వాటిపై సంపాదకీయాలు ఉండేవి.
-అదే ఏడాది శైవమణి అనే పత్రికను ముదిగొండ బుచ్చయ్య శాస్త్రి ప్రారంభించారు. ఇందులో మతానికి సంబంధించిన సమాచారమే కాకుండా ఇతర విషయాలు కూడాప్రచురించేవారు.
-1925లో అహాకాం సుబే వరంగల్ పేరుతో వరంగల్ నుంచి ఒక పక్షపత్రిక వెలువడింది. దీన్ని రెవెన్యూ అధికారులు నడిపేవారు. గ్రామాల్లోని పట్వారీలతో బలవంతంగా కొనిపించేవారు. దీన్ని తెలంగాణ నుంచి వెలువడిన మొదటి పక్షపత్రికగా పరిశోధకులు భావిస్తున్నారు.
-1925లో నేడు అనే పత్రికను సికింద్రాబాద్లో భాస్కర్ ప్రారంభించారు. వారానికి రెండుసార్లు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో వెలువడిన ఈ పత్రిక హైదరాబాద్ రాజకీయాలను ప్రభావితం చేసింది.
-సుబాహ్ దక్కన్, నిజాం గెజెట్ సయిఫా పత్రికలు 1924, 25ల్లో ప్రారంభమయ్యాయి. ఇవి ముస్లిం అనుకూల వార్తలకు ప్రాధాన్యతనిచ్చేవి.
-రహబరే దక్కన్ పత్రిక నిజాంకు అనుకూలమైన ఉర్దూ పత్రిక.
-ఆధునిక భావాలుగల ఖాజీ అబ్దుల్ గఫార్ సంపాదకత్వంలోని వయామ్ అనే పత్రిక ద్వారా ప్రగతిశీల భావాలను ప్రచారం చేశారు.
-హైదరాబాద్ రాజ్యంలో సహకార ఉద్యమానికి బాసటగా నిలవడానికి ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో 1926లో సహకారి పత్రిక వెలువడింది.
-మేడ్చల్ దగ్గర ఉన్న మఖ్తా వడ్డేపల్లి గ్రామం నుంచి బెల్లంకొండ రామానుజాచార్యులు తన సోదరుడైన నరసింహాచార్యునితో కలిసి తన సంపాదకత్వంలో దేశబంధు పత్రికను 1926 నుంచి వెలువరించారు.
-ఇందులో రాజకీయ, ఆర్థిక విషయాలు ప్రచురించినప్పటికీ ధార్మిక, సాహిత్య విషయాలకు అధిక ప్రాధాన్యమిచ్చేవారు.
-తెలంగాణ ప్రజలను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసిన గోల్కొండ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి సంపాదకుడిగా 1926, మే 10న ప్రారంభమైంది. పత్రిక నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణల కోసం ఆయన కృషిచేశారు.
-జాతి, కుల మతాలకు అతీతంగా తెలంగాణ సమాజాభివృద్ధి, సాహిత్య కృషి లక్ష్యాలుగా గోల్కొండ పత్రిక పనిచేసింది. ఇది హైదరాబాద్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరుతూ ఉండేది. ఇక్కడ జరిగే రాజకీయ వ్యవహారాలను, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక విశేషాలను వార్తలుగా, వ్యాఖ్యలుగా ప్రచురించేది.
-దీంతోపాటు గ్రామాలు, తాలూకాలు, జిల్లా కేంద్రాల నుంచి వార్తలు రాసి పంపాలని చదువుకున్న వారిని ప్రోత్సహిస్తూ తెలంగాణలో మొదటిసారిగా విలేకరులను సృష్టించిన ఘనత కూడా ఈ పత్రికకు దక్కుతుంది.
-ఈ పత్రిక మొదటి నుంచి ఉద్యమాలకు అండగా ఉండేది. ఇందులో గ్రంథాలయోద్యమానికి, రాత్రి బడుల ఉద్యమాలకు తగినంత ప్రోత్సాహాన్నిస్తూ వ్యాసాలు, వార్తలు ప్రచురించేవారు.
-తెలంగాణలో కవులే లేరన్న అపవాదుపై స్పందించి తెలంగాణ కవులు రాసిన కవితలతో గోల్కొండ కవుల సంచికను ప్రచురించిన ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి.
-ఈ సంచిక ఆధునిక కాలంలో వెలువడిన మొదటి తెలుగు కవితా సంకలనం. ఈ పత్రిక 1966లో ప్రచురణను నిలిపివేసింది.
-1931లో భాగ్యనగర్ పత్రిక అనే పక్ష పత్రికను భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించారు. ఇది దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడింది.
-దీని ముఖచిత్రంపై చార్మినార్, మక్కామసీదుతోపాటు అజంతా, ఎల్లోరా చిత్రాలు ఉండేవి.
-ఈ పత్రిక ద్వారా అంటరానితనం నిర్మూలన, ఆది హిందువుల అభివృద్ధి, బుద్ధిజం వ్యాప్తిని ప్రోత్సహించాడు. 1937 డిసెంబర్ నుంచి భాగ్యనగర్ పత్రిక పేరును ఆదిహిందూగా మార్చాడు.
-1927లో మందుముల నరసింగరావు సంపాదకత్వంలో రయ్యత్ పేరుతో ఉర్దూ వారపత్రిక ప్రారంభమైంది. దీనిద్వారా ఉత్తర భారతీయులకు హైదరాబాద్ స్టేట్ విషయాలు తెలిసేవి. 1929లో నిజాం ప్రభుత్వ నిషేధానికి గురవడంతో దీన్ని నిలిపివేశారు. 1932లో తిరిగి ప్రారంభమై 20 ఏండ్లు నడిచిన తర్వాత మరోమారు నిషేధానికి గురయ్యింది.
-1927, జనవరిలో హైదరాబాద్ నుంచి సుజాత అనే మాసపత్రిక ప్రారంభమైంది. పసుమాముల నరసింహశర్మ, మాడపాటి హన్మంతరావు, కొండా వెంకటరంగారెడ్డి, అక్కినేపల్లి జానక రామారావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి ప్రముఖుల సహకారంతో ఈ పత్రికను స్థాపించారు.
-దీనికి సుజాత అనే పేరును రాయప్రోలు సుబ్బారావు సూచించారు. ఇందులో వ్యాసాలు, గుడిపాటి వెంకటాచలం వంటివారి రచనలు ప్రచురించేవారు. తెలంగాణకు సంబంధించి ఆదిరాజు వీరభద్రరావు సేకరించిన అనేక శాసనాల వివరాలు ఇందులో ప్రచురించారు. ఇది గోల్కొండ పత్రిక ఆవరణ నుంచే నడిచేది.
-1930-35 మధ్య హనుమకొండ నయీంనగర్ ప్రాంతం నుంచి కంభంపాటి అప్పన్నశాస్త్రి సంపాదకత్వంలో బాలల పత్రిక పూలతోట వెలువడింది. ఇది తెలంగాణ నుంచి వెలువడిన తొలి బాలల పత్రికగా భావిస్తున్నారు.
-దాదాపు ఇదే ప్రాంతంలో సుబ్బరాయ సిద్ధాంతి సంపాదకత్వంలో ఆరోగ్య ప్రచారములు అనే పత్రిక ఉండేది. ఇందులో ఎక్కువగా ఆరోగ్య సంబంధమైన వార్తలుండేవి.
-1931లో కాష్తుకార్ అనే రైతాంగ పత్రిక హైదరాబాద్లోని డబిర్పుర నుంచి ఉర్దూ, తెలుగు భాషల్లో వచ్చేది. ఈ పత్రికకు మహమ్మద్ అబ్దుల్ రజాక్ సా బిస్మిల్ సంపాదకుడు. ఇందులో ప్రధానంగా రైతుల నైతిక, ఆర్థిక, వ్యవసాయాభివృద్ధిపై వ్యాసాలు ప్రచురించేవారు.
-1931లో ఎం అనంతరంగాచార్యులు సంపాదకత్వంలో వైద్యకళ అనే వైద్య సంబంధమైన పత్రిక వెలువడింది. హైదరాబాద్ వైద్య సంఘం దీన్ని ప్రచురించేది.
-ఇందులో ఆరోగ్య సంబంధమైన సమాచారం ప్రచురించేవారు. ముఖ్యంగా వంశపారంపర్యంగా వచ్చే జబ్బుల వివరాలు, చికిత్సా విధానం, మందులు, పరీక్షల వంటి వాటిపై వివరణాత్మక వ్యాసాలుండేవి.
-1933 నుంచి మహబూబ్నగర్ జిల్లా జటప్రోలు సంస్థానంలోని స్నేహలతా కవితా సంఘం వైజయంతి వార్షిక పత్రికను ప్రారంభించింది.
-అడుసుమిల్లి వెంకట దత్తాత్రేయ శర్మ సంపాదకత్వంలో దక్కన్ కేసరి అనే ఆంగ్లాంధ్ర ద్విభాషా పత్రిక 1934, జనవరి నుంచి సికింద్రాబాద్ నుంచి వెలువడింది.
-ఆంధ్ర బాలికల ఉన్నత పాఠశాల తరఫున మాతృభారతి అనే విద్యార్థి మాసపత్రికను ప్రారంభించారు.
-హైదరాబాద్ ప్రభుత్వ సౌజన్యంతో హైదరాబాద్ ఫార్మంగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఫార్మర్ అనే పత్రిక 1935 డిసెంబర్లో ప్రారంభమైంది. దీన్ని గోల్కొండ ముద్రాక్షరశాలలోనే ముద్రించేవారు.
-ఇందులో నిజాం రాష్ట్రంలో వ్యవసాయ సమస్యలు, ప్లేగు, విపరీతమైన చలి వల్ల పంటలకు కలిగే నష్టం, వ్యవసాయ శాఖలో ఉద్యోగ నియామకాలు, ఆనాటి వ్యవసాయ శాఖ కార్యకలాపాల సమాచారాన్ని రైతులకు సులభమైన రీతిలో అందించేది.
-1935-36 ప్రాంతాల్లో మద్యపాన నిషేధ ప్రచారం కోసం తెలుగు, ఉర్దూ భాషల్లో మద్యపాన నిరోధక పత్రికను ప్రారంభించారు.
-ఇందులో మౌల్వీలు, ముస్లిం, తెలుగు పండితులు, సంఘ సంస్కర్తలు, ఉస్మానియా విశ్వవిద్యాలయ లెక్చరర్లు మద్యపాన నిషేధంపై చేసిన రచనలను ప్రచురించేవారు.
-1936లో 1936 పేరుతో సికింద్రాబాద్ నుంచి ఒక మాసపత్రిక ప్రారంభమైంది. మూడు సంచికల తర్వాత ఇది మూతపడింది. ఈ పత్రిక స్థాపకులు, సంపాదకుల వంటి వివరాలు లేనప్పటికీ ఇందులో నవ్యాంధ్ర సాహిత్య వీధుల రచయిత కరుగంటి సీతారామ భట్టాచార్యుల కథలు అచ్చయ్యాయి. అందులో నారత్నం అనే కథ ఒకటి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు