Immigrant victory over Britain | బ్రిటన్‌పై వలసకారుల విజయం
మొదటి కాంటినెంటల్ సమావేశం
ఓహియో నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలపై వలసవాసుల హక్కులను రద్దుచేస్తూ కెనడా వలసలో నిరంకుశ వ్యవస్థ ను ఏర్పర్చి, క్యాథలిక్‌లకు విశిష్ఠ స్థానం ఇస్తూ శాసనం చేశారు బ్రిటిష్ వారు. అంతేగాక బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేయలేని రాజకీయ, చట్టబద్ధమైన హక్కులనేవి ఏమీ వలసలకు లేవని ఈ శాసనాలు స్పష్టంగా ప్రకటించాయి. దాంతో సంఘర్షణ అనివార్యమైంది. వర్జీనియా రాష్ట్రసభ వలసలన్నింటి ప్రతినిధులతో మహాసభ జరుపాలని నిర్ణయించి, అలాంటి మహాసభలో చట్టసభలు, వలసవాసుల సంఘాలతో, బహిరంగ సమావేశ వేదికల నుంచి ఎంపికచేసిన 56 మంది ప్రతినిధులు పాల్గొనాలని నిర్ణయించింది.
ఫిలడెల్ఫియా మహాసభ 1774, సెప్టెంబర్ 5న జరిగింది. ఈ మహాసభలో పాల్గొన్న ప్రతినిధులతో తీవ్రవాదులైన శామ్ ఆడమ్స్, జాన్ ఆడమ్స్, పాట్రిక్ హెన్రీ తదితరులు రక్తపాతంతోనైనా బ్రిటిష్ వారి అన్యాయాలను ఎదుర్కోవాలని వాదించారు. మితవాదులైన జాన్డికిన్సన్ తదితరులు శాంతియుతమైన సంప్రదింపుల ద్వారా మాతృదేశంతో తమకు ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలన్నారు.
తీవ్రవాదుల మాట నెగ్గడంతో వారొక హక్కుల పత్రాన్ని తయారుచేసి బ్రిటన్‌కు పంపించారు. ఆ పత్రంలో వలసల స్వాతంత్య్రానికి భంగం కలిగించే శాసనాలు బ్రిటన్ చేయరాదని, ప్రాతినిధ్యం లేకుండా పార్లమెంట్ పన్ను విధించరాదని, పాలనా సంబంధమైన శాసనాలను వలసల చట్టసభలే రూపొందించాలని తమ నిర్ణయాలను తెలిపారు. కాంకర్డ్ పట్టణంలో ఆయుధ సామగ్రి తయారుచేసే కర్మాగారాన్ని నెలకొల్పారు. ఈ కర్మాగారాన్ని స్వాధీనం చేసుకోవాలని, శామ్యూల్ ఆడమ్స్‌ను నిర్బంధంలోకి తీసుకోవాలని జనరల్ గేజ్ బ్రిటిష్ సైన్యంతో బోస్టన్ నుంచి బయల్దేరాడు.
దారిలో లెక్సింగ్టన్ వద్ద అటకాయించిన వలసకారులపై కాల్పులు జరిపి, కాంకర్డ్కు వెళ్లి అక్కడ మందుగుండు సామగ్రిని ధ్వంసం చేసి తిరిగి వస్తుండగా వలసకారులు చాటుమాటుగా దాడులు చేశారు. బోస్టన్ చేరేసరికి బ్రిటిష్ సైన్యాన్ని న్యూఇంగ్లండ్ వలస సైన్యం చుట్టుముట్టింది. వలసకారులు 1775, మే 10న ఫిలడెల్ఫియాలో రెండో మహాసభను నిర్వహించారు. మసాచుసెట్స్ వలసలకు జాతీయ సైన్యాన్ని తయారుచేయడానికి నిర్ణయించారు. వలసలో శాంతి నెలకొల్పాల్సిందిగా జార్జి చక్రవర్తిని కోరారు. 1775లో అమెరికన్ సైన్యాలు మోహరించి ఉన్న బంకర్ హిల్‌ను స్వాధీనం చేసుకోవడానికి యత్నించిన బ్రిటిష్ సేనాని హోవ్ మూడోవంతు సైన్యాన్ని నష్టపోయాడు. నారఫక్, వర్జీనియా, చార్లెస్టన్, దక్షిణ కరోలినాలో కూడా బ్రిటిష్ సైన్యాలకు పరాజయం ఎదురైంది.
అమెరికా స్వాతంత్య్ర ప్రకటన
1776 జూన్‌లో ఫిలడెల్ఫియా సభ ఎంపిక చేసిన ఐదుగురు సభ్యులతో కలిసి స్వాతంత్య్ర తీర్మాన పత్రాన్ని రూపొందించే పనిని థామస్ జెఫర్సన్‌కు అప్పగించారు. 1776, జూలై 4న వలస ప్రజలు ఒక జాతిగా, ఐక్యదేశంగా ఏర్పడాలని ప్రకటిస్తూ జార్జి నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ వలసల రాజకీయ విశ్వాసాలను ఉద్ఘాటిస్తూ తీర్మానం చేశారు. స్వాతంత్య్ర ప్రకటన తీర్మానంలో ప్రతి వ్యక్తికీ జీవించే హక్కు, స్వేచ్ఛ, సుఖాన్వేషణ హక్కు, సమానత్వం జన్మతః సిద్ధిస్తాయని అవి సహజమైన, అనన్య సంక్రామిక హక్కులని ఉద్ఘాటించారు.
ఇంగ్లండ్‌లో జన్మించి అమెరికాకు వలస వచ్చిన థామస్ పెయిన్ 1776 జనవరిలో కామన్ సెన్స్ అనే కరపత్రాన్ని ప్రచురించాడు. అందులో బ్రిటిష్ వారికంటే వలసకారులు తమను తాము చక్కగా పరిపాలించుకోగలరని, యూరోపియన్ నేపథ్యం నుంచి రూపొందిన నిరంకుశమైన పాలన నుంచి బయటపడి ఒక స్వేచ్ఛా సమాజంగా అవతరించేందుకు వలస పౌరులకు సువర్ణావకాశం వచ్చిందని, బ్రిటిష్ వారితో ఉన్న చిట్టచివరి అనుబంధాన్ని కూడా వలస ప్రజలు తెంచుకోవాలని పిలుపునిచ్చారు థామస్ పెయిన్. ఈ కరపత్రం సుమారు 1,20,000 ప్రతులు ప్రచురితమైంది.
అమెరికా స్వాతంత్య్ర యుద్ధం ప్రధాన ఘట్టాలు
-బోస్టన్‌లో ఓడిపోయిన హోవ్సేనాని లాంగ్ ఐలాండ్‌లో వాషింగ్టన్‌ని ఓడించి, దక్షిణ పెన్సిల్వేనియాలోకి తరిమేసి న్యూయార్క్‌ని ఆక్రమించాడు.
-వాషింగ్టన్ డిలావేర్ తోపుడు పడవలతో నదిని దాటి ట్రెంటన్‌లో బ్రిటన్ పక్షంలో యుద్ధానికి వచ్చిన జర్మన్ కిరాయి సైనికులను ఓడించి, ప్రిన్స్టన్ పోరాటంలో కూడా విజయాన్ని సాధించాడు.
-బర్గోయిన్ సేనాని, హోవ్సేనాని, లీజర్ సేనాని తమ తమ సైన్యాలతో ఒకేసారి న్యూయార్క్‌ను ముట్టడించే పథకాన్ని బ్రిటిష్ వారు రూపొందించారు. కానీ, సెంట్లీజర్ సేనానిని ఓరిస్కని వద్ద, బర్గోయిన్ సేనానిని సారటోగా వద్ద వలస సైన్యం ఓడించడంతో పథకం విఫలమైంది.
-సారటోగా విజయంతో ఫ్రాన్స్ వలస ప్రజలకు సహాయం చేస్తూ ఒప్పందం చేసుకున్నది. తర్వాత స్పెయిన్, హాలెండ్ దేశాలు కూడా నౌకాదళాలు పంపి సహాయపడ్డాయి.
-కొంతమంది ఫ్రెంచ్ పౌరులు వలస ప్రజలకు తోడుగా యుద్ధంలో పాల్గొనడానికి అమెరికా చేరారు. వారిలో లఫాయతే కూడా ఉన్నాడు.
-ఫిలడెల్ఫియాపై ఫ్రెంచ్ నౌకాదళం దాడి చేస్తుందని తెలిసి బ్రిటిష్ సైన్యం అక్కడి నుంచి తరలిపోయింది. యుద్ధం దక్షిణ, పశ్చిమ ప్రాంతాలకు మారింది (1778).
-దక్షిణ రాష్ర్టాలైన జార్జియా, కరోలినాలలోని విధేయతావాదులు తమకు అండగా ఉంటారని భావించిన బ్రిటిష్‌వారు యుద్ధాన్ని దక్షిణానికి మళ్లించారు. ఆ వలసలలో చాలా ప్రాంతాలు వారివశమయ్యాయి.
-దక్షిణ కరోలినాలోని కామ్డెన్లో బ్రిటిష్ సేనాని కారన్‌వాలీస్ వలస సైన్యాధిపతి గేట్స్‌పై విజయం సాధించాడు. గానీ, ఉత్తర కరోలినాలోని కింగ్స్మౌంటెన్ వద్ద వలస ప్రజల దళం ఒకటి హఠాత్తుగా దాడిచేసి కారన్ వాలీస్ సేనను ఓడించింది. తర్వాత కౌపిన్స్ వద్ద వలసలు విజయం సాధించాయి.
-వలసల సేనాని నాథనియల్ గ్రీన్, కారన్వాలీస్తో గిల్ఫల్డ్ కోర్టు దగ్గర పోరాటం జరిగింది. బ్రిటిష్ వారికి బాగా నష్టం కలిగింది. గ్రీన్ సేనాని దక్షిణ రాష్ర్టాలలోని చాలా ప్రాంతాలను తిరిగి వశం చేసుకోగలిగాడు. బ్రిటిష్ సైన్యాలు తిరిగి ఉత్తర దిశగా తరలాయి.
-1781లో వర్జీనియా ఆగ్నేయ దిక్కున గల మార్క్టౌన్లో వాషింగ్టన్ నాయకత్వంలోని వలస సైన్యం రోఫాంబో నాయకత్వంలోని ఫ్రెంచి సైనిక దళం కలిసి కారన్‌వాలీస్ సేనను పూర్తిగా పరాజయం పాలుజేశాయి.
-మార్క్టౌన్ యుద్ధం బ్రిటిష్ పౌరులలో అసంతృప్తిని కలిగించింది. పరిస్థితి విషమించిందని గ్రహించిన ప్రధాని నార్త్ ప్రభువు పదవి నుంచి తప్పుకున్నాడు. తర్వాత ప్రధాని అయిన రాకింగ్ హోమ్ శాంతి సంప్రదింపులు ప్రారంభించాడు.
పారిస్ శాంతి సంధి 1783
-పారిస్ శాంతి సంధి సంపదింపులలో అమెరికన్ వలసల పక్షాన బెంజిమన్ ఫ్రాంక్లిన్, జాన్ ఆడమ్స్, జాన్ జే పాల్గొన్నారు. ఈ సంధితో బ్రిటన్ 13 వలసలతో ఏర్పడిన స్వాతంత్య్ర, సర్వసత్తాక దేశంగా అమెరికా దేశాన్ని గుర్తించింది. ఉత్తరాన కెనడా, తూర్పున అట్లాంటిక్ సముద్రం, దక్షిణాన ఫ్లోరిడా, పశ్చిమాన మిసిసిపీలు అమెరికా సరిహద్దులుగా గుర్తించారు.
-న్యూఫౌండ్లాండ్లో చేపలు పట్టే హక్కు, మిసిసిపీ జలాల్లో నౌకాయాన హక్కు అమెరికా పొందింది.
-బ్రిటిష్ వర్తకులకు అమెరికన్ వలస వర్తకుల నుంచి రావాల్సిన రుణాలు, యుద్ధకాలంలో బ్రిటిష్ వారిపై విధేయత ప్రటించిన వారి ఆస్తుల గురించి తిరిగి ఇప్పించే హామీలను బ్రిటన్ కోరింది. కానీ, ఇవి ఆయా రాష్ర్టాలకు చెందిన సమస్యలుగా భావించారు. (తర్వాత ఫెడరల్ ప్రభుత్వమే బ్రిటిష్ వర్తకులకు రావాల్సిన రుణాన్ని చెల్లించింది. విధేయుల సమస్యను బ్రిటన్ పరిష్కరించుకోవాల్సి వచ్చింది.)
-యుద్ధంలో అమెరికన్ వలసలకు ధన, సైనిక సహాయం చేసిన ఫ్రాన్స్ టొబాగో, సెనెగల్ వలసను పొందింది.
-మైనార్కా, ఫ్లోరిడాలను స్పెయిన్‌కు ఇచ్చారు.
ఫ్రెంచ్ విప్లవం (1789- 1815)
-ఫ్రెంచ్ విప్లవం హఠాత్తుగా సంభవించిన సంఘటన కాదు. విప్లవం సంభవించడానికి ముందు దాదాపు అర్ధ శతాబ్దంగా ఫ్రాన్స్ అనేక రంగాలలో అసంతృప్తిని, అశాంతిని ఎదుర్కొంటూ విప్లవం వైపు కదులుతూ వచ్చింది. ఫ్రెంచ్ విప్లవం సంభవించడానికి ఆ దేశంలో నెలకొన్న రాజకీయ, సాంఘిక, వైజ్ఞానిక, ఆర్థిక కారణాలు దోహదం చేశాయి.
-రాజకీయ కారణాలు: 17వ శతాబ్ది ఆరంభం నుంచి విప్లవం సంభవించే వరకు ఫ్రాన్స్‌ను బూర్బన్ రాజవంశం పరిపాలించింది. బూర్బన్ల పాలన నిరంకుశత్వానికి, అవినీతికి, దుబారాకు, భోగలాలసకు నెలవైంది. ఆరంభం నుంచి నిరంకుశంగానే సాగిన బూర్బన్ల పాలన 14వ లూయీ (1643-1715) కాలంలో పరాకాష్ఠకు చేరింది. 14వ లూయీ దీర్ఘకాలం పరిపాలించి అనేక సైనిక విజయాలను సాధించి యూరప్‌లో ఫ్రెంచ్ ప్రతిష్ఠను ఇనుమడింపజేశాడు.
పారిస్‌కు 12 మైళ్ల దూరంలో వర్సే రాజప్రసాదాన్ని నిర్మించాడు. రాజ్యాధికారం కేంద్రీకృతమైందనడానికి నిదర్శనంగా లూయీ నేనే రాజ్యాన్ని అని అన్నాడు. 30 ఏండ్లపాటు సాగిన యుద్ధాలు, వైభవోపేతమైన జీవితంవల్ల ప్రభుత్వ ఖజనాలో ధనమంతా ఖర్చయిపోయి చివరికి లూయీ అంత్యక్రియలకు కావాల్సిన డబ్బు కూడా లేకుండా పోయింది. తనలా యుద్ధంపై ఆసక్తి చూపొద్దని, ప్రజా సంక్షేమంపై దృష్టిసారించాలని 14వ లూయీ మరణశయ్యపైన తన వారసుడికి తెలిపాడు.
-14వ లూయీ తర్వాత ఫ్రాన్స్ చక్రవర్తి అయిన 15వ లూయీ (1715-1774) సాగించిన సుదీర్ఘ పాలన కూడా యుద్ధాలతో రక్తసిక్తమైపోయింది. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం, సప్తవర్ష సంగ్రామాల్లో పాల్గొన్న 15వ లూయీ దేశాన్ని మరిన్ని ఆర్థిక సమస్యల్లోకి నెట్టాడు. స్త్రీలపై వ్యామోహంతో రాజ్య వ్యవస్థను తన ఉంపుడుకత్తెలైన మేడమ్ డీ పాంపోసిర్, మేడమ్ డూబారీ వంటివారి చేతుల్లో పెట్టాడు. పన్నుల భారం పెరగడంతో ప్రజలకు రాజు మీద ద్వేషభావం ఏర్పడింది. ఫలితంగా 15వ లూయీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పర్యటించడానికి భయపడేవాడు.
రైతులు, చేతివృత్తుల వారు వెక్కిరించేవాళ్లు. వారంతా తనను ద్వేషిస్తున్నారని 15వ లూయీ గుర్తించాడు. వారి ప్రవర్తనతో ఫ్రాన్స్‌ను కమ్ముకున్న విప్లవ మేఘాలను గమనించిన లూయీ తరుచూ నా తరువాత ప్రళయం వస్తుంది అని అనేవాడు. ఆ మాటలే అతని వారసుడైన 16వ లూయీ కాలంలో నిజమయ్యాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?