1935 భారతప్రభుత్వ చట్టం ప్రాముఖ్యత ఏంటి?
1929 డిసెంబర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని తీర్మానించింది. ఈ లక్ష్య సాధనకు గాంధీజీ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ 1930లో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా నూతన సంస్కరణలను రూపొందించడానికి లండన్‌లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశంలో వచ్చిన సూచనలు 1933లో ఒక శ్వేతపత్రంగా వెలువడ్డాయి. దీని ప్రాతిపదికగా తయారైన భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ 1935లో ఆమోదించింది.
చట్టం ముఖ్యాంశాలు
-ఇండియా కౌన్సిల్ రద్దు- దాని స్థానంలో ఒక సలహా సంఘం ఏర్పాటు
-కేంద్ర ప్రభుత్వంలో ద్వంద్వ పాలన
-కేంద్రం అఖిలభారత సమాఖ్యగా ఏర్పడటం (అధికార పంపిణీ, ఫెడరల్ శాసనసభ, ఫెడరల్ కోర్టు)
-రాష్ట్రంలో ద్వంద్వ ప్రభుత్వం రద్దు- దాని స్థానంలో సంపూర్ణ స్వేచ్ఛ లేక బాధ్యతాయుత ప్రభుత్వం
-కొన్ని రాష్ర్టాల్లో శాసనశాఖల్లో ద్విసభా విధానం ప్రవేశపెట్టడం
లోపాలు
-ఈ చట్టం రూపొందించిన అఖిలభారత సమాఖ్యలో అనేక లోపాలున్నాయి. ఇది అన్ని దుర్గుణాలు కలిగిన సమాఖ్య అని సీవై చింతామణి వర్ణించారు.
-ఎందుకంటే ఇందులో కార్యనిర్వాహక శాఖ రాజ్యాంగం కంటే బలమైనదిగా ఉంది. రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఫెడరల్ శాసనసభకు లేదు. పైగా ఫెడరల్ శాసనసభల్లో ప్రజల నిష్పత్తిని తీసుకుంటే స్వదేశీ సంస్థానాలకు కేటాయించిన స్థానాలు బ్రిటిష్ ఇండియా స్థానాలకంటే ఎక్కువ.
-స్వదేశీ రాజులు సమాఖ్యలో చేరడానికి అంగీకరించకపోవడంతో ఈ అఖిలభారత సమాఖ్య ఏర్పడలేదు. అందువల్ల చట్టంలోని సమాఖ్య రాజ్యాంగం అమల్లోకి రాలేదు.
-1919 భారత ప్రభుత్వ చట్టంలో రాష్ట్రం ద్వంద్వ ప్రభుత్వంలా, 1935 చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడిన ద్వంద్వ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైంది.
-గవర్నర్ జనరల్‌కు ఇచ్చిన విస్తృత అధికారం వల్ల కేంద్ర మంత్రిమండలి గానీ, కేంద్ర శాసనసభలు గానీ సమర్థవంతంగా పనిచేయలేదు. ఇతడు సర్వాధికారి, నియంత.
-ఇన్ని లోపాలుండటంవల్ల అన్ని వర్గాలవారు ఈ చట్టాన్ని నిరాకరించారు. ఇది పూర్తిగా కలుషితమైనదని, ఈ చట్టం ఇంజను లేని యంత్రాంగాన్ని ప్రసాదించిందని నెహ్రూ వర్ణించారు.
చట్టం ప్రాముఖ్యత
-ఈ చట్టంలో లోపాలున్నప్పటికీ రాజ్యాంగ చరిత్రలో దీనికి ఒక విశిష్ట స్థానం ఉంది. భారత రాజ్యాంగానికి ముఖ్య ప్రాతిపదిక 1935 చట్టం.
-సమాఖ్య రాజ్యాంగానికి మొదటిసారిగా రూపకల్పన చేసింది 1935 చట్టమే. అందుకే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వదేశీ సంస్థానాల విలీనీకరణకు ఇది వీలు కల్పించింది.
ముఖ్యమైన రైతు, కార్మిక ఉద్యమాలు
-దేశంలో స్వాతంత్య్రోద్యమం జరుగుతున్న కాలంలో 20వ శతాబ్ది రెండు, మూడో దశకాల్లో రైతు ఉద్యమాలు జరిగాయి. 1856లో అయోధ్య సంస్థానం బ్రిటిష్ వారి ఆధిపత్యంలోకి వెళ్లిన తర్వాత తాలూక్దార్లుగా వ్యవహరించిన జమీందార్ల ప్రాబల్యం అధికమైంది. వారు రైతుల నుంచి వసూలుచేసే పన్నులు విపరీతంగా పెంచి అక్రమ పన్నులు కూడా విధించేవారు. కౌలు ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పుడల్లా బలవంతపు కానుకలను రాబట్టారు. తమ ఇష్టమొచ్చినట్లు రైతులను వ్యవసాయ క్షేత్రాల నుంచి తొలిగించారు. వీటితోపాటు ప్రపంచ యుద్ధ ప్రభావంవల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి రైతుల జీవనం దుర్భరంగా మారింది.
కిసాన్ సభ
-1918లో గౌరీశంకర్ మిశ్రా, ఇంద్రనారాయణ్ ద్వివేదీలు కిసాన్ సభను ఏర్పాటుచేశారు.
-అనతికాలంలోనే ఇది 450 శాఖలను నెలకొల్పుకునేంతగా విస్తరించింది. కిసాన్ సభ ప్రతినిధులు భారత జాతీయ కాంగ్రెస్ సభల్లో పాల్గొన్నారు.
-అయోధ్య తాలూక్దారీ గ్రామాల్లో కిసాన్ సభ సమావేశాలు తరచూ జరిగాయి.
-బాబా రామచంద్ర అనే వ్యక్తి రైతు ఉద్యమాలకు ప్రధాన కేంద్రంగా నిలిచాడు.
-మహారాష్ట్రలో జన్మించిన ఇతను చిన్నతనంలోనే ఇల్లు వదిలి దేశ దిమ్మరిగా జీవిస్తూ ఫిజీ ద్వీపానికి కాంట్రాక్ట్ కూలీగా వెళ్లివచ్చి 1909లో ఫైజాబాద్‌కు చేరాడు.
-తులసీదాస్ రామచరిత మానస్ నుంచి పద్యాలను పఠిస్తూ సాధువులా జీవిస్తూ రైతుల ఆదరాభిమానాలు పొందాడు.
-1920లో ఔన్‌పూర్, ప్రతాప్‌గఢ్ జిల్లాల రైతులు సుమారు 100 మందితో కలిసి అలహాబాద్‌లో గౌరీశంకర్ మిశ్రా, నెహ్రూలను కలిశారు. ఈ సందర్భంగా రైతులు నివసిస్తున్న గ్రామాలకు వచ్చి వారి జీవన పరిస్థితులను పరిశీలించాలని కోరారు.
-అదేకాలంలో ప్రతాప్‌గఢ్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న మెహతా రైతు సమస్యలను పరిశీలించడానికి సుముఖత చూపాడు.
-రూల్ గ్రామం కిసాన్‌సభ రైతుల సమస్యలను నమోదు చేసింది. సుమారు లక్షమంది రైతులు ఒక అణా చొప్పున చెల్లించి తమ సమస్యలను నమోదు చేయించుకున్నారు. చాలావరకు ఈ సమస్యలు బేద్ఖలీలకు సంబంధించినవే.
-ఒకవైపు సహాయ నిరాకరణోద్యమాలు మొదలుకాగా, మరోవైపు మదన్ మోహన్ మాలవీయ వంటి నేతలు రాజ్యాంగబద్ధ ఆందోళన కార్యక్రమానికే బద్దులమని ప్రకటించారు. స్వాతంత్య్రోద్యమంలోని ఈ అభిప్రాయ భేదాలు కిసాన్ సభలపైకూడా ప్రభావం చూపాయి. సహాయ నిరాకరణ ఉద్యమ వాదులు అయోధ్య కిసాన్ సభను ఏర్పర్చుకున్నారు. ఇది అట్టడుగు స్థాయి కిసాన్ సభలన్నింటినీ తన సారథ్యం కింద సంఘటితపరిచింది. నెహ్రూ, గౌరీశంకర్ మిశ్రా, బాబా రామచంద్ర వంటి ప్రముఖులు దీన్ని ప్రోత్సహించారు.
అయోధ్య కిసాన్ సభ అక్రమంగా రైతులను తొలిగించిన క్షేత్రాన్ని (బేద్ఖలీ) సాగుచేయవద్దని, వెట్టిచాకిరీలు (బేగార్, హఠీ) చేయొద్దని, తమ వివాదాలను పంచాయత్ ద్వారా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. 1920, డిసెంబర్ 20, 21 తేదీల్లో అయోధ్యలో జరిగిన ప్రదర్శనలో కిసాన్ సభ సంఖ్యాబలం ప్రస్ఫుటమైంది. దాదాపు లక్షమంది రైతులు ఇందులో పాల్గొన్నారు. రైతుల దుస్థితికి ప్రతీకగా బాబా రామచంద్ర తాళ్లతో కట్టుబడి కనిపించారు.
అయోధ్య కౌలు శాసనాలు
-1921 నాటికి రాయ్‌బరేలీ, ఫైజాబాద్‌లో ధాన్యాగారాలు, ఇండ్లపై, బజారుల్లో లూటీలు జరిగాయి.
-వీటికి కిసాన్ సభ కార్యకర్తలే కాకుండా సాధువులు, సంత్లు, భూమి కోల్పోయినవారు నాయకత్వం వహించారు. అయితే ఈ అలజడులను ప్రభుత్వం అణచివేసింది.
-ప్రభుత్వం చేసిన అయోధ్య కౌలు శాసనంవల్ల రైతులకు ఉపశమనం కలుగలేదు. క్రమేణా ఉద్యమం సన్నగిల్లింది.
-కొద్ది నెలలకు హరిదోయ్, బహ్రైచ్, సితాపూర్ జిల్లాల్లోని రైతులు పన్ను వసూలుచేసే రౌకీదార్ల పీడనకు గురయ్యారు. వీరు కాంగ్రెస్, ఖిలాఫత్ కార్యకర్తలు ఇచ్చిన మద్దతుతో ఏకా ఉద్యమం మొదలైంది.
-వాస్తవంగా విధించిన పన్ను మాత్రమే చెల్లిస్తామనీ, క్షేత్రం నుంచి తొలిగించినా వదిలిపోమని, వెట్టి చాకిరీలు చేయడం, నేరస్తులకు సాయపడటం వంటివి చేయమని, వివాద సందర్భాల్లో పంచాయితీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు.
-ఏకా ఉద్యమం క్రమంగా అహింసా సిద్ధాంతాన్ని పాటించనివారి చేతుల్లోకి పోయింది. 1922, మార్చి నాటికి ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు