బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏం చెప్పింది?
అశోక్ మెహతా కమిటీ 1977
దంత్వాలా కమిటీ- 1978
సీహెచ్ హనుమంతరావు కమిటీ- 1984
జీవీకే రావు కమిటీ- 1985
ఎల్ఎం సింఘ్వీ కమిటీ- 1986
తుంగన్ కమిటీ- 1988
బల్వంతరాయ్ మెహతా కమిటీ- 1957
అశోక్ మెహతా కమిటీ తన నివేదికలో స్థానిక స్వపరిపాలన సంస్థలు విఫలమైన భగవంతుడేమీ కాదని వాటికి సరైన ప్రాధాన్యతను, అధికారాలను, నిధులను సమకూర్చినట్లయితే అవి విజయవంతంగా పనిచేస్తాయని పేర్కొన్నది.
– రాజకీయంగా ప్రజాస్వామ్య భావాలు బలపడటానికి, ఆర్థికంగా అభివృద్ధిపై దృష్టిసారించడానికి, సామాజికంగా నూతన నాయకత్వ భావం ఆవిర్భవించడానికి, పరిపాలనాపరంగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా స్థానిక స్వపరిపాలన సంస్థలు అవతరించాయని అశోక్ మెహతా కమిటీ తన నివేదికలో పేర్కొన్నది.
– జనతాప్రభుత్వం పతనంతో ఈ కమిటీ సిఫారసులపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ఈ కమిటీ చేసిన సిఫారసులలో కొన్నింటిని అమలుపరిచాయి.
– అశోక్ మెహతా సూచనల అనంతరం దేశంలోని అనేక రాష్ర్టాలు స్థానిక సంస్థలను పటిష్టపర్చడానికి నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాయి. అందువల్ల 1978 తరువాతి దశను పునర్జీవన దశగా పేర్కొంటారు.
– మండల పరిషత్‌ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం కర్ణాటక.
– 1985, అక్టోబర్ 2న రామకృష్ణ హెగ్డే ఈ వ్యవస్థను ప్రారంభించారు.
– మండల పరిషత్‌ను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం- ఆంధ్రప్రదేశ్
– 1986, జనవరి 13న ఎన్టీ రామారావు దీన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ మండలాలను మాత్రం 1985లోనే ప్రారంభించారు.
దంత్వాలా కమిటీ- 1978
– బ్లాక్ స్థాయిలో ప్రణాళికీకరణపై ఒక నివేదికను సమర్పించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
– 1978లో కమిటీ తన నివేదికను సమర్పించింది.
కమిటీ సిఫారసులు
1. గ్రామపంచాయతీల సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని సూచించింది.
2. జిల్లా స్థాయిలో ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి.
3. జిల్లా ప్రణాళిక వికేంద్రీకరణలో జిల్లా కలెక్టర్ ప్రధాన పాత్ర పోషించాలి.
4. ప్రణాళిక వికేంద్రీకరణలో భాగంగా బ్లాక్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని ప్రణాళికా రచనలు చేయాలి.
సీహెచ్ హనుమంతరావు కమిటీ- 1984
– 1984లో జిల్లా ప్రణాళికలపై ఒక నివేదికను సమర్పించడానికి సీహెచ్ హనుమంతరావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సిఫారసులు..
1. జిల్లా ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయాలి.
2. ప్రత్యేక జిల్లా ప్రణాళికా సంఘాన్ని జిల్లా కలెక్టర్ లేదా ఒక మంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేయాలి.
3. జిల్లాస్థాయిలోని అన్ని అభివృద్ధి, ప్రణాళిక కార్యకలాపాల్లో జిల్లా కలెక్టర్ సమన్వయకర్తగా పనిచేయాలి.
జీవీకే రావు కమిటీ- 1985
– గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పాలనాపరమైన ఏర్పాట్ల కోసం 1985లో ప్రణాళిక సంఘం జీవీకే రావు అధ్యక్షతన కమిటీని నియమించింది.
– దేశంలో ప్రభుత్వ పాలన మొత్తం క్రమంగా ఉద్యోగిస్వామ్యంగా మారింది. ఇది పంచాయతీరాజ్ స్ఫూర్తిని బలహీనపరిచింది. తద్వారా ప్రజాస్వామ్య వేర్లుగా కొనసాగాల్సిన పంచాయతీరాజ్ వ్యవస్థ వేర్లులేని వ్యవస్థ (నాట్ గ్రాస్ రూట్స్ డెమొక్రసీ, ఇటీజ్ ఏ గ్రాస్ వితవుట్ రూట్స్)గా మారిందని తీవ్రంగా ఆక్షేపించారు.
– కమిటీ సిఫారసులు
1. ప్రణాళిక విధాన రూపకల్పన అమలుకు జిల్లా ప్రధాన యూనిట్‌గా ఉండాలి.
2. బీడీవో అనే పదవిని రద్దు చేయాలి.
3. జిల్లా అభివృద్ధి అధికారి అనే పదవిని ఏర్పాటు చేయాలి. ఇతడు జిల్లా పరిషత్‌కు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తాడు.
4. క్రమం ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలను నిర్వహించాలి.
5. రాష్ట్రస్థాయిలో ఉన్న కొన్ని ప్రణాళిక విధులను జిల్లాస్థాయి ప్రణాళికకు మార్చాలి.
ఎల్ఎం సింఘ్వీ కమిటీ- 1986
– ప్రజాస్వామ్యం, ఆర్థికాభివృద్ధిలో పంచాయతీరాజ్ సంస్థల పాత్ర అనే అంశంపై అధ్యయనానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ఈ కమిటీని నియమించింది.
– 1987లో సింఘ్వీ కమిటీ నివేదికను సమర్పించింది. కింది సిఫారసులను చేసింది.
1. పంచాయతీరాజ్ సంస్థల (స్థానిక స్వపరిపాలన సంస్థలు)ను రాజ్యాంగబద్ధం చేయాలి.
2. గ్రామీణ న్యాయాలయాలను ఏర్పాటుచేయాలి.
3. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేయాలి.
4. గ్రామీణ పరిపాలనలో గ్రామసభలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
5. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి.
6. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి జ్యుడీషియల్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి.
తుంగన్ కమిటీ- 1988
– పంచాయతీరాజ్ వ్యవస్థకు స్వయంపోషకత్వం కల్పించి వర్తించే వ్యవస్థను అందించాలనే సర్కారియా కమిషన్ సిఫారసు చేసింది. దీనిపై 1988లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పీకే తుంగన్ నేతృత్వంలో ఒక మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
– స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలి. జిల్లాస్థాయిలో, జిల్లాపరిషత్ ప్రణాళికను అభివృద్ధి ఏజెన్సీగా పరిగణించాలని సిఫారసు చేసింది.
– ఎల్ఎం సింఘ్వీ కమిటీ సూచనల ఆధారంగా తుంగన్ కమిటీ సూచనలను పరిగణించి, రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లుల్ని రూపొందించింది. 64వ సవరణ బిల్లు పంచాయతీరాజ్ సంస్థలకు, 65వ సవరణ బిల్లు పట్టణ, నగరపాలక సంస్థలకు సంబంధించింది.
– 1989లో 64వ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగా లోక్‌సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరించడంతో వీగిపోయింది.
– 65వ సవరణ బిల్లు లోక్‌సభ పరిశీలనలో ఉండగానే సభ రద్దుతో బిల్లు కూడా రద్దయింది.
– 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం ఈ బిల్లును సవరించి పార్లమెంటులో ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ ప్రభుత్వం అర్ధంతరంగా పడిపోవడంతో వీలుకాలేదు.
– 1992లో పీవీ ప్రభుత్వం 64వ సవరణ బిల్లును పునరుద్ధరించి అనేక మార్పులతో 73వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది.
– 73వ సవరణ ద్వారా రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ చేర్చబడింది.
– పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు.
– ఈ రాజ్యాంగ సవరణ 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.
– 65వ సవరణ బిల్లును సవరించి నగరపాలిత బిల్లు పేరుతో 74వ సవరణగా 1992లో పార్లమెంటు ఆమోదించి, 12వ షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చారు.
– పై రెండు సవరణలు 73, 74లను భారత్‌లోని 17 రాష్ర్టాలు ఆమోదించాయి.
బల్వంతరాయ్ మెహతా కమిటీ
– సమాజాభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ పథకాలు ఆశించిన లక్ష్యాలను సాధించాయా లేదా అరి అధ్యయనం చేయడానికి ప్రణాళికా సంఘం నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బల్వంతరాయ్ మెహతా అధ్యక్షతన 1957, జనవరి 16న కమిటీని ఏర్పాటు చేసింది.
– దేశంలో ఈ కమిటీని మొట్టమొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీగా అభివర్ణిస్తారు.
– కమిటీ తన సిఫారసులను 1957, నవంబర్ 24న జాతీయ అభివృద్ధి మండలికి సమర్పించింది.
– జాతీయ అభివృద్ధి మండలి బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫారసులను 1958 జూన్‌లో ఆమోదించింది.
కమిటీ సిఫారసులు
1. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి.
2. కింది స్థాయిలో గ్రామపంచాయతీ
3. మధ్య స్థాయిలో (బ్లాక్ స్థాయి) పంచాయతీ సమితి
4. పై స్థాయిలో (జిల్లా స్థాయిలో) జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాలి.
5. గ్రామ స్థాయిలో ఎన్నికలు ప్రత్యక్షంగా, సమితి, జిల్లాస్థాయిల్లో పరోక్ష ఎన్నికలు నిర్వహించాలి.
6. జిల్లా పరిషత్‌కు జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా వ్యవహరించాలి.
7. స్థానిక సంస్థలకు ప్రతి ఐదేండ్లకు ఒకసారి క్రమబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి.
8. ఎన్నికలు పార్టీ గుర్తుపై కాకుండా స్వతంత్ర ప్రాతిపదికపై జరగాలి.
9. స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి తగిన అధికారాలు, ఆర్థిక వనరులను సమకూర్చాలి.
10. భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పథకాలన్నీ స్థానిక సంస్థల ద్వారా నిర్వహించాలి.
– మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను దేశంలో మొదటిసారిగా రాజస్థాన్ (నాగూర్ జిల్లా)లో ప్రవేశపెట్టారు.
– గాంధీ జయంతి సందర్భంగా 1959, అక్టోబర్ 2న జవహర్లాల్ నెహ్రూ దీన్ని ప్రారంభిస్తూ.. నేడు ప్రారంభిస్తున్న స్థానిక స్వపరిపాలన సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పనిచేస్తే, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ భవిష్యత్ నాయకత్వానికి పాఠశాలలుగా తోడ్పడుతాయి అన్నారు.
– మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
– 1959, నవంబర్ 1న తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో స్థానిక సంస్థలకు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శ్రీకారం చుట్టారు.
– ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ సంస్థల్ని ప్రారంభించిన రెండో జిల్లా శ్రీకాకుళం (ప్రస్తుతం మొదటి జిల్లా).
– బల్వంత్రాయ్ మెహతా కమిటీ తరువాత దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను అధ్యయనం చేయడానికి వివిధ స్టడీ టీంలు (వర్కింగ్ గ్రూప్), కమిటీలను ఏర్పాటు చేశారు.
అందులో ముఖ్యమైనవి..
1. 1960లో వీఆర్ రావు అధ్యక్షతన పంచాయతీరాజ్ వ్యవస్థ హేతుబద్ధత, గణాంకాల పరిశీలన.
2. 1961లో ఎస్డీ మిశ్రా అధ్యక్షతన పంచాయతీరాజ్, సహకార సంఘాల అధ్యయనం
3. 1961లో వీ ఈశ్వరన్ అధ్యక్షతన పంచాయతీరాజ్ పాలన అధ్యయనం
4. 1962లో జీఆర్ రాజగోపాల్ న్యాయ పంచాయత్ అధ్యయనం
5. 1963లో ఆర్ఆర్ దివాకర్ అధ్యక్షతన పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామసభ స్థానం అధ్యయనం
6. 1963లో ఎం రామకృష్ణయ్య అధ్యక్షతన పంచాయతీరాజ్ సంస్థల బడ్జెట్, అకౌంటింగ్ విధానంపై స్టడీ గ్రూప్.
7. 1963లో కే సంతానం అధ్యక్షతన పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక అంశాలపై అధ్యయనం
8. 1965లో కే సంతానం అధ్యక్షతన పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలపై అధ్యయనం
9. 1965లో ఆర్కే కన్నా అధ్యక్షతన పంచాయతీరాజ్ సంస్థల ఆడిట్, అకౌంట్ల అధ్యయనం
10. 1966లో జీ రామచంద్రన్ అధ్యక్షతన పంచాయతీ సంస్థల శిక్షణ కేంద్రాలపై అధ్యయనం
11. 1969లో వీ రామనాథన్ అధ్యక్షతన భూసంస్కరణలపై సామాజిక వికాస సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థల పాత్ర అధ్యయనం
12. 1972లో ఎన్ రామకృష్ణయ్య అధ్యక్షతన సమాజ వికాస, పంచాయతీరాజ్ వ్యవస్థలకు పంచవర్ష ప్రణాళిక రూపకల్పన.
13. 1976లో దయా అధ్యక్షతన సామాజిక వికాసం, పంచాయతీరాజ్ వ్యవస్థ అధ్యయనం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు