Andhra Mahasabha | ఆంధ్ర మహాసభ సమావేశాలు
ఆంధ్రజన కేంద్ర సంఘం
-ఈ సంఘం మొదటి సమావేశం హనుమకొండలో 1924, ఏప్రిల్ 1న జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, హుజూరాబాద్ల నుంచి సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రజనసంఘం ఆశయాలను కొంత విస్తరించారు. దాని ప్రకారం…
-గ్రంథాలయాలు, పఠనాలయాలు స్థాపించడం, విద్యార్థులకు సహాయం అందించి ప్రోత్సహించడం, పండిత సత్కారాలు, చరిత్ర పరిశోధన, చారిత్రక ఆధారాలను సేకరించి, కరపత్రాలు, చిన్నపుస్తకాలు ముద్రించడం, బహిరంగ ఉపన్యాసాల ద్వారా ప్రజలను చైతన్యపరచడం, తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటడం, కళలు, సంస్కృతిని ప్రోత్సహించడం, పేదలకు సహాయపడటం మొదలైనవి లక్ష్యాలుగా తీర్మానాలు జరిగాయి.
-కానీ వీటికి అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టడంలో తెలంగాణలో పలుచోట్ల ఆటంకాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ గ్రంథాలయ ఉద్యమాన్ని మాడపాటి హనుమంతరావు పట్టుదలతో కొనసాగించాడు.
-వివిధ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన గ్రంథాలయాల నిర్వాహకులను ఆహ్వానించి, 1925, ఫిబ్రవరి 22న మధిరలో గ్రంథాలయ నిర్వాహకుల సమావేశం జరిపారు.
-ఆంధ్రజన కేంద్ర సంఘం ధనిక వర్తకులను సంఘటితపరిచి వారి సమస్యలను చర్చిండానికి సూర్యాపేటలో 1922, డిసెంబర్లో ఒక సమావేశం ఏర్పాటు చేసింది.
-ప్రభుత్వ ఉద్యోగుల వల్ల ఈ వర్తకులు ఎదుర్కొనే సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వర్తకుల స్వేచ్ఛపై ఒక చిన్నపుస్తకం ప్రచురించి విడుదల చేశారు.
-సంఘం ప్రధాన కార్యక్రమాల్లో గ్రామాల్లో కొనసాగుతున్న బేగారి విధానాన్ని నిర్మూలించడం ఒకటి. నిజాం ప్రభుత్వం వెట్టి చాకిరిని నిషేధిస్తూ ఆదేశాలు జారీచేసినా ఈ ఆచారం కొనసాగుతూనే వచ్చింది.
-నిజాం ఫర్మానాను చిన్న పుస్తక రూపంలో అచ్చువేసి సంఘం ప్రచారం కోసం గ్రామంలో పంచింది.
-గ్రామాల్లో పాఠశాలల ఏర్పాటు కోసం సంఘం చేసే ప్రయత్నాలకు ప్రభుత్వం నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. సంఘం చేపట్టిన వివిధ సాంఘిక కార్యక్రమాలు, విద్య, సంఘ కార్యక్రమాలకు ప్రభుత్వం అడ్డు తగులుతూనే ఉండేది.
-ఆ కాలంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నడుచుకునేవారిని హైదరాబాద్కు దూరంగా శ్రీశైలం వెళ్లే దారిలో ఉన్న మున్ననూర్ (మహబూబ్నగర్ జిల్లా) అనే చిన్న గ్రామ అటవీప్రాంతంలో ఖైదు చేసేవారు.
-ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిని మున్ననూర్ ఖైదుకు పంపుతామని నాటి ప్రభుత్వ ఉద్యోగులు బెదిరించేవారు.
-1926లో నిజాం ప్రభుత్వం గస్తినిశాన్-53 ద్వారా ప్రజల వాక్, స్వాతంత్య్రాలను నిషేధించింది. ప్రభుత్వ అనుమతిలేకుండా గ్రంథాలయాలు, ప్రైవేటు పాఠశాలలు స్థాపించడానికి వీల్లేకుండా చేశారు. అయినా నాయకులు ఉత్సాహం కోల్పోకుండా పట్టుదలతో కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నం చేశారు.
ఆంధ్రమహాసభ
-1930 నాటి ఉప్పుసత్యాగ్రహం హైదరాబాద్లో జాతీయవాదులను మరింతగా ఉత్తేజపరిచింది. ఇంతవరకు ఆంధ్రజనసంఘం చేపట్టిన గ్రంథాలయ, విద్యా కార్యక్రమాలే గాక మరింత విస్తృత పరిధిలో కార్యక్రమాలు జరుపుకోవడానికి 1930లో తెలంగాణ ఆంధ్రమహాసభను స్థాపించారు.
-అయితే ఈ సభ సమావేశాలు జరుపుకోవడానికి నిజాం ప్రభుత్వం మొదట్లో అంగీకరించలేదు. చివరికి కొన్ని షరతులు విధించి అనుమతించింది.
-తెలంగాణ ప్రాంతంకానివారు ఈ సభకు అధ్యక్షత వహించకూడదని, ఇతర మతస్థులకు (ప్రధానంగా ముస్లింలు) ఎలాంటి ఆక్షేపణ లేనివిధంగా రాజకీయ విషయాలను చర్చించకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
-1930, మార్చి 3, 4, 5 తేదీల్లో గోల్కొండ పత్రిక సంపాదకుడైన సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన మెదక్ జిల్లా జోగిపేటలో ఆంధ్రమహాసభ మొదటి సమావేశం జరిగింది.
-ఈ సమావేశంలో వామన్నాయక్, మాడపాటి హనుమంతరావు, శ్రీధర్నాయక్, స్వామి యోగానంద చురుకుగా పాల్గొని ఎన్నో తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు.
-ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా రైతులకు తక్కావి రుణాలు ఇవ్వాలని, వారికి వ్యసాయ సంబంధమైన సూచనలు, సలహాలు, సరైన పరిజ్ఞానం కలిగించాలని, గ్రామాల్లో మంచినీటి సౌకర్యాలు కల్పించాలని, ఖాదీ, చేనేత పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వాలని, యునాని, హకీంలతో సమానంగా ఆయుర్వేద వైద్యులకు ప్రభుత్వ సహాయం ఇవ్వాలని, పట్టణ పాలకసంస్థల్లో ఎన్నికల ద్వారా ప్రతినిధులను ఎన్నుకునే పద్ధతిని కల్పించాలని, స్త్రీలపై పరదా విధానాన్ని నిషేధించాలనే తీర్మానాలు ఆమోదం పొందాయి.
-ఈ మహాసభ తెలంగాణ చరిత్రను తిరిగి రాయవలసిన ఆవశ్యకతను పునరుద్ఘాటించింది. అందుకు పరిశోధకులకు తగిన ప్రోత్సాహం, సమయం అందించాలని కోరింది. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రజలను చైతన్యపరిచి, వారిని జాతీయోద్యమంవైపు మళ్లించే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టింది.
-రెండో మహాసభ బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన 1931, మార్చిలో దేవరకొండలో జరిగింది. ఈ సభలో ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే ఆ తరువాతి సభలకు అనుమతి ఇవ్వమని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మహాసభలో భాగ్యరెడ్డివర్మ దళితుల సమస్యలైన అస్పృశ్యత, వెట్టిచాకిరి మొదలైనవి తొలగించి నిమ్నజాతులకు సమాన హక్కులు, గౌరవం ఇచ్చేవిధంగా తీర్మానాలు ప్రవేశపెట్టాడు. ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
-1934, డిసెంబర్లో మూడో సమావేశం ఖమ్మంలో జరుపుకోవడానికి ప్రభుత్వం ఎన్నో షరతులు విధించింది. ముఖ్యంగా భూమిశిస్తు తగ్గించాలని, ప్రభుత్వ అధికారులకు గ్రామ సేవకులు పనులు చేయవద్దని తీర్మానించరాదని, ప్రభుత్వంతో కార్యకర్తలు ఘర్షణపడే ఎలాంటి సభా చర్యలు జరుగకూడదని ఆదేశించింది.
-ఈ సభకు పులిజాల వెంకట రంగారావు అధ్యక్షత వహించారు. ఈ సభలో దేవాలయాల్లో జంతుబలి ఉండకూడదని, వివాహానికి యుక్తవయస్సు ఉండాలని, దేవదాసీ విధానం రద్దు చేయాలని తీర్మానించారు. సర్దార్ జమలాపురం కేశవరావు, మాడపాటి రామచందర్రావుల రాజకీయ జీవితం ఈ సభతో ప్రారంభమైంది.
-నాలుగో మహాసభ 1935, డిసెంబర్లో సిరిసిల్లలో జరిగింది. దీనికి మాడపాటి హనుమంతరావు అధ్యక్షత వహించారు. ఈ సభ నిర్వహ ణకోసం వేములవాడ భీమకవి పేరుమీదుగా భీమకవి నగర్ నిర్మించారు.
-ఈ సభకు కూడా ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు కల్పించింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 3వేల మంది సభ్యులు పాల్గొన్నారు.
-ఈ సందర్భంగా నిర్బంధ ప్రాథమిక విద్య, మాతృభాషలో విద్యాభ్యాసం, స్థానిక స్వపరిపాలన వంటి అంశాలపై తీర్మానాలతోపాటు మహాసభకు సంబంధించిన నియమావళిని ప్రవేశపెట్టారు.
-కమ్యూనిస్టు నాయకుడిగా పేరు తెచ్చుకున్న బద్దం ఎల్లారెడ్డి ప్రజాజీవితం ఈ సభతో ఆరంభమైంది.
-ఐదో మహాసభ 1936, డిసెంబర్లో కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన షాద్నగర్లో జరిగింది. ఈ సమావేశానికి పదివేల మంది తెలంగాణ ప్రతినిధులు వచ్చారు.
-ఈ సమావేశంలో విద్యావిషయాలు, సాంఘిక దురాచారాలు, రైతుల సమస్యలకు సంబంధించి తీర్మానాలు ఆమోదించారు.
-ఈ సమావేశ ప్రాంగణానికి దేశభక్తి నగరం అనే పేరుతో మహాసభ మందిరం ప్లాన్ సిద్ధపరిచి, నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసిన వల్లూరి బసవరాజు (వీబీ రాజు) ప్రజాజీవితం ఈ సమావేశంతో ఆరంభమైంది.
-ఆరో సమావేశం నిజామాబాద్లో 1937లో ముందముల నర్సింగరావు అధ్యక్షతన జరిగింది. ఇతర సాంఘిక సంస్కరణలతోపాటు రైతులపై వ్యవసాయ రుణభారాన్ని తగ్గించాలని తీర్మానాలు చేశారు.
-ఆంధ్రమహాసభ మొదటిసారిగా ఒక రాజకీయ సంస్థగా పరిగణించబడింది. ఇంతవరకు మితవాద, అతివాద భావాలు సమావేశాల్లో బహిర్గతంకాలేదు. కానీ ఈ సమావేశంలో ఒక ప్రతిపక్షం ఏర్పడింది.
-ఉర్దూలో మాట్లాడే సభ్యులను ఆక్షేపించారు. మహాసభ నియమావళిలో మార్పులు తేవాలని నందగిరి వెంకటరావు, వల్లూరి బసవరాజు, నరసారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.
-ఈ తీర్మానాన్ని కొండా వెంకటరంగారెడ్డి, రావి నారాయణరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు ప్రతిఘటించారు. దీంతో ప్రతాపరెడ్డి అధ్యక్షుడిగా, వల్లూరి బసవరాజు ప్రధాన కార్యదర్శిగా అభివృద్ధి పక్షం అనే పేరుతో ఆంధ్రమహాసభలో ఒక ప్రతిపక్షం ఏర్పాటయ్యింది.
-ఏడో మహాసభ వరంగల్ జిల్లా మల్కాపురంలో 1940, ఏప్రిల్లో జరిగింది. దీనికి ముందముల రామచంద్రారావు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
-రాజకీయ సంస్కరణల కోసం వచ్చిన అరవముదం అయ్యంగార్ కమిటీ నివేదిక ఈ సభలో చర్చించబడింది. ఈ నివేదిక పూర్తిగా తిరస్కరించబడింది.
-ఎనిమిదో మహాసభ 1941, జూన్లో చిలుకూరులో జరిగింది. ఈ సభకు రావి నారాయణ రెడ్డి అధ్యక్షులయ్యారు. దీంతో ఆంధ్రమహాసభ పూర్తిగా కమ్యూనిస్టుల పరమైంది. రావి నారాయణరెడ్డి తన అధ్యక్షోపన్యాసంలో జాతీయ, అంతర్జాతీయ సమస్యలను సమీక్షించారు.
-ఆంధ్రమహాసభ సభ్యత్వ రుసుం ఒక రూపాయి నుంచి 4 అణాలకు తగ్గించబడింది. తెలుగు భాషను మాత్రమే ఉపయోగించాలనే నియమం ఎత్తివేయబడింది.
-ఇంతవరకు ఆంధ్రమహాసభ అన్ని పక్షాలవారికి ఉమ్మడి వేదికగా పనిచేసినప్పటికీ, అధ్యక్షుడు పూర్తిగా కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడంవల్ల ఇతర పక్షాలకు చెందిన సభ్యులు మహాసభ తీరుపై విమర్శలు కొనసాగించారు.
-1942, మే నెలలో ధర్మవరంలో జరిగిన తొమ్మిదో మహాసభకు మితవాద నాయకుడు మాచిరాజు రామకోటేశ్వరరావు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ కమ్యూనిస్టులు సహకరించలేదు.
– అందువల్ల మహాసభ కార్యకారిణి సభలో మాత్రమే క్విట్ ఇండియా తీర్మానాన్ని బలపర్చినట్లు మాచిరాజు కోటేశ్వరరావు తమ స్వీయచర్రితలో తెలిపారు.
– పదో ఆంధ్రమహాసభ హైదరాబాద్లో జరిగింది. ఇక్కడ మొదటిసారిగా అధ్యక్షపదవికి కమ్యూనిస్టు అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి, మితవాద పక్షానికి కొండా వెంకటరంగారెడ్డి పోటీ చేశారు.
-రంగారెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు