Caste system | కులవ్యవస్థ – ప్రక్షాళన
-నాగరికత ఏర్పడినప్పటి నుంచి వివిధ దేశాలవారు భారత్‌పై దండెత్తినా భౌగోళికంగా దేశం ఇతర ప్రపంచం నుంచి (హిమాలయాలు, సుదీర్ఘ తీరప్రాంతం ఉండటంవల్ల) సంబంధాలు లేకుండా ఒంటరిగా ఉండటంవల్ల ఇక్కడ సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు అలాగే విజృంభించి ఫలితంగా బలమైన సాంస్కృతిక వర్గం అయిన కులం ఏర్పడింది.
-భారతీయ సామాజిక వ్యవస్థకు మూలస్తంభం హిందూ సామాజిక వ్యవస్థ, ఈ బలమైన సనాతన సంప్రదాయ వ్యవస్థలో వర్ణం అనేది కాలక్రమేణ అనులోమ, విలోమ వివాహాల ఫలితంగా, బలమైన మత సంరక్షణ దృక్పథంలో కులవ్యవస్థ అభివృద్ధి చెందడానికి దోహదపడింది.
-దేశంలో వివిధ తెగలు ఉండటం, ఆయా తెగలు వారివారి సంస్కారాలను బలంగా పాటించడం కూడా ఇందుకు దోహదపడింది.
-గ్రామీణ సామాజిక నిర్మాణం స్తబ్దుగా ఉంటూ వృత్తులను నిరాటంకంగా పాటించడం కూడా ఇందుకు కారణం.
-తరతరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్న వివిధ పరిపాలకుల చరిత్ర మొత్తంలో ఎక్కడా కుల నిర్మూలనకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
-సరైన విద్య లేకపోవడం కూడా ఒక కారణం.
-వారసత్వ వృత్తులు, బ్రాహ్మణుల ఆధిపత్యం, బలమైన కుటుంబం, కుల అంతర్వివాహం, కులదైవాలు మొదలైనవి కులం ప్రభావంగా విస్తరించడం కారణాలుగా చెప్పవచ్చు.
మార్పులు – దోహదపడిన అంశాలు
-కులవ్యవస్థ అనేది భారతీయ సామాజిక వ్యవస్థలో విడదీయరాని భాగం అయినప్పటికీ ముఖ్యంగా ఆంగ్లేయుల పరిపాలన ఆరంభమైన తర్వాత క్రిస్టియానిటీ ఆగమనం, సంఘసంస్కరణలు, నూతన సామాజిక చింతనలైన హేతుకీకరణ, సమానత్వం, ప్రజాస్వామ్యం వంటి ఆలోచనలు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు మొదలైనవి కులవ్యవస్థలో మార్పులకు దోహదం చేశాయి.
-బ్రిటిష్ పరిపాలనాకాలంలో ప్రారంభించిన ఒకే రూపత కలిగిన న్యాయ, శాసన, చట్ట వ్యవస్థలవల్ల కుల పంచాయతీలు బలహీనమై ఆయా కులాల సభ్యులు ఆయా సంఘాలు, కుల పంచాయతీలపై కాకుండా న్యాయవ్యవస్థపై ఆధారపడటంవల్ల కులం బలహీనమైంది.
-బ్రిటిష్ పాలకులు రూపొందించి అమలుపర్చిన కుల సంబంధ దురాచారాలను నిర్మూలించే చట్టాలైన 1) కుల అశక్తతల నిర్మూలన చట్టం 1850 (ది క్యాస్ట్ డిజేబిలిటీస్ రిమూవల్ యాక్ట్ ఆఫ్ 1850)- అంటరానితనాన్ని మొదటిసారిగా నిషేధించింది.
-కొన్ని కులాలకు సంబంధించిన దురాచారమైన బాల్య వివాహాలు- ది చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రయింట్ యాక్ట్ 1860, 1929 (శారదా చట్టం)లు కులపరంగా నిర్వహిస్తున్న బాల్యవివాహాలను నిర్మూలించే ప్రయత్నం చేసింది.
-కులాంతర, మతాంతర వివాహాలను చట్టబద్ధం చేసుకునేందుకు ప్రత్యేక వివాహాల చట్టం-1872 (స్పెషల్ మ్యారేజ్ యాక్ట్-1872)ను తీసుకురావడంవల్ల కులం, మతం కొంతవరకు బలహీనపడేందుకు దోహదపడింది.
-వితంతు పునర్వివాహ చట్టం-1876
-1924లో పెరియార్ రామస్వామి నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమం
-1903లో ప్రారంభించిన కేరళలోని శ్రీమన్నారాయణ ధర్మపరిపాలన యోగం అనే ఉద్యమం (నారాయణ గురు ఆధ్వర్యంలో)
-1872లో జ్యోతిబాఫూలే రచించిన గులాంగిరి నవల ప్రభావం, ఈయన 1873లో స్థాపించిన సత్యశోధక సమాజం
-1924లో అంబేద్కర్ స్థాపించిన బహిష్కృత హితకారిణి సభ
-మహారాష్ట్రలో మహర్ల ఉద్యమం
-1897 బెంగాల్లో జాతి నిర్ధారణ సభ, 1901లో స్థాపించిన మహిష్య సమితి
-1889లో చందుమీనన్ ఇందులేఖ నవల (కేరళ నాయక్‌ల దయనీయ పరిస్థితులపై)
-1906లో భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన జగన్ మిత్ర మండలి, 1911లో స్థాపించిన మనసంఘం, 1917లో ఏర్పాటు చేసిన పంచమ మహాసభ, ఆదిహిందూ ఉద్యమాలు.
-పైన తెలిపిన సంఘటనలవల్ల కులవ్యవస్థలో మార్పు వచ్చింది.
-1850లో వచ్చిన యూనిఫామ్ జుడీషియల్ సిస్టమ్ కూడా కులవ్యవస్థను నిర్మూలించేందుకు అన్ని కులాలవారికి ఒకే న్యాయం, వారిని ఒకే పౌరులుగా గుర్తించింది.
-బ్రిటిష్ వలసవాదుల ఆగమన లక్ష్యం ఆర్థిక, వనరుల దోపిడీ ఫలితంగా వారు దేశంలో యంత్రాలను ప్రవేశపెట్టడం, రవాణా, ప్రసార సాధనాల వృద్ధి ఫలితంగా పారిశ్రామీకరణ ఆరంభమై నూతన ఉపాధిమార్గాలు ఏర్పడి వలసలు, పారిశ్రామిక కూలీలు వంటి మార్పుల ఫలితంగా కులవృత్తులు మాయమై కులం బలహీనపడింది.
-బ్రిటిష్‌వారి ఫలితంగా వచ్చిన కులవృత్తుల్లో మార్పువల్ల సమాజంలో కులవ్యవస్థ బలమైన రూపంగా చెప్పుకునే జజ్‌మాని వ్యవస్థ బలహీనమైంది.
-బ్రిటిష్ పరిపాలనాకాలంలో ఉద్భవించిన సంస్కరణవాదుల కృషి ఫలితంగా కులాల ప్రభావం, దురాచారాల్లో కొంతవరకు బలహీనం చేయబడింది. అందులో ముఖ్యమైనవి..
1) 1829లో రాజారామ్మోహన్ రాయ్ బ్రహ్మసమాజం
2) 1887లో ఆత్మారాం పాండురంగ స్థాపించిన ప్రార్థనా సమాజం
3) 1897లో రామకృష్ణ మఠం
4) 1875లో స్థాపించిన ఆర్యసమాజం (దయానంద సరస్వతి)
5) 1875లో బ్లావట్స్కీ స్థాపించిన దివ్యజ్ఞాన సమాజం
6) 1825 దేవదాసీ నిషేధ చట్టం
7) 1932లో గాంధీజీ స్థాపించిన అఖిల భారత హరిజన సంఘం
8) అంబేద్కర్ స్థాపించిన ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (1942)
9) 1916-17 మధ్య ప్రారంభమైన జస్టిస్ ఉద్యమం (బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం, ప్రారంభకులు ముదలియార్, నాయర్, త్యాగరాయ చెట్టి)
10) 1910 తమిళనాడు నాడార్ మహాజన సంఘం
11) 1871 పల్లీల ఉద్యమం (ఉత్తర తమిళనాడు)
12) 1914 నాయర్ల సేవాసంఘం
సామాజిక-అశక్తతలు
-భారత సమాజంలో కులవ్యవస్థవల్ల ఏర్పడిన సామాజిక రుగ్మతలు, కొన్ని సమూహాల ప్రజలను సామాజిక, ఆర్థిక అశక్తతలకు దారితీసిన అంశాలు..
1) అంటరానితనం 2) వెట్టిచాకిరీ 3) బాల్యవివాహాలు
4) కుల అకృత్యాలు
5) సామాజిక వెలి
6) సామాజిక అసమానతలు
7) దేవదాసీ, జోగినీ వ్యవస్థలు
8) బాలకార్మికులు
9) పేదరికం
10) నిరక్షరాస్యత
11) మానవుల అక్రమ రవాణా
12) మానవ హక్కుల ఉల్లంఘన
13) బలహీనవర్గాల స్త్రీలపై అకృత్యాలు
14) గిరిజన హక్కుల ఉల్లంఘన వంటి వివిధ రూపాల్లో సమాజంలోని బలహీన వర్గాలను తరతరాలుగా పట్టిపీడిస్తున్నాయి.
-సంక్షేమ రాజ్య స్థాపనలో భాగంగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యం రాజ్యాంగం, శాసనాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా కులవ్యవస్థవల్ల ఏర్పడిన సామాజిక అంశాలను రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నది.
రాజ్యాంగం, రాజ్యం తీసుకున్న చర్యలు
-రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన డెమొక్రసివల్ల రాజ్యాలను ఏర్పర్చి, అన్ని కులాలకు సమాన అవకాశం లభించింది.
-జస్టిస్ అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేకుండా పౌరులందరికీ సమన్యాయం
-తరతరాలుగా కులంవల్ల వచ్చిన, హరించుకుపోయిన సామాజిక స్వేచ్ఛను పౌరులందరికీ అందించేందుకు లిబర్టీ అనే పదాన్ని రాజ్యాంగ పీఠికలో పొందుపర్చారు.
-కుల రక్కసివల్ల ఏర్పడిన అసమానతల తొలగింపునకు సమానత్వం (ఈక్వాలిటీ) అనే పదాన్ని రాజ్యాంగ పీఠికలో పొందుపర్చారు.
-దేశ ప్రజల మధ్య కులాలకు అతీతంగా సోదరభావాన్ని పెంపొందించడానికి సోదరభావం అనే ఆదర్శాన్ని రాజ్యాంగ పీఠికలో పొందుపర్చారు.
-రాజ్యాంగం రెండో భాగంలోని అధికరణ 5 నుంచి 11 వరకుగల నిబంధనల ద్వారా కులాలకు అతీతంగా భారతీయులందరికీ పౌరసత్వం ఇచ్చి సమానత్వ సాధనకు కృషిచేశారు.
ఇతర రాజ్యాంగ నిబంధనలు
-అధికరణ 14- చట్టం ముందు అందరూ సమానులే
-అధికరణ 15(1)- కుల వివక్షకు తావులేదు
-అధికరణ 15(2)- కులం ప్రాతిపదికపై ఏ వ్యక్తినీ ప్రజలకు అవసరమైన బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా నిరాకరించరాదు. అంటే కింది వాటిని ఎవరైనా వినియోగించుకోవచ్చు.
-అధికరణ 15(2)(ఎ)- దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాలు
-అధికరణ 15(2)(బి)- బావులు, చెరువులు, స్నానఘట్టాలు, రహదారులు, ఇతర బహిరంగ ప్రదేశాలు
-తరతరాలుగా కొన్ని తరగతులవారికి ఆయా ప్రదేశాల్లో నిషేధం విధించిన కుల మహమ్మారిని పారదోలేందుకు ప్రాథమిక హక్కులను ప్రవేశపెట్టినట్లు గమనించవచ్చు.
-అధికరణ 16(2)- కులం ఆధారంగా ప్రభుత్వరంగాల్లో ఉద్యోగ విషయంలో వివక్ష చూపరాదు.
-అధికరణ 17- అస్పృశ్యత ఒక తీవ్రమైన నేరం. ఇది ఏ రూపంలోనైనా ఆచరించడం పూర్తిగా నిషేధించబడింది. ఎవరైనా పాటిస్తే అది శిక్షార్హమైన నేరం.
-పై అధికరణాన్ని అమలుపర్చేందుకు ప్రభుత్వం అస్పృశ్యతానేరాల చట్టం 1955ని తీసుకువచ్చారు. ఇది 1955, నవంబర్ 19 నుంచి అమల్లోకి వచ్చింది.
-1976లో దీనిని పౌరహక్కుల పరిరక్షణ చట్టం 1976 (ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ యాక్ట్-1976)గా మార్చారు.
-పై చట్టం ప్రకారం అస్పృశ్యత పాటించినవారికి 6 నెలల నుంచి రెండేండ్ల వరకు జైలుశిక్ష, ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది.
-ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ (అకృత్య నిరోధక) చట్టం 1969న రూపొందించి 1989, సెప్టెంబర్ 11న ఆమోదించి, 1990, జనవరి 30 నుంచి అమలుపరుస్తున్నారు.
-నిబంధన 19: ఈ నిబంధన కింద పౌరులకు ఆరు రకాల స్వేచ్ఛలను రాజ్యాంగం ప్రసాదించింది. అందులో..
-నిబంధన 19(1)(ఎ): తరతరాలుగా కులం పేరుతో బలహీన వర్గాల గొంతునొక్కిన కులవ్యవస్థకు వ్యతిరేకంగా ప్రతి పౌరునికి వాక్కు, భావ ప్రకటన స్వాతంత్య్రం ఇచ్చింది.
-నిబంధన 19(1)(బి): శాంతియుతంగా సమావేశాలు జరుపుకొనే హక్కు. దీని ఫలితంగా కులవివక్షపై బాధితులు సమావేశం జరుపుకోవచ్చు.
-నిబంధన 19(1)(సి): సంస్థలు, సంఘాలు ఏర్పర్చుకునే హక్కు. ఈ హక్కు ఫలితంగానే కులసంఘాలు సంఘటితమై వివక్షను రూపుమాపేందుకు ప్రెషర్ గ్రూప్స్‌గా ఏర్పడే అవకాశం చిక్కింది.
-నిబంధన 19(1)(డి): కులం పేరిట సంచారానికి నిషేధం విధించిన దురాచారం ఈ హక్కుతో పటాపంచలైంది. అంటే పౌరునికిగల సంచార హక్కు. ఏ కులంవారైనా ఎక్కడైనా సంచరించవచ్చు.
-నిబంధన 19(1)(ఇ): దేశంలో ఎక్కడైనా నివసించే, స్థిర నివాసం ఏర్పర్చుకునే హక్కు (వెలివాడల సంస్కృతి అంటే గ్రామానికి దూరంగా నివసించాలనే నీచసంస్కృతిని దీనితో పారదోలే ప్రయత్నం జరిగింది).
-నిబంధన 19(1)(జి): ఏ వృత్తినైనా, వ్యాపారం అయినా చేపట్టవచ్చు (కులాల సమాజంలో వ్యక్తి ఆ వృత్తినే చేపట్టాలనే దురాచారాలను పారదోలేందుకు తోడ్పడింది ఉదా: జోగిని ఆచారం).
-నిబంధన 21: జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ హక్కు. మేనకాగాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 కేసులో సుప్రీంకోర్టు ఈ హక్కును విశాలభావంతో అర్థం చేసుకోవాలని తెలుపుతూ తీర్పునిచ్చింది. ఇందులో కులంవల్ల వచ్చే రుగ్మతలకు సంబంధించిన అంశాలు.. 1) రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ (గౌరవప్రదమైన జీవనం), 2) రైట్ టు అగైనెస్ట్ ఇన్ హ్యూమన్ ట్రీట్మెంట్ (అమానవీయ చర్యలు), 3) రైట్ టు అగైనెస్ట్ బాండెడ్ లేబర్ (అవమానపూరితమైన చర్యలు) అనేవి కుల రుగ్మతలను నిరోధించేవని చెప్పవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు