Women’s Consciousness | నిజాం స్టేట్ – మహిళా చైతన్యం
తెలంగాణలో చైతన్య ఉద్యమాలు
-భువనగిరిలో పదకొండో ఆంధ్రమహాసభ మే 27, 28 తేదీల్లో పూర్తిగా కమ్యూనిస్టుల ఆధిపత్యంలో జరిగింది. ఈ ఎన్నికల్లో జాతీయపక్షం తటస్థ విధానం అవలంబించి కమ్యూనిస్టుల గెలుపునకు కారణమైంది.
-పన్నెండో ఆంధ్రమహాసభ 1945, ఏప్రిల్ 26, 27 తేదీల్లో వరంగల్ పట్టణ పరిసర గ్రామం మడికొండలో మిత, జాతీయవాది అయిన మాదిరాజు రామకోటేశ్వరరావు నాయకత్వంలో జరిగింది. కమ్యూనిస్టు పక్షం నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభ పేరుతో 1945, ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఖమ్మంలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. దీంతో ఆంధ్రమహాసభ ఐక్యవేదికగా ప్రాధాన్యం కోల్పోయింది. తెలంగాణ అటు రజాకార్ల దౌర్జన్యాలతో, ఇటు సాయుధ రైతాంగ పోరాటాలతో వేడెక్కింది.
-చివరిదైన 13వ ఆంధ్రమహాసభ సమావేశం 1946, మే 10న జమలాపురం కేశవరావు అధ్యక్షతన మెదక్ జిల్లా కంది గ్రామంలో జరిగింది. కమ్యూనిస్టులు కూడా తమ ఆంధ్రమహాసభ తుది సమావేశం బద్దం ఎల్లారెడ్డి అధ్యక్షతన కరీంనగర్ జిల్లాలో నిర్వహించారు. ఈ తుది సమావేశం తర్వాత కాంగ్రెస్ వర్గం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో విలీనమైంది. అలాగే కమ్యూనిస్టు వర్గానికి చెందిన ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీ పేరుమీదనే జరిగింది.
ఆంధ్ర మహిళాసభ
-1930లో ఆంధ్రమహాసభ ప్రారంభించినప్పటి నుంచి, వీటితోపాటుగా దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రయత్నాల ఫలితంగా ఆంధ్ర మహిళాసభలు కూడా జరిగాయి.
-ఆంధ్రమహిళా సభ ప్రధానంగా మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళ విద్య, మహిళల రాజకీయ వెనుకబాటుతనం మొదలైన సమస్యలను చర్చించి పరిష్కరించడం కోసం ఏర్పడింది.
-ఆంధ్ర మహిళాసభలను మొదట్లో ఆంధ్రమహాసభల్లో అంతర్భాగంగా నిర్వహించేవారు. కానీ 10వ ఆంధ్ర మహిళాసభ నుంచి మహిళాసభలను విడిగా నిర్వహించారు.
-అన్ని ఆంధ్రమహిళా సభల్లోను ప్రధానంగా స్త్రీ విద్య ఆవశ్యకత, మాతృభాషలో విద్యాబోధన, మూఢనమ్మకాలు, స్త్రీల స్థితిగతుల గురించి తీర్మానాలు చేశారు.
-మొదటి ఆంధ్ర మహిళాసభను 1930లో జోగిపేటలో నిర్వహించారు. ఈ సభ మొదటి సమావేశంలో 500 మంది మహిళలు సమావేశం కావడానికి ఏర్పాట్లు చేశారు.
-నడింపల్లి సుందరమ్మ అధ్యక్షురాలిగా వ్యవహరించిన ఈ సభలో ముఖ్యంగా సంస్కృతి, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్య, మహిళల స్వేచ్ఛ మొదలైన అంశాల గురించి చర్చించారు.
-రెండో ఆంధ్ర మహిళాసభను 1931లో దేవరకొండలో టీ వరలక్ష్మమ్మ అధ్యక్షతన నిర్వహించారు.
-మొదటి ఆంధ్ర మహిళాసభలో జరిగిన తీర్మానాలన్నింటిని తిరిగి రెండో ఆంధ్ర మహిళాసభలోను పునరుద్ఘాటించారు.
-మూడో ఆంధ్ర మహిళాసభను 1934లో ఖమ్మంలో నిర్వహించారు. ఈ సభకు మూడువేల మందికంటే ఎక్కువ మహిళలు హాజరయ్యారు. ఈ సభలో మహిళల విద్య, మహిళల జీవన విధానంలో రావాల్సిన మార్పు మొదలైన తీర్మానాలు చేశారు.
-నాలుగో ఆంధ్ర మహిళాసభ 1935లో మాడపాటి మాణిక్యమ్మ అధ్యక్షతన సిరిసిల్లలో జరిగింది. నిరక్షరాస్యులైన మహిళల కోసం రాత్రిబడులు నిర్వహించడం, వరంగల్‌లో బాలికల తెలుగు మీడియం ఉన్నత పాఠశాలను స్థాపించడం, బాల్యవివాహాలవల్ల ఏవిధంగా మహిళల ఆయుర్ధాయం తగ్గిపోతున్నది? మొదలైన అంశాలపై తీర్మానం చేశారు.
-ఐదో ఆంధ్ర మహిళాసభను 1936లో షాద్‌నగర్‌లో బూర్గుల అనంతలక్ష్మమ్మ అధ్యక్షతన నిర్వహించారు. మహిళల పాఠశాలల నిర్వహణకు గ్రాంటులు ఇవ్వాలని స్త్రీవిద్య ప్రాముఖ్యాన్ని గుర్తించాలని తీర్మానించారు.
-ఆరో సభ నిజామాబాద్‌లో 1937లో నందగిరి ఇందిరావేవి అధ్యక్షతన జరిగింది. స్త్రీ వెనుకబాటుతనం, కాలం చెల్లిన సామాజిక, మూఢనమ్మకాలపైన, విదేశీ వస్తు బహిష్కరణ గురించి, వర్ణ వ్యవస్థ గురించి చర్చించారు.
-ఏడో మహిళాసభను 1940లో మల్కాపురంలో యోగ్య శీలాదేవి అధ్యక్షతన నిర్వహించారు. నిస్సహాయులైన మహిళలకు పునరావాస సౌకర్యాలు కల్పించడం, మహిళల ఆరోగ్య పరిస్థితులు, సమాజంలోని స్త్రీ, పురుష అసమానతలు మొదలైనవాటి గురించి తీర్మానం చేశారు.
-ఎనిమిదో ఆంధ్ర మహిళాసభ చిలుకూరులో 1941లో రంగమ్మ ఓబుల్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ మొదలైనవి అందించాలని తీర్మానించారు.
-తొమ్మిదో ఆంధ్ర మహిళాసభను 1942లో ధర్మారంలో నిర్వహించారు. ఇందులో బాల్యవివాహాలు, వితంతు పునర్వివాహాలు, వరకట్నం, విడాకులు మొదలైనవాటి గురించి తీర్మానాలు చేశారు.
-పదో ఆంధ్ర మహిళాసభను 1943లో హైదరాబాద్‌లో ఎల్లాప్రగడ సీతాకుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభనుంచే మహిళాసభలను ప్రత్యేకంగా, విడిగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాల్లో వేశ్యావ్యవస్థను రూపుమాపాలని తీర్మానం చేశారు.
-పదకొండో ఆంధ్ర మహిళాసభను 1944లో భువనగిరిలో నిమ్మగడ్డ సత్యవతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో రాష్ట్రంలోని ప్రధాన దురాచారమైన ఆడబాప విధానం, బానిసత్వం గురించి తీర్మానం చేశారు.
-పన్నెండో సభను 1945లో మడికొండలో నిర్వహించారు. ఈ సభలో ప్రధానంగా సమాజంలో వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. మహిళలు తప్పనిసరిగా పుస్తకాలు చదవాలని తీర్మానించారు.
-పదమూడో ఆంధ్ర మహిళాసభను 1946లో కంది అనే ప్రాంతంలో నిర్వహించారు. ఈ మహాసభలో ప్రధానంగా స్త్రీ విద్య, వెట్టిచాకిరీ, ప్రసూతి సదుపాయాలు, స్త్రీల మానసిక స్థాయిలపై చర్చించారు. వేశ్యావ్యవస్థను రూపుమాపాలని తీర్మానించారు.
హైదరాబాద్‌లో ఆర్యసమాజ్
-బ్రిటిష్ పాలనలో ఉత్తర భారతంలో ఆర్యసమాజ్ ఉద్యమం బాగా వ్యాప్తిచెందింది. దీని ప్రభావం హైదరాబాద్‌ను కూడా తీవ్రంగా స్పృశించింది. స్వామి గిరిజానంద సరస్వతి 1832లో హైదరాబాద్‌ను సందర్శించి ఇక్కడి ప్రజలను తన ఉపన్యాసాలతో చైతన్యవంతం చేశాడు. 1891లో హైదరాబాద్ పాలనలో బీడ్ జిల్లాకు చెందిన ధరూర్‌లో మొదటి ఆర్యసమాజ్ సంస్థ ప్రారంభమైంది.
-1905 నాటికి ఆర్యసమాజ్ సొంత భవనాన్ని ఏర్పర్చుకుంది. హైదరాబాద్ ప్రభుత్వం ఆర్యసమాజ్ కార్యక్రమాలను నాన్ ముల్కీ హిందువులు తెచ్చిన ప్రమాదంగా గుర్తించింది. అందువల్ల ఆర్యసమాజ్ ప్రచారకులు పండిత బాలకృష్ణ శర్మ, నిత్యానంద బ్రహ్మచారిలను బహిష్కరించారు. వీరి బహిష్కరణ తీవ్ర వివాదానికి దారితీసింది.
-1896లో హైదరాబాద్‌లో న్యాయవాద వృత్తిలో స్థిరపడిన కేశవరావు కొరాట్కర్ ఆర్యసమాజ్‌కు నాయకత్వం వహించారు. ఆయన అఘోరనాథ ఛటోపాధ్యాయ, పండిత్ శ్రీపాద దామోదర్ సత్యాలేకర్లతో కలిసి హైదరాబాద్‌లో ఆర్యసమాజ్ పక్షాన రాజకీయ, సాంఘిక, విద్యావిషయ సంస్కరణలు చేపట్టారు.
-1921లోనే తెలుగులోకి సత్యార్థ ప్రకాశ్ అనువదించబడింది. హైదరాబాద్‌లో పాఠశాలలు, గ్రంథాలయాల ద్వారా ఆర్యసమాజ్ విస్తరించింది. 1929లో సిద్దిక్ దీన్దార్ తాను లింగాయత్ మతస్థాపకుడైన బసవేశ్వరుని అవతారంగా ప్రకటించుకొని ఆ తత్వాన్ని ఇప్పటి ఇస్లాంగా అభివర్ణించి, హిందువులను ఇస్లాం స్వీకరించాల్సిందిగా ప్రచారం ప్రారంభించాడు. అయితే ఆర్యసమాజ్‌కు చెందిన మంగళదేవ్, పండిత్ రామచంద్ర నెహ్లావి హైదరాబాద్‌కు వచ్చి దీన్దార్ తత్వాన్ని గట్టిగా ఎదుర్కొన్నాడు. దీనివల్ల హిందూ, ముస్లింల మధ్య వైషమ్యాలు పొడసూపాయి. పండిత కేశవరావు 1930లో హిందూ వితంతువుల హక్కుల గురించి పోరాడి శాసనసభలో చట్టరూపంలో రావడానికి కృషిచేశాడు. 1932, మే 21న పూనాలో కేశవరావు మరణించిన తర్వాత ఆయన స్థానంలో పండిత వినాయక్ రావు విద్యాలంకార్ అధ్యక్షుడిగా ఆర్యసమాజ్ కార్యక్రమాలను నడిపించాడు.
హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్
-హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ సంస్థ పుట్టకపూర్వమే నిషేధించబడింది. అయినప్పటికీ కార్యకర్తలు కాంగ్రెస్ పేరిట ఉద్యమాన్ని నిర్వహించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి, సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ఒక రాజకీయ సంస్థ అని, మతపరమైన లక్ష్యాలు లేవని కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ హైదరాబాద్ ప్రభుత్వం నిషేధాన్ని సడలించలేదు.
-భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ దృక్పథంలో జాతిని ఐక్యపరచి విదేశీ పాలన నుంచి ముక్తి కోరినట్లే, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కూడా తనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని నిజాం ప్రభుత్వం భావించింది. కాంగ్రెస్‌కు రాజకీయ లక్ష్యాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ రాజ్యంలో అది హిందువులను మాత్రమే సమీకరించి తన ప్రభుత్వాన్ని, ముస్లింల ప్రయోజనాలను వ్యతిరేకిస్తుందని నిజాం ప్రభుత్వం భావించింది.
-హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఒక తాత్కాలిక కమిటీ ఏర్పర్చుకొని, తన లక్ష్యాలను ప్రకటించింది. ఈ కమిటీ సమావేశకర్త బూర్గుల రామకృష్ణారావు ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించి వాక్స్వాతంత్య్రం, పత్రికాస్వేచ్ఛ, మతస్వేచ్ఛ సంఘాలను స్థాపించుకుని అధికారాలకు ఇంతవరకు ప్రతిబంధకంగా ఉన్న ఆంక్షలను తొలగించి, హైదరాబాద్‌లో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరిచే దిశలో రాజ్యాంగ సవరణలు ప్రవేశపెట్టాలని, ప్రభుత్వ నియామకాలకు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను, పదేండ్లపాటు అల్పసంఖ్యాక వర్గాలకు శాసనసభల్లో కొన్ని రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని ఈ తాత్కాలిక కమిటీ కోరింది.
-ఈ కార్యాచరణ కమిటీకి గోవిందరావు నానల్ అధ్యక్షుడిగా, హెచ్ రామకృష్ణ దూత్ ప్రధాన కార్యదర్శిగా, రావి నారాయణరెడ్డి, శ్రీనివాసరావు బోరికర్, జనార్దన్‌రావు దేశాయ్ సభ్యులుగా నియమించబడ్డారు. 1938లో సత్యాగ్రహం చేసే మొదటి బ్యాచ్ కార్యకర్తలకు స్వామి రామానంద తీర్థను డిక్టేటర్‌గా ఈ కమిటీ నియమించింది. కాంగ్రెస్ కార్యకర్తలు 18 బ్యాచ్‌లుగా 1938, అక్టోబర్ నుంచి డిసెంబర్ 24 వరకు నిరసన ప్రదర్శనలు చేసి అరెస్టు అయ్యారు. ఆ తర్వాత మహాత్మాగాంధీ సలహామేరకు ఈ సత్యాగ్రహం నిలిపివేశారు.
-1938 నవంబర్‌లో ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులు చేపట్టిన వందేమాతర ఉద్యమాన్ని హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటంలో ఒక ముఖ్యఘట్టంగా పరిగణించవచ్చు. నవంబర్ 28 నుంచి యూనివర్సిటీ ఆవరణలో వందేమాతరం గీతం ఆలపించరాదని ప్రార్థనా మందిరానికి తాళం వేశారు. వందేమాతరం గీతం పాడారని చాలామంది అడ్మిషన్లను యూనివర్సిటీ రద్దుచేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు