టీఆర్ఎస్ ఆవిర్భావం.. ఒక చరిత్ర
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. ఈ పార్టీకి ప్రొఫెసర్ జయశంకర్ మేధోపరమైన మద్దతు అందించారు. ఈ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీచేసి, అసంతృప్తితో రగులుతున్న తెలంగాణ ప్రజలను రాష్ట్ర ఏర్పాటు దిశగా నడిపించింది. తెలంగాణ ఏర్పాటు ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ విజయవంతమైంది.
టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు – నేపథ్యం
– 1995లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత తెలంగాణ ప్రాంతంపై వివక్ష మరింత ఎక్కువైంది. ఆంధ్ర వలస దోపిడీ మరింత పెరిగింది.
– ఆర్థిక సరళీకృత విధానాలు, సంస్కరణల పేరుతో తెలంగాణలోని అనేక ప్రభుత్వరంగ పరిశ్రమలను నష్టాల సాకు చూపి మూసివేశారు.
– లాభాల్లో ఉన్న నిజాం షుగర్స్ వంటి కొన్ని పరిశ్రమలను ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులకు నామమాత్రపు ధరకు అమ్మివేశారు.
– చంద్రబాబు అనుసరించిన ఇలాంటి విధానాలవల్ల వేలమంది కార్మికులు రోడ్డున పడ్డారు. నక్సలైట్ల అణచివేత పేరుతో తెలంగాణ ప్రాంతం అంతటా ప్రభుత్వం తీవ్ర నిర్బంధం కొనసాగించింది.
– ఎన్కౌంటర్ల పేరుతో వందల మంది యువకులను పోలీసులు కాల్చిచంపారు.
– తెలంగాణలో నూటికి 70 శాతం వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపట్ల 1956 నుంచి ఆంధ్ర పాలకులు అనుసరిస్తున్న వివక్షను, నిర్లక్ష్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూడా కొనసాగించింది.
– అప్పటికే తెలంగాణలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ శిథిలమైపోయింది. దశాబ్దాల తరబడి చెరువులు, కుంటల్లో పూడిక తీయకపోవడంవల్ల గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.
– తెలంగాణలో 1956లో చెరువులు, కుంటల కింద సుమారు 11 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు అందగా 2001 నాటికి అది 2.5 లక్షల ఎకరాలకు పడిపోయింది.
– శ్రీరాంసాగర్, నాగార్జున సాగర్, మూసీ, కడెం వంటి భారీ ప్రాజెక్టుల కింద ఆంధ్రపాలకులు అనుసరించిన వివక్షవల్ల ఆశించిన ఆయకట్టుకు సాగునీరు అందలేదు.
– ఒక పక్కన వర్షాభావ పరిస్థితులు, మరోపక్క బోర్లు, బావుల్లో నీరు లేకపోవడం రైతులను సంక్షోభంలోకి నెట్టింది. అప్పుల భారం పెరిగిపోయి తెలంగాణవ్యాప్తంగా 1997 నుంచి 2000 మధ్యకాలంలో వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
– వ్యవసాయం భారమైందని, బతకలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదనతో ఉన్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వం కరెంటు చార్జీలను పెంచింది. ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో రైతులకు భారమయ్యే రీతిలో విద్యుత్‌రంగ సంస్కరణలు చేపట్టింది.
– ఈ సంస్కరణలకు, కరెంటు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి తొమ్మిది వామపక్ష సంఘాలు చేపట్టిన ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు.
– తెలంగాణలో నెలకొన్న పరిస్థితులకు తోడు ఈ సంఘటన జరుగడం అసెంబ్లీలో ఉపసభాపతిగా ఉన్న కేసీఆర్‌ని కలచివేసింది.
– ఆవేదన చెందిన కేసీఆర్ 2000, సెప్టెంబర్‌లో చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. తెలంగాణలో రైతుల దయనీయ పరిస్థితిని అందులో వివరించారు. కరెంటు చార్జీల పెంపువల్ల వారి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని పేర్కొన్నారు.
– అంతకుముందు చంద్రబాబు ఆధ్వర్యంలో రూపొందిన విజన్ 2020 డాక్యుమెంట్‌లోని అంశాలపై కూడా కేసీఆర్ వ్యతిరేకత వ్యక్తంచేశారు. దళిత, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల ప్రసక్తిలేని పత్రం ఇదేం పత్రం? ఇందులో తెలంగాణ అభివృద్ధిని గురించి అసలు ప్రస్తావించనేలేదు ఎందుకు? అని ప్రశ్నించారు.
– కేసీఆర్ ఆలోచనలు తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తున్నాయని పసిగట్టిన అనేకమంది తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు ఆయనను కలిసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి చర్చించడం ప్రారంభించారు.
– 1969 నాటి తెలంగాణ ఉద్యమ ప్రారంభకుల్లో ఒకరైన సంతపురి రఘువీరరావు 2000 సెప్టెంబర్‌లో కేసీఆర్‌ను కలిసి తెలంగాణ ఉద్యమంలోకి రావాలని ఆహ్వానించారు.
– ప్రొఫెసర్ జయశంకర్ 2000 అక్టోబర్‌లో కేసీఆర్‌ను కలిసి తెలంగాణ ఆవశ్యకత గురించి చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ఎంతోమంది నాయకులతో కలిసి పనిచేశాను. కానీ మీతో మాట్లాడిన తర్వాత మీ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందన్న నమ్మకం కలుగుతున్నది అని ప్రొ.జయశంకర్ అన్నారు.
– అనంతరం సుమారు 7 నెలలపాటు ప్రతిరోజు తెలంగాణ వాదులతో చర్చలు జరిపి, తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి వివరంగా తెలుసుకున్న కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
– పార్టీ ఆవిర్భావానికంటే ముందే తెలంగాణవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులను, తెలుగుదేశం పార్టీలోని తన సహచరులను, పలువురు కాంగ్రెస్ నాయకులను కలిసి ఉద్యమంలోకి ఆహ్వానించారు.
– పార్టీ ఏర్పాటుకు ముందు కేసీఆర్ దగ్గరకు వచ్చి ఆయనతో కలిసి నడుస్తామని సంసిద్ధత తెలిపినవారు కొద్దిమంది మాత్రమే. కూకట్‌పల్లికి చెందిన అప్పటి తెలుగు యువత నాయకులు సుదర్శనరావు, సంగారెడ్డికి చెందిన మహిళా నాయకురాలు ఎం. వరలక్ష్మి, నంది నిర్మల మొదటి నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు.
– టీఆర్ఎస్ ఏర్పాటు వరకు తెలంగాణ ఐక్యవేదిక కార్యాలయంగా ఉన్న జలదృశ్యంను పార్టీ కార్యాలయానికి ఇవ్వడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ అనుమతించారు. దీంతో 2001, ఏప్రిల్ 27న జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగింది.
– తెలంగాణ పది జిల్లాల పటంతో కూడిన గులాబి రంగు జెండాను పార్టీ జెండాగా నిర్ణయించారు. పార్టీ ఏర్పాటైన తొమ్మిది రోజులలోపే 19 లక్షల మంది సభ్యులుగా చేరారు.
గిర్గ్లాని కమిషన్
– మలిదశ తెలంగాణ ఉద్యమంలో చర్చకు వచ్చిన ప్రధాన అంశాల్లో 610 జీవో ఒకటి. కేసీఆర్ సమయం వచ్చినప్పుడల్లా 610 జీవో విషయాన్ని, ఆరు సూత్రాల పథకం వైఫల్యాన్ని ప్రస్తావించడంతో చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోక తప్పలేదు. ప్రభుత్వం 2001, జూన్ 15న అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఒక కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎం గిర్‌గ్లానీతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు 2001, జూన్ 25న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత రోజు నుంచే గిర్గ్లానీ బాధ్యతలు స్వీకరించారు. అయితే రాష్ట్రంలోని 134 మంది శాఖాధిపతుల్లో ఒక్కరు (ట్రెజరీ శాఖాధిపతి బ్రహ్మయ్య) తప్ప మిగిలిన వారంతా తెలంగాణేతరులే కావడంతో వారిలో చాలా మంది కమిషన్‌కు సహకరించలేదు.
కరీంనగర్ సింహగర్జన సభ
– 2001, మే 17న కరీంనగర్లో సింహగర్జన సభ నిర్వహించతలపెట్టిన కేసీఆర్.. ప్రజలను సభకు ఆహ్వానిస్తూ ఈ సభను విజయవంతం చేయడంపైనే తెలంగాణ ఉద్యమ భవిష్యత్తు ఆధారపడి ఉందని ప్రకటించారు.
– మే 17న ఉదయం 10 గంటలకు జలదృశ్యం నుంచి సుమారు 200 వాహనాలతో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆ పార్టీ నేతలు కరీంనగర్ సింహగర్జనకు బయలుదేరారు. ఎందరో న్యాయవాదులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు తమ సొంత వాహనాల్లో కరీంనగర్‌కు బయలుదేరారు. సిద్దిపేట దాటేసరికి వాహనాల సంఖ్య దాదాపు రెండు వేలు దాటింది.
– దారిపొడవునా వివిధ గ్రామాలు, పట్టణాల ప్రజలు కాన్వాయ్‌ని ఆపి కేసీఆర్‌కు, జయశంకర్‌కు తిలకం దిద్దారు. మంగళహారతులు ఇచ్చారు. అడుగడుగునా జై తెలంగాణ నినాదాలు మారుమోగాయి. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో ప్రారంభమైన ర్యాలీ సాయంత్రం ఆరు గంటలకు కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానానికి చేరింది. అప్పటికే సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది.
– సభకు ముఖ్య అతిథిగా వచ్చిన జార్ఖండ్ ముక్తిమోర్చా అధ్యక్షుడు శిబూసోరెన్.. అక్కడి జనసందోహాన్ని చూసి తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా పునరుద్దరిస్తున్నారంటూ కేసీఆర్‌ను అభినందించారు.
– రాత్రి ఏడు గంటలకు ప్రారంభమైన సభ 11 గంటల వరకు కొనసాగింది. ప్రొఫెసర్ జయశంకర్‌కు పాదాభివందనం చేసి కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
– ఈ సభలో కేసీఆర్ తెలంగాణ రైతులు, చేనేత కార్మికుల కడగండ్లు, పెరుగుతున్న ఆత్మహత్యలు, మూసివేసిన ఫ్యాక్టరీలు, ఉద్యోగ నియామకాలు, గిరిజనుల దయనీయ స్థితి గురించి మాట్లాడటంతోపాటు ప్రభుత్వం సీమాంధ్రకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా పక్షపాత ధోరణితో ఏవిధంగా వ్యవహరిస్తున్నదో ఆధారాలతో సహా వివరించారు.
– రామగుండంలోని ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ను కేంద్రప్రభుత్వం మూసివేయడానికి ఒప్పుకుని, డీలాపడిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మూతపడకుండా చంద్రబాబు చేసిన ప్రయత్నాల గురించి వెల్లడించారు.
– సమైక్య రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రొ.జయశంకర్ కళ్లకు కట్టినట్లు వివరించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
– సభ విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో టీఆర్ఎస్ పార్టీ 2001 జూన్ 1న పాలమూరులో, 2న నల్లగొండలో, 4న నిజామాబాద్‌లో, 5న నిర్మల్‌లో, 21న వరంగల్‌లో భారీ సభలు నిర్వహించింది. ఈ సభలకు సైతం అంచనాలకు మించి జనం హాజరయ్యారు. అన్ని సభల్లోనూ కేసీఆర్ ఒక మాటను గట్టిగా వినిపించారు. ఆంధ్రుల దోపిడీకి అడ్డుకట్ట పడాలంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఒక్కటే మార్గమని, తాను ఉద్యమానికి ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టిచంపండని చెప్పారు.
స్థానికసంస్థల ఎన్నికలు
– 2001 జూలై 12, 15, 17 తేదీల్లో జిల్లాపరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరిగాయి. అప్పటికి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి మూడు నెలలు కూడా కాలేదు. అన్ని జిల్లాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది.
– పార్టీ కార్యాలయమైన జలదృశ్యం నుంచి కేసీఆర్ హెలికాప్టర్లోప్రచారానికి బయలుదేరారు. ఇది చూ సి జీర్ణించుకోలేకపోయిన చంద్రబాబు ఏడాదిలోపే జలదృశ్యం భవనాన్ని నేలమట్టం చేయించారు.
– ఈ ఎన్నికల్లో రైతు నాగలి గుర్తుతో పోటీ చేసిన టీఆర్ఎస్.. 87 జడ్పీటీసీ, 100కు పైగా ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుంది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్‌లలో జయకేతనం ఎగురవేసింది. సంతోష్‌రెడ్డి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా, కేవీ రాజేశ్వర్‌రావు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
– 2001 ఆగస్టులో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వందల గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులే సర్పంచులుగా గెలిచారు. 2001 ఆగస్టు 18న టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ వద్ద రిజిష్టర్ అయ్యింది.
– కేసీఆర్ రాజీనామా చేసిన సిద్దిపేట శాసనసభ స్థానానికి 2001, సెప్టెంబర్ 22న ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కె. శ్రీనివాస్‌రెడ్డి (టీడీపీ)పై 58,712 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
– తెలంగాణ పదమే ఉచ్చరించకూడదని స్పీకర్ యనమల రామకృష్ణుడు రూలింగ్ ఇచ్చిన శాసనసభకు కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించి మరీ ఎన్నికయ్యారు.
– 2001, నవంబర్ 17న ఖమ్మం జిల్లాలో ప్రజాగర్జన సభ, 2002, మార్చి 27న వికారాబాద్‌లో శంఖారావం సభలు విజయవంతమయ్యాయి. సభలు, సమావేశాలు, శాసనసభలో తన ప్రసంగాల ద్వారా కేసీఆర్ తెలంగాణవాదాన్ని సజీవంగా నిలుపగలిగారు. శాసనసభలో కేసీఆర్‌కు పాపారావు (కాంగ్రెస్), రవీంద్రనాథ్‌రెడ్డి మద్దతుగా నిలిచారు.
– కేసీఆర్ 610 జీవో, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, రాజోలిబండ డైవర్షన్ కాల్వపై చేసిన ప్రసంగాలు శాసనసభలోని సీమాంధ్ర శాసనసభ్యుల నోరు మూయించాయి. తెలంగాణ ఎత్తుమీద ఉన్నది కాబట్టి నీళ్లు ఎట్లా వస్తాయి అని వాదించిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు.. నిజాం, బూర్గుల ప్రభుత్వ పథకాలైన అప్పర్ కృష్ణా, భీమా ప్రాజెక్టు కాల్వల డిజైన్లను మ్యాప్‌లతో సహా చూపించి నోరు విప్పకుండా చేశారు.
– తెలంగాణకు సాగునీటి కోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించామని చంద్రబాబు చెప్పినప్పుడు… కేసీఆర్ అదంతా అబద్దమని నిరూపించారు. బూటకపు ఎన్కౌంటర్లపై మాట్లాడుతూ.. నెత్తురు ఎటు నుంచి కారినా అది తెలంగాణ బిడ్డదేనని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే బూటకపు ఎన్కౌంటర్లు ఉండవని ప్రకటించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు