టీఆర్ఎస్ రాకతో తెలంగాణ ఉద్యమానికి కాక
తెలంగాణలోని ప్రాంతీయేతర ఉద్యోగుల లెక్క తేల్చడానికి ప్రభుత్వం గిర్గ్లానీ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్రంలోని 134 మంది శాఖాధిపతుల్లో ఒక్కరు (ట్రెజరీ శాఖాధిపతి బ్రహ్మయ్య) తప్ప మిగిలిన వారిలో చాలా మంది కమిషన్‌కు సహకరించలేదు. దీంతో గడువులోపు నివేదిక ఇవ్వలేకపోయింది. ఈ కారణంగా ప్రభుత్వం కమిషన్ గడువును మరో ఏడాదిపాటు పొడిగిస్తూ 2002, జూన్ 24న ఉత్తర్వులు జారీ చేసింది. మరోమారు 2003, జూలై నుంచి 2003, సెప్టెంబర్ 30 వరకు కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం పొడిగించింది.
అమలుకాని గిర్గ్లానీ నివేదిక
– కమిషన్ తన తొలి నివేదికను 2001 అక్టోబర్‌లో ప్రభుత్వానికి సమర్పించింది. కొన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగాలలో జోనల్ ఉల్లంఘనకు పాల్పడినట్లు కమిషన్ గుర్తించింది. ఇలా నియమించబడిన ఉద్యోగులను వెనక్కి పంపించాలని సిఫారసు చేసింది.
– గిర్గ్లాని తన తుది నివేదికను 2004, సెప్టెంబర్ 30న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. ఈ నివేదిక 3 భాగాలుగా 705 పేజీలు ఉంది.
– మొదటి భాగంలో 1975 నుంచి అమల్లోకి వచ్చిన రాష్ట్రప తి ఉత్తర్వుల తీరు తెన్నులను పరిశీలించి ఉద్యోగ రంగంలో తెలంగాణ స్థానికులకు జరిగిన నష్టాన్ని పరిశీలించింది.
– రెండో భాగంలో కమిషన్ సేకరించిన సమాచారాన్నంతా అనెక్జర్ల రూపంలో పొందుపర్చారు.
– మూడో భాగంలో 1975 నుంచి 2004 వరకు రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును పరిశీలించి వాటిపై తన పరిశీలనాంశాలను తెలిపారు.
– ఈ నివేదికలో రాష్ట్రపతి ఉత్తర్వులు 126 పద్ధతుల్లో ఉల్లంఘించబడ్డాయని, వాటిని 18 రకాలుగా వర్గీకరించి 35 పరిష్కార మార్గాలను సూచించారు.
గిర్గ్లాని నివేదికలోని ముఖ్యాంశాలు
– ఉద్యోగ నియామకాల్లో విధిగా పాటించాల్సిన రాష్ట్రపతి ఉత్తర్వులకు ఉల్లంఘనలు ఏవిధంగా జరిగాయో నివేదికలో పేర్కొన్నారు. అవి..
– ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులను నాన్‌లోకల్ కోటాగా వక్రీకరించడం. ముందుగా ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఖాళీలకు బదులు రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన ఖాళీలను నింపడంతో స్థానికులకు నష్టం జరిగింది.
– కొన్ని పోస్టుల పేస్కేళ్లను పెంచి స్థానిక అభ్యర్థులకున్న కోటాను తగ్గించడం (ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినంతటి అపచారం అని పేర్కొంది)
– ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ జోనల్ బదిలీలో జరిగిన అక్రమాలు, ఏకపక్ష ధోరణులు.
– బోగస్ సర్టిఫికెట్ల ద్వారా అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన స్థానికేతరుల సంఖ్యను నిర్ధారించడంలో అశ్రద్ధ
– స్థానిక అభ్యర్థులకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులను ఓపెన్ కేటగిరీకి మార్చి స్థానికేతరులకు అందించండం.
– న్యాయ శాఖలో బాహాటంగా జరిగిన ఉల్లంఘనలు, అన్యాయపు నియామకాలు, సెక్రటేరియట్ వంటి రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేసినప్పుడు అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగకపోవడం.
రాజకీయ పునరేకీకరణ
– టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్కు భవిష్యత్ లేదని, మఘలో పుట్టి పుబ్బలో కనుమరుగయ్యే పార్టీ అని చంద్రబాబు, ఈ పార్టీ 6 నెలలు కూడా ఉండదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. అయితే కేసీఆర్‌కు సిద్దిపేటలో లభించిన భారీ మెజారిటీ ఈ నాయకులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
– టీఆర్ఎస్ ఏర్పడిన వంద రోజుల్లోపే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 87 జెడ్పీటీసీ స్థానాలు, 2 జిల్లా పరిషత్‌లలో పార్టీ జయకేతనం ఎగురవేసినప్పటికీ అది రెండున్నర జిల్లాలకే పరిమితమైందని ఆంధ్రపత్రికలు, తెలుగుదేశం నాయకులు ప్రచారం చేశారు. 2003లో వరంగల్‌లో టీఆర్ఎస్ ద్వితీయ వార్షికోత్సవాలకు చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా సుమారు 15 లక్షల మంది హాజరుకావడంతో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పునరాలోచనలో పడ్డారు. ఈ సభ తర్వాత 2004 ఎన్నికల మధ్యకాలంలో టీఆర్ఎస్ చేరికలు పెరిగాయి. పార్టీ ఆవిర్భావంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారింది ఈ కాలంలోనే.
జల దృశ్యంపై పోలీసుల దాడి
– శ్రీరాంసాగర్ వద్ద ఉన్న గెస్ట్‌హౌస్ ఆవరణలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు తెలంగాణలోని వివిధ అంశాలపై రెండు రోజులపాటు శిక్షణ తరగతులను 2002 ఫిబ్రవరిలో నిర్వహించారు. ఇందులో కేసీఆర్ ప్రధాన ప్రసంగం చేయడంతోపాటు శిక్షణ తరగతులను సమన్వయం చేశారు. ప్రొ. జయశంకర్, బీ జనార్ధనరావు, వీ ప్రకాశ్, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు కొందరు వివిధ అంశాలపై ప్రసంగించారు.
– ముఖ్య నేతలంతా శ్రీరాం సాగర్ వద్ద ఉన్న విషయాన్ని గ్రహించిన చంద్రబాబు టీఆర్ఎస్ కార్యాలయం ఉన్న జలదృశ్యంపై రెవెన్యూ, పోలీసు అధికారులను పంపి దాడి చేయించాడు. అంతకుముందు జలదృశ్యం స్థలం తమదని ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఆ స్థలాన్ని కొనుక్కొని మున్సిపల్ నిబంధనల ప్రకారం కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు కట్టుకున్నారు. దీనిపై తప్పుడు రికార్డులు సృష్టించి అది ప్రభుత్వ స్థలమని ఉన్నత న్యాయస్థానాన్ని నమ్మించి ప్రభుత్వం తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నది. సెలవు రోజు ఆ ఇంటిపై దాడిచేయించి ఆఫీసు సామానంతా గోషామహల్ స్టేడియానికి తరలించారు.
2004 ఎన్నికలు-పొత్తులు
– ఉద్యమ పార్టీ బలం పుంజుకోవడం గమనించిన కాంగ్రెస్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. తద్వారా టీడీపీ ఓట్లను కొల్లగొట్టి ఆధికారంలోకి రావచ్చని ఎత్తుగడ వేసింది. దీనికి అనుగుణంగా 2004 ఎన్నికలకు టీఆర్ఎస్తో పొత్తు కుదిర్చే బాధ్యతను అప్పటి పీసీసీ అధ్యక్షుడైన డీ శ్రీనివాస్‌కు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది.
– అదేవిధంగా నాటి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గులాంనబీ ఆజాద్ కేసీఆర్ ఇంటికి వచ్చి పొత్తు విషయమై చర్చించాడు. ఆ తర్వాత కూడా ఢిల్లీలోని పశ్చిమ బెంగాల్ గెస్ట్‌హౌజ్‌లో ప్రణబ్‌ముఖర్జీ, కేసీఆర్‌లు పొత్తు విషయమై చర్చించారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌కు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
– ఎన్డీఏ అధికారంలోకి రాదని భావించిన కేసీఆర్ కాంగ్రెస్‌తో పొత్తుకు అంగీకరించి 2004 ఫిబ్రవరి 25న ఒక ఒప్పందానికి వచ్చారు. అయితే ఎన్నికల ప్రణాళికలో అస్పష్టంగానే తెలంగాణ విషయంలో మొదటి ఎస్ఆర్సీ నివేదికలో వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీనిపై కేసీఆర్ అభ్యంతరం తెలిపి తెలంగాణ ఏర్పాటు చేస్తామని స్పష్టంగా ప్రకటించాలని కోరారు.
– దీనిపై డీ శ్రీనివాస్ స్పందిస్తూ ఎస్ఆర్సీ తెలంగాణపై వెల్లడించిన అభిప్రాయాలను గౌరవించడం అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్లే అర్థమని అన్నారు.
– ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ 42 ఎమ్మెల్యే, 6 ఎంపీ స్థానాల్లో పోటీచేసేట్లు ఒప్పందం కుదిరింది.
– కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రీజినల్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చింది.
– ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒక కూటమిగా, టీడీపీ-బీజేపీలు ఒక కూటమిగా పోటీచేశాయి.
– ఎన్నికల్లో టీఆర్ఎస్ 26 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ మొదటిసారిగా గెలుపొందడంతోపాటు, సిద్దిపేట ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు.
– మెదక్ ఎంపీగా ఆలె నరేంద్ర, ఆదిలాబాద్ ఎంపీగా టీ మధుసూదన్ రెడ్డి, వరంగల్ నుంచి డీ రవీంద్రనాయక్, హన్మకొండ నుంచి బీ వినోద్ కుమార్ గెలుపొందారు. నాగర్‌కర్నూల్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కేఎస్ రత్నం గుర్తులో పొరపాటువల్ల ఓడిపోయారు.
వరంగల్ జైత్రయాత్ర
– టీఆర్ఎస్ రెండో వార్షికోత్సవ సభ వరంగల్ జైత్రయాత్ర పేరుతో 2003, ఏప్రిల్ 27న హన్మకొండలో జరిగింది. దేశంలో ఇంతపెద్ద సభను మునుపెన్నడూ తాను చూడలేదని మాజీ ప్రధాని దేవేగౌడ పేర్కొన్నారు. ఈ సభకు దేవేగౌడతోపాటు, అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అజిత్‌సింగ్, విదర్భ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకులు బన్వర్‌లాల్ పురోహిత్, బుందేల్ ఖండ్ ప్రత్యేకరాష్ట్ర ఉద్యమ నాయకులు ప్రొ. బాబూలాల్ తివారి హాజరయ్యారు.
– ఈ సభకు సిద్దిపేట నుంచి కేసీఆర్, అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు, నాయకులు సైకిళ్లపై వచ్చారు.
కేసీఆర్ కార్యక్రమాలు
– టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోచంపల్లి, దుబ్బాక, సిరిసిల్లలోని చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించడానికి కేసీఆర్‌తో సహా పార్టీ కార్యకర్తలు భిక్షాటన చేశారు.
– తెలంగాణ వాదులందరినీ కలుపుకుపోవాలనే ఉద్దేశంతో ఉద్యమంలో ఉన్న ఆలె నరేంద్రను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. దీంతో ఆయన ఆధ్వర్యంలోని తెలంగాణ సాధన సమితి 2002, ఆగస్టు 11న టీఆర్ఎస్లో విలీనమయ్యింది.
– భూపాలపల్లిలో సమృద్ధిగా లభిస్తున్న బొగ్గును ఆం ధ్రప్రాంతంలోని ప్లాంట్లకు కేటాయించారు. దీనికి వ్యతిరేకం గా భూపాలపల్లిలో వెంటనే విద్యుదుత్పాదన కేంద్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో 2002, అక్టోబర్ 28న బహిరంగ సభ నిర్వహించారు. దీంతో దిగివిచ్చిన ప్రభుత్వం 500 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని స్థాపించింది.
– తెలంగాణ వాదాన్ని గ్రామాలు, పట్టణాల్లో పటిష్టపరచడానికి 2002, సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 వరకు టీఆర్ఎస్ పార్టీ పల్లెబాట కార్యక్రమం నిర్వహించింది. ఇది విజయవంతం అయ్యింది.
– సాగునీటి విషయంలో తెలంగాణను ఎలా మోసం చేస్తున్నారో తెలపడానికి టీఆర్ఎస్ పార్టీ 2002, డిసెంబర్ 25 నుంచి జనవరి 6 వరకు జలసాధన కార్యక్రమాలను నిర్వహించింది. ఇందులో భాగంగా ఊరూరా సామూహిక నిరాహార దీక్షలు చేపట్టింది. కేంద్ర జలసంఘం రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఆర్ విద్యాసాగర్ రావు, రిటైర్డ్ ఇంజినీర్లు భీమయ్య, ప్రభాకర్, శ్యాం ప్రసాద్‌రెడ్డి చురుకుగా పాల్గొన్నారు.
– 2003, జనవరి 6న జలసాధన ఉద్యమం ముగింపు సభ లక్షలాది మందితో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగింది. తెలంగాణ గర్జన పేరుతో జరిగిన ఈ బహిరంగ సభకు కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్, శిబూసోరెన్, నేషనల్ ఆలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు మేధాపాట్కర్ హాజరయ్యారు. ఈ సభ విజయవంతం అవడంతో ఆంధ్రాపాలకులు తెలంగాణ ప్రాజెక్టులకు కొద్దిగానైనా నిధులు కేటాయించడం మొదలుపెట్టారు.
– తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను దేశవ్యాప్తంగా ప్రజ్వలింపచేసేలా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికోసం 1000 కార్లతో 10 జిల్లాల్లోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి రోడ్డు మార్గంలో 2003, మార్చి 3న ర్యాలీగా బయలుదేరారు. సభా స్థలిలో వారికి రాంవిలాస్ పాశ్వాన్ ఆహ్వానం పలికారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు