ఇవి భారత కమ్యూనికేషన్‌కు మరో కళ్లు..!
జీశాట్:
ఇస్రో అభివృద్ధి చేసిన అధిక నిర్దేశిత టెలీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-31. దీన్ని ఫిబ్రవరి 6న దక్షిణ అమెరికాలోని ఫ్రెంచి గయానాలో ఉన్న కౌరూ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్-5 వీఏ-247 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. 2007, సెప్టెంబర్ 7న ప్రయోగించిన ఇన్శాట్-4సీఆర్ కాలపరిమితి ముగియడంతో జీశాట్-31ను ప్రయోగించారు. ఇది 15 ఏండ్లపాటు సేవలందించనున్నది. భారత్‌కు చెందిన 40వ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ – 31. ఇప్పటికే తుది దశకు చేరుకున్న ఇన్శాట్ ఉపగ్రహాల స్థానంలో జీశాట్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు.
ఇన్శాట్:
-ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్‌ను సంక్షిప్తంగా ఇన్శాట్ అంటారు. టెలీ కమ్యూనికేషన్, వాతావరణ సమాచారం, రేడియో-టెలివిజన్ ప్రసారాలు, వీడియో కాన్ఫరెన్స్, విపత్తు నిర్వహణ మొదలైన సేవలకు ఉద్దేశించిన ఉగ్రహాల సముదాయమే ఇన్శాట్ వ్యవస్థ. ఇందులో భాగంగా మొదటి ఉపగ్రహం ఇన్శాట్-1ఏను 1982, ఏప్రిల్ 10న ప్రయోగించారు. దీంతో ఇన్శాట్ వ్యవస్థ ప్రారంభమైంది. కొన్ని సాంకేతిక కారణాల ద్వారా దీన్ని డీ యాక్టివ్ చేశారు. 1983లో ఇన్శాట్-1బీని విజయవంతంగా ప్రయోగించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, భారత వాతావరణ విభాగం సంయుక్తంగా ఇన్శాట్ వ్యవస్థను నిర్వహిస్తున్నాయి.
-ఇన్శాట్ ఉపగ్రహాలను భూస్థిరకక్ష్యలో ప్రవేశపెడుతారు. ఇందుకోసం ప్రత్యేకంగా జీఎస్ఎల్వీ వాహక నౌకను ఇస్రో రూపొందించింది. దీని పేలోడ్ సామర్థ్యం తక్కువ ఉండటంతో ఎక్కువగా ఇన్శాట్ ప్రయోగాలను ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నారు. దేశంలోని టెలివిజన్ కవరేజీని విస్తరించడంలో ఇన్శాట్ వ్యవస్థ కీలకపాత్ర పోషించింది. దేశంలోని 100 శాతం భూభాగంలో 100 శాతం జనాభాకు ఉపగ్రహ ఆధారిత టెలివిజన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం దూరదర్శన్‌తో సహా వందల చానళ్లు ఇన్శాట్లోని ట్రాన్స్పాండర్ల ద్వారా ప్రసారాలు నిర్వహిస్తున్నాయి. దేశంలో డీటీహెచ్ సేవలు, తద్వారా అడ్వైర్టెజింగ్ పరిశ్రమల వృద్ధి సాధ్యమైంది. ప్రస్తుతం వేగవంతమైన 2-జి, 3-జి, 4-జి సేవలు అందించడానికి ఇన్శాట్ వ్యవస్థే ప్రధాన కారణం. దేశవ్యాప్తంగా 620 ప్రధాన టెలికమ్యూనికేషన్స్ టెర్మినల్స్ ద్వారా మొబైల్, ల్యాండ్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ట్రాన్స్పాండర్లు:
-సమాచార, ప్రసార సేవల ఉపగ్రహాల్లోని ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలను ట్రాన్స్పాండర్లు అంటారు. సాధారణంగా ఎస్-బ్యాండ్, సీ-బ్యాండ్, కేయూ-బ్యాండ్, కేఏ-బ్యాండ్ ట్రాన్స్పాండర్లు ఉంటాయి. ఎస్-బ్యాండ్, సీ-బ్యాండ్ స్వల్ప బ్యాండ్‌విడ్త్‌లో సేవలు అందిస్తాయి. కేయూ-బ్యాండ్, కేఏ-బ్యాండ్ అధిక బ్యాండ్ విడ్త్‌లో సేవలను అందిస్తాయి. ఈ ట్రాన్స్పాండర్లలో ఒక రిసీవర్, మాడ్యులేటర్, ట్రాన్స్‌మీటర్ ఉంటాయి. నేల నుంచి అప్‌లింక్ ద్వారా సమాచారాన్ని తీసుకుని, మళ్లీ నేలపై ఉన్న రిసీవర్లకు డౌన్‌లింక్‌ను ట్రాన్స్పాండర్లు నిర్వహిస్తాయి. ఒక అప్‌లింక్ పౌనఃపున్యం, ఒక డౌన్ లింక్ పౌనఃపున్యాన్ని కలిపి బ్యాండ్ విడ్త్ అంటారు. ఈ ట్రాన్స్పాండర్లు మొబైల్, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్, రేడియో, టీవీ కార్యక్రమాల బ్రాడ్ కాస్టింగ్, డీటీహెచ్ సేవలు, వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్ సేవల ప్రసారాలకు కీలకం.
ప్రయోజనాలు:
-భారత ప్రధాన భూభాగంతోపాటు మారుమూల దీవులకూ కమ్యూనికేషన్ సేవలు అందుతాయి
-భూస్థిర కక్ష్యలో కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్ సామర్థ్యం పెరుగుతుంది
-డీటీహెచ్ టెలివిజన్ సర్వీసులు, ఏటీఎంలకు అవసరమైన వీశాట్స్ కనెక్టివిటీ, స్టాక్ ఎక్సేంజ్, డిజిటల్ సమాచారం, ఈ గవర్నెన్స్ అప్లికేషన్లకు అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తుంది.
-టెలికమ్యూనికేషన్ అప్లికేషన్లకు అవసరమైన డేటా పెద్ద ఎత్తున ఒకేసారి బదిలీ చేయవచ్చు.
-అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాల్లోని చాలా ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
గత ప్రయోగాలు:
-జీయో సింక్రోనస్ శాటిలైట్.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కమ్యూనికేషన్ శాటిలైట్ వ్యవస్థ జీశాట్. 2018, డిసెంబర్ 5 వరకు మొత్తం 20 జీశాట్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ప్రస్తుతం అందులో 14 ఉపగ్రహాలు సేవలను అందిస్తున్నాయి. 2019, ఫిబ్రవరి 6న ప్రయోగించిన జీశాట్-31తో మొత్తం 15 ఉపగ్రహాలు సేవలందిస్తున్నాయి. ప్రసార సేవలకు సంబంధించి మన దేశం స్వయంప్రతిపత్తి సాధించాలనే ఉద్దేశంతో ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) జీశాట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. మొత్తం 10 జీశాట్ ఉపగ్రహాల్లో 168 సీ – ట్రాన్స్పాండర్లను అమర్చారు.
జీశాట్ 31:
ఏ తరహా ఉపగ్రహం: కమ్యూనికేషన్
నిర్వహణ : ఇస్రో
ఎన్నేండ్లు సేవలు : 15 ఏండ్లు
తయారీ : ఇస్రో శాటిలైట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్
బరువు : 2,536 కిలోలు
శక్తి : సోలార్ పలకలు, బ్యాటరీలు
ప్రయోగ తేదీ : 2019, ఫిబ్రవరి 6
రాకెట్ : ఏరియన్ 5 వీఏ-247
ఎక్కడి నుంచి : కౌరూ ఈఎల్ఏ
ట్రాన్స్‌పాండర్ : కేయూ బ్యాండ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు