Telangana movement | సాయుధ పోరాట పూర్వరంగం
తెలంగాణ యువ మేధావి వర్గమైన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మునగాల రాజా, రావిచెట్టు రంగారావు మొదలైనవారు తెలుగుభాషా వికాసాల ప్రచారం కోసం గ్రంథాలయోద్యమాన్ని 1901లో ప్రారంభించగా.. మాడపాటి హనుమంతరావు, ఆలంపల్లి వెంకట రామారావు, బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి 1921లో ఆంధ్ర జనసంఘంను హైదరాబాద్‌లో స్థాపించారు.
ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడే ప్రజా తిరుగుబాటు ఉద్భవిస్తుందనే చారిత్రక సత్యాన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రుజువు చేసింది. ప్రపంచ ప్రజావిముక్తి పోరాటాల చరిత్రలోనేగాక, భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో మొదటి స్వతంత్రప్రతిపత్తిగల ఉద్యమంగా కమ్యూనిస్టులు నడిపిన తెలంగాణ సాయుధ పోరాటం మహోన్నతమైనది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో 1946-51 మధ్య జరిగింది.
– నాటి హైదరాబాద్ రాజ్యం మూడు భాషా ప్రాంతాలతో కూడి ఉండేది. అవి..
1. మరఠ్వాడా ప్రాంతం: 5 జిల్లాలు (ఔరంగాబాద్, బీరార్, పర్బని, నాందేడ్, ఉస్మానాబాద్), సుమారు 50 లక్షల జనాభాతో ఉండేది.
2. తెలంగాణ ప్రాంతం: 8 జిల్లాలు (నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, అత్రఫ్బల్దా), సుమారు 84 లక్షల జనాభాతో ఉండేది.
3. కన్నడ ప్రాంతం: మూడు జిల్లాలు (గుల్బర్గా, రాయచూర్, బీదర్), సుమారు 30 లక్షల జనాభాతో ఉండేది.
– సంస్థానం మొత్తం నాలుగు సుభాలుగా (ఔరంగాబాద్, గుల్బర్గా, మెదక్, వరంగల్), 1.64 కోట్ల జనాభాతో, 42,000 చదరపు మైళ్ల విస్తీర్ణంతో ఉండేది. తెలంగాణ మాత్రం 8 జిల్లాలతో రెండు సుభాలుగా (మెదక్, వరంగల్) ఉండేది. ఈ ప్రాంతం మిగతా ప్రాంతాలకంటే అన్ని రకాలుగా వెనుకబడి ఉండేది. ప్రధానంగా ఈ సంస్థానం బ్రిటిష్ పరిపాలనలోని ప్రాంతాల కంటే చాలా వెనుకబడి ఉండేది.
నిజాం పాలనలో హైదరాబాద్ రాజ్య పరిస్థితి
– మొగల్ చక్రవర్తుల పరిపాలన చివరికాలంలో దేశంలో సుమారుగా 562 స్వదేశీ సంస్థానాలుండేవి. వాటిలో హైదరాబాద్ పెద్దది. 1713లో దీనికి సుబేదార్‌గా నియమితులైన నిజాం-ఉల్-ముల్క్ 1724లో దాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు. మొగల్ సామ్రాజ్యం పతనమైన తర్వాత హైదరాబాద్ సంస్థానం ఆంగ్లేయుల సామంత రాజ్యంగా మారిపోయింది.
– నిజాం రాజులు పేరుకు మాత్రమే అధిపతులుగా చెలామణి అయ్యేవారు. 1800లో నిజాం అలీఖాన్ బ్రిటిష్ వారితో సైన్యసహకార ఒప్పందం చేసుకుని, తన రాజ్య రక్షణను దారాదత్తం చేయడమే కాకుండా రాజ్యానికి ప్రధానమంత్రిని నియమించే అధికారాన్ని కూడా వారికే ఇచ్చాడు. అంతేగాక బ్రిటిష్ రెసిడెంట్ హైదరాబాద్ రాజ్య విషయాలను ఎప్పటికప్పుడు ఢిల్లీకి చేరవేసేవారు. చివరికి నిజాం నవాబులు శక్తిహీనులై బ్రిటిష్ వారికి, తమకు వ్యతిరేకంగా జరిగే ప్రజాఉద్యమాలను అణచడానికి మాత్రమే పనికివచ్చే సైనికాధికారులుగా మిగిలిపోయారు.
– దీనికితోడు నాటి హైదరాబాద్ సంస్థానంలో మధ్యయుగాల నాటి ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది. సంస్థానంలోని 30 శాతం భూభాగంలో జాగీర్లు, ఇజారీలు, బంజర్లు, పాయిగాలు, మక్తాలు, అగ్రహారాలు, ఇనాములు మొదలైన పేర్లతో జాగీర్దారీ వ్యవస్థ అమల్లో ఉండేది. 10 శాతం భూభాగం నిజాం నవాబు ఖర్చులకుగాను సొంత జాగీరు అయిన సర్ఫేఖాస్గా ఉండేది.
– 60 శాతం భూమి ప్రభుత్వమే నేరుగా భూమిశిస్తు వసూలు చేసుకునేలా దివానీ లేదా ఖల్సా పద్ధతి అమల్లో ఉండేది. 1911లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధికారంలోకి వచ్చాడు. అతడు ఎంత సమర్థుడో అంతటి వివాదాస్పదుడు. ఇతనికాలంలో దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు, జమీందార్లు, జాగీర్దార్లు, గ్రామాధికారులు, చివరికి వారి ఏజెంట్లు అధికంగా భూములను సంపాదించి రైతాంగాన్ని నిత్యం పీడించేవారు. దీనికితోడు సంస్థానం మొత్తంలో వెట్టిచాకిరి, బలవంతపు శ్రమదోపిడీ, దోపిడీలు, అంటువ్యాధులు, అత్యాచారాలు, కరువు కాటకాలు విపరీతంగా పెరిగిపోయాయి.
– వీరిపాలన అసమర్థంగా తయారైనా, రైతాంగ తిరుగుబాట్లు వచ్చే పరిస్థితులు నెలకొన్నా.. 1918లో మీరు ఉస్మాన్ అలీఖాన్ బ్రిటిష్‌వారి నుంచి హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనే బిరుదును స్వీకరించాడు. పరిపాలనా సంస్కరణలకు బదులుగా ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. అంతేగాకుండా సంస్థానంలో ముస్లిం మత తత్వవాదాన్ని పరోక్షంగా పెంచి పోషించారు.
గ్రంథాలయోద్యమం
– నిజాం ప్రభువుల అత్యుత్సాహంవల్ల సంస్థానంలోని అల్పసంఖ్యాకుల భాష అయిన ఉర్దూ రాజభాషగా ఉండటం, అధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడే తెలుగుభాష రకరకాల అవమానాలకు గురికావడం చూసి భరించలేని తెలంగాణ యువ మేధావి వర్గమైన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మునగాల రాజా, రావిచెట్టు రంగారావు మొదలైనవారు తెలుగుభాషా వికాసాల ప్రచారం కోసం గ్రంథాలయోద్యమాన్ని 1901లో ప్రారంభించగా.. మాడపాటి హనుమంతరావు, ఆలంపల్లి వెంకట రామారావు, బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి 1921లో ఆంధ్ర జనసంఘంను హైదరాబాద్‌లో స్థాపించారు. క్రమంగా ఈ సంఘం 1924లో ఆంధ్ర జనకేంద్ర సంఘంగా, 1930లో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభగా పేరుమార్చుకుని మాడపాటి హనుమంతారావు, సురవరం ప్రతాపరెడ్డి నాయకత్వంలో రైతుల సమస్యలు, గ్రామాల పునర్నిర్మాణం అనే అంశాలపై పనిచేయడం మొదలుపెట్టింది.
భూమిశిస్తు విధానాలు
– సాయుధ పోరాటం ఆరంభమయ్యేనాటికి తెలంగాణలో రైతులను అణచివేయడానికి, దోపిడీ చేయడానికన్నట్లుగా మూడు రకాల భూమిశిస్తు విధానాలు అమల్లో ఉండేవి. అవి.. దివానీ లేదా ఖల్సా, జాగీర్లు, సర్ఫేఖాస్
దివానీ లేదా ఖల్సా
– హైదరాబాద్ సంస్థానంలో వ్యవసాయానికి పనికివచ్చే మొత్తం భూమి 5 కోట్ల 30 లక్షల ఎకరాలు. అందులో 3 కోట్ల ఎకరాలు అంటే మొత్తం వ్యవసాయ భూమిలో 60 శాతం ప్రత్యక్షంగా ప్రభుత్వ భూమిశిస్తు విధానంలో ఉండేది. దీన్నే దివానీ లేదా ఖల్సా ప్రాంతం అంటారు.
జాగీర్లు
– సంస్థానంలోని మొత్తం వ్యవసాయ భూమిలో 30 శాతం జాగీర్ల కింద ఉండేది. వీటిలో పైగాలు, సంస్థానాలు, జాగీర్దార్లు, ఇజారాదార్లు, బంజరుదార్లు, మక్తేదార్లు, ఇనాందార్లు, అగ్రహారికులు అనే పేర్లతో వివిధ రకాల ఫ్యూడల్ భూస్వామ్య వర్గాలుండేవి. వీరిలో కొందరికి పన్నులు విధించి వసూలు చేసేందుకు సొంత రెవెన్యూ-పోలీస్-సివిల్-క్రిమినల్ యంత్రాంగపు అధికారులు ఉండేవారు. ఇక జాగీర్దార్లులేని ప్రాంతాల్లోని గ్రామాలు స్థానిక భూస్వాములైన దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేల ఆధీనంలో ఉండేవి. వీరు గ్రామాల్లో అధికశాతం భూమిని సొంతంచేసుకున్న అగ్రకులాలకు చెందినవారే.
సర్ఫేఖాస్
– నిజాం తన సొంత ఖర్చులకోసం ఉంచుకున్న 10 శాతం వ్యవసాయ భూమినే సర్ఫేఖాస్ అంటారు. ఈ పద్ధతి ద్వారా నిజాంకు ఏటా రూ. 2 కోట్లకుపైగా ఆదాయం వచ్చేది. దీనికి అదనంగా సంస్థాన ఖజానా నుంచి నిజాం నవాబుకు ఏడాదికి రూ. 70 లక్షలు అందేవి.
– పైగాలంటే నిజాంకు యుద్ధాల్లో తోడ్పడటం కోసం సాయుధ బలగాలను ఏర్పాటుచేసి పోషించడానికి ముస్లిం భూస్వాములకు, నిజాం బంధువులకు మంజూరు చేసిన ఎస్టేట్లు. ఇక్కడ కూడా అణచివేత, దోపిడీ ఎక్కువగానే ఉండేది. నీటిపారుదల సౌకర్యంగల జాగీరు ప్రాంతాల భూమిపై పన్ను, దివానీ ప్రాంతాల్లో ప్రభుత్వం వసూలు చేసేదానికి పదిరెట్లు రూ. 150 లేదా ఎకరానికి 10 బస్తాల నుంచి 15 బస్తాల ధాన్యం పన్ను రూపంలో వసూలు చేసేవారు.
భూస్వాముల అరాచకాలు
– మొదటి సాలార్జంగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక భూ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. దీంతో రాజ్యానికి భూమిశిస్తు వసూలు చేసిపెట్టే దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలకు వతన్లు మంజూరు చేశారు. అందువల్ల వారు సాగులో ఉన్న అతి సారవంతమైన వేలాది ఎకరాల భూములను తమ సొంత ఆస్తులుగా దఖలు పర్చుకున్నారు.
– వాటిపై ఆధారపడి జీవించే రైతులను తమకు ఇష్టం వచ్చినప్పుడల్లా తొలిగించి కౌలుదార్ల స్థాయికి దిగజార్చారు. అధికారం అండతో రైతులకు చెందిన భూములను వారికి తెలియకుండానే తమ పేర్లమీద నమోదు చేయించుకునేవారు. ఇలా ఫ్యూడల్ భూస్వాములు విస్తారమైన భూములను దఖలుపర్చుకుని వాటిపై చట్టరీత్యా హక్కులు పొందేవారు.
సామాజిక ఆర్థిక పరిస్థితులు
– 1724 నుంచి హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న నిజాం ఉల్ ముల్క్ కాలం నుంచే భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిజాం సంస్థానంలోకి వచ్చిన అధికులైన ముస్లింలు, స్థానికంగా మతమార్పిడి చేసుకున్న దళిత, వెనుకబడిన కులాల వారు మొత్తం కలిసి ముస్లిం ప్రజల శాతం 1901లో 10 శాతంగా ఉంది. 1948 నాటికి అది 14 శాతానికి పెరిగింది. దీనికితోడు అంజుమన్-ఇ-తబ్లిక్-ఉల్-ఇస్లాం మత సంస్థ మతమార్పిడి కార్యకలాపాలను విస్తృతంగా చేపట్టింది.
– ప్రధానంగా నాటి తెలంగాణ సమాజంలో ఉన్న కులవ్యవస్థ నిర్మాణం, అధికారానికి మధ్య ఉన్న సంబంధాలను, ఆధిపత్య విధానాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే అప్పటి సామాజిక, ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అయితే మొత్తం జనాభాలో ముస్లింలు నూటికి 14 మంది ఉన్నప్పటికీ ఉన్నతస్థాయి ప్రభుత్వోద్యోగాల్లో మాత్రం 90కి పైగా ఉండేవారు. ముస్లింలు పాలకవర్గమని, వారికి సంస్థానంలోని మిగతా ప్రజలపై ఆధిక్యత ఉన్నదనే భావాన్ని పెంపొందించడానికి ముల్లాలు ప్రయత్నం చేశారు. దీనికి వ్యతిరేకంగా మధ్యతరగతి మేధావులు, ఆర్యసమాజికులు పోరాడారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు