సీఏ కోర్సులో నూతన విధానం 2017, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. సీఏ ఇన్స్టిట్యూట్ ముఖ్య ఉద్దేశం సీఏ చదివిన వారికి విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించండం. భారత చార్టర్డ్ అకౌంటెంట్లకు ప్రపంచస్థాయిలో ఉద్యోగావకాశాలు మరింతగా పెరగాలి, మన సీఏలు విదేశాల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతో కూడా ఈ నూతన విధానాన్ని రూపొందించారు. సీఏ కోర్సులోని అన్ని దశల్లో సీఏ ఇంటర్ కీలకం. సీఏలోని సీఏ ఇంటర్ దశ వరకు పూర్తిచేసినా మంచి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ దశలో విద్యార్థి అనవసర విషయాలకు తావివ్వకుండా ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే తప్పక విజయం సాధించవచ్చు. 2018 మే నుంచి ఈ కొత్త సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఏ ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి? పరీక్ష సమయంలో ఎలాంటి మెలకువలు పాటించాలి? వంటి అంశాలపై ప్రత్యేక ఫోకస్…
పరీక్షల సన్నద్ధత వ్యూహాలు
-తుది పరీక్ష ముగిసేవరకు అనుసరించే విద్యాప్రణాళికను ముందుగా తయారుచేసుకుని అదే ప్రణాళికకు కట్టుబడాలి.
-సీఏ కోర్సులో సమయస్ఫూర్తి, లాజికల్ ఆలోచనా విధానం చాలా అవసరం. అలా ఆలోచిస్తే పరీక్షల్లో అడిగిన ఎటువంటి ప్రశ్నకైనా సరైన సమాధానం రాసే వీలుంటుంది. సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహనతో చదవాలి తప్ప బట్టీపట్టొద్దు. పరీక్షలో ప్రశ్నలు ఒకటికి రెండుసార్లు చదివి సమాధానాలు డొంకతిరుగుడు లేకుండా సూటిగా రాయాలి. సీఏలో ఎంత రాశాం? అన్నదానికంటే ఏం రాశాం? సమాధానం ఎలా ఉన్నది? అన్నదానికే ప్రాధాన్యం ఉంటుందని మరచిపోకూడదు.
-ఒక డౌట్స్ బుక్ పెట్టుకోండి. మీకు వచ్చిన డౌట్స్ అన్నీ ఆ బుక్‌లో రాయండి. మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉంటే అక్కడి ఫ్యాకల్టీని అడిగి ఆ డౌట్స్‌ను నివృత్తి చేసుకోండి లేదా సొంతంగా ప్రిపేర్ అవుతుంటే మీరు చదివిన టెక్ట్స్ బుక్స్ లేదా స్టడీ మెటీరియల్ చూసుకుని మీ డౌట్స్‌ను క్లారిఫై చేసుకోండి.
-సీఏ చదివేటప్పుడు విశ్లేషణాత్మకత, సమయస్ఫూర్తి అనేవి చాలా అవసరం. ఇటువంటి గుణాలను అలవర్చుకుంటే పరీక్షల్లో సునాయాసంగా విజయం సాధించవచ్చు.
-ఈ పరీక్షకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు పనికిరాదు.
-ప్రతి సబ్జెక్టులో కనీస మార్కులకు తోడు మొత్తంగా చూసినప్పుడు అగ్రిగేట్ మార్కులు పొంది ఉండాలి. అప్పుడే పాసైనట్లు లెక్క. అందువల్ల కనీసం ఒకటి రెండు సబ్జెక్టుల్లో అయినా మన పర్ఫామెన్స్ బాగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకు విజయం సులువుగా దక్కుతుంది.
-అకౌంటెన్సీ, అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ, కాస్టింగ్‌లో పట్టు రావాలంటే ప్రాక్టీస్ ఒక్కటే దారి.
-సబ్జెక్టుల్లో ఇష్టం, కష్టం అని రెండు రకాలు ఉంటాయి. మొదట ఇష్టమైన తర్వాత కష్టమైన సబ్జెక్టులను వంతులవారీగా అధ్యయనం చేయడం మంచిది. అప్పుడు మొత్తంమీద కష్టం అనిపించదు.
-సీఏ చదవాలంటే ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు శ్రమించేతత్వం, నిబద్ధత, సహనం ఇవన్నీ ఉంటే ఒక సాధారణ విద్యార్థి కూడా సీఏ ఇంటర్ పూర్తిచేయవచ్చు.
-సన్నద్ధతకు అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏయే సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలో ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అదే ప్రణాళిక ప్రకారం చదవాలి.
-సన్నద్ధత సమయంలో బాగా కష్టం అని, అర్థం కాలేదు అనిపించిన అంశాలకు సంబంధించి ఆలోచిస్తూ అనవసరంగా సమయం వృథా చేసుకోకుండా స్నేహితులు, ఫ్యాకల్టీ లేదా మెంటార్స్‌ను అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలి.
-ఉన్న సమయంలో సబ్జెక్టుకు ఇన్ని రోజులని కేటాయించుకుని అలానే ఒక సబ్జెక్టుకు కేటాయించిన సమయంలో ఆ సబ్జెక్టులో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి. ఏ చాప్టర్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి, ప్రాముఖ్యం ఇవ్వాలి అని విభజించుకుని సన్నద్ధమవ్వాలి.
-పరీక్షల సమయంలో చదవడానికి ఎక్కువ అవకాశం ఉండదు. అందుకని పరీక్షలకు ముందు సన్నద్ధత సమయంలో అనవసర అంశాలను, బాగా వచ్చిన అంశాలను కొట్టివేస్తూపోవాలి. అంటే చివరికి కేవలం కొంచెం ఇబ్బందిగా అనిపించిన అంశాలే మిగులుతాయి. వాటిని బాగా చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. పరీక్షకు ముందు వాటినే చూసుకుని పరీక్షలకు హాజరైతే సరిపోతుంది.
-పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు, ఏయే టాపిక్స్ ఎక్కువగా కవర్ చేస్తున్నారనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. సిలబస్ వెయిటేజీ గమనించి సన్నద్ధమవ్వాలి.
-చాలామంది విద్యార్థులకు ప్రాథమిక అంశాలపై పట్టు ఉండదు. సీఏలో ఏ దశలోనైనా రాణించాలంటే ముందుగా ప్రాథమిక అంశాలపై మంచి అవగాహన ఉండాలి.
-పరీక్ష రాసే సమయంలో చాలామంది విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారు. ఇలా ఆందోళనపడటంవల్ల ఒక్కోసారి బాగా తెలిసిన సమాధానాలు కూడా రాయలేరు లేదా తప్పుగా రాసే అవకాశం ఉంది. పరీక్షలో దాదాపుగా మనం సమాధానం రాయగలిగే పరీక్షలు ఇస్తారు. కాబట్టి పరీక్షల గురించి కానీ, పరీక్షలు రాసేటప్పుడు గాని ఆందోళన పడకూడదు.
-పరీక్ష రాసేటప్పుడు సమయపాలన చాలా అవసరం. కొంతమంది అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఎలా రాయాలని ఆలోచిస్తూ అనవసరంగా పరీక్ష సమయాన్ని వృథా చేస్తుంటారు. పరీక్ష రాసేటప్పుడు వచ్చిన సమాధానాలను ముందుగా, వేగంగా రాసి చివర్లో రాని సమాధానాల గురించి ఆలోచించాలి. దీనివల్ల అనవసర సమయం వృథాకాదు.
-కొంతమంది విద్యార్థులు కొన్ని ప్రశ్నలకు సమాధానాలను పేజీలకు పేజీలు రాస్తే బాగా మార్కులు వస్తాయని భావిస్తుంటారు. కానీ అది అపోహే. సీఏ పరీక్షల్లో మనం ఎంత జవాబు రాశామన్న దానికంటే ఎంత సూటిగా రాశామన్నదే ముఖ్యం.
-పరీక్ష రాసేటప్పుడు సమాధానాన్ని చక్కగా రాస్తూ అవసరమైన వర్కింగ్ నోట్స్, క్యాలిక్యులేషన్స్ను పక్కనే రాయాలి. చాలామంది విద్యార్థులు కేవలం సమాధానం మాత్రమే రాసి వర్కింగ్ నోట్స్ వేరే ఎక్కడో రాయడంవల్ల అనవసరంగా మార్కులు కోల్పోతున్నారు.
-అకౌంట్స్ వంటి సబ్జెక్టుల్లో కొంతమంది విద్యార్థులు లెక్కకు ఇచ్చిన ప్రాధాన్యం ఫార్మాట్లకు ఇవ్వరు. అలా చేయడంవల్ల కూడా కొన్ని మార్కులు కోల్పోయే అవకాశం ఉంది.
సబ్జెక్టుల వారీ విశ్లేషణ
అకౌంటింగ్
పేపర్-1
-అకౌంటింగ్ స్టాండర్స్‌కు పరీక్షల్లో వెయిటేజీ బాగా ఉంటున్నందున అకౌంటింగ్ స్టాండర్స్‌కు ప్రాముఖ్యమివ్వాలి.
-చిన్న చిన్న చాప్టర్లను కూడా వదలకుండా ప్రాక్టీస్ చేయాలి. పరీక్షల్లో చిన్న, పెద్ద తారతమ్యాలు లేకుండా ప్రశ్నలను అడగటం జరుగుతుంది.
-థియరీ చాప్టర్లను కూడా తప్పక చదవాలి.
-అవసరమున్న ప్రతి ప్రశ్నకు తప్పక బ్యాలెన్స్ షీట్ తయారుచేయాలి.
-పరీక్ష సన్నద్ధత దశలో వేర్వేరు టెక్ట్స్‌బుక్స్ చదవకుండా, ప్రాక్టీస్ చేయకుండా ఉంటేనే మంచిది. మీరు ముందు నుంచి ఏ బుక్/ మెటీరియల్ అయితే అనుసరిస్తున్నారో అదే ప్రాక్టీస్ చేస్తే మంచిది.
-ప్రతి చాప్టర్లో ఒక బేసిక్ ప్రాబ్లమ్ ఎంచుకుని ప్రాక్టీస్ చేయాలి. మిగతా ప్రాబ్లమ్స్లోని ప్రముఖమైన అంశాలను హైలైట్ చేసుకోవాలి. ఇది రివిజన్‌కు బాగా ఉపయోగపడుతుంది.
-ప్రతి టాపిక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కాన్సెప్ట్‌కే ప్రాధాన్యమివ్వాలి.
-పార్ట్నర్షిప్ అకౌంట్స్, అమల్గమేషన్ అండ్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్, అకౌంట్స్ ఫ్రం ఇన్‌కంప్లీట్ రికార్డ్స్, కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ బ్రాంచ్ అకౌంట్స్ వంటి చాప్టర్లమీద ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్
పేపర్-3
-ప్రతి చాప్టర్లో ఇచ్చిన థియరీ ప్రశ్నలను చదవాలి.
-కనీసం గత 5 పరీక్షల ప్రశ్నపత్రాల్లోని థియరీ ప్రశ్నలను తప్పక చదివితే థియరీ ప్రశ్నలకు సంబంధించి మార్కులు సాధించే వీలుంటుంది.
-ప్రతి చాప్టర్లోని ఫార్ములాల మీద దృష్టి కేంద్రీకరించాలి. వీలైతే ఫార్ములాలన్నీ ఒక పుస్తకంలో రాసుకుని చదవాలి.
-ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. ప్రత్యేకించి మెటీరియల్స్, లేబర్, ఓవర్‌హెడ్స్ వంటి ప్రాథమిక చాప్టర్లమీద పట్టు సాధించండంవల్ల మిగతా చాప్టర్ల నుంచి అడిగే ప్రశ్నలకు సులభంగా సమాధానాలు రాసే అవకాశముంటుంది.
-ఓవర్‌హెడ్స్, స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్ వంటి చాప్టర్ల నుంచి సమస్యరూప ప్రశ్నలు అడిగే అవకాశమున్నందున ఆ చాప్టర్లను బాగా సన్నద్ధమవ్వాలి. ఈ చాప్టర్లలో అప్లికేషన్ విజ్ఞానం అనేది చాలా అవసరం.
-కొత్తగా కలిపిన చాప్టైర్లెన యూనిట్ కాస్టింగ్, ఏబీసీ కాస్టింగ్, సర్వీస్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్ వంటి చాప్టర్లను బాగా చదవాలి.
-ప్రాబ్లమ్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి.
కార్పొరేట్ లాస్ అండ్ అదర్ లాస్
పేపర్-2
-దీనిలో కార్పొరేట్ లాస్, అదర్ లాస్ చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. కార్పొరేట్ లాస్ 60 మార్కులకు, అదర్ లాస్ 40 మార్కులకు ఉంటుంది.
-ఇటీవల కొత్తగా కలిపిన చాప్టర్లపై, కొత్త సవరణలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి.
-తప్పు, ఒప్పుల ప్రకటనల ప్రశ్నల రూపంలో 8-10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా తప్పక చదవాలి.
-బైల్మెంట్ అండ్ ప్లెడ్జ్, ఇండెన్మిటీ అండ్ గ్యారంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ వంటి చాప్టర్లపై నుంచి ఇదివరకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలను మాత్రమే ఆశించేవారు కానీ ఇప్పుడు విశ్లేషణాత్మక ప్రశ్నలు కూడా ఈ చాప్టర్ల నుంచి వచ్చే అవకాశం ఉంది.
-జనరల్ క్లాజెస్, ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ స్టాచ్యూస్ వంటి చాప్టర్లు విద్యార్థుల ఆలోచనా స్థాయిపరంగా కొంచెం కష్టతరమైన చాప్టర్లని చెప్పవచ్చు. పరీక్షలో ఈ చాప్టర్ల నుంచి అడిగే ప్రశ్నలు విద్యార్థులను ఇబ్బందిపెట్టే విధంగా ఉండకపోవచ్చు. అలాగని విద్యార్థులు ఈ చాప్టర్లను చాయిస్ కింద వదలకుండా కొంతమేరకైనా చదవడం మంచిది.
-కంపెనీల చట్టంలో ఇంతకు పూర్వం సరళమైన ప్రశ్నలను నేరుగా అడిగేవారు. కానీ కంపెనీల చట్టానికి ప్రాముఖ్యత పెరిగినందున థియరీలో ఆచరణాత్మక ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి కొత్త సిలబస్ ప్రకారం కంపెనీ లాపై ఎక్కువ దృష్టి సారించాలి.
-పరీక్షల్లో సాధ్యమైనంతవరకు ఎగ్జామినర్ సీఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్‌లో ఇచ్చిన సమాధానాలను ఆశిస్తారు. పరీక్షలో సాధ్యమైనంత వరకు ఇన్స్టిట్యూట్ మెటీరియల్లోని ముఖ్యాంశాలను రాయాలి.
-పునశ్చరణ పరీక్ష పత్రాల నుంచి 10-15 మార్కులకు ప్రశ్నలను ఆశించవచ్చు. కాబట్టి వాటిని నిర్లక్ష్యం చేయరాదు.
టాక్సేషన్
పేపర్-4
-ఇందులో ఇన్‌కం ట్యాక్స్ 60 మార్కులు, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్కు 40 మార్కులకు ఉంటాయి.
ఇన్‌కంట్యాక్స్
-ఇటీవల సవరించిన ఫైనాన్స్ యాక్ట్- 2016, ఫైనాన్స్ యాక్ట్- 2017ను బాగా చదవాలి. వీటి నుంచి 10-15 మార్కులు వచ్చే అవకాశం ఉంది.
-ఇప్పటివరకు చదివిన పుస్తకం లేదా మెటీరియల్లోని అంశాలనే పునశ్చరణ చేయాలి. పాత ప్రశప్రతాల్లోని ముఖ్యమైన ప్రశ్నలను గుర్తించి వాటిని తప్పక చదవాలి.
-RTPs, MTPs, పాత ప్రశ్నపత్రాలు చదువుతున్నప్పుడు పాత ప్రశ్నలను కొత్త ఫైనాన్స్ చట్టం ప్రకారం నవీకరించుకోవాలి.
-గ్రాస్ టోటల్ ఇన్‌కంకు సంబంధించి లెక్కలను బాగా ప్రాక్టీస్ చేయాలి. పరీక్షలో లెక్కలు చేసేటప్పుడు పద్దులను వేస్తూ, సాధ్యమైనంత వివరంగా అంచెలవారీగా సమాధానం రాయాలి.
-టోటల్ ఇన్‌కంకు సంబంధించిన లెక్కలను సాధ్యమైనన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడంవల్ల ట్యాక్స్‌లోని ఐదు విభాగాలను పునశ్చరణ చేసినట్లవుతుంది.
ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్
-ఈ విభాగానికి 40 మార్కులు కేటాయించారు.
-సీఏ-ఐపీసీసీ పాత సిలబస్ ప్రకారం, సీఏ ఇంటర్ కొత్త సిలబస్ ప్రకారం పరీక్ష రాసే విద్యార్థులందరికీ 2018, మే పరీక్షలకు వస్తుసేవా పన్ను (జీఎస్టీ) వర్తిస్తుంది. కాబట్టి పాత, కొత్త సిలబస్ విద్యార్థులు జీఎస్టీ తప్పకుండా చదవాలి.
-జీఎస్టీకి సంబంధించి ప్రాక్టీస్ మాన్యువల్ ఇంకా అందుబాటులో లేదు. కాబట్టి అందుబాటులో ఉన్న మెటీరియల్లోని అన్ని ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.
అడ్వాన్స్డ్ అకౌంటింగ్
పేపర్-5
-పైన పేర్కొన్న అకౌంటింగ్ సబ్జెక్టులానే అడ్వాన్స్డ్ అకౌంటింగ్‌కు కూడా సన్నద్ధమవ్వాలి.
-అకౌంటింగ్ స్టాండర్డ్స్ బాగా చదవాలి. ఫార్మాట్స్ ఉన్న చాప్టర్లను, సాధ్యమైనన్ని ఎక్కువ లెక్కలు బాగా ప్రాక్టీస్ చేయాలి.
ఆడిటింగ్ అండ్ అస్యూరెన్స్
పేపర్-6
-పరీక్షల్లో ఆడిటింగ్ స్టాండర్డ్స్ మొత్తం ఎలా ఇచ్చారో అలాగే రాయాల్సిన అవసరం లేదు. అడిగిన ప్రశ్నకు వర్తించే భాగం వరకు ప్రస్తావిస్తే చాలు.
-ఆడిటింగ్ స్టాండర్డ్ పేరు, నంబర్‌ను గుర్తుంచుకోవాలి. పరీక్షల్లో ఒక్కోసారి మనం ఆడిటింగ్ స్టాండర్డ్ గురించి వివరంగా రాయలేకపోయినప్పటికీ ఆడిటింగ్ స్టాండర్డ్ పేరు, నంబర్ వరకు రాసినా ఎగ్జామినర్ దృష్టిని ఆకర్షించి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.
-ఆడిటింగ్ సబ్జెక్టులోని అన్ని చాప్టర్లలో ప్రాక్టికల్ ప్రశ్నలు చదవాల్సిన అవసరం లేదు. కంపెనీ ఆడిట్ చాప్టర్లోని ప్రాక్టికల్ ప్రశ్నలు చదివితే సరిపోతుంది.
-ఇటీవలి పరీక్షల్లో ఆడిటింగ్ పేపర్లో తప్పు ఒప్పు ప్రశ్నలు 20 మార్కుల వరకు ఇచ్చారు. కాబట్టి విద్యార్థులు ఇలాంటి ప్రశ్నలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.
-కొత్తగా కలిపిన ఎస్ఏ 701, ఆడిట్ ఆఫ్ బ్యాంక్ వంటి అంశాలను క్షుణ్ణంగా చదవాలి.
-కొత్తగా చేసిన సవరణలను ఆకళింపు చేసుకోవాలి.
-ప్రాక్టికల్ ప్రశ్నలు అన్ని చాప్టర్లలో చదవాలనుకునేవారు కంపెనీ ఆడిట్-1 నుంచి ప్రారంభిస్తే మంచిది.
-పరీక్షకు సన్నద్ధమవడానికి సమయం లేనట్లయితే వౌచింగ్ అండ్ వెరిఫికేషన్ చాప్టర్లను చాయిస్ కింద వదిలేయాలి.
ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్
పేపర్-7
-ఈ రెండు సబ్జెక్టుల్లో జవాబులను సొంతంగా రాయకుండా ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు చదివిన పుస్తకం లేదా మెటీరియల్లోని అంశాలనే ఉన్నవి ఉన్నట్లుగా, సాంకేతిక పదాలు మిళితం చేస్తూ రాయాలి.
-వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. రెండు పునశ్చరణల మధ్య తక్కువ సమయం ఉండేలా చూసుకోవాలి. వీలైతే రెండు సబ్జెక్టులకు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్ మెటీరియల్ తయారు చేసుకుని చదివితే మంచిది.
ఎంటర్ప్రైజ్ ఇన్పర్మేషన్ సిస్టమ్ (50 మార్కులు)
-పరీక్షల్లో ప్రశ్నలను నేరుగా అడుగుతారు. బాగా సన్నద్ధమైతే మంచి మార్కులు పొందవచ్చు.
-ఈ పేపర్లో చాలా అంశాలు సీఏ ఫైనల్లోని ఐఎస్‌సీఏ అనే సబ్జెక్టు నుంచి తీసుకున్నారు. ఐఎస్‌సీఏ అంటే విద్యార్థులు సహజంగా కొంచెం కష్టంగా భావిస్తారు. ఇందులో కూడా మంచి మార్కులు రావాలంటే ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, డెఫినేషన్లు, వ్యత్యాసాలు, తప్పు ఒప్పుల ప్రశ్నలు బాగా చదివితే సులువుగా మార్కులు పొందవచ్చు. పాత సిలబస్‌లో ఇలాంటి ప్రశ్నలకు పెద్దగా అవకాశం ఉండేది కాదు.
స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ (50 మార్కులు)
-ఈ సబ్జెక్టులో ప్రశ్నలు తికమక (Twists and Turns)గా అడుగుతారు. అంటే ప్రశ్నలను నేరుగా కాకుండా రకరకాలుగా అడుగుతారు. పరీక్షకు ముందు సన్నద్ధమయ్యేటప్పుడు ఇలాంటి ప్రశ్నలు వీలైనన్ని ఎక్కువ చదివితే ఎలాంటి భయంలేకుండా పరీక్ష రాయవచ్చు.
-పాత సిలబస్‌లోని పెద్ద చాప్టర్లను చిన్న చిన్న చాప్టర్లుగా విభజించారు. పరీక్షల్లో అన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అన్నీ చదవాలి.
-ఆజ్జెక్టివ్ ప్రశ్నలు, డెఫినేషన్లు, వ్యత్యాసాలు, తప్పొప్పుల ప్రశ్నలను బాగా చదవాలి.
-వీలైనంత వరకు చదువుతున్న పుస్తకం లేదా మెటీరియల్‌తోపాటు ఐసీఏఐ మెటీరియల్ కూడా చదివితే మంచిది.
-2, 3, 4, 5 చాప్టర్ల నుంచి అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ చాప్టర్లకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలు చదవాలి.
ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్
పేపర్-8
-ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ 60 మార్కులకు ఉంటుంది.
-ప్రతి చాప్టర్లో థియరీ ప్రశ్నలు తప్పనిసరిగా చదవాలి. ఇందులో నుంచి 25-30 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. గత ఐదేండ్ల ప్రశ్నపత్రాల్లోని థియరీ ప్రశ్నలు, సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్, స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎఫ్ఎం వంటి చాప్టర్లకు సంబంధించిన థియరీ ప్రశ్నలు చదవాలి.
-ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ 40 మార్కులకు ఉంటుంది.
-నేషనల్ ఇన్‌కం అకౌంటింగ్: సూత్రాలు, కాన్సెప్ట్, జాతీయ ఆదాయం లెక్కించడం వంటి అంశాలు బాగా చదవాలి.
-The Keynesian Theory of determination of National Income: అన్ని Sector models and investment multiplierలోని Circular flows and graphని ప్రాక్టీస్ చేయాలి.
-Indias fiscal Policy: Govt expenditure, Taxes, expansionary and contractionary fiscal policies వంటి అంశాలపై దృష్టి సారించాలి.
-The money market: Functions of money, demand for money థియరీలు, Money supply, money multiplier and objectives & Instruments of monetary policy, monetary policy Committee వంటి అంశాలు క్షుణ్ణంగా చదవాలి.
-International capital movements: FDIల వల్ల ఉపయోగాలు, నష్టాలు, ఎఫ్‌డీఐ, ఎఫ్‌పీఐ మధ్యగల వ్యత్యాసాలు బాగా చదవాలి.
-Exchange rate and its economic effects: Exchange rate, fixed and floating exchange rate, nominal exchange rate, Arbitrage, Diagrams of depreciation and appreciation of Currency exchange rates, Impact of Exchange rate fluctuations on Domestic Economy వంటి అంశాలపై శ్రద్ధవహించాలి.
-International Trade: Theories of International trade, Tariffs, Non-Tariff measures, effect of Tariffs, GATT, WTO and its agreements చదవాలి.