శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏం తేల్చింది..?
ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను 2010, డిసెంబర్ 30న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిటీ కోసం భారత ప్రభుత్వం దాదాపు 20 కోట్లు ఖర్చు చేసింది. అయితే శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికపై 2011, జనవరి 6న కేంద్ర హోంమంత్రి చిదంబరం మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ నీతి అవలంబిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మరింత జాప్యం చేస్తుందంటూ టీఆర్ఎస్, బీజేపీలు అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ప్రజారాజ్యం, ఎంఐఎం పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశంలో సీపీఐ, తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాత్రమే తెలంగాణ వాదన వినిపించారు. అయితే ఈ సమావేశంలోకూడా అధికార కాంగ్రెస్ పార్టీ కానీ, కేంద్ర హోంమంత్రికానీ తమ అభిప్రాయం తెలపకుండా శ్రీకృష్ణ కమిటీకి సంబంధించిన నివేదిక ప్రతిని, సీడీని ఇచ్చి సమావేశం ముగించారు. కమిటీ నివేదికలో 668 పేజీలతో కూడిన తొమ్మిది అధ్యాయాలున్నాయి.
కమిటీ నివేదిక అనంతర పరిణామాలు
శ్రీకృష్ణకమిటీ చేసిన 6 సూచనల్లో 4 ఆచరణ సాధ్యంకాదని కమిటీ స్పష్టం చేసింది. ఐదో సూచనను అమలు చేసినట్లయితే ఎదురయ్యే పరిణామాలను వివరిస్తూ చేసిన ఈ సూచన రెండో ప్రాధాన్యత గలదని కమిటీ తేల్చింది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆరో సూచన అమలు చేయడమే తమ దృష్టిలో అత్యుత్తమమైనదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి తోడు కమిటీ చేసిన అస్పష్టమైన పరిష్కార మార్గాలతో తెలంగాణ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్యమ జ్వాలలు తారాస్థాయిలో ఎగిసిపడ్డాయి. టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద 2010, జనవరి 6న భారీస్థాయిలో ధర్నా నిర్వహించాయి. తెలంగాణవ్యాప్తంగా కమిటీ నివేదికను దహనం చేస్తూ నిరసన ప్రదర్శనలు నిత్యకృత్యం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, శ్రీకృష్ణ కమిటీ పక్షపాతాన్ని నిరసిస్తూ తెలంగాణ ఐకాస ఇచ్చిన బంద్ 2010, జనవరి 7న విజయవంతమైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీ కుట్రలను తెలంగాణ ఉద్యోగ, ప్రజాసంఘాలు బట్టబయలు చేశాయి. కమిటీ సభ్యుల పనితీరు మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉందని తెలంగాణవాదులు ఆరోపించారు. సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన ప్రైవేటు విందుకు కమిటీ సభ్యకార్యదర్శి దుగ్గల్ స్వయంగా హాజరయ్యారు. శ్రీకృష్ణ కమిటీ రూపొందించిన నివేదికలోని 8వ అధ్యాయాన్ని భారత ప్రభుత్వానికి సీల్డ్ కవర్లో అందించింది. ఈ నివేదికను రహస్యంగా ఉంచాలని కమిటీ సూచించింది. నివేదికలోని ప్రతి పేజీమీద సీక్రెట్ అని ముద్రించింది. ఇలా కమిటీ నివేదికలోని 8వ అధ్యాయాన్ని రహస్యంగా ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణవాదులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.
చీకటి కోణం-8వ అధ్యాయం
-జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఎనిమిదో అధ్యాయాన్ని బహిర్గతం చేయాలని నిజామాబాద్ మాజీ ఎంపీ పండిట్ నారాయణరెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై వాదోపవాదాలు విన్న అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి.. ఈ అధ్యాయాన్ని కేంద్ర హోంశాఖ నుంచి తెప్పించుకుని చదివి, దాన్ని రెండు వారాల్లోగా బహిర్గతం చేయాలని 2011, మార్చి 23న హోంశాఖను ఆదేశిస్తూ 58 పేజీల తుదితీరు ్ప వెలువరించారు.
తొమ్మిది అధ్యాయాలు
1.పెద్దమనుషుల ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేయకపోవడంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి.
2.రాష్ట్రంలో అన్నిటికంటే వెనుకబడింది రాయలసీమ. తెలంగాణలో కూడా హైదరాబాద్‌పై మినహా ఇతర ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించలేదు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లతో పోలిస్తే తెలంగాణ జీడీపీ ఎక్కువ.
3.1971 తర్వాత తెలంగాణలో మిగతా ప్రాంతాలకంటే ఎక్కువ అక్షరాస్యత నమోదైంది. విద్యాసంస్థల విషయంలోనూ పరిస్థితి బాగానే మెరుగుపడింది.
4.సాగునీటి రంగంలో ఏ ప్రాంతం నిర్లక్ష్యానికి గురికాలేదు.
5.తెలంగాణ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న రక్షణాత్మక చర్యలు సమర్థంగా అమలు చేయాలి. కొత్త చర్యలేవీ అవసరం లేదు.
6.తెలంగాణ యాసను సినిమాల్లో గేలిచేస్తున్నారనే భావన వారిలో ఉంది. ఉత్తరాంధ్రుల్లోనూ ఇదే తరహా భావన ఉన్నది. ఒక ప్రాంతం మరో ప్రాంతంపై సాంస్కృతికంగా పెత్తనం చెలాయిస్తూ ఉపాధిపరంగా, రాజకీయంగా వారిని అణగదొక్కే ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
7.హైదరాబాద్ ప్రాధాన్యతను వివరించింది.
8.శాంతిభద్రతలు తదితరాంశాలపై కీలక సూచనలు చేసింది. (ఈ అధ్యాయాన్ని సీల్డ్కవర్లో పెట్టి నేరుగా హోంమంత్రికి అందించింది)
9.పై ఎనిమిది అధ్యాయాలను పరిశీలించి భవిష్యత్ మార్గనిర్దేశనం చేసే 6 సూచనలను శ్రీకృష్ణ కమిటీ చేసింది. అవి..
9వ అధ్యాయంలోని ఆరు సూచనలు
1. యథాతథ స్థితి కొనసాగింపు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ఎప్పటిలా రాజకీయ, శాంతి భద్రతల సమస్యగానే పరిగణిస్తూ రాష్ర్టానికే వదిలేయడంవల్ల ప్రయోజనం శూన్యం. కొంత కేంద్ర ప్రభుత్వం జోక్యం తప్పనిసరి. తక్షణం కచ్చితమైన చర్యలేవీ లేకపోతే తెలంగాణ ప్రజలు మానసికంగా సంతృప్తి చెందే అవకాశమేలేదు. అయితే యథాతథ స్థితి ఒక ప్రతిపాదన మాత్రమే. మేం దానికి చిట్టచివరి ప్రాధాన్యం మాత్రమే ఇస్తున్నామని కమిటీ అభిప్రాయపడింది.
2. సిమాంధ్ర, తెలంగాణలుగా విభజించి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం: ఇలా చేయడంవల్ల కాలక్రమంలో రెండు రాష్ర్టాలు సొంతంగా తమ రాజధానులను అభివృద్ధి చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల తమ ఆర్థిక ప్రయోజనాలకు నష్టముండదు. కాబట్టి ఇది సీమాంధ్ర ప్రజలకు కొంత ఆమోదయోగ్యం కావచ్చు. కానీ తెలంగాణలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతాయి. వారికి తెలంగాణ వచ్చిన తృప్తే ఉండదు. కాబట్టి ఆచరణలో ఇది అసాధ్యం.
3. రాష్ర్టాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్రలుగా విభజించడం: రాష్ర్టాన్ని విభజించి హైదరాబాద్‌ను రాయల తెలంగాణ రాజధానిగా చేయాలని కమిటీ సూచించింది. కొన్ని రాయలసీమ వర్గాలు, ముస్లిం జనాభా ప్రాబల్యం దృష్టితో ఎంఐఎం ఈ ప్రతిపాదన తెచ్చాయి. దీన్ని తెలంగాణ వాదులు ఒప్పుకోరు. పైగా ఇది మతఛాందస శక్తులకు ఊతమివ్వచ్చు. అయితే ఈ ప్రతిపాదన ఆర్థికంగా సమర్థనీయంగా ఉన్నప్పటికీ మూడు ప్రాంతాలను సంతృప్తిపరిచే పరిష్కారం ఇవ్వలేదని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
4. సీమాంధ్ర, తెలంగాణలుగా విభజన-హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం: రాష్ర్టాన్ని ఈ విధంగా విభజించి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)గా ప్రకటించాలి. అంతేకాకుండా నల్లగొండ-మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దుల్లోని 20 మండలాలను యూటీలో భాగం చేయాలి. తద్వారా హైదరాబాద్ యూటీని సీమాంధ్రలోని గుంటూరు, కర్నూలు జిల్లాల సరిహద్దులతో భౌగోళికంగా అనుసంధానం చేయాలి. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయడం. అయితే దీనికి తెలంగాణవాదులు ఒప్పుకునే వీళ్లేదు. అంతేకాకుండా రాష్ట్రంలో కొంతభాగాన్ని కేంద్రపాలన కిందకు తేవడంపై మూడు ప్రాంతాల నుంచి వ్యతిరేకత రావచ్చు.
5. సీమాంధ్ర, తెలంగాణగా విభజన: రాష్ర్టాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి తెలంగాణకు హైదరాబాద్‌ను, సీమాంధ్రకు మరో కొత్త రాజధాని ఏర్పాటు చేయడం. దీంతో తెలంగాణ ప్రజల పూర్తి ఆకాంక్ష నెరవేరుతుంది. కానీ హైదరాబాద్, జల వనరుల విషయమై సీమాంధ్రలో అల్లర్లు రేగవచ్చు. రాయలసీమలోనూ, దేశమంతా వేర్పాటు డిమాండ్లు రావొచ్చు. అయితే ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌లో కొంత న్యాయం లేకపోలేదు. విభజిస్తే ప్రజల అవసరాలనూ పట్టించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ద్వితీయ ప్రాధాన్యం. అనివార్యమైతేనే అందరికీ ఆమోదయోగ్యమైతేనే విభజించాలని సిఫార్సు చేస్తున్నాం.
6. రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచడం-తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు: తెలంగాణ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి రాజకీయ సాధికారతకూ, నిర్దిష్టమైన రాజ్యాంగబద్ధ చర్యలు తీసుకుంటూ రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచడం. రాష్ర్టాన్ని ముక్కలు చేయడంవల్ల ప్రస్తుత సమస్యలకు సుస్థిర పరిష్కారాలు రావు. సమైక్యంగా ఉండటం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికే కీలకం. అందుకే రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచుతూనే తెలంగాణ ప్రాంత అభివృద్ధికి రాజ్యాంగబద్ధమైన ప్రాంతీయ మండలి ఏర్పాటును సిఫారసు చేస్తున్నాం. జాతీయ దృక్పథంతో చూసినా ఇదే మేలు. అందుకే దీనికే మా తొలి ప్రాధాన్యం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు