Rupee Fall | రూపాయి పతనం – కారణాలు, పరిష్కారాలు
రూపాయి విలువ పతనం అనేది ఏ మాత్రం వాంఛనీయం కాదు. దీనివల్ల ఎన్నో రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది. మొత్తం భారం సామాన్య వినియోగదారులపై పడుతుంది. కాబట్టి ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో సరైన అవగాహన, పరస్పర సహకారంతో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకుని దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
సివిల్స్, గ్రూప్-1 వంటి పరీక్షల్లో ఈ అంశంపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిపుణ పాఠకుల అవగాహన కోసం ఈ వ్యాసం..
– రోజురోజుకు పతనమవుతున్న రూపాయి మారకపు విలువ ప్రభావం, కారణాలపై దేశంలోని వివిధ వర్గాల్లో ఆసక్తి పెరుగుతున్నది. రూపాయి పతనం ప్రభావం అంతిమంగా వినియోగదారులపై పడుతుండటం ఆందోళన కలిగించే అంశం.
– రూపాయి పతనానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ… ప్రస్తుతం అంతర్జాతీయ కారణాలున్నట్లు కనిపిస్తున్నది. ఈ పరిస్థితిని అదుపు చేయడం ప్రభుత్వం చేతుల్లోగానీ, భారత రిజర్వ్ బ్యాంకు చేతుల్లోగానీ లేకపోవడం బాధాకరం. అయినప్పటికీ అంతర్గతంగా, దేశీయంగా మనం చేయాల్సిన మార్పులు, సంస్కరణలు చాలా ఉన్నాయి.
– రూపాయి విలువ పతనం వేగంగా జరుగుతున్నది. అయిదు నెలల క్రితం వరకు డాలర్‌తో రూపాయి మారకపు విలువ క్షీణత తక్కువ శాతం ఉన్నప్పటికీ, గత అయిదు నెలలుగా క్షీణత శాతం క్రమంగా పెరుగుతున్నది. మరీ ముఖ్యంగా వారం నుంచి ఈ క్షీణత మరింత పెరిగింది. డాలర్‌తో పోల్చుకుంటే కనిష్టంగా రూ. 73కి తగ్గింది. ఇది జీవనకాల కనిష్టం. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ భరోసాతో రూపాయి పుంజుకుంటున్నది.
కారణాలు దేశీయమా? అంతర్జాతీయమా?
– రూపాయి బలహీనతకు అంతర్జాతీయ పరిస్థితులు చాలా వరకు కారణం. అందులోనూ ముడిచమురు ధర చాలా ప్రభావం చూపుతున్నది.
– దేశానికి ఇరాన్‌తో చాలా మంచి సంబంధాలు ఉండటంవల్ల వర్తక వాణిజ్యం, మరీ ముఖ్యంగా చమురు దిగుమతులు ఎక్కువగా ఆ దేశం నుంచి చేసుకుంటున్నాం. ఇప్పుడు అమెరికా ఆంక్షల కారణంగా బ్యారెల్ ముడి చమురు ధర 45 డాలర్ల నుంచి 75 డాలర్లకు చేరుకున్నది. చమురు దిగుమతులపై ఆధారపడిన మన దేశానికి ఇది శరాఘాతం. అందువల్ల చమురు ధరలు పెరిగిన ప్రతిసారి రూపాయి విలువ క్షీణిస్తుంది.
– దేశంలో ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ. దీనివల్ల కరెంటు ఖాతా లోటు (CAD) పెరిగిపోవడం మూలంగా రూపాయి మారకపు విలువ క్షీణిస్తుంది.
– ఆర్థిక వ్యవస్థలో ఇంధన వనరులది కీలకపాత్ర. మనదేశ ఇంధన ఉత్పత్తి, ఉత్పాదకత, ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువ.
– అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాల్లో ముఖ్యంగా అమెరికా తన దగ్గర ఉన్న షెల్ గ్యాస్‌తో ఆడుతున్న ఆట వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తుంది. కొంతకాలం క్రితం షెల్ గ్యాస్ ఉత్పత్తిని పెంచి, ఇంధన ధరల పతనానికి కారణం అయిన అమెరికా నేడు అదే షెల్ గ్యాస్ ఉత్పత్తిని తగ్గించి, దిగుమతులు పెంచుకోవడం ద్వారా ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. మన దేశం నుంచి వేరే దేశాల్లోకి తరలివెళ్లే సొమ్ముకు అంతే మొత్తంలో పెట్టుబడులు రాకపోవడం కూడా ఒక పెద్ద కారణం. ఇతర దేశాల నుంచి మనం చేసుకునే దిగుమతులకు, తగినట్టుగా ఎగుమతులు చేయకపోతే వాణిజ్యలోటు పెరిగిపోతుంది. కాబట్టి మనదేశం నుంచి పెట్టుబడులు తరలిపోకుండా చూడాలి.
– అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వల్ల చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభావితం అయ్యాయి. దీని మూలంగా మార్కెట్లో విశ్వాసం సన్నగిల్లుతున్నది. పెట్టుబడులు అనేకం వెనక్కి వెళ్లిపోవడంవల్ల రూపాయి విలువ క్షీణిస్తున్నది.
– అమెరికన్ ఫెడరల్ బ్యాంకు వడ్డీరేట్లు పెంచవచ్చు అనే ఊహాగానాల నేపథ్యంలో చాలా దేశాల నుంచి సంపద తరలి వెళ్లిపోతుంది. మన దేశంతోపాటు ఇతర దేశాల కరెన్సీ కూడా దీనివల్ల బలహీన పడుతున్నది.
– విపరీతమైన, విచ్చలవిడి దిగుమతుల కారణంగా విలువైన విదేశీ మారకద్రవ్యం విదేశాలకు తరలిపోతున్నది.
– ఎలక్ట్రానిక్స్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, బంగారం దిగుమతులు పెరగడం, కరెంటు ఖాతా లోటుకు దారితీస్తుంది.
– దేశంలో శాంతి భద్రతలపై విదేశాల్లో మంచి అభిప్రాయం లేకపోవడంతో పర్యాటకుల రాక కూడా ఆశించినంతగా జరగడంలేదు. ఇదే సమయంలో భారతీయుల విదేశీ ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
వివిధ వర్గాలపై ప్రభావం
– రూపాయి మారకపు విలువ తగ్గడంతో సమాజంలో దాదాపు అన్ని వర్గాలమీద విపరీతమైన ప్రభావం ఉంటుంది.
– వాణిజ్య లోటు స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో ఈ ఒక్క నెలలోనే 2.5 శాతం ఉంది. మన అవసరాల్లో దాదాపు సగం దిగుమతుల వల్లే తీరుతున్నాయి. కాబట్టి ఆ మేరకు పన్నులన్నీ కలిపి ఆ భారాన్ని సామాన్య ప్రజానీకంపై మోపుతారు.
– ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడంతో దానికి సంబంధించిన అన్ని రకాల సేవలపై భారం పడుతుంది. ప్రయాణ చార్జీలు, కూరగాయల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం అధికమవుతుంది. ప్రజల జీవన వ్యయం పెరగడం వల్ల ఆదాయపు విలువ తగ్గి ప్రజలకు తీవ్ర భారంగా మారుతుంది.
– అందువల్ల రూపాయ క్షీణతను మరింతకాలం అలాగే కొనసాగించడం మంచిదికాదు. కాబట్టి ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవడం మంచిది.
పరిష్కార మార్గాలు ఉన్నాయా?
– రిజర్వ్ బ్యాంక్ తన చేతిలో ఉన్న ద్రవ్య పరపతి విధాన సమీక్ష ద్వారా దీన్ని కట్టడి చేయవచ్చు. అయితే అది సులువైన అంశం కాదు. ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్యాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తే మన దగ్గర ఉన్న నిల్వలు పడిపోతాయి. అది కూడా మంచి పరిణామం కాదు.
– మన ఎగుమతులను, ఉత్పాదకత, సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది.
– ప్రభుత్వాలు ఉద్యోగ కల్పన, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి. దీంతో ఉత్పత్తి పెరిగి ఎగుమతులు చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించి రూపాయి స్థిరీకరణ చేయవచ్చు.
– మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రతలను మెరుగుపర్చడంతో దేశంలో విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచవచ్చు.
– దేశీయంగా ఎలక్ట్రానిక్స్ సంస్థలు నెలకొల్పడం, ఉన్నవాటి సామర్థ్యాన్ని, ఉత్పత్తిని పెంచి దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాలి.
– దిగుమతుల్లో ప్రముఖపాత్ర వహిస్తున్న ఇంధన అవసరాల కోసం దేశీయ సంస్థల్ని పురికొల్పి, ఎక్కువ ఉత్పత్తిని సాధించేలా చేయాలి.
– ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పాదకతను పెంచుకోవడం ద్వారా స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంది.
– దేశీయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడం ద్వారా ఎగుమతులకు అవకాశం కల్పించాలి.
– ఆర్బీఐ, ప్రభుత్వం సమన్వయంతో మార్కెట్ ఇంటర్వెన్స్ను చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి.
– విదేశాలతో మంచి వర్తక, వాణిజ్య సంబంధాలు నెరపడం ద్వారా తక్కువ ధరకే ఇంధన దిగుమతులు చేసుకోవచ్చు.
– విదేశీ ప్రయాణాలు, పెట్టుబడులపై పరిమిత స్థాయిలో సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చు.
– విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను ఆకర్షించాలి.
– ఎగుమతిదారులకు పన్ను రాయితీలు ఇవ్వాలి. ఎగుమతి రుణాలు సులభంగా లభ్యమయ్యేలా చూడాలి.
– ఎగుమతులు పెంచుకోవడానికి రూపాయి బలహీనత ఒకరకంగా ఉపయోగపడుతుంది. విదేశీ మార్కెట్లో మన వస్తువులు చవక ధరలకే దొరుకుతాయి. మన పొరుగున ఉన్న చైనా ఇలానే చేసి విజయం సాధించింది.
– టెక్స్టైల్స్, తోలు వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్ ఎగుమతులు ఇటీవల తగ్గాయి. దీన్ని పరిగణించి మళ్లీ ఎగుమతులు పెంచాలి.
– రూపాయి విలువ పతనం అనేది ఏ మాత్రం వాంఛనీయం కాదు. దీనివల్ల ఎన్నో రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది. మొత్తం భారం సామాన్య వినియోగదారులపై పడుతుంది. కాబట్టి ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో సరైన అవగాహన, పరస్పర సహకారంతో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకుని దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు