తెలంగాణ మహాసభ
-ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లోనే ప్రారంభమైన ఉల్లంఘనల పర్వాన్ని నిలువరించడానికి మేధావులందరూ కలిసి ఈ సభను ఏర్పాటు చేశారు.
-ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ద్వారానే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడవచ్చనే ఉద్దేశంతో 1958లో రాష్ట్రపతికి, 1961లో ప్రధాని నెహ్రూకు, 1967లో ఉపరాష్ట్రపతి వీవీ గిరికి వినతిపత్రాలు ఇచ్చారు.
-అయితే వీటివల్ల ఎలాటి ప్రయోజనం లేకపోయింది.
తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి
-తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి అధ్యక్షుడు టీ పురుషోత్తమరావు, ప్రధాన కార్యదర్శి ముచ్చర్ల సత్యనారాయణ.
-తెలంగాణ రక్షణల ఉద్యమంలో భాగంగా 1969, జూలై 10న తెలంగాణలోని అనేక జిల్లాల్లో తెలంగాణ హక్కుల దినం సభలు నిర్వహించారు.
-హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ హక్కుల దినం సభలో మొదటిసారి బీఎస్ మహదేవ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రస్తావన తీసుకువచ్చారు.
-1969లో జై తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రక్షణల ఉద్యమం పునాదిగా మారింది.
తెలంగాణ ప్రాంతీయ సమితి-1968
-దీని అధ్యక్షుడు కొలిశెట్టి రామదాసు, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న.
-ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో పనిచేస్తున్న దొంగ ముల్కీలను గుర్తించి తొలగింపజేయడం తెలంగాణ ప్రాంతీయ సమితి ప్రధాన ఉద్దేశాలుగా ఉండేవి.
-తెలంగాణ ప్రాంతీయ సమితి దొంగ ముల్కీలను తొలగించడానికి ధర్నాలు, నిరాహారదీక్షలు నిర్వహించేది.
-రామదాసు ప్రోత్సాహంతో ప్రారంభమైన కొత్తగూడెం నిరసనలు, రవీంద్రనాథ్ దీక్ష ఉద్యమ విస్తృతికి దోహదపడినాయి.
తెలంగాణ రక్షణలను కోరే వర్గం
-దీని అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి.
-ఈ వర్గం ఉద్దేశం తెలంగాణ రక్షణల అమలు (రాష్ట్ర సమైక్యత వీరి లక్ష్యంగా ఉండేది)
-వీరి కేంద్ర స్థానం వివేకవర్ధిని కాలేజీ (కోఠి)
-ఈ వర్గంలో విద్యార్థి ఫెడరేషన్ (సీపీఐ) వారు చేరడంతో ఉద్యమం బలంగా కొనసాగింది.
తెలంగాణ విమోచన ఉద్యమ సమితి సదస్సు
-ప్రజా కవి కాళోజీ నారాయణరావు అధ్యక్షతన 1969, జనవరి 28న ఈ సదస్సు జరిగింది.
-కాళోజీ నారాయణరావు అధ్యక్షతన 1969, జూన్ 6న జరిగిన తెలంగాణ రచయితల సదస్సులో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడతామని తెలంగాణ రచయితలు ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ (1969, ఫిబ్రవరి 18)
-కొంతమంది మేధావులు, పాత్రికేయులు కలిసి తెలంగాణ వతన్‌దార్ల సంఘం కార్యాలయంలో ఈ కన్వెన్షన్‌ను ఏర్పాటు చేశారు.
-దీని కన్వీనర్ మదన్ మోహన్ (సిద్దిపేటకు చెందిన లాయర్)
-తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ మార్చి 17న ప్రజాస్వామ్య రక్షణ దినం, తెలంగాణ పోరాట దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజాసమితి
-1969, మార్చి 25న తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ తెలంగాణ ప్రజాసమితిగా ఆవిర్భవించింది.
-దీని అధ్యక్షుడు మదన్ మోహన్, కార్యదర్శి నాగాకృష్ణ.
-విద్యార్థులు, యువకులు కొనసాగిస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఈ సమితిని ఏర్పాటు చేశారు.
తెలంగాణ లాయర్ల సంఘం
-ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా తమవంతు సహకారం అందించడానికి బీసీ జైన్ అధ్యక్షతన ఈ సంఘం ఏర్పడింది.
-జైలుపాలైన ఉద్యమ విద్యార్థుల తరఫున వాదించిన సుప్రసిద్ధ న్యాయవాది జీ నారాయణరావు.
-తెలంగాణ లాయర్లు అంతా కలిసి 1969, ఏప్రిల్ 15న ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కోర్టు విధులను బహిష్కరించారు.
తెలంగాణ యూనివర్సిటీ కాలేజీ టీచర్స్ కన్వెన్షన్
-తెలంగాణ ప్రాంతంలో ప్రారంభమైన ఆందోళనలు, అశాంతి, నిరసనలకు మౌలిక కారణాలను విశ్లేషించడానికి ఈ సదస్సు ఏర్పాటయ్యింది.
-1969, మే 20న ప్రారంభమైన ఈ సభకు అధ్యక్షత వహించినది ప్రొఫెసర్ షా మంజూరే ఆలం.
-ఈ సభలో ప్రారంభ ఉపన్యాసం చేసినది ప్రొ. రావాడ సత్యనారాయణ (ఓయూ వైస్ చాన్సలర్).
-తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాలపై అనేక మంది విద్యావంతులు శాస్త్రీయ విశ్లేషణలు, గణాంకాలతో కూడిన పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు.
-ఈ సభలో పరిశోధనాత్మక పత్రాలు సమర్పించినవారు ప్రొ. జయశంకర్ సార్, బషీరొద్దీన్, పెన్నా లక్ష్మీకాంతరావు, శ్రీధర్ స్వామి, తోట ఆనందరావు, రాధేశ్యామ్ శర్మ.
-ఈ సభలో సమర్పించిన పరిశోధన పత్రాలన్నింటిని కలిపి తెలంగాణ సమస్యలపై రూపొందించిన తొలి పరిశోధనాత్మక గ్రంథం- తెలంగాణ మూవ్మెంట్ ఇన్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్డ్
-ఈ గ్రంథంలో జయశంకర్ సార్ సమర్పించిన డా. కేఎల్ రావు నాగార్జునసాగర్ అనే పరిశోధనా పత్రంపై పార్లమెంట్లో చర్చ జరిగింది.
-ప్రధాని ఇందిరాగాంధీ జయశంకర్ సార్ తదితరులను ఢిల్లీకి పిలిపించి ఈ అంశంపై చర్చించారు.
-తెలంగాణ సమస్యను సత్వరమే పరిష్కరించకపోతే నక్సలైట్లు రంగప్రవేశం చేసే అవకాశం ఉంటుందని ఈ సదస్సు హెచ్చరించింది.
రెడ్డి హాస్టల్ సదస్సు
-హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్లో 1969, మార్చి 8, 9 తేదీల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా తొలి తెలంగాణ సదస్సు జరిగింది.
-ఈ సదస్సుకు అధ్యక్షత వహించినది సదాలక్ష్మి. ప్రారంభ ఉపన్యాసం చేసినది ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ.
-1969, ఏప్రిల్ 6లోపు ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేంతవరకు విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలను బహిష్కరించి నిరవధిక సమ్మె చేయాలని ఈ సదస్సులో తీర్మానించారు.
సదస్సు ప్రత్యేకతలు
-ఈవీ పద్మనాభన్, ఆదిరాజు వెంకటేశ్వర్లు రూపొందించిన తెలంగాణ మ్యాప్‌ను టీ పురుషోత్తమరావు ఈ సభలో ఆవిష్కరించారు.
-దాదాపు 3000 మందికి పైగా ఈ సభకు హాజరై జై తెలంగాణ నినాదాలు చేశారు.
-ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి సర్వస్వం త్యాగం చేస్తామని సభ్యులతో జగన్మోహన్రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు.
-ఈ సభలో ప్రసంగించిన శ్రీధర్ రెడ్డి తొలిసారిగా క్విట్ తెలంగాణ నినాదాన్ని ఇచ్చారు.
వరంగల్ విద్యార్థుల కార్యాచరణ సంఘం
-వరంగల్ ఆర్ట్స్, సైన్స్ కాలేజీలో 1969, మార్చి 12న విద్యార్థి సంఘాల కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది.
-ఈ సమావేశ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి (ఆర్ఈసీ కాలేజీ అధ్యక్షుడు)
పోటీ తెలంగాణ ప్రజాసమితి
-ఉద్యమంలోకి రాజకీయ నాయకుల ప్రవేశాన్ని నిరసిస్తూ విద్యార్థులు శ్రీధర్‌రెడ్డి అధ్యక్షుడిగా పోటీ తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేశారు.
-పోటీ తెలంగాణ ప్రజాసమితి మార్చి 26న సత్యాగ్రహ దినం ప్రకటించగా అనేకమంది నాయకులు సత్యాగ్రహం చేసి జైలుపాలయ్యారు.
తెలంగాణ కార్మికుల కార్యాచరణ సమితి
-గోవింద్ సింగ్ అధ్యక్షుడిగా 1969, జూన్ 7న తెలంగాణ కార్మికుల కార్యాచరణ సమితి ఏర్పడింది.
-తెలంగాణ కార్యాచరణ సమితి రాష్ట్రపతి పాలన కోసం డిమాండ్ చేసింది.
-1969 జై తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల్లోని 2.5 లక్షల మంది కార్మికులు కలిసి పోలీసు కాల్పులకు నిరసనగా సమ్మె చేశారు.
తెలంగాణ ప్రజాపరిషత్
-తెలంగాణ ప్రజాసమితి కాంగ్రెస్‌లో విలీనం కావడంతో నిరాశ చెందిన ఉద్యమ నాయకులు తెలంగాణ ప్రజాపరిషత్ను ఏర్పాటు చేశారు.
-ఈ పరిషత్‌ను ఏర్పాటు చేసిన నాయకులు కేఆర్ ఆమోస్, ఎం జగన్మోహన్ రెడ్డి, ఎస్ రవీందర్రావు.
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ)
-ఉద్యోగుల ఇబ్బందులను, వారి సర్వీసు ప్రమోషన్లను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన నాయకుడు కేఆర్ ఆమోస్.
-టీఎన్జీఓ సంఘం వ్యవస్థాపకుడు కేఆర్ ఆమోస్ ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణల ఉల్లంఘన, ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం ఒక జీఓ విడుదల చేసింది.
-1968, ఏప్రిల్ 30న విడుదల చేసిన ఆ జీవో ప్రకారం స్థానికులకు కేటాయించిన ఉద్యోగాల్లో నియమించిన స్థానికేతరులను వెనక్కి పంపాలని సచివాలయం శాఖాధిపతులను ఆదేశించింది.
-అయితే ఆ జీవో అమలు ద్వారా ఉద్యోగాలు కోల్పోయిన స్థానికేతరులు కోర్టుకెళ్లి వారికి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకోగా, కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ జీవో అమలుచేయబడలేదు.
తెలంగాణ విద్యార్థి హక్కుల రక్షణ కార్యాచరణ సంఘం
-వరంగల్ కాలేజీ విద్యార్థి సంఘాల ప్రతినిధులు 1969, జనవరి 11న సమావేశమై తెలంగాణ విద్యార్థి హక్కుల రక్షణ కార్యాచరణ సంఘంను ఏర్పాటు చేశారు.
-దీని అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, కార్యదర్శి సురేందర్ రెడ్డి.
-విద్యార్థులతో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఒక విద్యా ఏడాదిని కోల్పోయినప్పటికీ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు నడిపించారు.
తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి
-ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు 1969, జనవరి 13న సమావేశమై తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితిని ఏర్పాటు చేశారు.
-ఈ కార్యాచరణ సమితి ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్
-ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించడంతో విద్యార్థులు రెండు వర్గాలుగా చీలిపోయారు.
-మల్లికార్జున్ కార్యదర్శిగా ఏర్పడిన తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది.
-దీని కేంద్రస్థానం నిజాం కాలేజీ.