– రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిసి సంయుక్తంగా ఏర్పడిన తెలంగాణ జేఏసీకి రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తి కన్వీనర్ కావడం విశేషం. అనతికాలంలోనే అన్ని స్థాయిల్లో టీజేఏసీలు ఆవిర్భవించి క్రమంగా గ్రామస్థాయి వరకు విస్తరించాయి. ఇలా విరివిగా జేఏసీలు ఆవిర్భావానికి సీమాంధ్ర నేతలు, కేంద్రప్రభుత్వం ఊహించలేకపోయాయి. తెలంగాణవాదులు ఏకం కాకుండా, శక్తిగా ఎదగకుండా చేసి సీమాంధ్ర పాలకులు ఇంతకాలం విజయం సాధించారు. అయితే జెండాలు పక్కనపెట్టి తెలంగాణ పార్టీలన్నీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడటం ఉద్యమం సాధించిన గొప్ప విజయం.
– ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని వెంటనే ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి జేఏసీ తొలిసారి తెలంగాణ బంద్‌కు 2009, డిసెంబర్ 30న పిలుపునిచ్చింది. ఈ విధంగా తెలంగాణ జేఏసీ ఇచ్చిన బంద్‌లో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. యావత్ తెలంగాణ సమాజం రాజకీయాలు, పార్టీలు, సిద్ధాంతాలు, జెండాలు, ఎజెండాలు పక్కనబెట్టి కుల, మతాలకతీతంగా మొదటిసారిగా ఏకమై గతంలో ఎన్నడూ చూడని విధంగా బంద్ కొనసాగింది.
– ఓయూ విద్యార్థుల ఆమరణ దీక్ష: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో 18 మంది విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షను 2009, డిసెంబర్ 24న ప్రారంభించారు. విద్యార్థుల ఉద్యమ తీవ్రతను గ్రహించిన ప్రభుత్వం మరోసారి డిసెంబర్ 28 నుంచి హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తూ సర్క్యులర్ జారీచేసింది.
– వీరిని స్ఫూర్తిగా తీసుకుని కేయూ విద్యార్థులు కూడా డిసెంబర్ 28 నుంచి ఆమరణ దీక్షలు ప్రారంభించారు. అదేవిధంగా తెలంగాణలోని మిగతా యూనివర్సిటీల విద్యార్థులు కూడా ఆమరణ దీక్షలకు దిగారు. ఇలా అన్ని యూనివర్సిటీల్లో తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరింది. అయితే రోజురోజుకు యూనివర్సిటీల్లో పరిస్థితులు విషమిస్తున్నాయని ప్రభుత్వం గ్రహించి డిసెంబర్ 28న దీక్షా శిబిరంపై పోలీసులతో దాడి చేయించింది. దీక్షలో కూర్చున్న 12 మంది విద్యార్థులను బలవంతంగా గాంధీ ఆస్పత్రికి తరలించారు.
– ఈ ఘటనపై తెలంగాణ రాజకీయ ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం సీఎంను కలిసి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీక్ష చేస్తున్న విద్యార్థులను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించగా వారు ఆస్పత్రిలోనే తమ దీక్షను కొనసాగించారు. ఇలా 7 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న ఓయూ విద్యార్థుల ఆరోగ్యం బాగా క్షీణించింది. విషయం తెలిసిన తెలంగాణ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు విద్యార్థులను గాంధీ ఆస్పత్రిలో పరామర్శించారు. డిసెంబర్ 30న మరింతగా విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతినడంతో పోరాడి తెలంగాణ సాధిద్దామని కేసీఆర్ నచ్చజెప్పడంతో వారు దీక్ష విరమించారు. కానీ రిలే దీక్షలు మాత్రం కొనసాగాయి.
తెలంగాణ యూనివర్సిటీల అధ్యాపకుల సంఘం
– తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణ పరిధిలోని 9 యూనివర్సిటీల అధ్యాపకులు సికింద్రాబాద్‌లోని టీచర్స్ హోంలో 2009, డిసెంబర్ 28న తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. ఈ సంఘం కన్వీనర్‌గా ఓయూ అధ్యాపకులు భట్టు సత్యనారాయణ, కో కన్వీనర్‌గా కేయూ అధ్యాపకులు పాపిరెడ్డి నియమితులయ్యారు. ఈ సంఘం ప్రధానంగా ఆయా యూనివర్సిటీల్లో విద్యార్థులు కొనసాగించే ఉద్యమానికి చేదోడు వాదోడుగా నిలిచింది.
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు
– అఖిలపక్ష సమావేశం తెలంగాణలోని ఏ ఒక్క వర్గాన్ని సంతృప్తిపర్చలేకపోయింది. ఫలితంగా తెలంగాణలో ఆందోళనలు ఎక్కువయ్యాయి. తెలంగాణ రాదేమోనన్న అనుమానంతో రోజురోజుకు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఈ పరిణామాలతో తెలంగాణ ప్రాంతం అల్లకల్లోలంగా మారి రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. జరుగుతున్న ఆందోళనలను గమనించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు ముందు విస్తృత సంప్రదింపులు అవసరమనే సాకుతో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని నియమించింది. కమిటీని తెలంగాణవాదులందరూ నిర్ద్వందంగా తిరస్కరించారు. కమిటీ ఏర్పాటు లేకుండానే తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించాలని టీజేఏసీ, ప్రజా సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. గతంలో ప్రణబ్ ముఖర్జీ, రోశయ్య కమిటీలవల్ల తెలంగాణ ప్రజానీకంలో కమిటీల పట్ల నమ్మకం లేదని టీజేఏసీ ప్రకటించింది.
– ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం జనవరి 5న జరిగిన అఖిలపక్ష సమావేశానికి కొనసాగింపుగా ఫిబ్రవరి 3న జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోని అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపేందుకు నియమించింది.– ఓయూ విద్యార్థి గర్జన: రాజకీయంగా రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని నివారించడానికి 2010, జనవరి 5న అఖిలపక్ష సమావేశానికి కేంద్రప్రభుత్వం పిలుపునిచ్చింది. ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశానికి రెండు రోజుల ముందే ఓయూ జేఏసీ తమ బలాన్ని, తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అవసరాన్ని ప్రదర్శించడానికి ఆర్ట్స్ కాలేజీ వేదికగా విద్యార్థి గర్జనకు పిలుపునిచ్చింది.
కమిటీలోని సభ్యులు
– అధ్యక్షుడు: జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి
– సభ్యులు: ప్రొఫెసర్ డా. రణ్‌బీర్‌సింగ్ (వైస్‌చాన్స్‌లర్ జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం), డా. అబూసలే షరీఫ్ (సీనియర్ రిసెర్చ్‌ఫెలో, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ-ఢిల్లీ), డా. రవీందర్‌కౌర్ (ఢిల్లీలోని ఐఐటీలో మానవ సామాజిక శాస్ర్తాల విభాగం ప్రొఫెసర్), వినోద్ కే దుగ్గల్ (రిటైర్డ్ ఐఏఎస్, హోంశాఖ మాజీ కార్యదర్శి)
– ప్రభుత్వం, పోలీస్ బలగాలు ఎంత నిర్బంధం విధించినా, ఎన్ని ఆటంకాలు, అవరోధాలు కల్పించినా తెలంగాణ నలుమూలల నుంచి విద్యార్థులు తండోపతండాలుగా చేరుకుని సభను విజయవంతం చేశారు. ఓయూ విద్యార్థి గర్జన ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగేంత వరకు తెలంగాణ ఉద్యమం ఆగదని విద్యార్థులు స్పష్టమైన సంకేతాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు.
– అఖిలపక్ష సమావేశం: తెలంగాణలో డిసెంబర్ 30న జరిగిన బంద్ ప్రభావం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రులతో సహా అధికార విపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు పంచాయతీ సభ్యుడి నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో మూకుమ్మడి రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని నిర్ణయించారు.
– ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో కదలికవచ్చింది. తెలంగాణపై పార్టీల అభిప్రాయ సేకరణ కోసం ఉమ్మడి ఏపీలో గుర్తింపు పొందిన ఎనిమిది (కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, ప్రజారాజ్యం, టీఆర్ఎస్, ఎంఐఎం) రాజకీయ పార్టీలను 2010 జనవరి 5న అఖిలపక్ష సమావేశానికి (ఒక్కొక్క రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున) రావాలని కేంద్ర హోంశాఖ కోరింది. టీజేఏసీ మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అందుకోసం ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేయడానికి టీజేఏసీ పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
– కేంద్రప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ప్రకటించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమయ్యేంత వరకు శాంతియుత పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టంచేశారు. ఫిబ్రవరి 7న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రెండు భారీ బహిరంగ సభలు జరిగాయి. అందులో ఒకటి జమాతే ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో నిజాం కాలేజీ మైదానంలో, రెండోది ఓయూ క్యాంపస్ నుంచి కేయూ క్యాంపస్ వరకు సాగిన మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా లక్షలమంది విద్యార్థులతో కేయూ క్యాంపస్‌లో విద్యార్థి పొలికేక సదస్సు.
– కేంద్ర హోంమత్రి అధ్యక్షతన 2010, జనవరి 5న జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున ఇరు ప్రాంతాల నుంచి ఒక్కో ప్రతినిధి హాజరయ్యారు. కానీ ఈ సమావేశంలో పార్టీ అభిప్రాయం కాకుండా వ్యక్తుల అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ నుంచి ఒకరు సమైక్యవాదం వినిపించగా మరొకరు తెలంగాణ వాదం వినిపించారు. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐలు తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలని కోరాయి. సీపీఐ, ఎంఐఎంలు తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం చెప్పాలని కోరాయి. ప్రజారాజ్యం పార్టీ రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచాలని కోరింది.
– చివరికి కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ డిసెంబర్ 7న జరిగిన అఖిలపక్ష నిర్ణయం మేరకే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకుందని వివరించారు. రాష్ట్రంలో మాటమార్చిన పార్టీవల్లనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయమై విస్తృత స్థాయి చర్చలు జరగాలని అందుకోసం త్వరలో డిసెంబర్ 9, 23 ప్రకటనలపై ఒక కమటీ వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.