మనో విశ్లేషణవాదులు ఎక్కువగా ఉపయోగించే స్మృతి?
స్మృతి రకాలు
స్మృతి వివిధ రకాలుగా ఉంటుంది. కొంతమంది ఏదైనా చూసినా, విన్నా, చేసినా వెంటనే గ్రహిస్తారు. కొంతమంది నేర్చుకున్న విషయాన్ని ఎక్కువకాలం గుర్తుంచుకుంటే మరికొంత మంది వెంటనే మర్చిపోతారు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు స్మృతిలోని బేధాలను, స్వభావాన్ని బట్టి స్మృతిని వివిధ రకాలుగా చెప్పారు.
అవి..
1. తక్షణ స్మృతి 2. స్వల్పకాలిక స్మృతి
3. దీర్ఘకాలిక స్మృతి 4. బట్టీ స్మృతి
5. తార్కిక స్మృతి 6. క్రియాత్మక స్మృతి
7. నిష్క్రియాత్మక స్మృతి 8. సంసర్గ స్మృతి
9. రెడిన్టిగ్రేటివ్ స్మృతి
1. తక్షణ స్మృతి (Immediate Memory)
-ఏదైనా విషయాన్ని గ్రహించిన వెంటనే గుర్తుకు తెచ్చుకోవడమే తక్షణ స్మృతి. దీన్నే జ్ఞానేంద్రియ స్మృతి, సంవేదన స్మృతి అని కూడా అంటారు.
-ఈ స్మృతిలో ధారణ అతిస్వల్పంగా ఉంటుంది. అంటే సెకన్ కంటే తక్కువకాలం నుంచి కొన్ని సెకన్ల వరకు కొత్త సమాచారంతో పాత విషయాలు స్మృతి నుంచి తొలగిపోతాయి.
-దీనిలో 11 నుంచి 15 అంశాలు మాత్రమే నిలువ చేయబడుతాయి.
ఉదా: బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తికి రోడ్డు పక్కన ఉన్న రెండో హోర్డింగ్‌ను చూసేవరకు మొదట చూసిన హోర్డింగ్ గుర్తుండటం.
గమనిక:
1. 1-2 సెకన్లు మాత్రమే గుర్తులో ఉంటే తక్షణ స్మృతి.
2. 20-30 సెకన్లు మాత్రమే గుర్తులో ఉంటే స్వల్పకాలిక స్మృతి.
2. స్వల్పకాలిక స్మృతి (Short term Memory)
-తక్షణ స్మృతిలాగే ఇది కూడా తాత్కాలికమైనది.
-నేర్చుకున్న విషయాలు తక్కువకాలం స్మృతిలో ఉంటాయి. అవసరం తీరిపోగానే ఆ విషయాలను మర్చిపోతాం.
-ఏదైనా ఒక విషయాన్ని రిహార్సల్ చేసుకోకుండా ఉంటే, 30 సెకన్ల వరకు స్మృతిలో ఉంటుంది.
ఉదా: సినిమా హాల్లోకి వెళ్లి, సీటు నంబర్ చూసుకుని కూర్చున్న తర్వాత సీటు నంబర్ మర్చిపోవడం.
3. దీర్ఘకాలిక స్మృతి (Longterm Memory)
-ఈ రకమైన స్మృతిలో అభ్యసన అంశాలు ఎక్కువకాలం ధారణలో ఉంటాయి. అందుకే ఈ రకమైన స్మృతిని దీర్ఘకాలిక స్మృతి అంటారు.
-దీర్ఘకాలిక స్మృతుల ఫలితంగా ఒక వ్యక్తి ఉన్నత విద్యాంశాలను అవగాహన చేసుకోవడం, వాటిని విశ్లేషించడం, వాటి గురించి ఆలోచించి పరిశోధనలు చేయడం జరుగుతాయి.
ఉదా: బాల్యంలో నేర్చుకున్న ఎక్కాలు, పద్యాలు, గేయాలు, పాటలు పెద్దవారైన తర్వాత కూడా గుర్తుంచుకోవడం.
4. బట్టీ స్మృతి (Rote Memory)
-విద్యార్థి విషయాన్ని యథాతథంగా అర్థంతో, అవగాహనతో సంబంధం లేకుండా నేర్చుకోవడం, వాటిని స్మృతి పథంలో దాచుకోవడమే బట్టీ స్మృతి.
-ఇలాంటి అభ్యసనం స్మృతిలో ఎక్కువకాలం ఉండదు.
ఉదా:
1. ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు అర్థరహితంగా ఎక్కాలు వల్లెవేయడం.
2. సంస్కృత శ్లోకాలను వల్లించడం.
5. తార్కిక స్మృతి (Logical Memory)
-ఒక విషయాన్ని పూర్తిగా అవగాహనతో, అర్థంతో, ఎందుకు ఏమిటి అనే విచక్షణతో, ఒక క్రమంలో ఆలోచిస్తూ అభ్యసించి స్మృతి పథంలో జ్ఞాపకం ఉంచుకోవడమే తార్కిక స్మృతి.
-ఇది దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది.
ఉదా: విద్యార్థి ఒక పద్యాన్నో, గేయాన్నో, ఒక ప్రయోగాన్నో, ఎక్కాన్నో, అర్థంతో, ఒక క్రమంతో ఆలోచించి వివేచనాత్మకంగా అర్థాన్ని గ్రహించి జ్ఞప్తికి ఉంచుకోవడం.
6. క్రియాత్మక స్మృతి (Active Memory)
-అభ్యసన అంశాలను కృత్యాల ద్వారా, ప్రయోగాల ద్వారా నేర్చుకుని జ్ఞప్తికి ఉంచుకోవడం, ప్రయత్నంతో విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం క్రియాత్మక స్మృతి.
ఉదా: 1. ఆర్కిమెడిస్ సూత్రాన్ని ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవడం.
2. త్రిభుజ నిర్మాణాలు, చతుర్భుజ నిర్మాణాలను ప్రయోగాలు చేసి గుర్తుంచుకోవడం.
3. కథలను, సంఘటనలను, సన్నివేశాలను నాటకీకరణ చేయడం ద్వారా వాటిని నేర్చుకుని జ్ఞప్తికి ఉంచుకోవడం.
7. నిష్క్రియాత్మక స్మృతి (Passive Memory)
-కృత్యాలు, ప్రయోగాలు చేయకుండానే అభ్యసన అంశాలను నేర్చుకోవడం, వాటిని స్మృతిపథంలో దాచుకోవడాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటారు.
ఉదా: చిన్ననాటి స్నేహితులను చూడగానే బాల్యంలోని విషయాలన్నీ గుర్తుకు రావడం.
8. సంసర్గ స్మృతి (Associative Memory)
-ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు, ఆ విషయాన్ని ఇతర అంశాలతో సంధానం చేస్తూ నేర్చుకుని జ్ఞప్తికి ఉంచుకోవడాన్ని సంసర్గ స్మృతి అంటారు.
ఉదా :
1. తాజ్‌మహల్ – షాజహాన్
2. కంప్యూటర్ – చార్లెస్ బాబేజ్
3. మంచి – చెడు
4. తప్పు – ఒప్పు. ఇలా విషయాల మధ్య సంసర్గం ఏర్పర్చడం ద్వారా స్మృతిలో ఉండటం.
9. రిడెన్టిగ్రేటివ్ స్మృతి
కేవలం వస్తువులను, వాటి ఆకారాలను, అనుభవాలను జ్ఞాపకం ఉంచుకోవడం మాత్రమే కాకుండా, వాటి వెనుక ఉన్న ఉద్వేగాలు, అనుభూతులను కూడా జ్ఞాపకం ఉంచుకోవడాన్ని రిడెన్టిగ్రేటివ్ స్మృతి లేదా త్వరిత సమైక్య స్మృతి లేదా సూక్ష్మీకృత సంకేతాల పద్ధతి అంటారు.
ఉదా: భార్య చనిపోయిన వ్యక్తికి, తమ పెళ్లిరోజు గుర్తురాగానే భార్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకోవడం.
గమనిక: ఈ స్మృతిని మనో విశ్లేషణవాదులు ఎక్కువగా ఉపయోగిస్తారు.
విస్మృతి (Forgetting)
-స్మృతి అంటే జ్ఞప్తికి ఉంచుకోవడం, విస్మృతి అంటే మర్చిపోవడం. స్మృతిని వెన్నంటి ఉండేది విస్మృతి.
-వ్యక్తికి, వ్యక్తికీ మధ్య విస్మృతి విధానంలో తేడా ఉంటుంది.
-కొన్ని ప్రతికూల, బాధ కలిగే విషయాలను మర్చిపోవాలన్నా మర్చిపోలేం. అలాగే కొన్ని విషయాలు ఎంతగా ప్రయత్నించి గుర్తుంచుకోవాలన్నా గుర్తుంచుకోలేం. ఈ రెండు పరిస్థితులను ఎదుర్కోవడంలో ఎవరైతే సమర్థవంతంగా వ్యవహరిస్తారో వారే ఆనందంగా ఉండగలరు.
-విస్మృతిపై పరిశోధనలు చేసినవారు – ఎబ్బింగ్హాస్
-ఎబ్బింగ్హాస్ పరిశోధనల ప్రకారం ఒక విషయాన్ని నేర్చుకున్న 20 నిమిషాలకే సుమారు 40 శాతం మర్చిపోతామని, ఒక గంటకు 50 శాతం పైనే మర్చిపోతామని అన్నాడు. ఆరోరోజు చివరికి 75 శాతం మర్చిపోతామని కనుగొన్నారు. దీని ప్రకారం అంశాన్ని నేర్చుకున్న వెంటనే విస్మృతి శాతం ఎక్కువగా ఉంటే కాలవ్యవధి పెరిగినకొద్దీ విస్మృతి శాతం తగ్గింది. కాబట్టి పునర్భలనం విషయాలను స్మృతిలో ఉంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
-ప్రయోగాత్మక మనోవిజ్ఞానశాస్త్రంలో ఒక మైలురాయి On Memory గ్రంథం. ఈ గ్రంథాన్ని ఎబ్బింగ్హాస్ రచించారు.
విస్మృతికి గల కారణాలు:
1. అనుపయోగంవల్ల విస్మృతి
-అభ్యసించిన విషయాలను ఎక్కువకాలం ఉపయోగించకపోతే వాటిని మర్చిపోయే అవకాశం ఉంది.
-కాలం గడిచిన కొద్దీ స్మృతి చిహ్నాలు క్షీణించడంవల్ల విస్మృతి సంభవిస్తుంది. దీన్ని నివారించడానికి పాఠశాలలో డ్రిల్లింగ్ పద్ధతి, ఇంటిపని, అర్థరహిత కంఠస్థం లాంటి వాటిని ప్రోత్సహించాలి.
ఉదా: స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు నేర్చుకున్న విద్యార్థి దాన్ని వాడుకలో ఉపయోగించకపోవడంవల్ల కొంతకాలానికి భాషా సామర్థ్యం కోల్పోవడం.
గమనిక: కొన్ని విషయాలకు ఇది వర్తించదు. ముఖ్యంగా చలన కౌశలాలకు సంబంధించి.
ఉదా :
1. చిన్నతనంలో ఈత, టైపింగ్, సైకిల్ తొక్కడం వంటి కౌశలాలను నేర్చుకున్న తర్వాత వాటిని కొద్దికాలం ఉపయోగించకపోయినప్పటికీ తిరిగి అవసరమైనప్పుడు ఆ నైపుణ్యాలను ప్రదర్శించగలగడం.
2. చిన్నతనంలో నేర్చుకున్న పద్యాలు వయోజనదశలో కూడా చెప్పగలగడం.
-దీని ప్రకారం విస్మృతి అన్ని విషయాల్లో సంభవించదు.
2. స్మృతి చిహ్నాలు విరూపణవల్ల విస్మృతి
-అభ్యసనం జరిగినప్పుడు అభ్యసన అంశాలు జ్ఞానేంద్రియాల ద్వారా మెదడును చేరి, మెదడులో స్మృతి చిహ్నాలు లేదా న్యూరోగ్రామ్స్ను ఏర్పరుస్తాయి.
-స్మృతి చిహ్నాలు ఏర్పడకపోయినా, చెదిరిపోయినా, క్షిణించినా దానికి చెందిన అభ్యసనాంశాలు స్మృతిపథంలో ఉండవు. కాబట్టి అభ్యసించిన విషయాలు విస్మృతి కావడానికి కారణం స్మృతి చిహ్నాలు విరూపణకు లోనుకావడమే.
ఉదా: గతంలో ఒక విద్యార్థిని ఒక వ్యాసం చదవమని, కొద్దికాలం తర్వాత ఆ వ్యాసాన్ని చెప్పమన్నప్పుడు విద్యార్థి వ్యాసాన్ని చదివినది చదివినట్లు చెప్పలేక కొన్ని అంశాలను వదిలేయడం (విరూపణ అంటే చీలికలు).
3. దమనం (Repression)
-సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షకతంత్రాల్లో ముఖ్యమైనది.
-వ్యక్తికి ఇష్టంలేని, బాధను కలిగించే విచారకరమైన విషయాలను, సంఘర్షణను, వ్యాకులతను కలిగించే అనుభవాలను ప్రయత్నపూర్వకంగా అచేతనంలోకి నెట్టివేయడమే దమనం.
-దీనివల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది.
ఉదా: సన్నిహితుల మరణవార్తను తట్టుకోలేక కావాలని మర్చిపోవడం.
4. అవరోధం (Inhibition)
-అభ్యసించిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకునేటప్పుడు దానికంటే ముందు నేర్చుకున్నది లేదా దాని తర్వాత నేర్చుకున్నది ఆటంకపర్చడాన్నే అవరోధం అంటారు. దీన్ని జోక్యప్రభావం అని కూడా అంటాం. ఇది రెండు రకాలు.
ఎ. పురోగమన అవరోధం (Projactive Inhibition)
-దీన్ని మొదట తెలిపినది – అండర్ ఉడ్
-గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా నిలుస్తాయి.
ఉదా:
1. ఒక విద్యార్థి మొదట సంస్కృతం చదివి, తర్వాత హిందీ చదివాడు. హిందీలో తాను అభ్యసించిన విషయాలు పునఃస్మరణ చేసుకుంటున్నప్పుడు సంస్కృత అంశాలు జ్ఞప్తికి వచ్చి పునఃస్మరణకు ఆటంకం కలిగించడం.
బి. తిరోగమన అవరోధం (Retroactive Inhibition)
-దీన్ని మొదట తెలిపినది – ముల్లర్ గిపిల్జెకర్
-ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన అంశాల పునఃస్మరణకు ఆటంకంగా నిలుస్తుంది.
ఉదా:
1. ముందుగా హిందీ నేర్చుకుని, తర్వాత ఉర్దూ నేర్చుకుంటే, నేర్చుకున్న హిందీని మర్చిపోయే అవకాశాలుండటం.
గమనిక: ఇచ్చిన స్టేట్మెంట్లో పాతది కొత్తదానికి అవరోధం కలిగిస్తే పురోగమన అవరోధంగాను, కొత్తది పాతదానికి అవరోధం కలిగిస్తే తిరోగమన అవరోధంగాను గుర్తించాలి.
విస్మృతి నిర్వచనాలు
-ఇంతకుముందు అభ్యసించిన విషయాలపై పూర్తిగా లేదా పాక్షికంగా పునఃస్మరణ లేదా గుర్తుంచుకునే సామర్థ్యాన్ని కోల్పోవడమే విస్మృతి
– మన్
-ఇంతకుముందు నేర్చుకున్న అనుభవాలను ఏ సమయంలోనైనా ప్రదర్శించడానికి లేదా చేయడానికి ప్రయత్నించేటప్పుడు వాటిని జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడమే విస్మృతి
– డ్రెవర్
-మూల ఉద్దీపన సహాయం లేకుండా వ్యక్తి తన భావన లేదా భావనల సమూహాన్ని చేతనంలోకి పునరుద్ధరించుకోలేక పోవడమే విస్మృతి
– భాటియా
-విస్మృతి అంటే అవసరం వచ్చినప్పుడు ఒక విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోలేక పోవడం లేదా అభ్యసించిన పనిని చేయలేకపోవడం
– జేమ్స్ హెవెర్.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు