ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు ఏవి?
కొన్ని ప్రత్యేక భౌగోళిక ప్రాంతాల్లో స్థానికంగా ఉండే ఉష్ణోగ్రత, పీడన వ్యత్యాసాలవల్ల ఏర్పడే పవనాలను స్థానిక పవనాలు అంటారు. అంటే ఈ రకమైన పవనాలు స్థానికంగా వీస్తాయి. ఈ పవనాలు అశాశ్వతం, అస్థిరం. వీటిలో ముఖ్యమైనవి..
1) స్థల (భూ), జల పవనాలు (Land, Sea Breezes)
2) పర్వత, లోయ పవనాలు (Mountain, Valley Breezes)
3) వెచ్చనిపొడి (ఉష్ణ) పవనాలు (Warm Dry Winds)
4) శీతల పవనాలు (Cold Winds)
స్థల (భూ), జల పవనాలు
-భూభాగం (నేల) మీద నుంచి జల భాగం (సముద్రం)పైకి వీచే పవనాలను స్థల పవనాలు అని, జలభాగం (సముద్రం) మీద నుంచి భూభాగం (నేల) మీదకు వీచే పవనాలను జల పవనాలు అని అంటారు.
-ఈ పవనాలు ఉష్ణోగ్రత విషయంలో నేల, నీరు స్పందించే విధానాన్ని బట్టి ఏర్పడుతాయి.
-నేల త్వరగా వేడెక్కి త్వరగా చల్లారుతుంది. నీరు ఆలస్యంగా వేడెక్కి ఆలస్యంగా చల్లారుతుంది.
-రాత్రిపూట లేదా శీతాకాలంలో సముద్రం కంటే నేల త్వరగా చల్లబడటంవల్ల నేలమీద అధికపీడనం, సముద్రం నెమ్మదిగా చల్లబడటంవల్ల వేడెక్కిన సముద్ర ఉపరితల గాలి వ్యాకోచించి తేలికై పైకి పోవడంవల్ల అక్కడ (సముద్రం మీద) అల్పపీడనం ఏర్పడుతుంది. అప్పుడు పవనాలు నేలమీద నుంచి సముద్రంవైపు వీస్తుంటాయి. వీటిని స్థల (భూ) పవనాలు అంటారు.
-ఈ పవనాల కారణంగా తీరప్రాంతాల (చెన్నై, విశాఖపట్నం, కోల్‌కతా, ముంబై) భూభాగాలు రాత్రి సమయంలో లేదా శీతాకాలంలో సాయంత్ర సమయం నుంచి వాతావరణం వేడెక్కుతుంది.
ఉదా: రాత్రి సమయంలో హైదరాబాద్, భోపాల్‌లతో పోలిస్తే చెన్నై, విశాఖపట్నం వంటి తీరప్రాంతాల్లో వేడిగా ఉంటుంది.
పగటిపూట లేదా వేసవికాలంలో ఎండవేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు నేల బాగా వేడెక్కుతుంది. నేలతోపాటు నేలను ఆనుకుని ఉన్న గాలి కూడా వేడెక్కుతుంది. వేడెక్కిన ఈ గాలి వ్యాకోచించి తేలికై పైకిపోవడంవల్ల అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. అదే సమయంలో పక్కనే ఉన్న సముద్రం వేడెక్కక చల్లగానే ఉంటుంది. కాబట్టి అక్కడ అధిక పీడనం ఉంటుంది. కాబట్టి అప్పుడు పవనాలు సముద్రం (అధిక పీడనం) మీద నుంచి నేలమీద (అల్పపీడన ప్రాంతం)కు వీస్తుంటాయి. వీటిని జల పవనాలు (Sea Breeze) అంటారు.
-ఈ పవనాల కారణంగా తీరప్రాంతాల (చెన్నై, విశాఖపట్నం, కోల్‌కతా, ముంబై, గోవా) భూభాగాలు పగటి సమయంలో లేదా వేసవికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది.
ఉదా: పగటి సమయంలో చెన్నై, విశాఖపట్నం, కోల్‌కతా, ముంబై, గోవా లాంటి తీరప్రాంతాలతో పోలిస్తే ఢిల్లీ, హైదరాబాద్, భోపాల్ వంటి ఖండాంతర్గత ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉంటుంది.
స్థల, జల పవనాలు రాత్రి, పగలు సమయాల్లోని సరస్సు, దాని పరిసర భూభాగాల్లోని ఉష్ణోగ్రత వ్యత్యాసాలను బట్టి వీస్తాయి.
పగటి సమయంలో ఇవి సరస్సులపై నుంచి వీయడంవల్ల వీటిని సరస్సు సమీరా (Lake Breeze)లు అంటారు.
– సమీరం అంటే గాలి అని అర్థం.
ఉదా: అమెరికాలో- సుపీరియర్ సరస్సు, అంటారియో సరస్సు
ఆఫ్రికాలో- విక్టోరియా సరస్సు వంటివాటి చోట్ల ఇదేరకంగా స్థల, జల పవనాలు వీస్తుంటాయి.
పర్వత, లోయ పవనాలు
-పర్వతంమీద నుంచి లోయలోకి దిగే పవనాలను పర్వత పవనాలు (Mountain Breeze) అని, లోయలోనుంచి పర్వతాలపైకి ఎగబాకే పవనాలను లోయ పవనాలు అని అంటారు.
-ఈ పవనాలు రాత్రి, పగలు ఏర్పడే ఉష్ణోగ్రత భేదంవల్ల పర్వత, లోయ పవనాలు ఏర్పడుతాయి.
-ఉష్ణోగ్రత, ఎత్తు విలోమానుపాతంలో ఉంటాయి. అంటే ఎత్తు పెరిగితే ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి పర్వతాలమీద ఉండే గాలి చాలా చల్లగా ఉంటుంది. అదే సమయంలో పక్కన ఉన్న లోయలో ఉండే గాలి వెచ్చగా ఉంటుంది.
-పగటిపూట ఎండవేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు లోయలో ఉండే గాలి వేడెక్కి, వ్యాకోచించి తేలికై, పర్వత వాలు గుండా నెమ్మదిగా పైకి (అంటే పర్వతంమీదకు) పోతుంది.
-రాత్రి కాగానే లోయలో కంటే పర్వతాల మీద బాగా చల్లగా ఉంటుంది. అప్పుడు చల్లగా ఉన్న ఈ గాలి సంకోచించి, బరువెక్కి, పర్వతపు వాలు గుండా నెమ్మదిగా పక్కనే ఉన్న లోయలోకి దిగుతుంది. అంటే ఉష్ణోగ్రత భేదంవల్ల పర్వతంమీద నుంచి పక్కనే ఉన్న లోయలోకి, లోయలో నుంచి పక్కనే ఉన్న పర్వతంమీదకు పవనాలు వస్తుంటాయి. వీటిని పర్వతలోయ పవనాలు అంటారు.
వెచ్చని పొడి పవనాలు
-లోయలో నుంచి పర్వతంమీదకు ఎగబాకిన గాలి (లోయ పవనం) చల్లబడి, అప్పుడప్పుడు కొద్దిపాటి వర్షానికి కారణమవుతుంది.
-చల్లగా ఉన్న ఈ గాలి సంకోచించి, బరువెక్కి, పక్కనే ఉన్న లోయలోకి దిగుతుంది. లోయలోకి దిగేటప్పుడు పైన ఉన్న గాలి ఒత్తిడివల్ల మళ్లీ వేడెక్కుతుంది. వేడెక్కిన ఈ గాలి చుట్టూ మైదాన ప్రాంతంలోకి వ్యాపిస్తుంది. దీన్నే వెచ్చని పొడి పవనాలు అంటారు.
ఇవి వీస్తున్న దేశాలు, ప్రాంతాలను బట్టి వీటిని రకరకాల పేర్లతో పిలుస్తారు. అవి.. 1) ఫోహెన్ (Fohn) 2) చినూక్ (Chinook) 3) సమూన్ (Samoon) 4) సిరాకో (Siracco) 5) సైమూన్ (Simoon) 6) శాంటా అన్నా (Santa Anna) 7) లూ (Loo)
ఫోహెన్: ఇవి ఐరోపాలో ఉన్న వెచ్చని పొడి పవనాలు. ఇవి ఆల్ఫ్స్ పర్వతాల నుంచి ఉత్తరంవైపు ఉన్న స్విట్జర్లాండ్ మైదానాల వైపునకు వీస్తుంటాయి. ఈ పవనాలు చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలపై మంచుపడకుండా కాపాడుతాయి. దీనివల్ల పశువుల మేతకు, సంచారానికి అనుకూలంగా ఉంటుంది.
చినూక్
ఉత్తర అమెరికాలోని అమెరికా-కెనడా ప్రాంతంలో ఉన్న రాకీ పర్వతాల మీది నుంచి తూర్పుగా ఉన్న పచ్చిక మైదానల వైపు (ప్రయరీలు) వీస్తాయి. ఈ పచ్చిక మైదానాలు ఉత్తర ధృవానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఈ వెచ్చని పవలనాల వల్ల శీతాకాలంలో కూడా మంచు పడకుండా ఉంటుంది. దీంతో పశువుల మేతకు, సంచారానికి అనుకూలంగా ఉంటుంది.
గమనిక: చినూక్ అనే పదానికి మంచును భక్షించేది (Snow Eater) అని అర్థం.
వేడిగా ఉన్న ఈ పవనాలు తాకగానే మంచు పూర్తిగా కరిగిపోతుంది. కాబట్టి ఆ పేరు వచ్చింది.అయితే ఆ ప్రాంతంలో నివసించిన అమెరికా మూలవాసీల్లో చినూక్ అనే జాతి పేరు మీదుగా ఈ పవనాలను పిలుస్తారు.
సమూన్
ఇవి ఇరాన్లో ఉన్న ఎల్బుర్జ్ పర్వతాల మీది నుంచి వీస్తాయి. సరిగ్గా ఇలాంటి వెచ్చని పొడి పవనాలను న్యూజిలాండ్‌లో నార్వెస్టర్ అని, దక్షిణాఫ్రికాలో బెర్న్…. అని, భారతదేశం (అసోం)లో నార్వేస్టర్ అని పిలుస్తారు.
సిరాకో
వేసవిలో సహారా ఎడారిలో జన్మించి మధ్యదరా సముద్రం మీదుగా ఇటలీ దక్షిణ ప్రాంత భూభాగాల్లో వీచే వేడి పొడి గాలులనే సిరాకో అని పిలుస్తారు. వీటిని పోలిన పవనాలను స్పెయిన్‌లో లెవిచె లేదా సాలూనో అని, లిబియాలో గిబ్లీ, మొరాకోలో లెస్బె, ట్యునీషియాలో చిలీ, ఈజిప్టులో ఖంసిం, సూడాన్‌లో హర్మట్టన్ అని పిలుస్తారు.
సైమూన్
అరేబియా ఎడారిలో వీస్తున్న వెచ్చని పవనాలను సైమూన్ అంటారు. (ఇవి సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు వీస్తాయి)
సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు వీచే పవనాలను హబూబ్ అని పిలుస్తారు.
సరిగ్గా వీటిని పోలిన పవనాలు..
పశ్చిమాసియాలో పగటిపూట వీచే దుమ్ము పవనాలను షమాల్ అంటారు.
శాంటా అన్నా
దక్షిణ కాలిఫోర్నియాలో శీతాకాలంలో వీచే పొడి గాలులనే శాంటా అన్నా అంటారు.
సరిగ్గా వీటిని పోలిన పవనాలను అర్జెంటీనాలో జొండాలు అని, ఆస్ట్రేలియాలో బ్రిక్ఫీల్డర్స్, జపాన్‌లో యోమూ…. అని పిలుస్తారు.
లూ (Loo)
భారత్‌లోని ఉత్తర, వాయవ్య ప్రాంతాల్లో వేసవి కాలంలో వీచే పొడి, వేడి గాలులను లూ అంటారు.
4. శీతల పవనాలు
ఈ రకమైన పవనాలు కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లోనే వీస్తుంటాయి. ఇవి వీస్తున్న దేశాలు, ప్రాంతాలను బట్టి వీటిని రకరకాల పేర్లతో పిలుస్తారు. అవి..
i. మిస్ట్రాల్ ii. బ్లిజార్డ్ iii. పాంపెరొ iv. బోరా v. ప్యూనా vi. బెర్గ్స్
విస్ట్రాల్
శీతల స్థానిక పవనాల్లో ఆల్ఫ్స్ పర్వతాల నుంచి ఫ్రాన్స్ మీదుగా మధ్యదరా సముద్రంవైపు వీచే పవనాలు మిస్ట్రాల్లు. ఇవి రోమ్ లోయగుండా వీస్తాయి.
బోరా
యుగోస్లేవియా దేశం నుంచి ఎడ్రియాటిక్ సముద్రం వైపు వేసవి కాలంలో వీచే చల్లని గాలులనే బోరా అంటారు.
బ్లిజార్డ్స్
శీతాకాలంలో ఆర్కిటిక్, అంటార్కిటికా ప్రాంత భూభాగాల్లో ఉన్నత అక్షాంశాల మధ్యవీచే తీవ్రమైన చలిగాలులను బ్లిజార్డ్స్ అంటారు.
ప్యూనా
ఇవి ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు.
పాంపెరో
ఇవి దక్షిణ అమెరికాలోని పంపాల (గడ్డి మైదనాల) ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధృవ పవనాలు.
బెర్గ్స్
దక్షిణాఫ్రికాలోని వేసవిలో డ్రాకెన్స్బర్గ్ పర్వతాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీచే చల్లని గాలులనే బెర్గ్స్ అంటారు.
ఇతర శీతల పవనాలు
కార్సికా- ట్రమోంటానా
న్యూసౌత్‌వేల్స్- సదర్ లీ బస్టర్స్
టెక్సాస్- నార్టర్
బ్రెజిల్- సురాజో
మెక్సికో- పపాగయో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు