సీఎంఏ
చాలామంది సీఎంఏ లాంటి కామర్స్ కోర్సులు కష్టంగా ఉంటాయని అపోహ పడుతుంటారు. ఒక నిర్దిష్ట ప్రణాళిక, మంచి సంస్థలో కోచింగ్, లక్ష్యాన్ని సాధించాలన్న తపన ఉంటే ఎలాంటి వారైనా సీఎంఏ కోర్సులు చదవచ్చు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించవచ్చు.
-సీఎంఏ (కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ) కోర్సుకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంది.
-సీఎంఏల సప్లయ్ తక్కువగా ఉంది. పెరిగిన పారిశ్రామిక అవకాశాలకు అనుగుణంగా సీఎంఏలు లేకపోవడంతో ఆ కోర్సు పూర్తిచేసిన వారికి చాలా డిమాండ్ ఉంది.
-ఈ కోర్సు పూర్తి చేయడానికి ఖర్చు చాలా తక్కువ. ఆర్థిక కార్యకలాపాల ప్రపంచీకరణ నేపథ్యంలో ఉత్పిత్తి రంగ, సేవారంగ పరిశ్రమలన్నీ సంస్థల యాజమాన్యానికి వనరుల నిర్వహణ, వ్యయాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్న కాస్ట్ అకౌంటెంట్ల సేవలను వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి.
-కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్లు పెట్టుబడి, ప్రణాళికల విషయంలో, లాభాల ప్రణాళిక, ప్రాజెక్ట్ నిర్వహణలో సేవలు అందిస్తారు. ప్రస్తుతం చాలా మంది కాస్ట్ అకౌంటెంట్లు వివిధ సంస్థల్లో చైర్మన్, సీఈఓ/సీఎఫ్ఓ, మేనేజింగ్ డైరెక్టర్లుగా, ఫైనాన్స్ డైరెక్టర్లుగా, ఫైనాన్స్ కంట్రోలర్స్‌గా, చీఫ్ అకౌంటెంట్లుగా, కాస్ట్ కంట్రోలర్స్‌గా మార్కెంటింగ్ మేనేజర్లు, చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్స్‌గా సేవలందిస్తున్నారు.
-ఇప్పటి ప్రొఫెషనల్ కామర్స్ కోర్సుల్లో సులువుగా పూర్తి చేసుకోగలిగిన కోర్సు సీఎంఏ అని చెప్పవచ్చు. కోర్సు వ్యవధి చాలా తక్కువ. దీంతో చాలామంది విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకుంటున్నారు.
-10వ తరగతి తరువాత అయితే నాలుగేండ్లలో, ఇంటర్ ఎంఈసీతో పాటు సీఎంఏ చదివితే రెండేండ్లలో, ఇంటర్ తర్వాత అయితే రెండున్నరేండ్లలో సీఎంఏ పూర్తి చేయవచ్చు.
-సీఎంఏ చదవాలంటే ఇంటర్లో ఏ గ్రూప్‌వారైనా అర్హులే. ఇంటర్ లేదా డిగ్రీ పూర్తిచేసిన ఏ గ్రూప్‌వారైనా సీఎంఏ కోర్సు చదవచ్చు. అలాగే ఇంజినీరింగ్ పూర్తిచేసినవారు కూడా సీఎంఏ చదవచ్చు. ఈ కోర్సు మొత్తం పూర్తవడానికి డిగ్రీ లేదా ఇంజినీరింగ్ తర్వాత రెండేండ్లు పడుతుంది.
-సీఎంఏ కోర్సులో ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ అనే మూడు దశలు ఉంటాయి.
సీఎంఏ ఫైనల్ కోర్సు
-సీఎంఏ ఇంటర్ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణత సాధించి 6 నెలల ప్రాక్టికల్ ట్రెయినింగ్ పూర్తయిన విద్యార్థి ఫైనల్ పరీక్ష రాయవచ్చు.
రిజిస్ట్రేషన్
-సీఎంఏ ఇంటర్ పూర్తయినవారు ఫైనల్ రిజిస్ట్రేషన్ కోసం రూ. 17,000 చెల్లించాలి.
-జూన్‌లో సీఎంఏ ఫైనల్ పరీక్ష రాయాలంటే అదే ఏడాది జనవరి 31న, డిసెంబర్లో పరీక్ష రాయాలంటే జూలై 31లోగా నమోదు చేసుకోవాలి.
పరీక్ష ఫీజు
-ఒక గ్రూప్‌కి అయితే రూ.1400, రెండు గ్రూపులకు అయితే రూ. 2800
-జూన్ నెలలో పరీక్ష రాయాలంటే మార్చి 31లోగా, డిసెంబర్లో పరీక్ష రాయాలంటే సెప్టెంబర్ 30లోగా ఫీజు చెల్లించాలి. సీఎంఏ ఫైనల్లో కూడా రెండు గ్రూపులు (గ్రూప్-3, గ్రూప్-4) ఉంటాయి. ఫైనల్ పరీక్షకు అర్హత సాధించాలంటే విద్యార్థి కనీసం 6 నెలల ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేయాలి. విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూప్ 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు. ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో సీఎంఏ ఫైనల్ పరీక్షలు జరుగుతాయి.
-సీఎంఏ ఫైనల్ పూర్తిచేసిన విద్యార్థులను కంప్యూటర్ ట్రెయినింగ్ పూర్తయిన తర్వాత క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్లుగా పరిగణిస్తారు. సొంతంగా ప్రాక్టీస్ చేయాలనుకున్నవారు రెండున్నరేండ్లు ప్రాక్టికల్ ట్రెయినింగ్ తీసుకోవాలి (పైన తెలిపిన 6 నెలలకు ఇది అదనం). ట్రెయినింగ్ పూర్తి చేసినవారికి ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీఓపీ) అందిస్తుంది.
సీఎంఏలకు అవకాశాలు
-కాస్ట్ అకౌంటింగ్ రంగంలో స్థిరపడవచ్చు.
-అకౌంటెంట్లుగా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించవచ్చు.
-ఫైనాన్షియల్, బిజినెస్ అనలిస్టులుగా అవకాశాలు ఉంటాయి.
-ఆడిటింగ్, ఇంటర్నల్ ఆడిటింగ్, స్పెషల్ ఆడిట్స్ చేయవచ్చు.
-డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సేషన్లు నిర్వహించవచ్చు.
-సిస్టమ్స్ అనాలిసిస్, సిస్టమ్స్ మేనేజ్మెంట్ చేయవచ్చు.
-ఈఆర్పీ హౌసెస్‌లో ప్రాసెస్ అకౌంటెంట్లుగా, కాలేజీలు, మేనేజ్మెంట్ సంస్థల్లో అకడమీషియన్లుగా స్థిరపడవచ్చు.
-సీఎంఏ కోర్సును దూరవిద్యా విధానంలో కూడా పూర్తి చేయవచ్చు. దీనిద్వారా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ కోర్సు చేయడం ద్వారా పదోన్నతులు పొందవచ్చు.
సీఎంఏ కోర్సు- ఉత్తీర్ణతా శాతం
-2017 జూన్‌లో నిర్వహించిన సీఎంఏ పరీక్షలో నమోదైన ఉత్తీర్ణతాశాతాన్ని పరిశీలిస్తే ఈ కోర్సులో రెండో దశ అయిన సీఎంఏ ఇంటర్లో 32.36 శాతం, సీఎంఏ చివరి దశ అయిన సీఎంఏ ఫైనల్లో 25.12 శాతం నమోదైంది.
ప్రాక్టికల్ శిక్షణ
-సీఎంఏ ఫైనల్ పరీక్ష రాయాలంటే ఆరు నెలల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. సీఎంఏ ఎగ్జిక్యూటివ్ (సీఎంఏ ఇంటర్) ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణత సాధించినవారు గుర్తింపు పొందిన సంస్థలో నిర్దేశించిన విభాగాల్లో లేదా ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ వద్ద 6 నెలలపాటు ప్రాక్టికల్ ట్రెయినింగ్ పొందాలి. ఇలా శిక్షణ పొందుతున్న సమయంలో విద్యార్థి తను ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతున్న ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.2000 నుంచి 5000ల వరకు స్టయిఫండ్ పొందవచ్చు. ఈ ప్రాక్టికల్ ట్రెయినింగ్ ద్వారా విద్యార్థి సీఎంఏ వృత్తికి కావలసిన నైపుణ్యాన్ని పొందడమే కాకుండా తన కోర్సు పూర్తి చేసుకోవడానికి కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చు. సీఎంఏ ఫైనల్ ఉత్తీర్ణులైనవారు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మూడేండ్ల ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది.
సీఎంఏ ఫౌండేషన్ కోర్సు
-సీఎంఏ కోర్సులోని మొదటి దశను సీఎంఏ ఫౌండేషన్ అంటారు.
-అర్హత: ఇంటర్ ఏ గ్రూప్ వారైనా సీఎంఏ ఫౌండేషన్ కోర్సుకు నమోదు చేయించుకుని సీఎంఏ ఫౌండేషన్ కోర్చు చదవచ్చు. అదే ఇంటర్ ఎంఈసీ విద్యార్థులు అయితే ఇంటర్ ఎంఈసీతోపాటు సీఎంఏ ఫౌండేషన్ కోర్సుని సమాంతరంగా పూర్తి చేయవచ్చు.
రిజిస్ట్రేషన్
-సీఎంఏ ఫౌండేషన్ కోర్సుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్ (10+2) లేదా తత్సమాన పరీక్ష పాస్ అవ్వాలి. సీఎంఏ ఫౌండేషన్ చదవాలంటే ముందుగా రూ. 4000 డీడీ తీయాలి. దాన్ని రిజిస్ట్రేషన్ కోసం పూర్తిచేసిన దరఖాస్తును సీఎంఏ ఇన్స్టిట్యూట్ కోల్‌కతాకు పంపించాలి లేదా దాని అనుబంధ సంస్థలో ఇవ్వాలి. ఈ దరఖాస్తు ఫారాన్ని పొందాలంటే సీఎంఏ శాఖల్లోగాని, సీఎంఏ చాప్టర్లో లేదా సీఎంఏ ఇన్ఫర్మేషన్ సెంటర్లలో రూ.250 చెల్లించాలి.
-సీఎంఏ చాప్టర్లు, అనుబంధ సంస్థలు హైదరాబాద్, కొత్తగూడెంలలో ఉన్నాయి. వివరాలకోసం www.icmai.in చూడవచ్చు.
రిజిస్ట్రేషన్ ఎప్పుడు
-సీఎంఏ ఫౌండేషన్ పరీక్ష జూన్ నెలలో రాయాలంటే అదే ఏడాది జనవరి 31లోగా నమోదు చేసుకుని మార్చి 31లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. డిసెంబర్లో పరీక్ష రాయాలంటే అదే ఏడాది జూలై 31లోగా నమోదు చేసుకుని సెప్టెంబర్ 30లోగా ఫీజు చెల్లించాలి. పరీక్ష ఫీజు రూ. 1200.
సీఎంఏ ఫౌండేషన్ కోర్సు
-కోర్సులోని మొదటి దశను ఫౌండేషన్ అని వ్యవహరిస్తారు. సీఎంఏ ఫౌండేషన్ కోర్సులోని మొత్తం 8 సబ్జెక్టులను 4 పేపర్లుగా విభజించారు. అంటే రెండు సబ్జెక్టులు కలిసి 1 పేపర్ అన్నమాట. సీఎంఏ ఫౌండేషన్ పరీక్షను 4 పేపర్లుగా విడివిడిగా (రోజుకో పేపర్ చొప్పున) నిర్వహిస్తారు. ప్రతి పేపర్లో 100 మార్కులకు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో 50 శాతం అంటే 200 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులు కావచ్చు. అలాగే ప్రతి పేపర్లో 40 శాతం కన్నా ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి.
సీఎంఏ ఇంటర్
-సీఎంఏ ఇంటర్ కోర్సునే సీఎంఏ ఎగ్జిక్యూటివ్ కోర్సు అనికూడా పిలుస్తారు.
-అర్హత: సీఎంఏ ఫౌండేషన్ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులు సీఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏడాది తర్వాత సీఎంఏ ఇంటర్ పరీక్ష రాయవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు సీఎంఏ ఫౌండేషన్ రాయకుండానే సీఎంఏ ఇంటర్ కోర్సుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, శిక్షణ కూడా తీసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్
-ఫౌండేషన్ పరీక్ష పాసైనవారు సీఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ కోసం రూ.20 వేలు చెల్లించాలి. సీఎంఏ ఫౌండేషన్ పూర్తిచేసి సీఎంఏ ఇంటర్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులకు సీఎంఏ ఇన్స్టిట్యూట్ వెసులుబాటు కల్పించింది. ఫౌండేషన్ పూర్తిచేసిన వారు ఇంటర్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రూ.20వేలలో రూ.12వేలు చెల్లించి మిగిలిన రూ. 8వేలు మూడు నెలల తర్వాత చెల్లిచేందుకు అవకాశం ఉంది.
-సీఎంఏ ఇంటర్ పరీక్ష జూన్‌లో రాయాలంటే అదే ఏడాది జనవరి 31లోగా నమోదు చేసుకోవాలి. డిసెంబర్లో పరీక్ష రాయాలంటే జూలై 31లోగా నమోదు చేసుకోవాలి.
పరీక్ష ఫీజు
-ఒక గ్రూప్‌కి అయితే రూ.1200, రెండు గ్రూపులకు అయితే రూ. 2400
-జూన్‌లో పరీక్ష రాయాలంటే మార్చి 31లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. డిసెంబర్లో పరీక్ష రాయాలంటే సెప్టెంబర్ 30లో ఫీజు చెల్లించాలి.
-నాలుగు పేపర్లలో మొత్తం 400 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఒక్కో సబ్జెక్టులో కనీసం 40 మార్కులు సాధించాలి. మొత్తంగా 200లు, ఆపై మార్కులు సాధించినవారు ఉత్తీర్ణులవుతారు.
-ఇందులో కూడా ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు సాధించాలి. విద్యార్థి వీలును బట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు. సీఎంఏ ఇంటర్ కోర్సు నమోదు చేసుకున్నవారు ఏడాది తరువాత సీఎంఏ ఇంటర్ పరీక్ష రాయవచ్చు.