-భారతరత్న పురస్కార గ్రహీతల జాబితాను రాష్ట్రపతికి ప్రధానమంత్రి సిఫారసు చేస్తారు. భారతరత్న అవార్డులను ప్రదానం చేయడానికి ఉన్న మార్గదర్శకాలను కేంద్రప్రభుత్వం 2011, డిసెంబర్ 16న సవరించింది. దీని ప్రకారం క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన వారికి కూడా భారతరత్న అవార్డును ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పురస్కారాలను ప్రారంభించే సమయంలో మరణానంతరం ప్రకటించే అవకా శంలేదు. అయితే 1966 నుంచి ఈ వెసులుబాటు కల్పించారు.
-పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం, ఒక మెడల్ బహూకరిస్తారు. రావి ఆకు రూపంలో ఉన్న మెడల్‌పై ప్రకాశిస్తున్న సూర్యుడి బొమ్మ, దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. వెనుకవైపు భారత జాతీయ చిహ్నం, కింద దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అనే అక్షరాలు ఉంటాయి.
-రాజ్యాంగంలో ఆర్టికల్ 18(1) ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహీతలు తమ పేర్లముందు, వెనుక భారతరత్న అని రాసుకోకూడదు. భారతరత్నతోఎలాంటి నగదు ప్రోత్సాహకం ఇవ్వరు.
-భారతరత్న పొందిన గ్రహీతలకు ఏడో స్థాయి గౌరవం లభిస్తుంది (రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధాని తర్వాత). జనతా ప్రభుత్వం 1977-80ల మధ్య పురస్కారాలను ఇవ్వడం నిలిపేసింది.
-భారతరత్న పొందిన తొలివ్యక్తి సీ. రాజగోపాలాచారి. ఇప్పటివరకు భారతరత్న అవార్డు అందుకున్న వారి సంఖ్య 48.
భారతరత్న గ్రహీతలు
సీ రాజగోపాలాచారి: తమిళనాడుకు చెందిన రాజాజీ 1954లో భారతరత్న అందుకున్నారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలివ్యక్తి. స్వతంత్ర భారతదేశానికి తొలి భారతీయ గవర్నర్‌గా, మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.
సీవీ రామన్: తమిళనాడుకు చెందిన భౌతికశాస్త్రవేత్త రామన్ 1954లో భారతరత్న అందుకున్నారు. రామన్ జన్మదినం అయిన ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నందుకుగాను ఆయనకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది.
సర్వేపల్లి రాధాకృష్ణన్: ఈయన కూడా తమిళనాడుకు చెందిన వారే. 1954లో భారతరత్న అందుకున్నారు. భారత దేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా పనిచేశారు. ఈయన జన్మదినం అయిన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
జవహర్లాల్ నెహ్రూ: భారత తొలి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూకు 1955లో భారతరత్న అవార్డు ప్రకటించారు. ఈయన అలీనోద్యమ స్థాపకుల్లో ఒకరు. ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాని. పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టి, ఆర్థికవ్యవస్థకు పటిష్టమైన పునాదులు వేశారు. ఈయన జన్మదినం నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
బాబూ రాజేంద్రప్రసాద్: ఈయనకు 1962లో భారతరత్న లభించింది. భారతదేశ తొలి రాష్ట్రపతి. రాజ్యాంగసభ అధ్యక్షులు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈయన స్వాతంత్య్ర సమరయోధులు. నెహ్రూ మంత్రిమండలిలో ఆహార, వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు.
జాకీర్ హుస్సేన్: తెలంగాణ రాష్ర్టానికి చెందిన జాకీర్ హుస్సేన్ 1963లో భారతరత్న అందుకున్నారు. రాష్ట్రపతిగా నియమితులైన తొలి ముస్లిం. పదవిలో ఉండగా చనిపోయిన తొలి రాష్ట్రపతి. మహాత్మాగాంధీతో కలిసి బేసిక్ విద్యను రూపొందించారు. ఈయన బీహార్ గవర్నర్‌గా, రెండో ఉపరాష్ట్రపతిగా, మూడో రాష్ట్రపతిగా పనిచేశారు.
లాల్‌బహదూర్ శాస్త్రి: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈయన 1966లో భారతరత్న అందుకున్నారు. నెహ్రూ మంత్రివర్గంలో రైల్వేమంత్రిగా, దేశానికి రెండో ప్రధానిగా పనిచేశారు. పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని.
ఇందిరాగాంధీ: ఈమె 1971లో భారతరత్న పురస్కారం అందుకున్నారు. దేశానికి తొలి మహిళా ప్రధా ని. లాల్‌బహదూర్ శాస్త్రి మంత్రిమండలిలో సమాచార, ప్రసారశాఖ మంత్రిగా, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పనిచేశారు. 1974లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించి భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటారు. రాజాభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణతో ప్రజల అభిమానాన్ని చూరగొన్నది.
వీవీ గిరి: ఈయనకు భారత ప్రభుత్వం 1975లో భారతరత్న ప్రకటించింది. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన వరహాగిరి వెంకటగిరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎన్నికైన తొలి రాష్ట్రపతి. ఈ ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారం అనే నినాదంతో వీవీ గిరిని గెలిపించి ఇందిరాగాంధీ తన పంతం నెగ్గించుకున్నారు. రెండో ప్రాధాన్య ఓటు ద్వారా రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అతి తక్కువ మెజారిటీతో గెలిచారు. దేశానికి నాలుగో రాష్ట్రపతి. యూపీ, కేరళ, మైసూర్ రాష్ర్టాలకు గవర్నర్‌గా పనిచేశారు. న్యాయ విద్యకోసం ఐర్లాండ్‌కు వెళ్లి సీన్పెన్ ఉద్యమంలో పాల్గొని దేశ బహిష్కరణకు గురయ్యారు. ఏఐటీయూసీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేశారు. 1936లో మద్రాస్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలిరాజాపై పోటీచేసి గెలిచారు.
మదర్ థెరిస్సా: స్కోపేకు (మాసిడోనియా) చెందిన మదర్ థెరిస్సా 1980లో భారతరత్న అందుకున్నా రు. ఈమెకు 1979లో నోబెల్ బహుమతి కూడా ప్రదానం చేశారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్: భారతదేశపు ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు 1991లో భారతరత్న పురస్కారం లభించింది. జవహర్లాల్ మంత్రిమండలిలో ఉపప్రధానిగా, హోంశాఖ మంత్రిగా పనిచేశారు. 1950, డిసెంబర్ 15న మరణించారు.
రాజీవ్‌గాంధీ: ఈయనకు 1991లో భారతరత్న ప్రకటించారు. దేశానికి ఆరో ప్రధానిగా పనిచేశారు. చిన్న వయస్సులో (40 ఏండ్ల 72 రోజులు) దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1991, మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎల్టీటీఈ తీవ్రవాదులు హత్య చేశారు.
మొరార్జీదేశాయ్: భారతదేశ తొలి కాంగ్రెసేతర ప్రధా ని. దేశానికి నాలుగో ప్రధాని. అతిపెద్ద వయస్సులో (81 ఏండ్ల 23 రోజులు) ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈయన భారతరత్నతోపాటు.. పాకిస్థాన్ అత్యున్నత పురస్కారమైన నిషానే పాకిస్థాన్ కూడా అందుకున్నారు.
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్: భారతరత్న పొందిన మొదటి విదేశీయుడు. 1987లో భారతరత్న అందుకున్నారు. పెషావర్(పాకిస్థాన్)కు చెందిన గఫార్ బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా రెడ్‌షర్ట్స్ దళాన్ని ఏర్పాటు చేశారు. గఫార్‌ఖాన్ అనుచరులను ఖుదాయి ఖిద్మత్గార్ (భగవత్ సేవకులు) అని పిలిచేవారు.
పండిట్ రవిశంకర్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈయన 1999లో భారతరత్న అందుకున్నారు. మూడుసార్లు గ్రామీ పురస్కారాలను, సితార్, హిందుస్థానీ క్లాసికల్ సంగీతంలో పలు అవార్డులు అందుకున్నారు.
ఉస్తాద్ బిస్మిల్లాఖాన్: బీహార్‌కు చెందిన ఈయన షెహనాయి విద్వాంసుడు. 1961లో పద్మశ్రీ అవార్డు, 1968లో పద్మవిభూషణ్, సంగీతనాటక అకాడమీ అవార్డు, తాన్సేన్ అవార్డులను అందుకున్నారు. 2001లో దేశ అత్యున్నత పౌరపురస్కారం లభించింది.
పండిట్ భీమ్సేన్ జోషి: 2008లో భారతరత్న పురస్కారం అందుకున్నారు. కర్ణాటకకు చెందిన ఈయ హిందుస్థానీ గాయకుడు.
మదన్ మోహన్ మాలవీయ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, బేనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకుడు. ఈయనకు 2015లో కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఈయన 1909, 1918, 1932, 1933లలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు.
నానాజీ దేశ్‌ముఖ్: నానాజీ దేశ్‌ముఖ్‌గా పేరుగాంచిన చండికాదాస్ అమృతరావ్ దేశ్‌ముఖ్‌కు 2019కి గాను భారతరత్న లభించింది. ఈయన 1916లో మహారాష్ట్రలోని హింగోలిలో జన్మించారు. సామాజిక ఉద్యమకారుడైన ఈయన వి ద్య, ఆరోగ్యం, గ్రామీణ స్వావలంబన రంగాల్లో విశేష కృషిచేశారు. దేశవ్యాప్తంగా సరస్వతి శిశు మందిర్ పాఠశాలలను ఏర్పాటు చేసిన ఆయన 1999లో పద్మ విభూషణ్ అందుకున్నారు.
భూపేన్ హజారికా: సుధాకాంత్గా సుపరిచితుడైన హజారికా అసోంలోని సాదియాలో 1921లో జన్మించారు. ఆయన ప్రముఖ కవి, గేయ రచయిత, నేపథ్య గాయకుడు. 1977లో పద్మశ్రీ, 1987లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1992లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2001లో పద్మభూషణ్, 2012లో పద్మవిభూషణ్ లభించాయి. 2011లో మరణించారు.
ప్రత్యేకతలు
-భారతరత్న అందుకున్న మొదటి మహిళ ఇందిరాగాంధీ.
-మరణాంతరం ఈ పురస్కారం అందుకున్న మొదటి వ్యక్తి లాల్‌బహదూర్ శాస్త్రి.
-ఈ పురస్కారం అందుకున్న మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్.
-ఈ పురస్కారాలను పునరుద్ధరించిన తర్వాత అందుకున్న మొదటి వ్యక్తి మదర్ థెరిస్సా.
-ఈ పురస్కారం అందుకున్న మొదటి శాస్త్రవేత్త సీవీ రామన్, తొలి కళాకారుడు సత్యజిత్‌రే, తొలి క్రీడాకారుడు, అతిపిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్.
-డీకే కార్వే అత్యధిక వయస్సులో భారతరత్న పొందారు.
-ఒక ఏడాది గరిష్టంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న ప్రకటించవచ్చు. కానీ 1999లో నలుగురికి ప్రకటించారు.
-కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రచురించే గెజిట్‌లో ప్రకటించిన తర్వాతే ఈ పురస్కారం అధికారికంగా లభించినట్లు భావిస్తారు.
-వీటిని కోల్‌కతాలోని అలిపోర్ ప్రభుత్వ ముద్రణాలయంలో ముద్రిస్తారు. దీంతోపాటు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, పరమవీరచక్ర వంటి పౌర, సైనిక పురస్కారాలు ఇక్కడే తయారవుతాయి.
-1992లో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు భారతరత్న ప్రకటించినప్పటికి వెనక్కి తీసుకున్నారు.
ఏపీజే అబ్దుల్ కలాం
ఈయనకు 1997లో భారతరత్న ప్రదానం చేశారు. పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. భారతదేశ క్షిపణి పితామహుడు. దేశానికి పదకొండో రాష్ట్రపతి. రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి ముందు ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని వ్యక్తి. 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. కలాం.. ఇండియా-2020, ఇగ్నైటెడ్ మైండ్, ఇండియా మై డ్రీమ్, వింగ్స్ ఆఫ్ ఫైర్. ఈయన జన్మదినం అయిన అక్టోబర్ 15ను ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2005, మే 26న స్విట్జర్లాండ్‌లో తొలిసారి పర్యటించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ దేశం మే 26ను జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించింది.
అటల్ బిహారీ వాజ్‌పేయి
భారత దేశ మాజీ ప్రధాని, జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 2015లో దేశ అత్యున్నత పురస్కారం లభించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత మూడు సార్లు ప్రధానిగా, తొమ్మిదిసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1998 మేలో పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించి విజయం సాధించారు. ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి వ్యక్తి. 1994లో పద్మభూషణ్ అందుకున్నారు.
అమర్త్యసేన్
పశ్చిమబెంగాల్ రాష్ర్టానికి చెందిన అమర్త్యసేన్ 1999లో భారతరత్న అవార్డు అందుకున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త. 1998లో నోబెల్ బహుమతి అందుకున్నారు.
ప్రణబ్ ముఖర్జీ
1935 డిసెంబర్ 11న జన్మించారు. 83 ఏండ్ల ప్రణబ్ భారత రాజకీయల్లో గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరొందాడు. 13వ రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్.. ఇందిరాగాంధీ నుంచి మన్మోహన్ సింగ్ వరకు వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
రంగాల వారీగా..
-రాష్ట్రపతులు: బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ
-ప్రధానులు: జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయి
-ముఖ్యమంత్రులు: గోవింద్ వల్లభ్‌పంత్ (ఉత్తరప్రదేశ్), బీసీ రాయ్ (పశ్చిమబెంగాల్), కుమారస్వామి కామరాజ్ నాడార్ (తమిళనాడు), ఎంజీ రామచంద్రన్ (తమిళనాడు), గోపీనాథ్ బర్డోలీ (అసోం).
-మహిళలు: అరుణా అసఫ్ అలీ, ఎంఎస్ సుబ్బులక్ష్మి, లతా మంగేష్కర్
-కళారంగం: సత్యజిత్ రే, పండిట్ రవిశంకర్, బిస్మిల్లాఖాన్, భీంసేస్ జోషి, భూపేన్ హజారికా
-విదేశీయులు: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, నెల్సన్ మండేలా
-పారిశ్రామిక వేత్తలు: జేఆర్డీ టాటా
మరణాంతరం: లాల్ బహదూర్ శాస్త్రి, కామరాజ్ నాడర్, వినోబాభావే, ఎంజీ రామచంద్రన్, బీఆర్ అంబేద్కర్, రాజీవ్ గాంధీ, సర్ధార్ వల్లభాయ్‌పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, గుల్జారీలాల్ నందా, అరుణా అసఫ్ అలీ, జయప్రకాశ్ నారాయణ్, మదన్ మోహన్ మాలవీయ, నానాజీ దేశ్‌ముఖ్, భూపేన్ హజారికా.
అవార్డు గ్రహీతలు-వివరాలు
1. సీ రాజగోపాలా చారి (1954)- తమిళనాడు
2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (1954)- తమిళనాడు
3. సీవీ రామన్ (1954)- తమిళనాడు
4. భగవాన్ దాస్ (1955)- ఉత్తరప్రదేశ్
5. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1955)- కర్ణాటక
6. జవహర్లాల్ నెహ్రూ (1955)- ఉత్తరప్రదేశ్
7. గోవింద్ వల్లభ్ పంత్ (1957)- ఉత్తరాఖండ్
8. డీకే కార్వే (1958)- మహారాష్ట్ర
9. బీసీ రాయ్ (1961)- పశ్చిమబెంగాల్
10. పురుషోత్తమ దాస్ టాండన్ (1961)-ఉత్తరప్రదేశ్
11. రాజేంద్రప్రసాద్ (1962)- బీహార్
12. జాకీర్ హుస్సేన్ (1963)- తెలంగాణ
13. పాండురంగ వామన్ కానే (1963)- మహారాష్ట్ర
14. లాల్ బహదూర్ శాస్త్రి (1966)- ఉత్తరప్రదేశ్
15. ఇందిరాగాంధీ (1971)- ఉత్తరప్రదేశ్
16. వీవీ గిరి (1975)- ఒడిశా
17. కే కామరాజ్ నాడార్ (1976)- తమిళనాడు
18. మదర్ థెరిస్సా (1980)- మాసిడోనియా
19. వినోబాభావే (1983)- మహారాష్ట్ర
20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1987)- పాకిస్థాన్
21. ఎంజీ రామచంద్రన్ (1988)- శ్రీలంక
22. బీఆర్ అంబేద్కర్ (1990)- మధ్యప్రదేశ్
23. నెల్సన్ మండేలా (1990)- దక్షిణాఫ్రికా
24. రాజీవ్ గాంధీ (1991)- మహారాష్ట్ర
25. వల్లభాయ్ పటేల్ (1991)- గుజరాత్
26. మొరార్జీ దేశాయ్ (1991)- గుజరాత్
27. అబుల్ కలాం ఆజాద్ (1992)- మక్కా
28. జేఆర్డీ టాటా (1992)- ఫ్రాన్స్
29. సత్యజిత్ రే (1992)- పశ్చిమబెంగాల్
30. గుల్జారీలాల్ నందా (1997)- పాకిస్థాన్ (పంజాబ్)
31. అరుణా అసఫ్ అలీ (1997)- హర్యానా
32. ఏపీజే అబ్దుల్ కలాం (1997)- తమిళనాడు
33. ఎంఎస్ సుబ్బులక్ష్మి (1998)- తమిళనాడు
34. జీ సుబ్రమణ్యం (1998)- తమిళనాడు
35. జయప్రకాశ్ నారాయణన్ (1999)- బీహార్
36. అమర్త్యసేన్ (1999)- పశ్చిమబెంగాల్
37. గోపీనాథ్ బర్డోలి (1999)- అసోం
38. రవిశంకర్ (1999)- ఉత్తరప్రదేశ్
39. లతా మంగేష్కర్ (2001)- మధ్యప్రదేశ్
40. బిస్మిల్లాఖాన్ (2001)- బీహార్
41. భీంసేన్ జోషి (2008)- కర్ణాటక
42. సీఎన్ఆర్ రావు (2014)- కర్ణాటక
43. సచిన్ టెండూల్కర్ (2014)- మహారాష్ట్ర
44. మదన్ మోహన్ మాలవీయ (2015)- ఉత్తరప్రదేశ్
45. అటల్ బిహారీ వాజ్‌పేయి (2015)- మధ్యప్రదేశ్
46. ప్రణబ్ ముఖర్జీ (2019)- పశ్చిమబెంగాల్
47. భూపేన్ హజారికా (2019)- అసోం
48. నానాజీ దేశ్‌ముఖ్ (2019)- మహారాష్ట్ర