Industrial Training | పారిశ్రామిక శిక్షణ సీఏ ప్రత్యేకం
సీఏ కోర్సులో థియరీ పార్ట్‌తోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ముఖ్యమైనదే. అంటే విద్యార్థి తరగతిలో నేర్చుకున్న అంశాలు నిజజీవితంలో ఎలా ఆచరించాలో కూడా తెలుసుకోగలగడమే ప్రాక్టికల్ ట్రెయినింగ్ ఉద్దేశం.
-పరిశ్రమల అవసరాలు పెరుగుతుండటంతో పరిశ్రమల గురించిన పరిజ్ఞానం ఉండి, వాటి పనితీరుపై పూర్తి అవగాహన కలిగిన నిపుణులను పరిశ్రమలకు అందించాలనే ఉద్దేశంతో సీఏ ఇన్స్టిట్యూట్ వారు ఈ పారిశ్రామిక శిక్షణను సీఏ కోర్సులో భాగంగా రూపొందించారు. ప్రాక్టికల్ ట్రెయినింగ్ పొందుతున్న విద్యార్థులు ఎవరైనా భవిష్యత్తులో పరిశ్రమల్లోని ఉద్యోగాల్లో స్థిరపడాలన్నా, సీఏ పూర్తయ్యాక సొంతంగా ఒక పరిశ్రమ స్థాపించాలన్నా ఈ పారిశ్రామిక శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది.
శిక్షణ ఎక్కడ..
-సీఏ ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థి ప్రాక్టికల్ శిక్షణ మరో ఏడాదికి ముగుస్తుందనగా ఈ పారిశ్రామిక శిక్షణ తీసుకోవచ్చు. కనీసం రూ. కోటి పైబడిన స్థిరాస్తులు కలిగిన వాణిజ్య, వ్యాపార, పరిశ్రమలలో గానీ, రూ. 10 కోట్లకు పైబడి టర్నోవర్ కలిగిన సంస్థల్లోగానీ, రూ. 50 లక్షలకు పైగా చెల్లింపు మూలధన వాటాలు కలిగిన సంస్థల్లోగానీ, కౌన్సిల్ ఆమోదించిన సంస్థల్లో గానీ ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ పొందవచ్చు.
కాల పరిమితి
-పారిశ్రామిక శిక్షణను 9 నెలలకు తగ్గకుండా 12 నెలలకు మించకుండా (సెలవులను కలుపుకుని) తీసుకోవాల్సి ఉంటుంది.
శిక్షణ ఇచ్చేవారికి ఉండాల్సిన అర్హతలు
-సీఏ ఇన్స్టిట్యూట్ ఆమోదించిన సంస్థల్లో పనిచేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్లు మాత్రమే సీఏ విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ ఇవ్వడానికి అర్హులు.
-సీఏ ఇన్స్టిట్యూట్ పరిధిలో కనీసం మూడేండ్లు అసోసియేట్ మెంబర్ (ఏసీఏ)గా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్
-ఫెలోషిప్ చార్టర్డ్ అకౌంటెంట్ (ఎఫ్సీఏ) అయితే ఇద్దరు విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ అందించవచ్చు.
శిక్షణతోపాటు సంపాదన
-చదువుతూనే సంపాదన అనే విధానం సీఏ పారిశ్రామిక శిక్షణ తీసుకునేటప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే చదువుతోపాటే విద్యార్థికి సంపాదన కూడా ఉంటుంది. పారిశ్రామిక శిక్షణకి ఏ సంస్థలో అయితే మనం చేరుతామో ఆ సంస్థవారు విద్యార్థికి ఐసీఏఐ నిబంధనల ప్రకారం స్టయిఫండ్ కూడా ఇస్తారు.
నిబంధనలు
-విద్యార్థి ఏ రోజునుంచైతే పారిశ్రామిక శిక్షణ తీసుకోవాలని అనుకుంటాడో ఆ రోజుకి మూడు నెలల ముందే తను ఆర్టికల్‌షిప్ చేస్తున్న ప్రధాన ఆడిటర్ (ప్రిన్సిపల్ ఆడిటర్)కి తన పారిశ్రామిక శిక్షణ గురించి చెప్పి అనుమతి పొందాలి.
-ప్రస్తుత ప్రధాన ఆడిటర్ నుంచి ట్రెయినీ గైడ్లో సూచించిన శిక్షణా నివేదికతోపాటు ఫాం. నం. 109 లేదా ఫాం.నం. 114 తీసుకోవాలి.
-అప్రెంటిస్‌షిప్ డీడ్ (Apprenticeship Deep)ను ఫాం.నం. 104 ప్రకారం నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్పైగానీ, ప్రాంతీయ స్టాంప్ ధరలను అనుసరించి తయారు చేసిన ప్రత్యేకంగా అంటించిన స్టాంపు పేపర్‌పై గానీ, తయారు చేసి దానికి నకలును జతచేసి శిక్షణ అందించే సంస్థ ద్వారా శిక్షణ ప్రారంభమయ్యే 30 రోజులు ముందుగా సీఏ ఇన్స్టిట్యూట్ వారికి పంపించాలి.
ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఎప్పుడు..
-సీఏ ఇంటర్‌లోని మొదటి గ్రూపు కాని, రెండో గ్రూపు కాని అంటే ఏదోఒక గ్రూపు పూర్తిచేసినవారు లేదా రెండు గ్రూపులూ పూర్తిచేసినవారు ఒక ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ప్రాక్టికల్ శిక్షణకు తమ పేరు నమోదు చేసుకుని మూడేండ్లపాటు ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడేండ్ల ప్రాక్టికల్ శిక్షణలో విద్యార్థి కావాలనుకుంటే చివరి 12 నెలలు అంటే మూడో ఏడాది ప్రాక్టికల్ శిక్షణకు బదులుగా వేరే పరిశ్రమలో పారిశ్రామిక శిక్షణ కూడా తీసుకోవచ్చు. నేటి పారిశ్రామిక అవసరాలకు సరిపడే నైపుణ్యాలు కలిగిన సీఏలను తయారుచేయాలని ఈ ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. పారిశ్రామిక శిక్షణ వల్ల విద్యార్థి తన కెరీర్‌కు అవసరమయ్యే కొత్త నైపుణ్యాలను, టెక్నికల్ స్కిల్స్‌ను, ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు భవిష్యత్తులో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వచ్చే అవకాశాలు అందిపుచ్చుకుంటారు.
శిక్షణ-ప్రయోజనాలు
-మంచి భావప్రసరణ నైపుణ్యాలు ఉండి కొత్త వ్యక్తులతో కలిసి మాట్లాడే ఆసక్తి ఉంటే పారిశ్రామిక శిక్షణ ద్వారా వ్యాపార సామ్రాజ్యం గురించిన ప్రాథమిక అనుభవాన్ని పొందవచ్చు.
-పారిశ్రామిక శిక్షణలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే పారిశ్రామిక శిక్షణలో భాగంగా ఒక స్టార్టప్ కంపెనీని స్థాపించవచ్చు. అనేక ప్రాజెక్టులను ప్రారంభదశ నుంచి చేయడం మొదలు పెట్టవచ్చు.
-వ్యాపార అనుభవం పొందడంతోపాటు తరగతిలో నేర్చుకోని విషయాలు నేర్చుకునే వీలు కలుగుతుంది. విద్యార్థుల్లో ప్రత్యేక గుర్తింపు కూడా పొందవచ్చు.
-తరగతిలో నేర్చుకున్న సజ్జెక్టు పరిజ్ఞానం ఆచరణాత్మకంగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునే వీలుంటుంది.
-సీఏ కోర్సులోని సబ్జెక్టులపై ప్రతి విద్యార్థికి లోతైన అవగాహన అవసరం. పూర్తి అవగాహన కలిగిన విద్యార్థులు మాత్రమే సీఏ ఫైనల్ పరీక్షలను సమర్థంగా రాసే అవకాశం ఉంటుంది. ఈ పారిశ్రామిక శిక్షణ వల్ల విద్యార్థికి చదువుతున్న అంశాలపై లోతైన అవగాహన ఏర్పడి ఫైనల్ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటుంది.
-విద్యార్థి పారిశ్రామిక శిక్షణ పొందే సమయంలో ట్రెయినింగ్ తీసుకుంటున్న సంస్థలోని సహ విద్యార్థులు, సీనియర్లు, ప్రభుత్వ అధికారులు, ఆదాయపు పన్ను విభాగం వారు, లీగల్ అడ్వైజర్లు, ఇలా అందరితో కలిసి పనిచేయడం వల్ల తాము కూడా తన భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం ఉంటుంది.
ఉద్యోగ అవకాశాలు
-కంపెనీలు ఉద్యోగ నియామకాలు జరిపేటప్పుడు తమ కంపెనీలో ఎవరైతే పారిశ్రామిక శిక్షణ తీసుకున్నారో వారికే మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
-ఒకసారి ఒక సీఏ విద్యార్థి ఒక సంస్థలో పారిశ్రామిక శిక్షణ తీసుకుంటే సహజంగా అదే కంపెనీ అతను సీఏ క్వాలిఫై అయ్యాక మంచి వేతనంతో ఉద్యోగంలోకి తీసుకుంటుంది. దీంతోపాటు పారిశ్రామిక శిక్షణ తీసుకున్న విద్యార్థికి ఇతర సంస్థల నుంచి కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
-సీఏ పూర్తయ్యాక సొంతంగా ఒక సంస్థను నెలకొల్పి వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు ఈ ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ చాలా ఉపయోగపడుతుంది
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?