జనాభా విస్ఫొ టనం-నివారణ
భారతదేశపు ప్రస్తుత జనాభా ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉంది. అయితే జనాభా చాలా నెమ్మదిగా పెరగడం చాలా మంచిదని అందరూ అంగీకరించారు.
జనాభా విస్ఫోటనాన్ని ఎదుర్కోవడానికి చర్యలు
1. ఆర్థిక చర్యలు
-పారిశ్రామిక రంగ విస్తరణ
-ఉద్యోగావకాశాల కల్పన
-సమానత్వంతో కూడిన ఆదాయ పంపిణి, పేదరిక నిర్మూలన
2. సాంఘిక చర్యలు
-జననాల రేటును తగ్గించడానికి సాంఘిక దురాచారాలను రూపుమాపాలి.
-అక్షరాస్యతను పెంచాలి, స్త్రీ విద్యాస్థాయిని కూడా పెంచాలి.
-సామాజికంగా, ఆర్థికంగా స్త్రీల స్థాయిని పెంచాలి.
-కనీస వివాహ వయస్సును పెంచాలి.
3. కుటుంబ నియంత్రణ పథకం
-కుటుంబ నియంత్రణ కార్యక్రమాల అమలు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
-కుటుంబ నియంత్రణకు అంగీకరించిన వారికి ప్రోత్సాహకాలు
-కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
-కుటుంబ నియంత్రణపై పరిశోధన మొదలైన చర్యలు చేపట్టాలి.
దేశంలో జనాభా విధానం
-ప్రభుత్వం 1952లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను ప్రారంభించింది. మొదటి మూడు ప్రణాళికల్లో తగినంత ఫలితాలు రాకపోవడంతో 1966లో పూర్తిస్థాయి కుటుంబ నియంత్రణ శాఖను ఏర్పాటు చేశారు.
-1972లో గర్భస్రావాలు చట్టబద్ధం చేశారు. ఐదో ప్రణాళిక నుంచి కుటుంబ నియంత్రణతోపాటు ఆరోగ్యం, ప్రసూతి, శిశు సంక్షేమం, పోషకాహార కార్యక్రమాలు చేపట్టారు.
-1976లో జాతీయ జనాభా విధానం ప్రకటించారు. దీంతో కుటుంబ నియంత్రణను తప్పనిసరిచేసే అధికారం రాష్ర్టాలకు కల్పించారు.
-స్త్రీ పురుషుల వివాహ వయస్సు 18, 21 ఏండ్లుగా నిర్ణయించారు. దేశంలో అత్యవసర పరిస్థితి కాలంలో నిర్భంధ కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అమలుచేయడంతో వాటిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దీంతో 1977 నుంచి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను స్వచ్ఛంద పద్ధతుల ద్వారా అమలు చేయాలని నిర్ణయించారు.
-ఎనిమిదో ప్రణాళికలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రాధాన్యతా రంగంగా గుర్తించి 1991లో కరుణాకరన్ కమిటీని నియమించింది. కమిటీ సూచనలతో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు నిధుల పెంపు, కుటుంబ నియంత్రణ సాధనాల నాణ్యత పెంచాలని నిర్ణయించారు.
-భవిష్యత్లో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కన్నవారు కేంద్ర రాష్ట్ర చట్టసభలకు పోటీచేసే అర్హత లేకుండా చేయాలని 1992 డిసెంబర్లో నిర్ణయించారు. కుటుంబ నియంత్రణ పాటించని వారిని పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా నిరోధించాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.
-2000, మే 1 నాటికి భారత జనాభా అధికారికంగా 100 కోట్లకు చేరుకుంది. అదేరోజు జనాభా స్థిరీకరణకు సంబంధించిన కార్యక్రమాల కోసం ప్రణాళికలు రూపొందించడం, వాటి అమలులో సమన్వయం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ జనాభా కమిషన్ను ఏర్పాటు చేసింది.
-వివిధ మంత్రిత్వశాఖలు, ప్రభుత్వేతర రంగ ప్రతినిధులతో మొత్తం 100 మంది సభ్యులతో ఈ జాతీయ జనాభా కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వైస్ చైర్మన్గా ఉంటారు.
-జాతీయ జనాభా విధానం-2000 అమలును పర్యవేక్షిస్తూ దిశా నిర్దేశం చేయడం, వివిధ రాష్ర్టాలు కేంద్ర ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాలను సమన్వయం చేయడం జాతీయ జనాభా కమిషన్ ధ్యేయం.
-2002-07 కాలానికి ప్రకటించిన పదో ప్రణాళికలో జనాభా వృద్ధి రేటును 21.34 శాతం (1991-2001) నుంచి 16.21 శాతానికి (2001-2011) తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జాతీయ జనాభా విధానం-2000
-తక్షణమే సాధించాల్సిన ఆశయాలను, మధ్యకాలిక, దీర్ఘకాలిక ఆశయాలను ఇది నిర్ణయించింది.
-తక్షణ ఆశయాలలో గర్భ నిరోధక అవసరాలను ఏర్పాటు చేయడం, వైద్య వ్యవస్థాపన సౌకర్యాలను ఏర్పర్చడం, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడం, పునరుత్పత్తి, శిశు ఆరోగ్య సంరక్షణకు సమగ్ర సేవలను అందించడం ప్రధానమైనవి.
-2010 నాటికి ప్రసూతి రేటును సాధ్యమైనంత స్థాయికి తగ్గించడం, మధ్యకాలిక లక్ష్యంగా 2046 నాటికి జనాభాను స్థిరీకరించడం దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకుంది.
జనాభా పెరుగుదల, పోకడలు
-ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుతుంది. ప్రతి దేశంలోనూ ఏటా జనసంఖ్యలో ఎంతో కొంత వృద్ధి నమోదవుతుంది. ఆసియా దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కన్పిస్తుంది.
-జనాభా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా పూర్తి స్థాయిలో వృద్ధిని నివారించలేకపోతున్నాయి. దక్షిణాది రాష్ర్టాల కన్నా ఉత్తరాది రాష్ర్టాల్లోనే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్నది.
-పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాలకు పెను సవాలుగా మారింది. తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి సౌకర్యాల కోసం పెద్దఎత్తున నిధులు వెచ్చించాల్సి వస్తుంది.
-ప్రపంచ జనాభా 1987, జూలై 11 నాటికి 500 కోట్లు దాటిందని ఐక్యరాజ్యసమితి అధ్యయనంలో తేలింది. దీంతో 1987 నుంచి జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తున్నారు. జనాభాను తగ్గించడంతో పాటు, లైంగిక సమానత్వం, పునరుత్పత్తి ఆరోగ్యం ధ్యేయంగా జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
-ఐదు శతాబ్దాల క్రితం ప్రపంచ జనాభా సుమారుగా 50 కోట్లుగా ఉండేది. 1700 నాటికి 70 కోట్లు, 1800 నాటికి 95 కోట్లు, 1900 నాటికి 160 కోట్లు, 2000 నాటికి 600 కోట్లకు చేరుకుంది. నేడు అది 730 కోట్లకు చేరుకుంది. అత్యధిక పెరుగుదల గత శతాబ్దంలోనే నమోదైంది.
-భారతదేశంలో 1871 నుంచి జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. 1881లో లార్డ్ రిప్పన్ ఆధ్వర్యంలో జరిగిన గణన మేరకు భారత ఉపఖండ జనాభా 28.80 కోట్లు, నేడు 196 కోట్ల జనాభాతో భారత్ ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. మరో దశాబ్దంలో చైనాను అధిగమించనుందని అంచనా.
-దేశంలో శిశు మరణాల సంఖ్య రెండు దశాబ్దాల క్రితం వెయ్యికి 68 ఉండగా, నేడు అది 34కు తగ్గింది. జనాభా పెరుగుదల ప్రస్తుతం భారత్లో 1.13 శాతంగా ఉంది. ప్రతి వెయ్యి మందికి 18.7 మంది జన్మిస్తుండగా 7.3 మంది మరణిస్తున్నారు.
-ఆదర్శ జనాభా ఎంత అనే అంశంపై ఎన్నో ఏండ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కు చెందిన ఎడ్విన్ కానన్, కార్స్ శాండర్స్ పరిశోధన ప్రకారం ఒక ప్రాంతంలోని వనరులు, వాటిని ఉపయోగించుకునే జనాభా, వారి సాంకేతిక సామర్ధ్యాన్ని అంచనా వేసి, ఇక్కడ ఎంత జనాభా ఉండవచ్చో లెక్కగట్టారు.
-రెండు వేల ఏండ్ల క్రితం ప్రపంచ జనాభాను 30 కోట్లుగా చరిత్రకారులు లెక్కగట్టారు. ఇప్పుడు ప్రపంచ జనాభా 730 కోట్లు అయ్యింది. జనాభా పరిమితికి మించిందని చెప్పవచ్చు.
-ఐక్యరాజ్యసమితి జనాభా అధ్యయన నిధి సంస్థ జనాభా లెక్కలను ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నది. దీని గణాంకాల ప్రకారం పూరించగల పునరుత్పత్తి స్థాయి 2.1గా ఉంటే తరుగుదల, పెరుగుదల లేకుండా జనాభా స్థిరంగా ఉంటుంది. ఈ ప్రాతిపదికన ప్రతి మహిళ జీవితకాలంలో 2.1 చొప్పున బిడ్డలకు జన్మనివ్వవచ్చు.
-అయితే దేశంలో ప్రజనన స్థాయి (ఫెర్టిలిటీ రేటు) 2.3గా ఉంది. అందువల్ల జనాభా పెరుగుతూనే ఉంది. పునరుత్పత్తి (ప్రజనన) స్థాయి దేశంలో పెద్ద రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్ 3.3, బీహార్లో 3.1గా, చిన్న రాష్ర్టాలైన సిక్కిం 1.2, మణిపూర్లో 1.4 శాతంగా ఉంది.
-కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆర్థిక సర్వే ప్రకారం దేశంలోని వివిధ రాష్ర్టాల్లో జనాభా వృద్ధిరేటు తగ్గనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోను ఈ పరిస్థితి కొనసాగుతుంది. అదే సమయంలో ఈ రాష్ర్టాల్లో లింగ నిష్పత్తి మెరుగుపడింది. ప్రజల ఆయుఃప్రమాణాలు పెరగడంతోపాటు మరణాల శాతం తగ్గుతున్నది.
-ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా కొనసాగితే జనాభా పెరుగుదలను నియంత్రించడం కష్టమేమీ కాదు. 2050 నాటికి ప్రపంచ జనాభా స్థిరీకరణ సాధ్యమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
జనాభా స్థిరీకరణ నిధి
-2010 నాటికి 2.1 శాతం సంతానోత్పత్తిని సాధించాలని 2045 నాటికి జనాభా స్థిరీకరణను సాధించాలని 2045 నాటికి జనాబా స్థిరీకరణను సాధించాలని జాతీయ జనాభా విధానం నిర్దేశిస్తుంది. ఆ లక్ష్యాల సాధనకు కృషి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్లతో రాష్ట్రీయ జనసంఖ్య కోశ్ పేరుతో జనాభా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది.
-దీనికి చైర్మన్గా ప్రధాని, వైస్ చైర్మన్గా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వ్యవహరిస్తారు. కుటుంబ సంక్షేమ శాఖ సెక్రెటరీ ఈ నిధికి మెంటార్ సెక్రెటరీగా ఉంటారు.
-జనాభా స్థిరీకరణ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రైవేట్ వ్యక్తులు, దాతలు, చారిటీ సంస్థల నుంచి విరాళాలు సేకరిస్తుంది.
-అధిక జనాభాతో సతమతమవుతున్న రాష్ర్టాలకు ఆర్థికంగా సహాయకారిగా ఉంటూ, కుటుంబ నియంత్రణలో భాగం గా మహిళల పునరుత్పత్తికి, పిల్లలకు ఆరోగ్య సౌకర్యాలు కల్పించడానికి ఈ నిధి కృషి చేస్తుంది.
-దేశంలో జనాభా పెరుగుదలకు కారణాల్లో మరణాల రేటు తగ్గడం, బాల్య వివాహాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పేదరికం, మూఢ నమ్మకాలు, నిరక్షరాస్యత వంటివి ప్రధానమైనవి.
-అధిక జనాభా వల్ల ప్రకృతి వనరులు కరిగిపోవడం, ఆహారపు కొరత, నిరుద్యోగం, జాతీయ తలసరి ఆదాయాలు తగ్గడం, జీవన ప్రమాణ స్థాయి తగ్గడం, పొదుపు-పెట్టుబడులు తగ్గడం, సాంఘిక వ్యవస్థాపక వ్యయం పెరగడం, వ్యయసాయ రంగంపై తీవ్ర ఒత్తిడి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
-జనాభా పెరుగుదల ఆర్థికాభివృద్ధిని ఆటంకపరుస్తుంది. కాబట్టి దేశంలో ఉన్న ప్రధాన సమస్య అధిక జనాభాను అదుపులో ఉంచడమే.
-విద్యావ్యాప్తి జరగకుండా, జీవన ప్రమాణ స్థాయిలో పెరుగుదల లేకుండా ప్రపంచంలో ఎక్కడ జనాభా వృద్ధిరేటు తగ్గలేదు. జననాల రేటును తగ్గించడానికి భారతదేశంలో ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా దాటవేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు