జనాభా పరిమాణం- కూర్పు, పెరుగుదల

ఆర్థికాభివృద్ధి కేవలం భౌతికమైన సహజ వనరులపైనే గాక మానవ వనరుల మీద కూడా ఆధారపడుతుంది.
-దేశంలోని జనాభా, వారి విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పౌష్టికాహారం, విధానాలు, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, ఆదాయ పంపిణీ మొదలైన వాటిని మానవ వనరులుగా చెప్పవచ్చు.
-జనాభా పెరుగుదల రేటు కొన్ని దేశాల ఆర్థికాభివృద్ధిని ఆటంకపరుస్తుందని తెలుస్తుంది.
జనాభా పరిమాణం బట్టి జనాభా 3 రకాలు
1. అల్ప జనాభా- ఒక దేశ విస్తీర్ణతకు సరిపోని జనాభాను అల్పజనాభా అంటారు. ఇలాంటి దేశాల్లో మానవ వనరుల కొరత ఏర్పడి ఆర్థికాభివద్ధి మందగిస్తుంది.
ఉదా: రష్యా, ఆస్ట్రేలియా, అరబ్‌దేశాలు
2. అభిలషణీయ జనాభా- ఒక దేశానికి సరిపడే జనాభాను అభిలషణీయ జనాభా అంటారు. అభిలషణీయ జనాభా ఉన్నట్లయితే ఆ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుంది.
ఉదా: అభివృద్ధి చెందిన దేశాలు
3. అధిక జనాభా- ఒక దేశ భూభాగం కన్నా జనాభా ఎక్కువగా ఉంటే దానిని అధిక జనాభాగా పేర్కొనవచ్చు. ఫలితంగా ఉపాధి అవకాశాలు తగ్గి నిరుద్యోగిత ఏర్పడుతుంది. దీనిలో మానవ వనరులు వృథా అవుతాయి.
ఉదా: భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్ మొదలైన అభివృద్ధి చెందుతున్న దేశాలు
జనాభా పరిణామ సిద్ధాంతం
(Demographic TransitionTheory)
-జనాభా సిద్ధాంతాల్లో మాల్థస్-జనాభా సిద్ధాంతం చాలా ముఖ్యమైనది. 1805లో మాల్థస్ తన వ్యాసంలో మొత్తం సమస్యను విశ్లేషించి, ఒక అభిప్రాయానికి వచ్చారు.
-పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగిత, అనారోగ్యం దాని మూలంగా వ్యాధిగ్రస్తులు కావటం వంటి సమసల్యకు జనాభా పెరుగుదల కారణమని అభిప్రాయపడి ‘జనసంఖ్య’ సిద్ధాంతాన్ని తీసుకువచ్చాడు.
-ఈ సిద్ధాంతం ద్వారా జనన, మరణాల రేటుకు, ఆర్థికాభివృద్ధిలోని మార్పులకు మధ్యగల సంబంధాన్ని తెలుసుకోవచ్చు. ఈ సిద్ధాంతాన్ని మాల్థస్ ప్రతిపాదించాడు.
-జనాభా పరిణామ సిద్ధాంతాన్ని నాలుగు దశలుగా విభజించవచ్చు.
-మొదటి దశ- ఈ దశలో జననాల రేటుతోపాటు మరణాల రేటు అధికంగా ఉంటుంది. ఈ దశలో ఆర్థికాభివృద్ధి స్థాయి తక్కువగా, వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది.
-ఈ దశ భారత్‌లో 1921కి పూర్వం ఉంది. అధిక జనాభా ఉండటం వల్ల పౌష్టికాహారం, వైద్యసదుపాయం ప్రతి ఒక్కరికి అందకపోవడంతో మరణాల రేటు అధికంగా ఉంటుంది. నిరక్షరాస్యత, మూఢాచారాలు, కుటుంబ నియంత్రణ మార్గాలపై అవగాహన లేకపోవడం వల్ల జననాల రేటు కూడా అధికంగా ఉంటుంది.
-మొదటి దశలో అధిక మరణాలు, అధిక జననాలు ఉండటం వల్ల కొంత కాలం జనాభా స్థిరంగా ఉంటుంది.
-ఈ దశను వెనుకబడిన దేశాలు ఎదుర్కొంటాయి. మొదటి దశ నుంచి రెండో దశకు వెళ్లడానికి ఈ దేశాలు ప్రయత్నం చేస్తాయి.
-రెండో దశ- మరణాల రేటు తక్కువగాను, జననాల రేటు అధికంగాను ఈ దశలో ఉంటుంది. ఆర్థికాభివృద్ధి ప్రారంభం కావడంతో ప్రజల ఆదాయం పెరగడం ఫలితంగా ప్రజలకు పౌష్టికాహారం లభ్యత, ఆరోగ్య సదుపాయాలు దగ్గరవుతాయి. కలరా, మశూచి వంటి వాటిని ప్రభుత్వం అరికట్టడం వలన మరణాల రేటు తగ్గుతుంది.
-నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, కుటుంబ నియంత్రణపై ఇంకా అవగాహన రాకపోవడంతో జననాల రేటు రెండో దశలో అధికంగా ఉంటుంది. అల్పమరణాలు, అధిక జననాల రేట్లవల్ల జనాభా పెరుగుదల రేటు ఇంకా ఎక్కువ అవుతుంది. దీన్నే ఆర్థికవేత్తలు ‘జనాభా విస్ఫోటనం’ అంటారు.
-ఈ దశలో ఉన్న దేశాలు అధిక జనాభా వల్ల ఏర్పడే సమస్యలను ఎదుర్కొంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో రెండో దశ లక్షణాలు కనబడతాయి (ప్రస్తుతం భారతదేశంలో రెండో దశ కనబడుతుంది).
-మూడో దశ- జననాలు, మరణాల రేటు తక్కువగా ఉంటుంది. ఆధునికీకరణ, నగరీకరణ, విద్యావ్యాప్తి, పారిశ్రామికీకరణ వల్ల జననాల రేటు తగ్గిపోతుంది. అధిక జనాభాతో ఏర్పడే సమస్యలను ప్రజలు గుర్తించి కుటుంబ నియంత్రణను అమలుపరుస్తారు.
-పౌష్టికాహార లభ్యత, ఆరోగ్య సదుపాయాలు, అభివృద్ధి చెందడంతో మరణాల రేటు తగ్గిపోతుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఈ దశ క్లిష్టతరమైనది. ఈ దశలో జనాభా వలన ఏర్పడే సమస్యలు ఉత్పన్నం కావు.
-నాలుగో దశ- ఈ దశలో జనన, మరణాల రేట్ల మధ్య సమన్వయం సాధించి రెండింటిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి. విజ్ఞాన శాస్ర్తాభివృద్ధి వల్ల వైద్య సౌకర్యాలు విస్తరించి మనిషి సగటు జీవితకాలం పెరిగి మరణాల రేటు గణనీయంగా తగ్గుతుంది.
-చిన్న కుటుంబం, కుటుంబ సంక్షేమం, సుఖజీవనానికి కుటుంబ నియంత్రణ పాటించడంవల్ల జననాల రేటు గణనీయంగా తగ్గుతుంది. జనాభా పెరుగుదల రేటు ఈ దశలో స్థిరత్వాన్ని పొందుతుంది. దీనితో ఆర్థికాభివృద్ధి జరిగి ప్రజల జీవన ప్రమాణ రేటు పెరుగుతుంది.
విశ్లేషణ
-పై దశలను పరిశీలిస్తే జనన, మరణరేటు ఎక్కువగా ఉండి జనాభా పెరుగుదలలో మార్పు కనిపించని ప్రథమ దశ ప్రమాదకరం కాదని చెప్పవచ్చు.
-మొదటి దశ నుంచి రెండో దశకు చేరినప్పుడు మరణాల రేటు కన్నా జననాల రేటు ఎక్కువగా ఉండి ఆర్థికవ్యవస్థలో అసమానతలు ఏర్పడతాయి. శాస్త్ర విజ్ఞానాభివృద్ధి వలన మరణాల రేటు తగ్గించినంత సులభంగా జననాల రేటుకు కారణమైన సాంఘిక ఆచారాలను, మూఢనమ్మకాలను తొలగించడం సులభం కాదు. కాబట్టి ఈ దశల్లో జనాభా విస్ఫోటనం అన్ని విధాలా ప్రమాదకరం. ఈ అసమానతలను తొలగించేందుకు పరిణామ దశ అవసరం. దీన్నే ‘జనాభా పరిణామ సిద్ధాంతం’ అంటారు.
-మూడో దశలో మరణాల రేటు స్థాయికి జననాల రేటు తగ్గించడం వల్ల జనాభా పరిణామం చెంది ఆర్థికాభివృద్ధికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
-చివరి దశలో సమన్వయించిన, తగ్గించిన జనన మరణాల రేట్లు మనిషి సగటు జీవిత కాలాన్ని, వస్తు ఉత్పాదక శక్తిని, ఆర్థికాభివృద్ధిని, ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడం వల్ల జనాభా పెరుగుదల ఒక సమస్య కాదు.
ప్రపంచ వ్యాప్తంగా జనాభా పరిస్థితి
-1830లో ఒక బిలియన్గా ఉన్న ప్రపంచ జనాభా 1930 నాటికి రెండు బిలియన్లకు, 1960 నాటికి మూడు బిలియన్లకు, 1975 నాటికి నాలుగు బిలియన్లకు, 1987 నాటికి ఐదు బిలియన్లకు చేరుకుంది. 1987 జూలై 11న ఐదవ బిలియన్ బేబీ జన్మించింది. అప్పటినుంచి ఆ రోజును ‘ప్రపంచ జనాభా దినంగా’ జరుపుకుంటున్నారు.
-ప్రపంచ జనాభా 6 బిలియన్లకు చేరుకున్న 12 అక్టోబర్ 1999ని ఐక్యరాజ్యసమితి ‘డే ఆఫ్ సిక్స్ బిలియన్’గా ప్రకటించింది.
-ప్రపంచ జనాభా ఒక అంచనా దృష్ట్యా 2022 నాటికి ఎనిమిది బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా వేశాయి.
-‘పాపులేషన్ డివిజన్ U.S’ తన 2003 నివేదికలో 2050 నాటికి ప్రపంచ జనాభా 8.9 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.
భారత్‌లో జనాభా పరిస్థితి
-మన దేశంలో జనాభా లెక్కల సేకరణ 1872లో ప్రారంభమైంది. అయితే 1891 నుంచి మాత్రం పూర్తిస్థాయిలో క్రమంతప్పకుండా సేకరిస్తున్నారు.
-20వ శతాబ్దం తొలినాళ్లలో (1901) 23.04 కోట్లుగా ఉన్న భారత జనాభా 1991 నాటికి 84.63 కోట్లు, 2001 నాటికి 102.70, 2011 నాటికి 121.05 కోట్లకు చేరుకుంది.
భారతదేశ జనాభా పెరుగుదల
-ప్రపంచ భూభాగంలో మనదేశం 2.4శాతం ఉంటే 2001 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 16.7శాతం జనాభాను మనదేశం కలిగి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 17.5శాతం జనాభాను మనదేశం కలిగిఉంది.
-జనాభా పెరుగుదల వల్ల మనదేశంలో జనాభా విస్ఫోటనం ఏర్పడినది. ప్రతి 1000 మందికి జననాలు 21.4గా ఉంటే, మరణాలు 7.1గా ఉన్నది. వీటి మధ్య అంతరం పెరగడంతో జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గి మళ్లీ 1921 నుంచి జనాభా పెరుగుదల రేటు వేగంగా పెరిగింది. అందువల్ల 1921 సంవత్సరాన్ని ‘ మహా విభాజక సంవత్సరం’ అంటారు.
-మొదటి దశ (1891-1921)- 30 ఏండ్లలో భారతదేశ జనాభా 1.5 కోట్లు మాత్రమే పెరిగింది. ఈ కాలంలో వార్షిక వృద్ధిరేటు 0.19 శాతమే. జనన, మరణరేట్లు రెండూ అధికంగా ఉండటంతో జనాభా పెద్దగా పెరగలేదు. అందువల్ల ఈ దశను ‘స్తబ్ధతతో కూడిన జనాభా’ (Stagnant Population Period) అంటారు.
-1911తో పోలిస్తే 1921లో జనాభా తగ్గింది. అంటే 1921లో రుణాత్మక వృద్ధి నమోదయింది. 1918లో ఇన్ప్లూయెంజ వల్ల జనాభా తగ్గింది.
-1921కి పూర్వం జనాభా పెరుగుదలలోని ఒడిదుడుకులు అంతమై, 1921 తర్వాత జనాభా నిరంతరం పెరుగుతూ వచ్చింది. అందుకే 1921ని ‘గ్రేట్ డివైడింగ్ ఇయర్’ (మహావిభాజక సంవత్సరం) అంటారు.
-రెండో దశ (1921-51)- ఈ దశలో భారతదేశ జనాభా 11 కోట్లు పెరిగింది. వార్షిక వృద్ధిరేటు 1.22శాతం. ఈ దశలో జనాభా నెమ్మదిగా పెరగడంతో దీన్ని ‘క్రమవృద్ధి’ అంటా రు. జనాభా పరిమాణ సిద్ధాంతంలో భారతదేశం రెండో దశలోకి ప్రవేశించింది.
-మూడో దశ (1951-81)- ఈ దశలో భారతదేశ జనాభా 32 కోట్లకు పెరిగింది. జనన రేటులోని తగ్గుదల కంటే మరణరేటులోని తగ్గుదల అధికంగా ఉండటంతో జనాభా పెరిగింది. అంటే ‘జనాభా విస్ఫోటనం’ (Population Explosion) సంభవించింది. జనాభా వేగంగా పెరిగే ఈ దశను ‘సత్వర అధికవృద్ధి’ (Rapid High Growth) అంటారు.
-1951 నుంచి జనాభా దశాబ్ద పెరుగుదల రేటు 20శాతం పైన నమోదుకావడంతో 1951ను చిన్న విభాజక సంవత్సరం (Small divide year) అని అంటారు.
-నాలుగో దశ (1981-2001)- 1981-91 మధ్య జనాభా 16 కోట్లు పెరిగి, వార్షిక వృద్ధిరేటు 2.11 శాతంగా నమోదయింది.
-1991-2001 మధ్య 18.3కోట్లు జనాభా పెరిగి, వార్షిక వృద్ధిరేటు 1.9శాతంగా నమోదయింది.
-2001-11 మధ్య 18.1 కోట్లు జనాభా పెరిగి, వార్షిక వృద్ధిరేటు 1.64 శాతంగా నమోదయింది.
-ఈ 30 ఏండ్లలో జనాభా 52.8 కోట్లు పెరిగింది. వార్షిక వృద్ధిరేటు 1.84 శాతంగా నమోదయింది.
-ఈదశలో జనాభా పెరుగుదల ఉన్నప్పటికీ జనాభా పెరుగుదల రేటు తగ్గింది. అందుకే ఈ దశను ‘తగ్గుతుందనే సంకేతాలతో కూడిన అధిక వృద్ధి’ (High Growth with definite sings of slowing down) అని అంటారు.
-జనసాంద్రత- దేశంలో ప్రతి చదరపు కిలోమీటరుకు నివసించే జనాభాను జనసాంద్రత అంటారు. ఈ జనసాంద్రత పెరుగుదల రేటును బట్టి మారుతుంటుంది.
-2011 ప్రకారం జనసాంద్రతలో బీహర్ (1106), పశ్చిమ బెంగాల్ (1028), కేరళ (860) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
స్త్రీ, పురుష నిష్పత్తి
-ప్రస్తుతం చాలా దేశాల్లో స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాని అభివృద్ధి చెందిన దేశాలలో ఇందుకు భిన్నంగా ఉన్నది. ప్రతి 1000 మంది పురుషులకు రష్యాలో 1070 మంది స్త్రీలు ఉన్నారు.
-అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ముఖ్యంగా భారతదేశంలో 1901 సంవత్సరంలో స్త్రీ-పురుష జనాభా నిష్పత్తి 972: 1000 ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం 943: 1000 ఉంది.
-పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. ఈ రాష్ట్రంలో ప్రతి 1000మంది పురుషులకు 1022 మంది స్త్రీల సంఖ్య ఉంది. 2001లో 1058 కి, 2011లో 1084 కు పెరిగింది. జనాభా అక్షరాస్యత- మనదేశ జనాభాలో అక్షరాస్యుల శాతం 1951 నుంచి క్రమంగా పెరుగుతున్నది. కేవలం 20శాతం మాత్రమే అక్షరాస్యులుగా ఉన్న జనాభా 2011 నాటికి 64.84శాతానికి పెరగగా 2011 నాటికి 73శాతానికి పెరిగింది.
-2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యులున్న రాష్ట్రం కేరళ. ఈ రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 94మంది అక్షరాస్యులు ఉన్నారు.
-మనదేశంలో 1951 నాటికి స్త్రీల అక్షరాస్యత 2.8శాతం ఉండగా పురుషుల అక్షరాస్యత 29శాతంగా ఉంది.
-2011 నాటికి స్త్రీల అక్షరాస్యత రేటు 64.6శాతం కాగా పురుషుల అక్షరాస్యత రేటు 80.9 శాతానికి పెరిగింది.
-మొత్తం జనాభాలో పురుషుల కంటే స్త్రీలు విద్యలో వెనుకబడినట్లు తెలుస్తున్నది. ఇందుకు మనదేశంలోని మత, సాంఘిక, ఆర్థిక పరిస్థితులే కారణమని చెప్పవచ్చు.
RELATED ARTICLES
-
Biology – JL / DL Special | ఆశ్రయం పొందుతాయి.. హాని తలపెడతాయి
-
Telangana Socio Economic Survey | ఆయిల్‌పామ్ పండించే రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం?
-
Indian festivals and culture | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
-
Geography – Groups Special | విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించినది ఎవరు?
-
Economy | డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం.. పాత కొత్తల మేలు కలయిక
-
Biology | విటమిన్ల లోపం వల్ల చర్మానికి వచ్చే వ్యాధి?
Latest Updates
DSC Special – Social Studies | బ్యాంకులు పూచీకత్తులు లేకుండా రుణాలు ఎవరికి ఇస్తాయి?
General Studies | బ్రిటిషర్లు ‘కైజర్-ఇ-హింద్’ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు?
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు
CLAT 2024 | Common Law Admission Test Latest Updates
Current Affairs | కెంటకీ నగరం ఏ రోజు ‘సనాతన ధర్మ’ రోజుగా ప్రకటించింది?
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా జరుగుతుంది?
Society QNS & ANSWERS | తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏది?
Physics – IIT/NEET Foundation | Vector Subtraction is Useful to?
RBI Recruitment | ఆర్బీఐలో 450 అసిస్టెంట్ పోస్టులు