నది రూపం-విశ్వరూపం అంటే తెలుసా..?
నదీగ్రహణం
– సాధారణంగా పర్వతాల్లో రెండు నదులు ఒకదానికింద మరొకటి ప్రవహిస్తున్నప్పుడు కిందున్న నది ఊర్ధక్రమక్షయం ద్వారా పైనున్న నదిని ముట్టడించి దాని నీటిని దొంగిలిస్తుంది.
– నీటి ప్రవాహాన్ని దొంగిలించిన నదిని దోచుకున్న నది (Captor river) అని, దోపిడీకి గురైన నదిని దోపిడీకాబడ్డ నది (Captured river) అని అంటారు.
ఉదా: గంగానది తన జన్మస్థానం దేవప్రయాగ వద్ద కింద ఉన్న అలకనంద నది పైనున్న భగీరథి నదిని నదీగ్రహణం ద్వారా ముట్టడిస్తుంది.
నదీగ్రహణం-తోడ్పడే అంశాలు..
1. నదీలోయ వాలు
2. నదీలోయలోతు
3. నదిలోని నీటి పరిమాణం
4. నదీప్రవాహవేగం
5. నదీలోయ శిలల స్వభావం
6. భూస్వరూపం
నదీగ్రహణం ఏర్పడే పద్ధతులు
– క్రమక్షయ భూస్వరూపమైన నదీ గ్రహణం ప్రధానంగా మూడు రకాలుగా ఏర్పడుతుంది.
1. ఊర్ధక్రమక్షయం (Head ward erosin)
2. అధోముఖ క్రమక్షయం (Vertical erosin)
3. పక్కవాలు క్రమక్షయం (Lateral erosin)
– నదీగ్రహణం యవ్వన, ప్రౌఢ, వృద్ధ దశల్లో చోటుచేసుకుంటుంది.
– నదీ గ్రహణం యవ్వన దశలో ఏర్పడాలంటే ఊర్ధక్రమక్షయం, ప్రౌఢదశలో ఏర్పడాలంటే పక్కవాలు క్రమక్షయం, వృద్ధదశలో ఏర్పడాలంటే నదీవంకరలు ఖండించుకోవడం అవసరం.
నది ప్రౌఢదశలో ఏర్పడే భూస్వరూపాలు
– నది మధ్యభాగం అయిన ఈ దశలో వాలు తక్కువగా ఉండి ప్రవాహ వేగం కూడా తక్కువగా ఉంటుంది. ఈ దశలో ఉపనదుల సంఖ్య పెరగడంతో నదీపరీవాహక ప్రాంతం పెరిగి నదిలో నీటి పరిమాణం కూడా అధికమవుతుంది.
– ఈ దశలో ప్రధానమైనవి రవాణా, నిక్షేపణలు.
ఏర్పడే భూస్వరూపాలు..
స్పర్స్
– నదీలోయ వెడల్పు చేసేక్రమంలో స్పర్స్ ఏర్పడుతాయి. ఇది త్రిభుజాకారంలో ఉండి ఒకదానికొకటి అభిముఖంగా ఉంటాయి. కాబట్టి వీటిని జోడించిన స్పర్స్ (Interlocking Spurs) అనికూడా అంటారు.
నదీవేదికలు
– నదీలోయలో క్రమక్షయం కారణంగా అక్కడక్కడ మెట్లు లేదా వేదికలను ఏర్పరుస్తుంది. వీటినే నదీవేదికలు (River Terraces) అంటారు.
నదీవరద మైదానాలు
– నదికి వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు నది ప్రవహించే నదీలోయలోనే కాకుండా నది ఒడ్డుమీద కూడా పొర్లి ప్రవహించడం వల్ల నదిలో రవాణా చేయబడుతున్న రాళ్లు, రప్పలు, ఒండ్రుమట్టి, ఇసుక మొదలైనవి నది ఒడ్డున నిక్షేపించబడుతాయి. ఇవి ఒక మైదాన రూపంలో నిక్షేపించబడుతాయి. కాబట్టి వీటిని వరద మైదానాలు అంటారు.
సహజ లెవీలు
– నదికి వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు నది ప్రవాహం పెరిగి ఒక్కోసారి నది ఒడ్డును దాటి వరద మైదానం వెలుపల సన్నని రిడ్జ్ల రూపంలో నదీ భారాన్ని నిక్షేపణ కావిస్తుంది. దీన్నే సహజ లెవీలు (Natural Levees) అంటారు.
– నదీ ముఖద్వారంలో డెల్టాలు ఏర్పడటమనేది నది పరీవాహక ప్రాంతంలో ఉన్న శిలల స్వభావం, అక్కడ కురిసే వర్షపాతం, చుట్టూ ఉన్న వృక్షజాలం, క్రమక్షయం జరిగే విధానం, సముద్ర అలల స్వభావం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది.
నదీవంకరలు
– నది తాను క్రమక్షయం ద్వారా సమకూర్చుకున్న భారాన్ని మోయలేక అధికభారం వల్ల వంకరలు తిరిగి ప్రవహిస్తుంది. ఈ వంకరలను నదీవంకరలు (Meanders) అంటారు.
ఉదా: గోదావరి నది అంతర్వేది సమీపంలో వంకరలు తిరిగి ప్రవహించడం, గంగానది అలహాబాద్ సమీపంలో వంకరలు తిరిగి ప్రవహించడం.
ఒండలి వీవన
– నది యవ్వన దశ నుంచి ప్రౌఢదశలోకి, దిగువ దశలోకి ప్రవేశించినప్పుడు ప్రవాహ వేగం తగ్గడంవల్ల ప్రవాహం వెంట రవాణా చేయబడుతున్న ఇసుకరాళ్లు, ఒండ్రుమట్టి మొదలైన పదార్థాలను అనువైన చోట విసనకర్ర ఆకారంలో నిక్షేపణం చెందించడాన్ని ఒండలి వీవన (Allvial fans) అంటారు.
డెల్టాలు
– క్రమక్షయం ద్వారా నది సముపార్జించిన ఒండ్రుమట్టి ఇసుక వంటివి నది ముఖద్వారం వద్ద నిక్షేపించబడినప్పుడు డెల్టాలు (Deltas) ఏర్పడుతాయి.
– ఇది గ్రీకు అక్షరమైన డెల్టా ( పోలి ఉంటుంది. అందువల్ల ఆ పేరు వచ్చింది.
– ఇవి చాలా సారవంతమైనవి. వీటిలో ఒండ్రుమట్టి ఎక్కువగా ఉండటంతో వరి పంటసాగుకు అనుకూలంగా ఉంటాయి.
డెల్టాలు రకాలు
– డెల్టాలను వాటి ఆకారం, నిర్మాణం, పరిమాణం, పెరుగుదల మొదలైన వాటిని ఆధారంగా చేసుకుని వర్గీకరించారు. అవి…
1. ధనుస్సు ఆకార డెల్టా (Arcumate Delta)
2. పక్షి అడుగు డెల్టా (Bird Foot Delta)
3. డిజిటల్ డెల్టా (Digital Delta)
4. లొబేట్ డెల్టా (Lobate Delta)
5. ఎస్చురైన్ డెల్టా (Estuarine Delta)
6. విసర్జిత డెల్టా (Abandoned Delta)
ధనుస్సు ఆకార డెల్టా
– డెల్టా మధ్యభాగం సముద్రంవైపు వంగినట్టు ఉండి దాని రెండు చివరలు దగ్గరకు కుచించినట్లుగా ఉంటూ ఒక వృత్త చాపంలా లేదా వంచిన ధనుస్సు ఆకారంలో ఉంటే అలాంటి డెల్టాను ధనుస్సు ఆకార డెల్టా అంటారు.
– నదిలోని నీటి సాంద్రత, సముద్ర జలసాంద్రతలు ఇంచుమించు సమానంగా ఉన్నప్పుడు ఈ డెల్టాలు ఏర్పడుతాయి.
పక్షి అడుగు డెల్టా
– ఇది పక్షి అడుగు ఆకారంలో ఉంటుంది. ఇవి సముద్ర జలాల కంటే నదీ జలాలు తేలికగా ఉన్నప్పుడు ఏర్పడతాయి.
ఉదా: మిసిసిపి డెల్టా (అమెరికా)
డిజిటల్ డెల్టా
– కంప్యూటర్ కీబోర్డులో అక్షరాల బిళ్లల్లా చిన్న చిన్న డెల్టాలు అనేకం ఏర్పడటం వల్ల ఈ రకం డెల్టా ఏర్పడుతుంది.
ఉదా: గంగా, బ్రహ్మపుత్ర నదులు ఏర్పర్చేవి.
లొబేట్ డెల్టా
– నది, సముద్ర జలాల సాంద్రత ఇంచుమించు సమానంగా ఉన్నప్పుడు మూడు చీలికలు కలిగి ఫ్యాను ఆకృతిలో ఏర్పడే డెల్టాను లొబేట్ డెల్టా అంటారు.
ఉదా: కృష్ణా, పెన్నా, మహానది డెల్టాలు
ఎస్చురైన్ డెల్టా
– నదులు సముద్రంలో కలిసేచోట పొడవైన డెల్టాలను ఏర్పర్చినప్పుడు వాటిని ఎస్చురైన్ డెల్టా అంటారు.
ఉదా: తాపి డెల్టా, మెకంజీ డెల్టా, హడ్సన్ డెల్టా
విసర్జిత డెల్టా
– నదులు తమ ముఖద్వారాలను మార్చుకున్నప్పుడు పాత డెల్టాలను పూర్తిగా వదిలేసి కొత్త డెల్టాలను ఏర్పరుస్తాయి. ఇది వదిలేసిన వాటిని విసర్జిత డెల్టాలు అంటారు.
ఉదా: పుసుపు నది (చైనా), హొయాంగ్హో నది (చైనా), హుగ్లీనది (పశ్చిమబెంగాల్- గంగా డెల్టా పశ్చిమభాగంలో)
నది వృద్ధ దశలో ఏర్పడే భూస్వరూపాలు
– నదులు సముద్రంలో కలిసేముందు నదీలోయవాలు చాలా తక్కువగా ఉండటంతో ప్రవాహ వేగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీంతో నది పాయలుగా చీలి ప్రవహిస్తుంది. వీటిని నదీపాయలు (Distributories) అని పిలుస్తారు.
– ఈ దశలో ఇసుక మేటలు, ఆక్స్-బౌ సరస్సులు, నదీపాయలు, డెల్టాలు అనే భూస్వరూపాలు ఏర్పడుతాయి.
ఇసుక మేటలు
– యవ్వన, ప్రౌఢదశల్లో నదీక్రమక్షయం వల్ల సమకూరిన నదీ భారాన్ని సముద్రం వరకు రవాణా చేయలేక మధ్యలోనే అక్కడక్కడ ఇసుకను నిక్షేపిస్తుంది. ఈ నిక్షేపణలను ఇసుక మేటలు (Sand bars) అంటారు.
– ఇసుక మేటలు నది ప్రవాహంలా వంకర టింకరగా ఉంటాయి. కాబట్టి వీటిని డ్రెయిడెడ్ నమూనా (Draided patterns) అంటారు.
ఆక్స్-బౌ సరస్సులు
– నది వృద్ధ దశలో మరీ వంకరలు తిరిగి ప్రవహించే సందర్భంలో కొన్నిసార్లు అర్ధచంద్రాకార ఆకృతి గల సరస్సులు ఏర్పడుతాయి. వీటినే ఆక్స్ బౌ సరస్సులు (Ox-bow lakes) అంటారు.
ఉదా: ఉలార్ సరస్సు (జమ్ముకశ్మీర్)
నదీపాయలు
– నది సముద్రంలో కలిసేముందు అనేక పాయలుగా చీలిపోయి అవి విడివిడిగా సముద్రంలో కలుస్తాయి. వీటిని నదీపాయలు (Distributories) అంటారు.
ఉదా: గోదావరి నది గౌతమి (యానాం వద్ద), వశిష్ట (అంతర్వేది), వైనతేయ (కొమరగిరిపట్నం), తుల్య, భరద్వాజ, కౌశిక, ఆశ్రేయ (బెండమూరులంక వద్ద) పాయలుగా ఏర్పడి బంగాళాఖాతంలో కలుస్తుంది. వీటిని సప్త గోదావరులు అంటారు.
– కృష్ణానది- హంసలదీవి (ఆంధ్రప్రదేశ్) వద్ద విడిపోయి నదిపాయగా బంగాళాఖాతంలో కలుస్తుంది.
– కావేరీ నది- కావేరీపట్నం (తమిళనాడు) వద్ద పాయగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది.
– మహానది- నారాజ్ (కటక్-ఒడిశా) వద్ద పాయగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది.
– పెన్నానది- ఊటుకూరు (నెల్లూరు-ఆంధ్రప్రదేశ్) వద్ద పాయగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు