తెలంగాణ ఉద్యమం-దోపిడీపై మేధో ఆగ్రహం ఎక్కడ జరిగింది..?
పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘనలపై 1958, మార్చి 8న హైదరాబాద్‌లోని కోఠీలో ప్రముఖ న్యాయవాది ఎస్ వెంకటస్వామి అధ్యక్షతన తెలంగాణ మహాసభ సమావేశం జరిగింది. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు హరిశ్చంద్ర హెడా ప్రారంభోపన్యాసం చేస్తూ ఆంధ్ర-తెలంగాణ నాయకుల మధ్య కుదిరిన పెద్దమనుషుల ఒప్పందాన్ని అమలుచేయాలన్నారు. అధికారంలో ఉన్నవారు తెలంగాణపై నిర్లక్ష్యం చూపుతున్నారు. మంత్రివర్గంలో తెలంగాణ ప్రతినిధులమని చెప్పుకున్న కొందరు నాయకులు రెండు విధాలుగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం ఉపముఖ్యమంత్రి పదవి తెలంగాణకు రావాలి. ఎప్పటి నుంచో ఉన్న ఆ పదవిని ఆరో వేలువంటిదన్నారు అని విమర్శించారు. స్వాగతోపన్యాసం చేసిన భోజ్రెడ్డి కొత్తగా అభివృద్ధి మాట అటుంచి ఉన్న గోడే చెడింది. ఈ పరిస్థితులను గుర్తించే పెద్దమనుషుల ఒప్పందం అమలుకోసం పోరాడటానికి తెలంగాణ మహాసభను ఏర్పాటు చేశామని అన్నారు.
-మాడపాటి హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఒప్పందాన్ని అమలు చేయడంలో విఫలమైతే ప్రజలు రాజ్యాంగబద్ధమైన చర్యల ద్వారా తమ సహజహక్కును వినియోగించుకోవాలని అన్నారు.
-ఎంపీ, కమ్యూనిస్టు నేత రాజ బహదూర్ గౌర్ ప్రసంగిస్తూ పన్నులు, ఉద్యోగ పరిస్థితుల విలీనీకరణ (ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్)కు వ్యతిరేకంగానే ఆందోళన సాగుతున్నది. ఈ విషయాన్ని పరిశీలించడానికి అన్ని పార్టీలతో ఒక కమిటీని వేయాలి అన్నారు.
-గోపాలరావు ఎక్బోటే మాట్లాడుతూ పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు జరపనందుకు అసంతృప్తి పెరిగింది. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను భగ్నం చేస్తున్న ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగానే ఈ ఉద్యమం జరుగుతుందన్నారు. సోషలిస్టు పార్టీకి చెందిన శాసనసభ్యుడు రత్నసభాపతి హైదరాబాద్ కార్పొరేషన్ అధికారాలను తగ్గించినందుకు ప్రభుత్వాన్ని విమర్శించారు.
-మాజీ మంత్రి మర్రి చెన్నారెడ్డి మాట్లాడుతూ.. పెద్దమనుషుల ఒప్పందాన్ని అమలు జరపనందుకు ప్రభుత్వాన్ని విమర్శించారు. డా. గోపాల్‌రెడ్డి (ఆర్థికమంత్రి) చెప్పినది ఏమైనా, తెలంగాణ ఆదాయం ఆంధ్రలో ఖర్చు పెట్టబడుతున్నది. తెలంగాణకు ప్రత్యేక పీసీసీ (ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఉండటానికి పెద్ద మనుషుల ఒప్పందంలో (పేరా 14) అంగీకరించి తరువాత రెండు పీసీసీలను కలిపారు. తెలంగాణలో సమర్థులు లేరని చెప్పి డీఎస్ రెడ్డిని ఉస్మానియా వైస్ చాన్స్‌లర్‌గా నియమించారు. ఈ నియామకాన్ని తెలంగాణ శాసనసభ్యులు బలపరిచారనడం నిజం కాదు. తెలంగాణ మహాసభ తెలంగాణ ప్రయోజనాలకు పనిచేయాలి అని పేర్కొన్నారు.
-ఈ సభకు 500 మంది ప్రతినిధులు, రెండు వేలమంది ప్రజలు వచ్చారు. (1958, మార్చి 9, 10- గోలకొండ పత్రిక)
తెలంగాణపై నిర్లక్ష్యం- కాంగ్రెస్ పరిశీలన కమిటీ
-తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం తగినంత శ్రద్ధవహించడం లేదని, నిర్లక్ష్యం చేస్తున్నదనే విమర్శలను పరిశీలించడానికి ఒక ఉపసంఘాన్ని తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ కార్యవర్గం ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రాంత ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. ఈ వ్యవహారాన్ని పరిశీలించి అలాంటి అవకాశం లేకుండా చేయడానికి విశేషాధికారాల సంఘం ఏర్పాటు చేయాలని కోరుతూ కార్యవర్గం ఒక తీర్మానాన్ని 1958, మార్చి 7న ఆమోదించింది. ఈ ప్రాంతీయ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానంపై ప్రణాళికల శాఖ మంత్రి వీబీ రాజు, నీటిపారుదల శాఖ మంత్రి జేవీ నర్సింగరావు హాజరయ్యారు. వాసుదేవ నాయక్, నూకల రామచంద్రారెడ్డి, డిప్యూటీ స్పీకర్ కొండా లక్ష్మణ్, కేఎస్ నారాయణ, పీవీ నరసింహారావులతో ఉపసంఘం ఏర్పాటయ్యింది.
నీటిపారుదల రంగంలో రక్షణల ఉల్లంఘన
-నీటి పారుదల అనే అంశం తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఆంధ్రలో బ్రిటిష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ వందేండ్లకు (1956 నాటికి) పూర్వమే నిర్మించిన కృష్ణా, గోదావరి, పెన్నా బ్యారేజీల కింద, డచ్ కంపెనీ 1863-70లో నిర్మించిన కడప-కర్నూలు కాలువల కింద లక్షన్నర ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఆంధ్ర ప్రాంతంలోని పంట భూమిలో దాదాపు 30 శాతం భూమికి కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర నదుల ద్వారా సాగునీటి వసతి లభించింది.
-1956 నాటికి తెలంగాణలో ప్రాజెక్టుల ద్వారా సాగవుతున్నది కేవలం 2-3 లక్షల ఎకరాలు మాత్రమే. ఇది తెలంగాణ పంట భూమిలో కేవలం 3 శాతం. నిజాం 1923-31లో నిర్మించిన నిజాం సాగర్, అప్పర్ మానేరు (1950), ఘనపూర్ ఆనకట్ట (1905), పోచారం, డిండి, మూసీ (1954) ప్రాజెక్టులను మాత్రమే 1956కు పూర్వం ప్రభుత్వాలు నిర్మించాయి. ఇవిగాక రాజులు, ప్రజలు నిర్మించుకున్న రామప్ప, పాకాల, ఘనపురం, శనిగరం, శాలిగౌరారం, పెండ్లిపాకల, భీమునిపల్లి, ఆసిఫ్‌నహర్ (మూసీపై కత్వ) వంటి వాటిని 1956కి ముందు పునరుద్ధరించారు. వీటిలో లక్ష ఎకరాలకు పైగా (అంచనా ఆయకట్టు 2 లక్షల 75 వేల ఎకరాలు ఉన్నప్పటికీ) సాగునీరందించే ప్రాజెక్టు తెలంగాణలో 1956 నాటికి కేవలం ఒక్క నిజాం సాగర్ మాత్రమే.
-తెలంగాణలో నీటిపారుదల అభివృద్ధి కోసం 1944 నాటికి నిజాం ప్రభుత్వం చాలా ప్రాజెక్టులకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి వెల్లోడి 1951, జూలై 27, 28 తేదీల్లో కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన రాష్ర్టాల ప్రతినిధులతో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో తలపెట్టిన ప్రాజెక్టులన్నింటికి అనుమతులు పొందారు. వీటిలో కొన్నింటిని మొదటి పంచవర్ష ప్రణాళికలో చేర్చగా, మరికొన్నింటిని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం చేపట్టింది.
-తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో విలీనం చేస్తే సాగునీటి రంగంలో నష్టం జరుగుతుందని ఈ ప్రాంత మేధావులు, నాయకులు, స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమిషన్ సభ్యులతో మొరపెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఫజల్ అలీ తమ నివేదికలో ప్రస్తావించారు. తెలంగాణ అనుకూల వాదనల గురించి వివరిస్తూ.. భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించి ప్రణాళికల విషయాన్ని పరిగణలోకి తీసుకునే సందర్భంలో విశాలాంధ్రలో ఈ ప్రాంత అవసరాల గురించి పట్టించుకోరనే భయం తెలంగాణ వారిలో నెలకొని ఉన్నది. ఉదాహరణకు భారతదేశానికి, తెలంగాణకు నందికొండ (నాగార్జునసాగర్), కృష్ణాపురం (గోదావరిలోయ బహుళార్థసాధక) ప్రాజెక్టులు ఎంతో ప్రాముఖ్యం కలిగినవి. కోస్తాంధ్రలోని డెల్టా ప్రాంతంలోని ఈ రెండు నదుల నీటిని వినియోగించుకోవడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కాబట్టి కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణ ప్రస్తుతం తనకుగల స్వతంత్రమైన హక్కులను వదులుకోవడానికి సిద్ధంగాలేదన్నారు.
-అయితే ఈ భయాలు నిజమయ్యాయి. పెద్దమనుషుల ఒప్పందంలో నీటిపారుదల అంశాన్ని ప్రాంతీయ మండలి ఆధీనంలో ఉండాలని అంగీకరించి కూడా ఆ అంశాన్ని రాష్ట్రపతి ఉత్తర్వు టీఏపీ రీజినల్ కమిటీ-1958లో చేర్చకపోవడాన్నిబట్టి ఆంధ్ర నేతల కుట్రలు, మోసపూరిత వ్యవహారాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ నీటిపారుదల అంశం విషయంలో జరగబోయే అన్యాయాల గురించి రాష్ర్టాల పునర్విభజన కమిషన్ చూపించిన శ్రద్ధను కూడా తెలంగాణ నాయకులు చూపించలేకపోయారు.
హైదరాబాద్ రాష్ట్రం-నీటిపారుదల
-ఆరు, ఏడో నిజాంల పాలనలో తెలంగాణలో సాగునీటి వనరుల అభివృద్ధికి గణనీయమైన కృషి జరిగింది. 1868లో మొదటి సాలార్జంగ్.. నీటిపారుదల రంగానికి సంబంధించి తొలిసారి ఇరిగేషన్ బోర్డును పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో అంతర్భాగంగా ఏర్పాటు చేశారు. నీటిపారుదల అభివృద్ధిని ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని చేకూర్చే సంస్కరణగా మొదటి సాలార్జంగ్ భావించారు. అంతకుపూర్వం తాలూకాదార్లు (కలెక్టర్లు), రెవెన్యూ సిబ్బంది చెరువులు, కుంటల అభివృద్ధికి, మరమ్మతులకు అంచనాలు తయారుచేసి సూపరింటెండెంట్ ఇంజినీర్‌కు పంపించేవారు. దూరప్రాంతాల్లో ఇవి ఉండటం వల్ల క్షేత్రపరిశీలన సాధ్యపడేది కాదు. నీటి వనరులన్నీ రెవెన్యూ అధికారుల ఆధీనంలోనే ఉండేవి. ప్రతి ఏటా వీటి నిర్వహణ, అభివృద్ధికి 1867 నాటికి ప్రభుత్వం బడ్జెట్లో సుమారు రూ.2 లక్షలు కేటాయించి ఖర్చు చేసింది.
-అయితే కృష్ణా, గోదావరి నదులు వందలాది మైళ్లు హైదరాబాద్ సంస్థానంలో ప్రవహిస్తున్నా ఆ నదుల నీటిని వ్యవసాయానికి వినియోగించుకోవాలనే శ్రద్ధ ప్రభుత్వానికి అప్పటికి లేదు. గోదావరిపై ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి 1858లో అప్పటి హైదరాబాద్-మద్రాసు ప్రభుత్వాలు ప్రయత్నించినా అనారోగ్యంతో ఇంజినీర్లు చనిపోయారు. దీంతో ఆ ప్రాజెక్టును అర్ధంతరంగా వదిలివేశారు. వరుస కరువుల నుంచి రక్షణకు 1870 తర్వాత ప్రభుత్వం ఖజానాకు ఆదాయాన్ని పెంచుకోవడానికి, భూములకు నీటి వసతి స్థిరీకరణ, అభివృద్ధికి చెరువుల మరమ్మతులపై దృష్టి పెట్టింది. దీనికి పూర్వం నీటిపారుదల రంగ ఆధునీకరణ పనులకు జాగీర్దార్లు అడ్డంకిగా నిలిచేవారు. 1870లో నీటిపారుదల వనరుల నిర్మాణానికి, నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. రెండో సాలార్జంగ్ బాధ్యతలు చేపట్టగానే 1855లో పూర్తి విధానాన్ని మార్చి మళ్లీ పబ్లిక్ వర్క్స్ శాఖ నియంత్రణలోకి నీటిపారుదలను తీసుకువచ్చాడు.
-1887లో ఆరో నిజాం నిర్ణీత ధరలు నిర్ణయించి ఎంపిక చేసిన గుత్తేదార్లకు చెరువులు, కుంటలను వేలం పాట ద్వారా అప్పగించేవాడు. చెరువుల నిర్వహణ, పునరుద్ధరణ పనులను గుత్తేదార్లు వేలం పద్ధతిలో తీసుకునేవారు. 1888లో ఇరిగేషన్ బోర్డును ఏర్పాటు చేశారు. మొదటిసారి చీఫ్ ఇంజినీర్‌ను నియమించింది ప్రభుత్వం. ఒక అంచనా ప్రకారం తెలంగాణలో 1887 నాటికి 16,933 చెరువులు, కుంటలు ఉండేవి. వీటిలో శిథిలమైన వాటిలో 2,356 చెరువులు, 4,453 కుంటలు ఉండేవి. 1894లో ఇరిగేషన్ బోర్డును ప్రభుత్వం రద్దు చేసింది. ఆ కాలంలో నీటిపారుదలపై రూ. 44,90,206 వెచ్చించారు. మళ్లీ నీటిపారుదల విధులు పీడబ్ల్యూడీ సెక్రటేరియట్‌కు మార్చారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు