జీ7 అంటే ఏమిటి?.. ఎందుకు ఏర్పడింది..?
అంతర్జాతీయంగా కొన్ని అనుమానాలు, మరికొన్ని అంచనాలతో ప్రారంభమైన జీ7 సదస్సు ఎలాంటి నిర్ధిష్ట కార్యచరణ, ఉమ్మడి ప్రకటన లేకుండానే ముగిసింది. సభ్యదేశం కాకపోయినా ఈ సదస్సు సందర్భంగా భారత్ కు దౌత్యపరంగా గొప్ప విజయం అందింది. ఈ నేపథ్యంలో అసలు జీ7 అంటే ఏమిటి?.. ఈ కూటమి ఏం చేస్తుంది. ఈ సదస్సులో ఏయే అంశాలు చర్చకు వచ్చాయి, ప్రస్తుత పరిణామాలేంటి అనే విషయాన్ని పరిశీలిద్దాం.
జీ7 అంటే ?
-అత్యంత అధునాతన, పారిశ్రామికీకరణ చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఏడు దేశాల కూటమి. అమెరికా కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ , జపాన్ సభ్యదేశాలు. జీ7 అనే పేరు సభ్య దేశాల సంఖ్యని సూచిస్తుంది.
ఎలా ఏర్పడింది..ఏం చేస్తుంది..
-యోమ్ కిప్పర్ యుద్ధం( అరబ్-ఇజ్రాయెల్ దేశాల మధ్య) తర్వాత, ఇజ్రయెల్ ని సమర్ధించిన దేశాలకు ఒపెక్ దేశాలు చమరు సరఫరాని తగ్గించాయి. ధరలు కూడా పెంచాయి. ఈ సంక్షోభం సందర్భంగానే ఈ కూటమి ఏర్పడింది. తొలి నాళ్లలో ఆర్థిక రాజకీయ అంశాలపై మాత్రమే చర్చ జరిగేది. కాలక్రమంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనేక అంతర్జాతీయ అంశాలపై ఈ కూటమి దృష్టిపెట్టింది. ఇందనం, భద్రత, వాణిజ్యం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ ఆరోగ్య విషయాలు, లింగ సమానత్వం, పేదరికం వంటి అనేక అంశాలని చర్చిస్తుంది. వీటితోపాటు సంబంధిత ఏడాది అధ్యక్షత వహిస్తున్న దేశం ఏదైనా అంశాన్ని ఎజెండాలో చేర్చితే ఆ విషయంపై కూడా జీ7 చర్చ జరుపుతుంది.
45వ సదస్సు
-జీ7 కూటమికి ఇది 45 వసదస్సు. ఫ్రాన్స్ దేశంలోని బ్రియరిట్జ్ నగరంలో ఈనెల 24 నుంచి 26 వరకు ఈ సదస్సు జరిగింది. సదస్సుకు సభ్యదేశమైన ఫ్రాన్స్ అధ్యక్షత వహించింది. అసమానతలపై పోరాటం, అందరికీ అవకాశాలు కల్పించడం, సురక్షితమైన ప్రపంచంకోసం ప్రజాస్వామ్యం బలోపేతం చేయడం ఈ సారి సదస్సులో ప్రధానాంశాలు.
చర్చించిన అంశాలు
-అంతర్జాతీయ వాణిజ్యం, భూతాపం, ఇరాన్ అణు ఒప్పందం, డిజిటల్ ట్యాక్స్ అమేజాన్ అడవుల్లో కార్చిచ్చు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. సదస్సు అనంతరం ఉమ్మడి ప్రకటన ఏదీ విడుదల కాలేదు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఒక ప్రకటన జారీ చేశారు. పారదర్శకమైన ని నిష్పాక్షికమైన ప్రపంచ వాణిజ్యానికి కూటమి కట్టుబడి ఉంటుందన్నది దాని సారాంశం.
కీలక అంశాలు- సదస్సులో పరిణామాలు
రష్యా అంశం
-ప్రస్తుతం జీ7 గా పిలుస్తున్న ఈ కూటమిలో 2014 వరకు రష్యా కూడా సభ్య దేశం. అప్పట్లో దీన్ని జీ8 అనేవారు. ఉక్రెయిన్ ఉదంతం తర్వాత రష్యాని సభ్య దేశంగా తొలగించారు. రష్యాని తిరిగి కూటమిలోకి తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుబడుతున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ త్వరలోనే రష్యా, ఉక్రెయిన్ నేతలతో చర్చలు జరుపుతారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తెలిపారు. అంటే వచ్చే ఏడాది సదస్సు నాటికి రష్యా కూటమిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.
ఇరాన్ అంశంపై కొత్త ఆశలు
-అమెరికా ఇరాన్ మధ్య సయోధ్యకు జీ7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తీవ్రంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ని మెక్రాన్ ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ విదేశాంగ మంత్రితో సమావేశమవనప్పటికీ అతని ఆహ్వానానికి అడ్డపడలేదు. మరోవైపు తగిన పరిస్థితుల్లో ఇరాన్ తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. సెప్టెంబర్ లో జరుగనున్న ఐరాస సమావేశాల సందర్భంగా ఈ విషయంపై అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.
అమెరికా చైనా వాణిజ్య యుద్ధం
-చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థని కుంగదీస్తుందని కూటమి సభ్యదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అంశంపై అమెరికా నుంచి స్పష్టమైన హామీలేవీ లేనప్పటికీ చైనాతో త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామనే సంకేతాలిచ్చారు. అటు చైనా కూడా సమస్య పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ఇతర అంశాలు
-డిజిటల్ పన్ను అంశంపై ఈ సదస్సులో ఓ కొలిక్కి వచ్చింది. అమెరికా – ఫ్రాన్స్ దేశాల మధ్య ఈ అంశంపై ఒప్పందం కుదిరింది.
-హాంకాంగ్ విషయంలో ఆదేశానికి జీ7 సభ్య దేశాలు బాసటగా నిలిచాయి. సైనో- బ్రిటిష్ ఉమ్మడి ప్రకటనని కొనసాగించాలని కోరారు.
-బ్రెగ్జిట్ అంశం తర్వాత అమెరికా బ్రిటన్ తో భారీ వాణిజ్య ఒప్పందం చేసుకోనున్నట్లు వెల్లడైంది.
-అమెరికా -జపాన్ కొత్త వాణిజ్య ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు జపాన్ లో మార్కెట్ కల్పించడం ఈ ఒప్పందం ఉద్దేశం.
-మొత్తానికి డిజిటల్ పన్ను విధానం పై మినహా, అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, ఆర్థిక మాంద్యం వంటి నిర్మాణాత్మక మైన చర్చలేవీ లేకుండానే జీ7 సదస్సు ముగిసింది. వచ్చే ఏడాది జరగబోయే సదస్సుకు అమెరికా అధ్యక్షత వహించనుంది.
జీ7- భారత్ – ఓ ఘన విజయం
-జీ7 దేశాల కూటమి సదస్సులకు అంతర్జాతీయ సంస్థలను, తమ కూటమిలో సభ్యత్వం లేని దేశాలను ఆహ్వానించే సంప్రదాయం ఉంది. ఈ సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ మన దేశాన్ని ఆహ్వానించింది. ప్రధాని మోదీ సదస్సుకు హాజరయ్యారు. వేరు వేరు సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశమయ్యారు. కశ్మీర్ అంశంలో అమెరికా జోక్యం చేసుకోదని భారత్ – పాక్ ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఆ సమస్యని పరిష్కరించుకుంటాయని ట్రంప్ తో చెప్పించగలిగారు మోదీ. ఇది ఒక విధంగా దౌత్యపరంగా భారత్ కు ఘన విజయమనే చెప్పాలి. మరోవైపు ఇదే అంశంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ భారత్ కు బాసటగా నిలిచారు. పాక్ ప్రధాని తోనూ తాను చర్చలు జరపనున్నట్లు తెలిపారు.
-అసమానతల నిర్మూలనలో సాంకేతికత పాత్ర, ఒకసారి వాడి పాడేసే ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు వంటి అంశాలపై మోదీ ఇతర సమావేశాల్లో చర్చించారు.
-జీ 7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ వెళ్లిన మోదీ ఆ దేశం ద్వైపాక్షిక అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు.రెండు దేశాల మధ్య డిజిటల్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని భారత్, ఫ్రాన్స్ తీర్మానించుకున్నాయి. సైబర్ నేరాలని అరికట్టేందుకు పరస్పరం సహకరించుకోవాలన్న ఒప్పందానికి వచ్చాయి. డిజిటల్ భాగస్వామ్యంపై కీలక ఒప్పందాలు జరిగాయి.
వాతావరణం-జీవవైవిధ్యం
-వాతావరణ మార్పులపై జీ7 ప్రత్యేక దృష్టి పెట్టింది. అమెజాన్ అడవుల్లోని కార్చిచ్చుపై ఆందోళన వ్యక్తం చేసింది. మంటలు ఆర్పడానికి సభ్య దేశాల కూటమి 22 మిలియన్ డాలర్లు కేటాయించాలని తీర్మానించింది. అయితే ముందు నుంచి పారిస్ ఒప్పందానికిి మోకాలడ్డుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, సదస్సులో భాగంగా పర్యావరణ మార్పులపై జరిగిన సమావేశానికి హాజరు కాలేదు. ఇంధన ఎగుమతులపైనే అమెరికా సంపద ఆధారపడిందని ఎవో కలలుగని దాన్ని కోల్పోనని తనని తాను సమర్థించుకున్నారు. కాబట్టి పర్యావరణ మార్పుల అంశంపై ఈ సదస్సులో పెద్దగా సాధించిందేమీ లేదనే చెప్పాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు