సీఏ కోర్సు అంటే భయంతో కొంతమంది ఆ కోర్సును దూరం పెడుతుంటారు. కొంతమందికి దీనిపై అవగాహన ఉన్నప్పటికీ అనవసర ఆందోళనలు, అపోహలవల్ల సీఏలో చేరడానికి ఆలోచిస్తుంటారు. కానీ సాధారణ కుటుంబాల నుంచి వచ్చి సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో ఆలిండియా ర్యాంకులు సాధించారంటే కోర్సుపై వారికి ఉన్న మక్కువ, అవగాహనవల్లే సాధ్యమైంది. సంకల్ప బలం ఉంటే సాధించలేనిదేమీ లేదని నిరూపించారు వారు. గతంలో సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో ఆలిండియా ర్యాంకులు సాధించినవారు. ర్యాంకర్ల విజయాలు వారి మాటల్లో విందాం.
విశ్లేషణతోనే విజయం
మాది నిజామాబాద్ జిల్లాలోని ధర్మారం (బి) గ్రామం. మా నాన్న షేక్ మస్తాన్ ట్రాక్టర్ మెకానిక్. అమ్మ షబీర గృహి. 10వ తరగతి వరకు మా ఊరిలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో చదివాను. 10వ తరగతిలో 8.2 గ్రేడ్ పాయింట్లు సాధించాను. పది పాసయ్యాక మాస్టర్మైండ్స్వారి సీఏ అవేర్నెస్ సీడీ చూశాను. దీంతో సీఏ చేయాలని నిర్ణయానికి వచ్చాను.
-ఇంటర్ ఎంఈసీలో 700 మార్కులు సాధించాను. అయితే సీఏలో జాయిన్ అయ్యాను కానీ సీఏ పాస్ కాగలనా అని ఆలోచించేవాడిని. అప్పుడు మా అన్నయ్య నాగుర్ బాషా నన్ను గైడ్ చేస్తూ మాస్టర్‌మైండ్స్‌లో చేర్పించాడు. మొదట్లో కొంచెం భయపడ్డాను. కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా సీఏ చదవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. సీఏ-సీపీటీలో 200 మార్కులకుగాను 104 సాధించాను.
-ఇంత తక్కువ మార్కులు వచ్చినా నిరాశచెందకుండా మరింత ఉత్సాహంతో సీఏ-ఐపీసీసీ బాగా చదవడం ప్రారంభించాను. దీంతో సీఏ-ఐపీసీసీలో 392 మార్కులతో ఆలిండియా 6వ ర్యాంకు సాధించాను. అయితే ఐపీసీసీని మొదటి ప్రయత్నంలో పూర్తిచేయలేదు. అన్నయ్య నాకు అండగా ఉండి నువ్వు చదవగలవని, భయం వద్దని ఎంతగానో ప్రోత్సహించాడు. దీంతో సీఏ-ఐపీసీసీ విజయవంతంగా పూర్తిచేశాను. ఈ విజయంలో మాస్టర్‌మైండ్స్ పాత్ర కీలకం. వారు అందించిన షెడ్యూల్, రివిజన్ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్వల్ల నేనీ ఘనత సాధించాను.
-సీఏ చదివేటప్పుడు హార్డ్‌వర్క్‌తోపాటు స్మార్ట్ వర్క్ కూడా చేశాను. క్లాసులో ప్రతి సబ్జెక్టుకి రన్నింగ్ నోట్స్ రాసుకునేవాడిని. ప్రతి చాప్టర్, ప్రతి టాపిక్ తప్పనిసరిగా రివైజ్ చేసుకునేవాడిని. సీఏ చేయాలనుకునేవారు ధైర్యంగా ఈ కోర్సు చేయవచ్చు. ఏ క్షణంలోనూ ధైర్యాన్ని, మీ మీద మీకున్న నమ్మకాన్ని కోల్పోవద్దు. నిజాయితీగా శ్రమిస్తే ఎవరైనా సీఏ పూర్తిచేయవచ్చు.
-ఐపీసీసీ ప్రణాళిక ప్రకారం చదివాను. పరీక్షకు సన్నద్ధమయ్యేటప్పుడు ఫాస్ట్‌ట్రాక్ నోట్స్ తయారు చేసుకున్నాను. దీనివల్ల పరీక్షల సన్నద్ధత సులువైంది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి రిపీటెడ్‌గా వస్తున్న ప్రశ్నలు గమనించి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చాను. సాధ్యమైనంతవరకు అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యం ఇచ్చి చదవాలి. పరీక్షలో అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం రాయాలి.
-సీఏలో ఐపీసీసీ (రెండో దశ) చాలా కీలం. కాబట్టి ఐపీసీసీలో చేరిన మొదటిరోజు నుంచే నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలి. ఐపీసీసీ తుది పరీక్ష ముగిసేవరకు అనుసరించే విద్యా ప్రణాళికను ముందుగా తయారుచేసుకుని అదే ప్రణాళికకు కట్టబడాలి. తరగతులు బోధించే సంస్థే కాకుండా మనల్ని చదివించే స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్ వంటి వాటిని కండక్ట్ చేసే సంస్థను ఎంచుకోవాలి.
-ప్రణాళికాబద్ధంగా చదివితే ఐపీసీసీని మొదటి ప్రయత్నంలోనే పూర్తిచేయవచ్చు. అన్ని సబ్జెక్టులకు ఒకేచోట కోచింగ్ అందించే సంస్థను ఎంచుకుని కోచింగ్ తీసుకుంటే మంచిది. దీనివల్ల అనవసరంగా వృథా అయ్యే సమయాన్ని నివారించవచ్చు.
-సీఏ చదివేటప్పుడు విశ్లేషణాత్మకత, సమయస్ఫూర్తి అనేవి చాలా అవసరం. ఇటువంటి గుణాలను అలవర్చుకుంటే పరీక్షల్లో విజయం సాధించవచ్చు. మన శక్తిసామర్థ్యాలు, బలహీనతలపై మనకు అవగాహన ఉండాలి.
-క్లాసులో టీచర్లు చెప్పే ఉదాహరణలు, చార్ట్స్ తప్పకుండా రాసుకోవాలి. రివిజన్ నిమిత్తం రన్నింగ్ నోట్స్ రాసుకుని రివిజన్ సమయంలో ప్రాక్టీస్ మాన్యువల్, రన్నింగ్ నోట్స్ చదవాలి. కోచింగ్ పూర్తయ్యాక పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ మొదలుపెట్టాలి.
-అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలను ముందుగానే సమకూర్చుకోవాలి. ఉదా: ప్రాక్టీస్ మాన్యువల్స్, పాత ప్రశ్నపత్రాలు, రివిజన్ పేపర్లు, మోడల్ టెస్ట్పేపర్స్ ఇలా తదితర అవసరమైన పుస్తకాలు.
-రోజుకు రెండు సబ్జెక్టులను చదివేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. వీలైనంత వరకు ఆ రెండు సబ్జెక్టుల్లో ఒకటి థియరీ పేపర్, మరొకటి ప్రాబ్లమాటిక్ పేపర్ ఎంచుకోవాలి. ప్రిపేరయ్యే సమయంలో ఇంకో నోట్‌బుక్‌లో కీ వర్డ్స్ రాసుకోవడం, మెటీరియల్‌లో అండర్లైన్ చేయడం వంటివి చేయాలి. దీనివల్ల రివిజన్ సులభంగా చేయవచ్చు.
-మీరు మొదటి నుంచి ఏదైతే మెటీరియల్ చదువుతున్నారో చివరి వరకు అదే మెటీరియల్‌ను చదవాలి. తరుచుగా మెటీరియల్స్‌ను మార్చవద్దు. ఉన్న ఏడు సబ్జెక్టుల్లో ఏవైనా నాలుగు సబ్జెక్టులపై ఎక్కువ శాతం దృష్టి కేంద్రీకరిస్తే ఆయా సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించే వీలుంటుంది.
సీఏ కోచింగ్‌తో ఈజీగా సీఎంఏ..
మాది కర్నూలు జిల్లాలోని బత్తులూరు. మా నాన్న శ్రీనివాస్‌రెడ్డి. ఆయన ఒక సాధారణ రైతు. పదో తరగతి తెలుగు మీడియంలో చదివి 558 మార్కులు సాధించాను. నాన్న సలహాతో ఇంటర్లో ఎంఈసీ, సీఏలో చేరాను. అయితే మొదట్లో బయపడినప్పటికీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంటర్లో 937 మార్కులు సాధించాను. ఇంటర్‌తోపాటే సీఏ-సీపీటీ కూడా పూర్తి చేశాను. అందులో 200ల మార్కులకు 183 సాధించాను. అయితే రెండు మార్కుల తేడాతో ఆల్ఇండియా ర్యాంకును కోల్పోయాను. తర్వాత సీఏ ఐపీసీసీ మొదటి ప్రయత్నంలోనే 509 మార్కులతో ఆల్ ఇండియా 40వ ర్యాంకు సాధించాను. ఐపీసీసీ పూర్తిచేశాక ఆర్టికల్స్ చేస్తూనే సీఏ ఫైనల్లోని ప్రాక్టికల్ సబ్జెక్టులు చదవడం ప్రారంభించాను. ఫైనల్ 485 మార్కులతో పూర్తిచేసి సీఏ క్వాలిఫై అయ్యాను. అనంతరం సీఎంఏకి రిజిస్ట్రేషన్ చేసుకుని సీఎంఏ ఇంటర్ సొంతంగా చదవడం ప్రారంభించాను. మొదటి ప్రయత్నంలోనే 631 మార్కులతో ఆల్ఇండియా మొదటి ర్యాంకు సాధించాను.
ఇలా చేయండి..
-సీఏ/సీఎంఏ కోర్సులు చాలా కష్టంగా ఉంటాయని చాలామంది అపోమ పడుతుంటారు. అయితే మంచి మార్గదర్శకత్వంతో, కోర్సులోని సిలబస్‌ను ప్రణాళికా ప్రకారం చదవితే ఇన్‌స్టిట్యూట్‌వారు నిర్వహించే ఫైనల్ పరీక్షలు సులభంగా రాయవచ్చు.
-ప్రణాళిక ప్రకారం ఎప్పుడు ఏం చదవాలో నిర్ణయించుకుని దాన్ని తప్పకుండా అనుసరించాను. అదే నా విజయానికి కారణం.
-సీఎంఏ చదవాలనుకునే వారు ముందుగా సీఏ కోర్సుకి కోచింగ్ తీసుకుంటే సీఎంఏ ఈజీగా పూర్తిచేయవచ్చు.
-సీఎంఏ పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్స్ ఎక్కువగా కవర్ చేస్తున్నారనే విషయాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. వెయిటేజీ ప్రకారం సన్నద్ధమవ్వాలి.
-పరీక్షలకు ప్రిపేరయ్యేటప్పుడు ఏదైనా ఒకే పుస్తకానికి పరిమితం కావాలి. రెండు మూడు పుస్తకాలు చదవడం వల్ల తికమకపడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక్క పుస్తకాన్నే చదడంవల్ల రివిజన్ కూడా సులభం అవుతుంది. పరీక్షలో సమాధానం కూడా తొందరగా గుర్తుకువస్తుంది.
-పరీక్ష రాసేటప్పుడు ఏ ప్రశ్నకు ఎంత సమయం పడుతుందనే బేరీజు వేసుకుని సమాధానాలు రాయడం ప్రారంభించాలి. ఒక్కోసారి జవాబులు పెద్దగా ఉండేవాటికి మార్కులు తక్కువగా, సమాధానం చిన్నగా ఉండేవాటికి మార్కులు ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు. కాబట్టి వాటిని గమనిస్తూ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
సబ్జెక్టులను ఏకాగ్రతతో చదవాలి