కరెంట్ అఫైర్స్
జాతీయం
చిరంజీవి హెల్త్‌కేర్ మెడిక్లెయిమ్
రాజస్థాన్‌లో ఏప్రిల్ 1న ‘చిరంజీవి హెల్త్‌కేర్ మెడిక్లెయిమ్’ పథకాన్ని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించారు. ఆ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం రూ.5 లక్షల వరకు విలువైన క్యాష్‌లెస్ మెడిక్లెయిమ్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రజలందరికీ మెడికల్ రిలీఫ్ కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
భారత్‌లో వేలిముద్రల నివేదిక
జాతీయ నేరగణాంక సంస్థ ‘భారత్‌లో వేలిముద్రల నివేదిక-2019’ను మార్చి 29న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2019లో ఘటనాస్థలంలో లభించిన వేలిముద్రల విశ్లేషణ, పాత నేరగాళ్ల వేలిముద్రలతో వాటిని సరిపోల్చడం ద్వారా కేసులను ఛేదించిన రాష్ర్టాలను ఇందులో వెల్లడించారు. ఈ విధంగా 512 కేసుల్ని ఛేదించిన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలువగా.. తర్వాతి స్థానాల్లో కేరళ (402), కర్ణాటక (399), తెలంగాణ (350) నిలిచాయి.
ధర్మ స్వాతంత్య్ర చట్టం
బలవంతపు మతమార్పిళ్లను నిరోధించే ధర్మ స్వాతంత్య్ర (మత స్వేచ్ఛ) చట్టం-2003 సవరణ బిల్లును గుజరాత్ అసెంబ్లీ ఏప్రిల్ 1న ఆమోదించింది. బలవంతం చేసి లేదా ప్రలోభాలతో మతమార్పిళ్లకు ఎవరైనా పాల్పడినా, మతం మార్చడం కోసం వివాహం చేసుకున్నా నేరంగా పరిగణిస్తారు. దీంతో దోషులకు 3 నుంచి 5 ఏండ్ల వరకు జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తారు. బాధితులు మైనర్, దళిత, గిరిజన వర్గాలకు చెందినవారైతే నేరానికి పాల్పడిన వ్యకిక్తి ఏడేండ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించవచ్చు. ఏదైనా సంస్థ అయితే దాని యజమానికి పదేండ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
సరళదాస్ 600వ జయంత్యుత్సవం
ఒడిశాలోని కటక్ నగరంలో ఆదికవి సరళదాస్ 600వ జయంత్యుత్సవాన్ని ఏప్రిల్ 2న నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రతిష్ఠాత్మక కళింగరత్న పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేశారు. 30 జిల్లాలు ఉన్న ఈ రాష్ట్రంలో 147 ఎమ్మెల్యే, 21 లోక్‌సభ సీట్లు ఉన్నాయి.
బ్రిటానియా అదనపు డైరెక్టర్
ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ బ్రిటానియా ఇండస్ట్రీస్‌కు అదనపు డైరెక్టర్‌గా ఏప్రిల్ 3న నియమితులయ్యారు. ఆయన ఐదేండ్లపాటు ఈ పదవిలో ఉంటారు. బ్రిటానియాను 1892లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.
పుస్తకావిష్కరణ
‘ఎకో టి కాలింగ్: టువర్డ్స్ పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్’ అనువాద పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏప్రిల్ 3న ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని శైలేంద్ర జోషి రచించగా తెలుగులోకి అన్నవరపు బ్రహ్మయ్య అనువదించారు.
వ్యాధులపై జాతీయ విధానం
అరుదైన వ్యాధులపై జాతీయ విధానం-2021ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఢిల్లీలో ఏప్రిల్ 3న ఆవిష్కరించారు. ఈ వ్యాధుల చికిత్సకయ్యే వ్యయాలను తగ్గించడం, దేశంలోనే పరిశోధనలు చేపట్టి, మందులు తయారు చేయడం లాంటివి దీని ప్రధాన ఉద్దేశం. వ్యాధిగ్రస్థులకు రాష్ట్రీయ ఆరోగ్య నిధి కింద రూ.20 లక్షల వరకు సహాయం అందిస్తారు. ఇది పేదలకే పరిమితం కాకుండా, పీఎం జన్ ఆరోగ్య యోజన కింద నమోదైన వారందరికీ వర్తిస్తుంది.
అంతర్జాతీయం
మితాలీ ఎక్స్‌ప్రెస్
బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య కొత్త ప్రయాణికుల రైలు ‘మితాలీ ఎక్స్‌ప్రెస్’ రైలును ఇరుదేశాల ప్రధానులు షేక్ హసీనా, మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్చి 27న ప్రారంభించారు. ఈ రైలు ఢాకా నుంచి పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయిగురి వరకు నడుస్తుంది. ఈ సందర్భంగా డిసెంబర్ 6ను మైత్రీ దినోత్సవంగా పాటించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.
గిగా మెష్
ఆస్ట్రోమ్ అనే స్టార్టప్ అభివృద్ధి చేసిన ‘గిగా మెష్’కు అమెరికా, భారత్‌ల నుంచి మార్చి 29న పేటెంట్ లభించింది. గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాలకు తీగలు లేకుండా నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్ను తక్కువ ధరకే అందించేందుకు దీనిని రూపొందించారు. దీనిని నేహా శతక్, ప్రసాద్ హెచ్ఎల్ భట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూర్ (ఐఐఎం బెంగళూర్)లో ఈ ఆస్ట్రోమ్ స్టార్టప్‌ను ప్రారంభించారు.
గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్
ప్రపంచ ఆర్థిక ఫోరం 156 దేశాలతో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్-2021ను మార్చి 31న విడుదల చేసింది. దీనిలో ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలువగా.. ఫిన్లాండ్ 2, నార్వే 3, న్యూజిలాండ్ 4, రువాండా 5, స్వీడన్ 6వ స్థానాల్లో నిలిచాయి. భారత్ 140వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ 153, చివరగా 156వ స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 15వ ఎడిషన్‌ది.
భారత్-బంగ్లాదేశ్ మిలిటరీ విన్యాసాలు
భారత్-బంగ్లాదేశ్ మిలిటరీ విన్యాసాలు ‘శాంతిర్ ఆర్గోషేన-2021 (ఫ్రంట్ రన్నర్ ఆఫ్ ది పీస్)’ పేరుతో బంగ్లాదేశ్‌లో ఏప్రిల్ 4న ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఈ విన్యాసాలు జరుగుతాయి. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రహమాన్ శతజయంతి, బంగ్లాదేశ్ 50 ఏండ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్నారు. దీనిలో డోగ్రా రెజిమెంట్ బెటాలియన్‌కు చెందిన 30 మందితో కూడిన ఆర్మీ బృందం పాల్గొంది.
తెలంగాణ
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్
స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ర్యాంకుల కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన పౌర స్పందన ప్రక్రియ ఫలితాలను మార్చి 31న విడుదల చేశారు. దీనిలో హైదరాబాద్ వరుసగా రెండో ఏడాది మొదటి స్థానంలో నిలిచింది. అహ్మదాబాద్ 2, సూరత్ 3వ స్థానాల్లో నిలిచాయి.
ఈ-గోల్కొండ పోర్టల్
చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఈ-గోల్కొండ’ వెబ్ పోర్టల్‌ను మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 1న ప్రారంభించారు. తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన ఈ పోర్టల్‌తో సంప్రదాయ కళాకృతులు, చేతిబొమ్మలను కొనుగోలు చేసుకోవచ్చు. ప్రతి కళాకృతిని సునిశితంగా చూసేందుకు 3డీ సౌకర్యం కూడా ఉంది.
రీ సైక్లింగ్ హీరోయిన్గా సాహితీ
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ‘రీ సైక్లింగ్ హీరోయిన్’గా హైదరాబాద్‌కు చెందిన సాహితీ స్నిగ్ధను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1న పురస్కారాన్ని ప్రకటించింది. తెలంగాణ నుంచి ఈ పురస్కారం అందుకున్న మొదటి వ్యక్తిగా ఆమె ఘనత సాధించారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తూ సుమారు ఆరువేల మందికి అండగా నిలిచినందుకు ఈ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు.
స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్‌గా కవిత
స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత రెండోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యాలయంలో ఏప్రిల్ 2న జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. 2015లో తొలిసారి చీఫ్ కమిషనర్‌గా ఆమె ఎన్నికయ్యారు.
వార్తల్లో వ్యక్తులు
శరణ్ కుమార్
ప్రముఖ మరాఠీ రచయిత డాక్టర్ శరణ్ కుమార్ లింబాలే సరస్వతి సమ్మాన్-2020కు మార్చి 31న ఎంపికయ్యారు. ఆయన రచించిన ‘సనాతన్’ పుస్తకానికి ఈ అవార్డు లభించింది. ఈ నవలలో దళిత పోరాటం, సామాజిక అంశాలపై వివరించారు. ఈ అవార్డు కింద రూ.15 లక్షల నగదు అందిస్తారు. 1991లో ఈ అవార్డును స్థాపించారు. కేకే బిర్లా ఫౌండేషన్ బహుమతిని ప్రదానం చేస్తుంది.
రూపా రంగ
ఫెడరల్ జడ్జిగా భారత అమెరికన్ రూపా రంగ పుట్టగుంట ఏప్రిల్ 1న నియమితులయ్యారు. అమెరికాలోని వాషింగ్టన్ కోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో జిల్లా కోర్టుకు ఎంపికైన తొలి ఆసియా అమెరికన్ ఈమె.
మంజిందర్ సింగ్
పశ్చిమ కమాండ్ చీఫ్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మంజిందర్ సింగ్ ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరించారు. ఆయన జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులపై దాడిలో కీలక పాత్ర పోషించి పోరాడారు. ఆయనకు 2015లో యుధ్ సేవా పతకం, 2019లో విశిష్ట్ సేవా పతకం లభించాయి.
రజనీకాంత్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే 51వ పురస్కారం ఏప్రిల్ 1న లభించింది. 50 ఏండ్లుగా సినీరంగంలో విశేష సేవలందిస్తున్న ఆయనకు ఈ అవార్డు దక్కింది. 32 మంది హిందీ సినీకళాకారులు, 19 మంది ఇతర భాషా సినీకళాకారులకు ఈ పురస్కారం లభించింది. దీనిని 1969లో స్థాపించారు. ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు అందజేస్తారు. రజనీకాంత్‌కు 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ లభించింది.
సుభాష్ కుమార్
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) సీఎండీగా సుభాష్ కుమార్ ఏప్రిల్ 2న బాధ్యతలు చేపట్టారు. ఓన్జీసీని 1956, ఆగస్ట్ 14న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.
క్రీడలు
ప్రణీత్‌కు స్వర్ణం
ఆసియా అండర్-14 ఆన్లైన్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్ బి జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తెలంగాణకు చెందిన వీ ప్రణీత్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. మార్చి 29న ఈ పోటీలో తొలి బోర్డుపై ఆడిన ప్రణీత్ మొత్తం తొమ్మిది గేముల్లో ఏడింటిలో గెలిచి, ఒకటి డ్రా కాగా, మరో గేమ్‌లో ఓడిపోయాడు.
బ్రిక్స్ సీసీఐ అంబాసిడర్‌గా సృష్టి
బ్రిక్స్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ (సీసీఐ) అంతర్జాతీయ అంబాసిడర్‌గా 2021-22కుగాను హైదరాబాద్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సృష్టి జూపూడి ఏప్రిల్ 1న నియమితులయ్యారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాల్లో ఎంఎస్ఎంఈ రంగంలోని వ్యాపారాలు, యువ, మహిళా వ్యాపారవేత్తలు, స్టార్టప్‌ల ఏర్పాటులో ఆమె కీలకపాత్ర పోషించనున్నారు.
బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్
మెర్సిడెస్ స్టార్ లూయీస్ హామిల్టన్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్‌ను ఏప్రిల్ 1న గెలుచుకున్నాడు. ఇది అతడి కెరీర్లో 96వ టైటిల్. 12 ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్నాడు. బ్రిటన్ నుంచి నైట్‌హుడ్ అవార్డును కూడా అందుకున్నాడు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు