విషయ అవగాహనకు ఎక్కువ మార్కులు
80 మార్కులకుగాను 60 మార్కులు వివరణాత్మకంగా, 20 మార్కులు లక్ష్యాత్మకంగా రాసే విధంగా పేపర్ ఉంటుంది. వివరణాత్మక సమాధానాలు రాయాలంటే సాంఘికశాస్త్రంలోని 15 పాఠాలను విశ్లేషిస్తూ సమగ్రంగా అభ్యసించాలి. పునశ్చరణకు వీలయ్యేవిధంగా పాఠ్యపుస్తకంలో అండర్లైన్ చేయాలి. ముఖ్య ఫొటోగ్రాఫ్‌ల పక్కన గుర్తుపట్టేలా గీత గీసుకోవాలి.విషయ అవగాహనకు ఎక్కువ మార్కులు, ప్రశ్నలు వస్తాయి. గరిష్ట మార్కుల సాధనకు ఎక్కువ దృష్టి సారించాలి. విషయ పరిజ్ఞానాన్ని ఉదహరించడం, విశ్లేషించడం, చర్చించడం వంటివి పాఠ్యాంశాల్లో చదివేటప్పుడు గుర్తించి, సొంతంగా ప్రశ్నలు తయారుచేసుకోవాలి. పాఠ్యాంశాల్లో ఉన్న అదనపు సముచిత బాక్సులు, బాక్సుల్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి పాఠ్యాంశాన్ని విశ్లేషిస్తూ చదవడం వల్ల ప్రశ్నలు ఎలా అడిగినా సమాధానాలు సులువుగా రాసే అవకాశం ఉంది.
ఉదాహరణకు దేశాభివృద్ధిలో హిమాలయాల పాత్రను చర్చించండి? అనే ప్రశ్నకు సమాధానం బాగా ప్రిపేర్ అయి ఉంటే దేశ వ్యవసాయ రంగానికి హిమాలయాలు ఏ విధంగా తోడ్పడుతున్నాయి? అని అడిగే ప్రశ్నకు సమాధానాన్ని సులువుగా కొద్ది మార్పులతో రాయవచ్చు. తీవ్ర ఆర్థిక మాంద్య కాలంలో ప్రపంచదేశాలు ఎదుర్కొన్న సవాళ్లు ఏవి? అనే ప్రశ్నకు ప్రిపరేషన్ అయి ఉంటే తీవ్రమాంద్యంలో జర్మనీ ఎదుర్కొన్న సమస్యలు ఏవి? అని అడిగే ప్రశ్నకు సమాధానాన్ని వివరణాత్మకంగా రాయవచ్చు. చదివే క్రమంలోనే విస్తృత అభ్యసనం కొనసాగిస్తూ, విభిన్న ప్రశ్నల్ని, అంతర సంబంధమున్న ప్రశ్నల్ని తయారు చేసుకుంటూ చదవడం వల్ల బాగా రాయగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించేందుకు పాఠ్యాంశాల్లో అనేక పేరాగ్రాఫ్‌లు, కేస్‌స్టడీలు ఉంటాయి. ఇలాంటి వాటిని గుర్తించి ఆ పేరాగ్రాఫ్ ఏ అంశాన్ని ప్రస్తావించింది, పాఠ్యాంశం అభ్యసించడం విశ్లేషణ చేసి వ్యాఖ్యానించాలి. సమాధానం బహుకోణాల్లో స్వేచ్ఛగా స్వీయ అభిప్రాయం సొంతమాటల్లో రాసే విధంగా ప్రాక్టీసు చేసుకోవాలి.
సమాచార నైపుణ్యం: పాఠ్యాంశాల్లో విషయ పరిజ్ఞానం వివరణాత్మకతతో పాటు, గణాంక పట్టికలు, గ్రాఫ్‌ల రూపంలో ఇచ్చారు. వీటిని అభ్యసించడం ద్వారా సులువుగా ఎక్కువ మార్కులు సాధించే అవకాశముంది. సగటు విద్యార్థి కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణుడు కావడానికి ఇవి తోడ్పడుతాయి. మానవాభివృద్ధి నివేదిక గణాంక పట్టికలు, స్థూలదేశీయోత్పత్తి పట్టికలు, గ్రాఫ్‌లు, శీతోష్ణస్థితి ైక్లెమోగ్రాఫ్లు, చరిత్ర పాఠాల్లోని కాల పట్టికలు, యుద్ధమరణాలు, ఆయుధపోటీబార్గ్రాఫ్, ఎన్నికల ఫలితాలపై చార్టు, రాజ్యాంగ సవరణ బార్గ్రాఫ్, అణ్వాయుధ నిల్వల రేఖాచిత్రం, తెలంగాణలో పంటలు, సాగునీటి విస్తీర్ణం పట్టికలను విశ్లేషణాత్మకంగా అభ్యసించాలి.
సమకాలీన అంశాలు ప్రతిస్పందన: ప్రశ్నించుట ప్రమాణంలో మంచి మార్కులు సాధించాలంటే పాఠ్యాంశాలను చదువుతున్న సమయంలో విమర్శనాత్మకంగా అవగాహన చేసుకుని, విలువలను అన్వయించుకొని, తనకు గల వైఖరిని వ్యక్తం చేయాలి. వివిధ సమకాలిన సమస్యలను ఆలోచించి బహుళ సమాధానాలు వ్యక్తం చేసే నైపుణ్యం సాధించాలంటే సంబంధిత సమకాలీన అంశాల్ని ముందే గుర్తించి కారణాలు అన్వేషించి, పరిష్కార మార్గాలు సూచించాలి.
ఉదా: హిమాలయాలు భారతదేశానికి వరం దీన్ని నీవెలా సమర్థిస్తావు? ఒక దేశం అభివృద్ధి చెందిందని చెప్పడానికి ఏ అంశాలు పరిగణనలోకి తీసుకుంటావు? ప్రజాపంపిణీ వ్యవస్థలోని సమస్యలు ఏవి? మెరుగుపర్చడానికి సూచనలివ్వండి? భారత రాజ్యాంగంలో పేర్కొన్న సంక్షేమరాజ్య భావన అమలు చేయబడుతుందని ఎలా చెప్పగలవు? పర్యావరణ సమస్యల పరిష్కారానికి సూచనలివ్వండి? ఎన్నికల్లో అనుచిత ప్రవర్తన-నివారణకు చేపట్టే చర్యలు తెల్పండి? స్వాతంత్య్రానంతరం వివిధ కాలాల్లో సాధించిన ప్రగతి, సామాజిక ఉద్యమాల అవశ్యకత, రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమానికి, ఉమ్మడి రాష్ట్ర పాలనా విధానాలు వంటి సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి. పటనైపుణ్యాల ప్రమాణంలో అత్యధికంగా మార్కులు సాధించడానికి పటాలు గీయడం, పటాలు చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయడం, పటాల్లో అడిగిన ప్రాంతాలు, దేశాలు గుర్తించడం అట్లాస్ సహాయంతో ప్రాక్టీసు చేయాలి. భారతదేశ పటం, తెలంగాణ పటం గీయడంలో నైపుణ్యం సాధించాలి. ప్రపంచపటంలో ముఖ్యమైన 20 ప్రదేశాలు (నదులు, రాజధానులు, దేశాలు) గుర్తించడం ప్రాక్టీసు చేయాలి. ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న దేశాలు, ఆర్థికమాంద్యం/ ప్రభావిత దేశాలు, సామాజిక ఉద్యమాలు జరిగిన ప్రదేశాలు, దేశాలు, భారతదేశ భౌగోళికాంశాలు, నగరాలు, నదులు, పర్వతాలు మొదలైన అంశాలు పటంలో గుర్తించే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
ప్రశంస: సున్నితత్వం విద్యాప్రమాణంపై అడిగే ప్రశ్నలు స్పందనను చైతన్యపరిచే నినాదాలు పోస్టర్లు తయారుచేయడం, వివిధ సమస్యలపై విశ్లేషిస్తూ పత్రికలకు వ్యాసాలు, అధికారులకు లేఖలు రాయడం, విలువలను, మంచిపనులను ప్రశంసించే వైఖరులకు అవకాశం ఉన్న పాఠ్యాంశాల నుంచి సేకరించి ప్రాక్టీస్ చేయాలి. భూగోళం వేడెక్కడం వల్ల కలిగే దుష్ఫలితాలపై పత్రికకు వ్యాసం రాయడం, లింగ వివక్ష అనర్థ్ధాల్ని తెలిపే కరపత్రం తయారుచేయడం, భూగర్భజలాల పెంపు- నీటి వినియోగంపై నినాదాలు, హిమాచల్‌ప్రదేశ్ చేపట్టిన విద్యావిప్లవంలో నీకు నచ్చిన అంశాలు ఏవి? వంటి ప్రశ్నలు, యుద్ధాల నివారణ, శాంతిని పెంపొందించేందుకు నినాదాలు, సామాజిక నిరసన ఉద్యమాల్లో మహిళలు నిర్వహించిన పాత, జాతీయోద్యమ నాయకుల్లో నీకు నచ్చిన అంశాలు, జాతీయసమైక్యతకు దోహదపడే నినాదాలు, ప్రపంచశాంతికి ఐక్యరాజ్యసమితి చేపట్టిన కార్యక్రమాల్లో నచ్చిన అంశాలు, భారత రాజ్యాంగ దినోత్సవం, ఓటరు దినోత్సవంపై వ్యాసాలు, పాఠశాలల్లో సమానత్వ భావన అమలుపై కరపత్రం తయారు చేయడం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ అంశంపై అడిగే ప్రశ్నలకు సులభంగా సమాధానాలు రాయడం మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
పార్ట్-బి లో విషయ అవగాహన, విద్య ప్రమాణం సాధించబడే కీలక భావనలు, అన్ని పాఠ్యాంశాలను విస్తృత అభ్యసనం చేస్తూ, పాఠ్యపుస్తకంలో అండర్లైన్ చేసుకోవాలి. సంవత్సరాలు, వ్యక్తుల పేర్లను ఈ విభాగంలో ప్రశ్నించే అవకాశం లేదు. ఇందులో జరిగే బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఉదా- ఇందిరా పాయింట్ ప్రత్యేకత, ఉన్నత హిమాలయాలను ఇలా కూడా పిలుస్తారు, మానవాభివృద్ధి నివేదికలో ప్రామాణికం కాని అంశం.. కింది వాటిలో సేవారంగంతో సంబంధం లేని అంశం, ఆర్థికమాంద్య ప్రభావానికి గురికాని దేశం ఇలాంటి ప్రశ్నలకిచ్చే జవాబుల్లో ఒకటి సరైనది కాగా దగ్గర సంబంధం ఉండే పలు సమాధానాలు సరైనవే అనే విధంగా, మరికొన్నింటిలో కన్ఫ్యూజన్ అయ్యే విధంగా ప్రశ్నల్ని అడిగే అవకాశం ఉంది. అందువల్ల పాఠం చదివేటప్పుడు ఇలాంటి ప్రశ్నల్ని తయారు చేసుకోవాలి.
పాఠ్యాంశాల ప్రశ్నలు నమూనా ప్రశ్నలు మాత్రమేనన్న విషయాల్ని గుర్తుంచుకోవాలి. అవి యథాతథంగా ఎట్టి పరిస్థితుల్లో అడిగే అవకాశం లేదు. కొన్ని విద్యాప్రమాణ ప్రశ్నల్లో పాఠ్యాంశ పరిధిని దాటి సమాచార నైపుణ్యాల అంశంలో సమాచార పట్టికలు, గ్రాఫ్స్లు అడిగే అవకాశం ఉంటుంది.
రాయడంలో మెలకువలు పాటించాలి: పార్ట్-ఎ సెక్షన్ -I లో అన్ని పాఠ్యాంశాల నుంచి అడిగే ప్రశ్నలకు గ్రూప్-ఎ, గ్రూప్-బి లో వివరణాత్మక సమాధానాలు క్లుప్తంగా, సంక్షిప్తంగా ఒకటి రెండు వాక్యాల్లో మాత్రమే రాయాలి. ఉదా- దక్కన్ పీఠభూమి తూర్పునకు వాలి ఉండటానికి గల కారణమేమిటి? అంత్య వస్తువులు అని వేటినంటారు? ఉదాహరణనిమ్ము? మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైన రెండు అంశాల్ని తెల్పండి? వంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
సెక్షన్- II లో కూడా అన్ని పాఠ్యాంశాలు కవర్ చేసే విధంగా ప్రశ్నలుంటాయి. సమాధానాలు 4 నుంచి 5 వాక్యాల్లో పూర్తిచేయాలి. ఈ సెక్షన్ లో పాఠ్యాంశాల్ని చదివి వ్యాఖ్యానించే విద్యాప్రమాణం రావడానికి అవకాశం లేదు. మిగతా ఐదు విద్యాప్రమాణాలపై ప్రశ్నలు అడుగుతారు. తూర్పుతీర మైదానాల కంటే భిన్నమైనవని ఎలా చెప్పగలవు? సమాచార పట్టిక లేదా బార్ గ్రాఫ్, పై చార్ట్ ఇచ్చి వాటిపై రెండు ప్రశ్నలు అడగవచ్చు. పటనైపుణ్యంపై అడిగే ప్రశ్న తెలంగాణ, భారతదేశ పటం గీయడం, పటంతో పాటు ఏవైనా రెండు అంశాలు గుర్తించమని అడగవచ్చు. ప్రశంస, సున్నితత్వం విద్యాప్రమాణంపై కరపత్రం, లేఖలు, నినాదాలు రాయమనే ప్రశ్నలు అడిగే అవకాశముంది.
సెక్షన్-III లో గ్రూప్-ఎ, గ్రూప్-బి లో సమాధానాలు 8-10 వాక్యాల్లో రాయాలి. గ్రూప్-ఎ లో వనరుల అభివృద్ధి సమానత, గ్రూప్-బి లో సమకాలీన ప్రపంచం భారతదేశం భాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పేరాగ్రాఫ్ చదివి అభిప్రాయాన్ని రాయమనే ప్రశ్నలు, పట్టికలు, గ్రాఫ్‌లు పరిశీలించి విశ్లేషించమనే ప్రశ్నలు, భారతదేశ పటంతో గుర్తించమని నాలుగు అంశాలు అడుగుతారు. గ్రూప్-బి నుంచి పేరాగ్రాఫ్ చదివి వ్యాఖ్యానించడానికి పేరాగ్రాఫ్, పట్టిక పై డయాగ్రమ్, బార్గ్రాఫ్లలో ఏదో ఒకటి ఇచ్చి విశ్లేషించమనే ప్రశ్నని అడగవచ్చు. ఈ గ్రూప్‌లో ప్రపంచ పటంలో నాలుగు అంశాలు 3 గుర్తించమనే ప్రశ్న ఇస్తారు. పటాల్లో గుర్తించే 3 అంశాలు డైరెక్టుగా 1 అంశం ఇన్‌డైరెక్ట్‌గా అడుగుతారు.
ఉదా: 1. భారతదేశ పటంలో కింది వాటిని గుర్తించండి?
ఎ. పశ్చిమంగా ప్రవహించే నది బి. ఢిల్లీ
సి. చోటా నాగపూర్ డి. ఊటీ
- ప్రపంచ పటంలో కింది వాటిని గుర్తించండి?
ఎ. ఇజ్రాయెల్ బి. పోలెండ్ సి. ఐర్లాండ్
డి. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన దేశం
ప్రశ్నపత్రం ఇవ్వగానే 15 నిమిషాల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. తెలియని ప్రశ్నలు వచ్చినట్లయితే ఆందోళన చెందకుండా బాగా తెలిసిన ప్రశ్నతో జవాబు రాయడం మొదలుపెట్టాలి. వీలైనంతవరకు సెక్షన్లవారీగా ప్రశ్నలకు జవాబులు రాయడం వల్ల మంచి ఇంప్రెషన్ పొందుతారు.
సమాధానాలు అక్షర దోషాలు లేకుండా స్పష్టంగా వాక్యపరిమితితో ముఖ్యాంశాలను భావనలు అండర్లైన్ చేయడం వల్ల మంచి మార్కులు సాధించవచ్చు.
వ్యాసరూప ప్రశ్నల జవాబుల్లో అక్షర దోషాలున్నట్లయితే అరమార్కు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పులు లేకుండా జవాబులు రాయడం వల్ల గరిష్టంగా మార్కులు పొందవచ్చు.
వ్యాసరూప సమాధానాల్లో భేదాలు రాయమన్నప్పుడు పట్టిక రూపంలోనూ, వ్యాఖ్యానించమని అడిగే ప్రశ్నలకు పేరాగ్రాఫ్ ఏ అంశానికి సంబంధించినదో ఒక పేరా, వివరణ, విశ్లేషణ, ఉదాహరణలతో మరో పేరా చివరగా ముగింపులో సూచనలు, సలహాలు రాయడంవల్ల మంచి మార్కులు పొందవచ్చు.
సమాచార పట్టికలు, పై గ్రాఫ్‌లు విశ్లేషించమని అడిగే ప్రశ్నలకు జవాబులు ఆ చార్ట్, పట్టిక ఏ అంశానికి సంబంధించినదో తెలపడం, దత్తాంశ వివరణ చేసే పేరాగ్రాఫ్ అనంతరం దత్తాంశ విశ్లేషణతో మరో పేరాగ్రాఫ్, దీని ద్వారా ఏం తెలుసుకున్నారో, సమస్య అయివుంటే సూచనలు, సలహాలు, పరిష్కార మార్గాలు తెలుపుతూ ముగింపు స్వీయ అభిప్రాయం రాయాలి.
సమకాలీన సామాజిక అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించుట విద్యా ప్రమాణంలో అడిగే ప్రశ్నలకు స్వీయ అభిప్రాయం వ్యక్తీకరణ, తార్కిక వివేచనతో నిజజీవిత సంఘటనల్ని ఉదహరించడం ద్వారా సమాధానాలు పరిపూర్ణం అవుతాయి.
పటాల్లో గుర్తించమని అడిగే ప్రశ్నలకు, పటాల్లో వాడే/ ఉపయోగించే సంకేతాలు, గుర్తులు ఉపయోగించాలి. ఉదాహరణకు కొండలకు , పర్వతాలకు ప్రధాన నగరాలకు వాడే గుర్తులు, దేశాలను గుర్తించమన్నప్పుడు దేశ సరిహద్దును గీయడం ద్వారా పూర్తి మార్కులు వస్తాయి.
ప్రశంస సున్నితత్వంలో అడిగే ప్రశ్నలకు తక్కువ శ్రమతో గరిష్ట మార్కులు సాధించవచ్చు. పాఠ్యాంశాలు చదివినప్పుడు రాసుకున్న వాటిలో నినాదాలు, కరపత్రాలు, లేఖలు, పత్రికలకు వ్యాసాలు రాయడంలో క్రమపద్ధతి మరవకుండా రాయాలి.
రాసే జవాబులో కీలక పదాలు/ భావనలు, సాంకేతిక పదజాలం, ఉపశీర్షికలు, సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి. కొన్నింటికి పాయింట్లవారీగా, కొన్నింటిని వివరణాత్మకంగాను రాసే ప్రశ్నలుంటాయి. కాబట్టి సమయస్పూర్తిగా రాసే పద్ధతిని ఎన్నుకోవాలి.
పార్ట్-బి లక్ష్యాత్మక ప్రశ్నలకు దిద్దబడిన, కొట్టివేసిన, చెరిపిరాసిన సమాధానాలకు మార్కు లు రావు. కాబట్టి జవాబులు ఆలోచించి నిదానంగా సరైనది గుర్తించి బ్రాకెట్లలో పూరించాలి.
సంవత్సరం మొత్తం ఎంత చదివినా (3గంటల15 నిమిషాల్లో) పరీక్ష హాల్లో రాసే జవాబులే కీలకం. ఆన్సర్షీట్స్లో ప్రశ్నసంఖ్య స్పష్టంగా వేయాలి. అదనపు ప్రశ్నలను రాయాలంటే చివరగా సమయం మిగిలి ఉంటేనే రాయాలి. అన్ని జవాబులు రాసిన తర్వాత జవాబు పత్రాన్ని అంతా చదివి తప్పులుంటే సరిచేసుకోవాలి. సమాచార ఆధారిత ప్రశ్నలకు జాగ్రత్తగా క్రమానుగతంగా జవాబు పేరాల్లో రాయాలి.
డా.రాచర్ల గణపతి
పాఠ్యపుస్తక రచయిత
వరంగల్
9963221590
ఇవీ కూడా చదవండి…
అతిపెద్ద కిడ్నీ ఆస్పత్రిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
సుమత్రా దీవుల్లో నివసించే ఆదిమజాతి?
ఉద్వేగ వికాసంపై ప్రభావం చూపే హార్మోన్?
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు