జీతం పెరిగిందా.. పొదుపు చేయండిలా
లాక్డౌన్ దెబ్బకు అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. ప్రైవేట్ కంపెనీలైతే ఉద్యోగుల జీతభత్యాల్లో భారీగా కోత విధించాయి కూడా. గత ఏడాది కాలంగా తక్కువ జీతాలకు, రావాల్సిన ఇంక్రిమెంట్లు రాక, ప్రమోషన్లు రాక వేతన జీవులు తక్కువ ఆదాయాలతోనే కాలం వెళ్లదీసారు. మళ్లీ దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుండటంతో కంపెనీలు మళ్లీ పాత జీతాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. కొన్ని రంగాలకు చెందిన సంస్థలైతే ఏకంగా ఇంక్రిమెంట్లు, బోనస్‌లను కూడా ప్రకటించాయి. అలా పూర్తి వేతనాలను పొందిన వారికి, ఇంక్రిమెంట్లు వచ్చిన వారికి మొదటగా కంగ్రాట్స్. అయితే ఇన్నాళ్లూ తక్కువ ఆదాయంతోనే కాలం వెళ్లదీసిన వారు ఇప్పుడొస్తున్న కాస్త అదనపు ఆదాయానికైనా ఆర్థిక ప్రణాళికను మొదలు పెట్టండి. కరోనా వైరస్ ప్రతి ఒక్కరికి చాలా ఆర్థిక పాఠాలను నేర్పింది. క్రమశిక్షణ అవసరం ఏంటో తెలియచెప్పింది. కొన్ని చిన్న విషయాలే అయినప్పటికీ ప్రభావం చూపే అంశాలపై ఒక లుక్కెద్దాం..
1.అప్పు తీర్చండి
గత ఏడాదిలో జీతం చాలక కొంత అప్పు చేసే ఉంటారు. పెరిగిన ఆదాయంతో మొదట దాన్ని తీర్చేయండి. ముఖ్యంగా అధిక వడ్డీ ఉండే క్రెడిట్ కార్డు అప్పులు తీర్చేయండి. చే బదుళ్లు, కుదవబెట్టి తెచ్చిన అప్పులను మొట్ట మొదట వదిలించుకోండి. అందువల్ల వచ్చే ఆర్థిక పరమైన ఊరటతో మీరే ఊపిరి పీల్చుకోవచ్చు. మొదట మీకు భారంగా మారిన వాటి జాబితా రాయండి. ఆ తర్వాత ప్రయారిటీ ప్రకారం వాటిని సాధ్యమైనంత త్వరగా తీర్చేయడానికి ప్రణాళికను రూపొందించుకోండి. అధిక వడ్డీ అప్పుల తర్వాత చిన్న చిన్న అప్పులు తీర్చేసి వాటి సంఖ్యను తగ్గించండి. దీంతో మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది
2.అత్యవసర ఫండ్
కరోనాతో ఎమర్జెన్సీ ఫండ్ అవసరమేంటో తెలియచేసింది. అత్యవసర పరిస్థితులు చెప్పిరావు. ఇలాంటి అత్యవసర సంఘటనలతో ఆర్థికంగా బాగా దెబ్బతినాల్సి వస్తుంది. అత్యవసర ఫండ్ అంటూ ఉంటే ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడడమే కాదు ఆర్థిక భారం నుంచి బయటపడేస్తుంది. మీకు ఇప్పుడు అదనంగా వస్తున్న ఆదాయంలో కొంత భాగాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కోసం కేటాయించండి. అది కనీసం ఆరు నెలల వేతనానికి సరిపడేంత ఉంటే మంచిది. అంత మొత్తం జమ చేయాలంటే నెలకు ఎంత పొదుపు చేయాలో ఆలోచించి కార్యాచరణ చేపట్టండి. దాని కోసం రికరింగ్ డిపాజిట్, రిస్క్ లేని మదుపు సాధనాల్లో ఎస్ఐపీ లాంటి వాటిపై ఒక్కసారి దృష్టి సారించండి. ఎందులో పొదుపు చేసినా వాటిని వెంటనే నగదు రూపంలోకి మార్చుకునే సదుపాయం ఉందో లేదోచూసుకోండి.
3.మదుపు చేయండి
అదనంగా వచ్చే ఆదాయాన్ని మదుపు చేయండి. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మదుపు సాధానాలను ఎంచుకోండి. ఎస్ఐపీలు, మ్యూచువల్ ఫండ్లు, పన్ను ఆదా చేసే సాధనాలు, ఎన్పీఎస్ లాంటి వాటిలో పెట్టుబడి పెట్టండి. భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా వాటిలో ఎంతెంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. అవసరమైతే ఆర్థిక సలహాదారున్ని సంప్రదించండి. అదనంగా ఆదాయం ఏ రూపంలో వచ్చినా సరే దాన్ని సద్వినియోగం చేయండి. కరోనా నేపథ్యంలో ఆర్థిక అనిశ్చితి ఎన్నిరకాలు వస్తుందో అర్థం అయింది. కొన్ని జాగ్రత్తగా వేసే అడుగులే. మన ఆర్థిక భరోసాకు ధీమాను ఇస్తాయి.
4.నైపుణ్యాలను పెంచండి
మీకిప్పటికే ఉద్యోగం ఉంది. అయినా సరే ఒకే ఆదాయం ఉండి, అది ఊహించని రీతిలో తగ్గిపోతే, అకస్మాత్తుగా ఆ ఉద్యోగం ఊడిపోతే పడే కష్టాలేమిటో గత ఏడాదిలో చాలా మందికి తెలిసివచ్చింది. అందుకే ఇతర ఆదాయాల కోసం అదనపు నైపుణ్యాలను పెంచుకోండి. అదనంగా వచ్చే ఎంత తక్కువైనా సరే అదే కష్ట సమయంలో చాలా ఆదుకుంటుంది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న మీ క్వాలిఫికేషన్లకు తోడు కొన్ని ప్రొఫెషనల్ కోర్సులు చేయండి. అలాంటివి ఆన్లైన్లో నేర్చుకోండి. అదనపు క్వాలిఫికేషన్లతో పాటు మీకున్న అనుభవం రీత్యా మంచి వేతనంతో మరో ఉద్యోగం రావచ్చు కూడా. మీ ప్రతిభను పెంచుకోవడానికి మదుపు చేయండి.
5.హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్
హాస్పిటల్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కుటుంబంలో అందరికీ వర్తించేలా ఆరోగ్య బీమాను తీసుకోండి. తద్వారా హాస్పిటలైజేషన్ ఖర్చుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే కుటుంబ పెద్దగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. మామూలు జీవిత బీమా కన్నా ఇందులో ప్రీమియం తక్కువ కవరేజి ఎక్కువ. ప్రస్తుత అనిశ్చిత కాలంలో టర్మ్ పాలసీ మీ తదనంతరం కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు కాపాడుతుంది. మీ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కలిగిస్తుంది. ఈ పాలసీ మీకు ఆదాయపన్నును ఆదా కూడా చేస్తాయి.
ఇవీ కూడా చదవండి
ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా పాజిటివ్
ఆఖరి పంచ్ మనదే..వన్డే సిరీస్ భారత్‌దే
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు