‘పాండోర పేపర్లు’ దేనికి సంబంధించినవి?
- దేశంలో తొలిసారిగా ఈ-ఓట్ విధానాన్ని ఎక్కడ పరిశీలించనున్నారు? (సి)
ఎ) అహ్మదాబాద్ బి) వారణాసి
సి) ఖమ్మం డి) మధురై
వివరణ: దేశంలో తొలిసారిగా స్మార్ట్‌ఫోన్ వినియోగించి ఇంటినుంచే ఓటు వేసే ఈ-ఓట్ విధానాన్ని ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఐటీ శాఖలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం బ్లాక్‌చెయిన్ సాంకేతికతను వినియోగించి దీనిని అభివృద్ధి చేశాయి. ఈ పద్ధతిలో ఓటు వేయాలనుకుంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. వారికి లాగిన్ ఐడీ ఇస్తారు. రిజిస్ట్రేషన్, ఓటు వేసే సమయంలో ఒకే ఫోన్‌ను వినియోగించుకొనేందుకు లాగిన్ ఐడీని ఫోన్ ఐఎంఈఐ నంబర్‌కు, ఫోన్ నంబర్‌కు అనుసంధానం చేస్తారు. ఓటింగ్ సమయంలో ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మూడు దశల్లో ఓటర్ను గుర్తించి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తుంది.
- కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి? (ఎ)
ఎ) గ్రామీణ ప్రాంతాల్లో ఓబీసీల సగటు జాతీయ స్థాయి కంటే తెలంగాణలో ఎక్కువగా ఉంది
బి) గ్రామీణ ప్రాంతాల్లో ఓబీసీల సగటు జాతీయ స్థాయి కంటే తెలంగాణలో తక్కువగా ఉంది
సి) గ్రామీణ ప్రాంతాల్లోని ఓబీసీల్లో తెలంగాణ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో సమానంగా ఉంది
డి) ఏదీకాదు
వివరణ: దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓబీసీల సగటు 44.4 శాతంగా ఉందని జాతీయ గణాంకాల కార్యాలయం చేసిన సర్వేలో తేలింది. 2018 జూలై-2019 జూన్‌లో గ్రామీణ వ్యవసాయ కుటుంబాల భూములు, పాడి సంపద గురించి అధ్యయనం చేశారు. ఈ సర్వే ప్రకారం దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 17.24 కోట్ల కుటుంబాలు ఉండగా ఓబీసీ సగటు 44.4 శాతంగా తేలింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఓబీసీ సగటు 57.4% ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓబీసీలు 45.8%గా ఉన్నారు.
- ‘బీజీఎం-4005, ఐపీసీఎల్4-14, ఐపీసీఎంబీ19-3’ ఇవి ఏంటి? (సి)
ఎ) కరోనా కొత్త ఉత్పరివర్తనాలు
బి) కొత్త వరి వంగడాలు
సి) కొత్త శనగ వంగడాలు
డి) కరోనా ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్
వివరణ: కరవు ప్రాంతాల్లో వాతావరణ మార్పులను తట్టుకొని పండే మూడు కొత్త శనగ వంగడాలను ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్ విడుదల చేసింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి అనుబంధ సంస్థలతో కలిసి వీటిపై పరిశోధనలు చేసి సత్ఫలితాలు సాధించింది. ఈ విత్తనాలు పశ్చిమ, ఉత్తర భారత రాష్ర్టాల్లో పండే రకాలు. వీటి పంట సాగు కాలం 106 నుంచి 133 రోజులు ఉండొచ్చని అంచనా. ఎన్నో ఏళ్లుగా రైతులు పండిస్తున్న పాత రకాల విత్తనాల్లో జన్యువుల మార్పిడి ద్వారా కొత్త వంగడాలను సృష్టించారు. అలాగే ఇవి పాత వంగడాల కన్నా 11 నుంచి 14.76% అధిక దిగుబడిని ఇచ్చాయి.
- హెలిబోర్న్ జియోఫిజికల్ మ్యాపింగ్ సాంకేతికత దేనికి సంబంధించింది? (బి)
ఎ) ఖనిజ వనరుల గుర్తింపు
బి) భూగర్భ జలాలను గుర్తించడం
సి) తుఫాన్ ఏ తీరాన్ని తాకుతుందో గుర్తించడం
డి) ఏదీకాదు
వివరణ: భూగర్భ జలాలను గుర్తించేందుకు హెలిబోర్న్ జియోఫిజికల్ మ్యాపింగ్ సాంకేతికతను వినియోగించనున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించగా ఫలితాలు సానుకూలంగా ఉండటంతో విస్తృతంగా దీనిని చేపట్టనున్నారు. ఇందుకు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ కూడా సహకరిస్తుంది. ముఖ్యంగా వర్షాభావ ప్రాంతాల్లో 4 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాలకు హెలికాప్టర్ ద్వారా జియోఫిజికల్ మ్యాపింగ్ సాంకేతికతను వినియోగించి భూగర్భ జలాలను గుర్తిస్తారు. సర్వేను రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో చేపట్టనున్నారు. ఎన్జీఆర్ఐ అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత సహాయంతో భూమిలోపల 500 మీటర్ల వరకు త్రీడీ చిత్రంతో స్పష్టంగా నీటి జాడలు గుర్తించనున్నారు.
- రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అత్యధికంగా అటవీ ప్రాంతం ఉందని అటవీ శాఖ నివేదిక పేర్కొంది? (డి)
ఎ) పినపాక బి) ఖానాపూర్
సి) బాన్సువాడ డి) ములుగు
వివరణ: రాష్ట్రంలో ములుగు నియోజకవర్గంలో అత్యధికంగా అటవీ ప్రాంతం ఉందని అటవీ శాఖ నివేదిక పేర్కొంది. 33 జిల్లాల వారీగా కాకుండా 119 శాసనసభ నియోజకవర్గాల స్థానాల్లోని అటవీ ప్రాంతాల పరిస్థితిపై ఈ నివేదిక వెలువడింది. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా 2.77 కోట్ల పైగా ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో 66.64 లక్షల ఎకరాలు అంటే 24.03% అటవీ ప్రాంతం ఉంది. అగ్రస్థానంలో ములుగు ఉండగా.. 2, 3 స్థానాల్లో పినపాక, ఖానాపూర్‌లు నిలిచాయి. కేవలం 11 శాసనసభ స్థానాల్లోనే 50 నుంచి 75 శాతం మధ్య అటవీ ప్రాంతం ఉన్నట్లు స్పష్టమవుతుంది. పచ్చదనం ఎక్కువగా ఉన్న మొదటి పది ప్రదేశాల్లో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాలే ఎనిమిది ఉన్నాయి.
- కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి? (సి)
- బాలకార్మికులు లేని మండలంగా వేల్పూర్ రికార్డ్ సృష్టించింది
- గ్రామం మొత్తాన్ని దానంగా ఇచ్చినట్లు పేర్కొనే ఒక శాసనం గుండ్లపల్లి మండలంలో గుర్తించారు
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
వివరణ: 20 సంవత్సరాలుగా బాల కార్మికులు లేని మండలంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ రికార్డ్ సాధించింది. 2001లో దీనిని బాలకార్మికులు లేని మండలంగా ప్రకటించారు. అప్పటి నుంచి దీనిని నిలబెట్టుకుంటూ వచ్చింది. రాజపురోహితులకు గ్రామం మొత్తాన్ని దానంగా ఇచ్చినట్లు పేర్కొనే ఒక శాసనం నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండలం వావికొల్లు గ్రామంలో లభించింది. ఏడు అడుగుల ఎత్తు అడుగున్నర మందంతో ఉన్న ఈ శిలపై నాలుగు వైపులా 81 పంక్తులతో తెలుగు భాషలో చెక్కారు. కందూరు నాడును పాలించిన ఉదయచోలుడు ఈ శాసనాన్ని వేయించాడు.
- ఇటీవల తెలంగాణ ఏర్పాటు చేసిన హరిత నిధికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి నెలా ఎంత జమచేస్తారు? (డి)
ఎ) రూ.1000 బి) రూ.100
సి) రూ.5000 డి) రూ.500
వివరణ: రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం హరిత హారాన్ని చేపట్టారు. దీనిని నిరంతరాయంగా కొనసాగించడానికి తెలంగాణ హరిత నిధిని ఏర్పాటు చేస్తారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెలా కొంత ఈ నిధికి అందజేస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి నెలకు రూ.500, జిల్లా పరిషత్తు చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ల నుంచి రూ.100, మున్సిపల్ చైర్పర్సన్, ఎంపీపీ, జడ్పీటీసీల నుంచి రూ.50, మున్పిపల్ కార్పొరేటర్, కౌన్సిలర్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీల నుంచి రూ.10, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల నుంచి రూ.100, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రూ.25 జమచేస్తారు
- ‘పాండోర పేపర్లు’ దేనికి సంబంధించినవి? (బి)
ఎ) వివిధ జంతు జాతుల సంఖ్య
బి) పన్ను ఎగవేత దారుల జాబితా
సి) ఈశాన్య రాష్ర్టాల్లో వృక్ష సంపద
డి) దేశం మొత్తంలో వృక్ష, జంతు జాతుల సంఖ్య
వివరణ: పన్ను ఎగవేతదారుల పేర్లను వెల్లడిస్తూ పాండోర పేపర్లతో అక్టోబర్ 3న ఒక జాబితా విడుదలయ్యింది. ఇందులో 91 దేశాలకు చెందిన వందల మంది ప్రస్తుత, మాజీ ప్రపంచ నేతలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు, బిలియనీర్లు, వివిధ రంగాల ప్రముఖుల పేర్లు ఉన్నాయి. 380 మంది భారతీయుల పేర్లు కూడా వెల్లడించారు. తక్కువ పన్ను ఉన్న దేశాలకు పెద్ద ఎత్తున తరలించిన రహస్య సంపద, అక్రమ పెట్టుబడుల వివరాలు వీటిలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ కన్షార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) ఈ వివరాలను వెల్లడించింది. 117 దేశాల్లో 150కి పైగా వార్తాసంస్థల్లోని 600 మంది విలేకరులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. గతంలో కూడా ఈ సంస్థ పనామా పేపర్ల పేరుతో ఈ తరహా జాబితాను విడుదల చేసింది.
- టోటల్ పోలార్ కాంపౌండ్ (టీపీసీ) అంటే ఏంటి? (సి)
ఎ) ధ్రువ ప్రాంతాల విస్తరణ
బి) సూర్యకాంతిని కొలిచే ప్రమాణం
సి) నూనె నాణ్యతను తెలిపే ప్రమాణం
డి) వాతావరణ కాలుష్యాన్ని తెలిపే ప్రమాణం
వివరణ: టోటల్ పోలార్ కాంపౌండ్ అంటే నూనె నాణ్యతను తెలిపే ప్రమాణం. ఇది 25 శాతానికి మించరాదు. వాడిన వంటనూనెతో జీవ ఇంధన ఉత్పత్తిని చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఈ పదాన్ని వినియోగించారు. వంటనూనెను ఎక్కువగా వాడే హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులను అప్రమత్తం చేస్తూ ఈ నూనెను సేకరిస్తున్నారు. వీటన్నింటికి రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఆదేశాలు జారీ చేసింది. వాళ్లు ఎంత నూనె కొన్నారు, ఎంత వినియోగించారో లెక్క చెప్పాలి. వాడిన నూనెను ఏం చేస్తున్నారో రికార్డ్ చేయాలి. అధికారులు ప్రతి నెలా ఆడిట్ నిర్వహిస్తారు.
- కింది వాటిలో సరైనవి గుర్తించండి? (డి)
- మిహిదాన ఎగుమతిని పశ్చిమబెంగాల్ నుంచి ప్రారంభించారు
- ఆసియాలోనే జీవ ఇంధనంతో నడిచే ఫ్లయింగ్ కారును తమిళనాడులో అభివృద్ధి చేశారు
ఎ) 1 బి) 2 సి) ఏదీకాదు డి) 1, 2
వివరణ: జీఐ ట్యాగ్ పొందిన మిహిదానా స్వీట్‌ను బహ్రెయిన్‌కు ఎగుమతి ప్రారంభించారు. పశ్చిమబెంగాల్లోని బర్డ్‌మ్యాన్ నుంచి తొలి నౌక బయలుదేరింది. ఈ తీపి పదార్థం మిహి, దానా అనే పదాల ద్వారా వచ్చింది. మిహి అంటే బాగుంది అని, దానా అంటే గింజ అని అర్థం. అలాగే జీవ ఇంధనంతో పాటు బ్యాటరీతో పనిచేస్తూ గాలిలో ఎగిరే కారును ఆసియాలోనే మొదట చెన్నైకి చెందిన వినత ఏరో మొబిలిటీ సంస్థ అభివృద్ధి చేసింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో 3 వేల అడుగుల ఎత్తులో 60 నిమిషాలు ఇది ప్రయాణించింది. 2030 నాటికి ఇవి వాణిజ్య పరంగా అందుబాటులోకి వస్తాయి. ఇవి నిట్టనిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేసేందుకు వీలుంటుంది.
- పీఎం మిత్ర దేనికి సంబంధించింది? (ఎ)
ఎ) టెక్స్టైల్ పార్కులు
బి) గ్రామాల్లో భూముల రికార్డ్
సి) ఇతర దేశాలతో సఖ్యతగా మెలగడం
డి) లెదర్ పార్కులు
వివరణ: పీఎం ఎంఐటీఆర్‌ఏ (మిత్ర) అన్నది సంక్షిప్త రూపం. దీనిని విస్తరిస్తే ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్క్. దేశ వ్యాప్తంగా రూ.4445 కోట్లతో ఏడు మెగా టెక్స్టైల్ పార్క్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని ప్రధాన లక్ష్యం 5fలను సాధించడం. 5f అంటే ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్. ఏ రాష్ర్టాలకు వీటిని కేటాయిస్తున్నారో ఇంకా నిర్ణయించలేదు. ఎక్కువ ప్రయోజనాలు అందించే రాష్ర్టాలకు ఇవ్వాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. భూమి ఉచితంగా ఇవ్వడంతో పాటు, మౌలిక వసతులు, పన్ను మినహాయింపులు ఎక్కువ ఇచ్చే రాష్ర్టాలకు ప్రాధాన్యం ఇస్తారు.
- జూలియస్, అర్డెమ్ పటపౌటియన్‌లకు ఏ అంశంలో నోబెల్ బహుమతి వచ్చింది? (సి)
ఎ) భౌతిక శాస్త్రం బి) రసాయన శాస్త్రం
సి) మెడిసిన్ డి) ఆర్థికం
వివరణ: దెబ్బతగిలితే నొప్పి ఎలా తెలుస్తుంది? ఎవరైనా తాకితే ఎలా స్పందించగలుగుతాం?, వేడి, స్పర్శలను ఎలా గుర్తించగలుగుతామన్న అంశాలపై పరిశోధనకుగాను 2021కి మెడిసిన్‌లో డేవిడ్ జులియస్, అర్డెమ్ పటపౌటియన్‌లకు నోబెల్ అవార్డ్ దక్కింది. ఇది తెలుసుకోవడం వల్ల దీర్ఘకాలిక రోగాలు, నొప్పి బాధల నుంచి ఉపశమనం దొరికే అవకాశం ఉంది. తాజా పరిశోధనలతో నొప్పికి సంబంధించిన చికిత్స మారే అవకాశం కూడా ఉంది.
- భౌతిక శాస్త్రంలో నోబెల్ పొందింది? (డి)
ఎ) సుకురో మనబె బి) క్లాస్ హాజల్‌మాన్
సి) జారిజ్రయో పారిసి డి) పై అందరూ
వివరణ: ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. వీరు ప్రకృతిలో గందరగోళంతో కూడిన, యాదృచ్ఛికంగా జరిగే సంక్లిష్ట వ్యవస్థలపై పరిశోధన చేశారు. వీరి కృషి వల్ల వాతావరణ సంబంధ అంశాలను మెరుగ్గా అర్థం చేసుకోడానికి, కచ్చితత్వంతో ముందస్తు అంచనాలు వేయడానికి మార్గం సుగమమయ్యింది. అలాగే సంక్లిష్ట భౌతిక వ్యవస్థల గురించి అవగాహన పెరిగింది. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థల్లో యాదృచ్చికత ఉంటుంది. ఒక క్రమపద్ధతి ఉండదు. వాటిని అర్థం చేసుకోవడం కష్టం. అలాంటి ప్రక్రియను వివరించడానికి, వాటి దీర్ఘకాల వ్యవహారశైలిని ముందుగా ఊహించడానికి దోహదం చేసే కొత్త విధానాలను వీరు కనుగొన్నారు.
- అసిమెట్రిక్ ఆర్గానోకెటాలసిస్ వార్తల్లో నిలవడానికి కారణం? (బి)
ఎ) కొత్తగా కనుగొన్న ఉత్పరివర్తన పద్ధతి
బి) నోబెల్ బహుమతి పొందిన పరిశోధన
సి) కొత్తగా ఆవిష్కరించిన సౌరశక్తి నిర్మాణ సిద్ధాంతం
డి) ఏదీకాదు
వివరణ: పరమాణువుల అమరికను సరికొత్త మార్గంలో అభివృద్ధి చేసే అసిమెట్రిక్ ఆర్గానోకెటాలసిస్ విధానాన్ని ఆవిష్కరించినందుకు డేవిడ్ మెక్‌మిలన్, బెంజమిన్ లిస్ట్‌లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. మానవజాతి మనుగడకు ఉపకరించే అద్భుత ప్రక్రియను వీళ్లు కనుగొన్నారు. బెంజమిన్ లిస్ట్ జర్మనీ దేశస్తుడు, డేవిడ్ మెక్‌మిలన్ స్కాట్లాండ్ దేశానికి చెందిన వారు. విడివిడిగా ఈ సాంకేతికతను 2000లో కనుగొన్నారు. దీని ఫలితంగా రసాయన శాస్ర్తం పర్యావరణ హితంగా మారింది.
- ఏ సరస్సుకు అంబాసిడర్‌గా గూడ కొంగను ఎంపిక చేశారు? (సి)
ఎ) ఊలార్ బి) పులికాట్ సి) కొల్లేరు డి) వెంబనాడ్
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సుకు గూడ కొంగను అంబాసిడర్‌గా ఎంపిక చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూడ కొంగల్లో 40% ఈ సరస్సులోనే ఉన్నాయి.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ 9849212411
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు