ఇంటికి బీమా.. ఎంతో ధీమా!
- అందుబాటులో అనేక పాలసీలు
- యజమానితోపాటు అద్దెకున్నవారికీ వర్తింపు
ఇల్లు.. ఓ ముఖ్యమైన ఆస్తి. సామాన్యులకు ఓ పెద్ద పెట్టుబడి. అలాంటి ‘ఇంటికి’ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే? ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవి చూడాల్సిందే! అలాంటి సమయాల్లో గట్టెక్కించేది.. ‘బీమా’ మాత్రమే!
మనుషులు, వాహనాలకు ఉన్నట్టే.. ఇండ్లకూ ఇన్సూరెన్స్ ఉంటుంది. అయితే, గృహ బీమా తీసుకోవడంలో ఎక్కువ మంది అలసత్వం ప్రదర్శిస్తుంటారు. కానీ, మనల్ని సురక్షితంగా ఉంచే ఇల్లు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశముంది. వరదలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు.. లాంటివాటితో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఆ నష్టాల నుంచి బయట పడాలంటే.. ఇంటికి ‘బీమా రక్షణ’ ఉండాల్సిందే!
రెండు రకాలుగా..
హోమ్ ఇన్సూరెన్స్ రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది భవనానికి. రెండోది ఇంట్లోని వస్తువులకు. ప్రమాదాలు చెప్పి రావు. కాబట్టి, నివాస గృహానికి, అందులో ఉండే వస్తువులకూ ‘బీమా’ చేయించుకోవడం మంచిది. దీని వల్ల ఆర్థిక భద్రత లభిస్తుంది. భూకంపాలు, పిడుగుపాటు, వరదలు, తుఫాన్‌లాంటి ప్రకృతి వైపరీత్యాలతోపాటు అగ్ని ప్రమాదాలు, దోపిడీల్లాంటి ఘటనలతో జరిగే నష్టాలను ఈ ఇన్సూరెన్స్ పూడ్చుతుంది. అయితే, ఇండ్లకు ఇన్సూరెన్స్ తీసుకొనేందుకు ఆయా ఇంటి యజమానులు మాత్రమే అర్హులు. అద్దెకుండే వారికి ఈ సౌలభ్యం లేదు. కానీ, ఆ ఇంట్లోని వస్తువులకు బీమా తీసుకొనే వెసులుబాటు అద్దెదారులకు లభిస్తుంది. ఇంట్లోని పురాతన వస్తువులు, బంగారు, వజ్రాభరణాలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులకూ బీమా పొందే అవకాశం ఉంటుంది.
వీటికి వర్తించదు..
కొన్ని రకాల ప్రమాదాలకు ‘హోమ్ ఇన్సూరెన్స్’ వర్తించదని బీమా సంస్థలు చెబుతున్నాయి. అణు ప్రమాదం, రేడియేషన్, యుద్ధం, ఉగ్రదాడులు,
సైనిక ఆపరేషన్లు లాంటి ఘటనలతోపాటు ఉద్దేశపూర్వకంగా చేసే నష్టాలకు ఇంటి బీమా వర్తించదని అంటున్నాయి. అంతేకాకుండా, సంస్థను బట్టి కూడా కవరేజీ అంశాలు మారుతూ ఉంటాయి. అయితే, పాలసీదారులు ఎన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షణ కోరుకుంటున్నారనే అంశాన్ని బట్టి ప్రీమియం ఆధారపడి ఉంటుంది.
అనేక పాలసీలు..
హోమ్ ఇన్సూరెన్స్‌లో సంస్థలను బట్టి అనేక రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మూడు. బేసిక్, హౌస్ బ్రేకింగ్ పాలసీ, హౌస్ హోల్డర్ ప్యాకేజీలు. అన్ని బీమా పాలసీల మాదిరిగానే కంపెనీలు ఇచ్చే వివిధ పాలసీలను పోల్చుకొని, తమకు అనుకూలమైనదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఫీచర్లుండే పాలసీని తీసుకొంటే మంచిది. అదేవిధంగా సెటిల్మెంట్ నిష్పత్తితోపాటు ఎంత త్వరగా సెటిల్మెంట్ జరుగుతుందో కూడా పరిశీలించుకోవాలి. ఈ బీమా కేవలం ఇంటికి మాత్రమే. ఇంటికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడే ఇది చెల్లుబాటు అవుతుంది. అంతేకాకుండా, ఇంటి విలువను బట్టి కాకుండా, ఇల్లు ఉన్న స్థలం విలువ, ఆ ఇంటిని పునర్నిర్మించడానికయ్యే ఖర్చును బట్టి ఇన్సూరెన్స్ కవరేజీ ఆధారపడి ఉంటుంది. ఇంటికి భద్రత కల్పించేలా అదనపు సదుపాయాలుంటే, ప్రీమియంలోనూ మార్పులు ఉంటాయి. అగ్నిమాపక వ్యవస్థ, వరదలను తట్టుకొనేలా డ్రైనేజీ సిస్టమ్లాంటివి ఉన్నట్లయితే, ప్రీమియం తక్కువగా ఉంటుంది. అలాగే, ఎంత ఎక్కువ కవరేజీ కావాలనుకొంటే, అంత ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఇంట్లోనే కాదు..
బంగారు, వజ్రాభరణాల్లాంటి వాటి కోసం ప్రత్యేకంగా అనుబంధ పాలసీలు ఉంటాయి. ఇంట్లో దొంగతనం జరిగినప్పుడే కాదు.. బయటికెళ్లినప్పుడూ ఏదైనా జరిగినా వీటికి బీమా రక్షణ ఉండేలా పాలసీని తీసుకోవచ్చు.
బీమా చేసిన ఇంట్లో జరిగే ప్రమాదం వల్ల వేరే ఆస్తికి నష్టం వాటిల్లినప్పుడు కూడా బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్న ఇంట్లో సిలిండర్ పేలితే, పక్క ఇల్లు కూడా దెబ్బతింటుంది. ఇలాంటి సందర్భంలో ఉపయోగపడే పాలసీలు కూడా ఉంటాయి.
ఏదైనా.. విపత్తు జరిగితే!
ఏదైనా విపత్తుల వల్ల ఇల్లు, లేదా ఇంట్లోని వస్తువులు దెబ్బతింటే.. సాధ్యమైనంత త్వరగా బీమా కంపెనీలకు సమాచారమివ్వాలి. కస్టమర్ కేర్ నంబర్‌కు లేదా ఇన్సూరెన్స్ అధికారి/ఏజెంట్‌కు ఫోన్ చేయడం ద్వారా బీమా క్లెయిమ్‌ను నమోదు చేసుకోవచ్చు. అయితే, సదరు క్లెయిమ్ రిజిస్ట్రేషన్ అయ్యేలా చూసుకోవాలి. లేకుంటే, బీమా క్లెయిమ్‌పై ఇన్సూరెన్స్ కంపెనీలు అభ్యంతరం తెలిపే అవకాశం ఉంటుంది. అవసరమైతే జరిగిన నష్టానికి సంబంధించిన ఫొటోలు తీసి, సాక్ష్యాలుగా పెట్టుకోవడం మంచిది. అయితే, ప్రమాదం జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ అధికారి వచ్చే వరకూ ఏ వస్తువునూ కదపకుండా ఉంచాలి. లేకుంటే, అభ్యంతరాలు వ్యక్తం కావచ్చు. అంతేకాకుండా, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు కూడా ఆన్
లైన్లో ఉంచుకోవాలి. ప్రమాదంలో పేపర్లు దెబ్బతిన్నా, ఆన్లైన్ డాక్యుమెంట్లు ఉపయోగపడతాయి.
వర్డెల్లి బాపురావు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు