ఇదేం భాష, ఇదేం గోస?
‘మరక మంచిదే’ అంటుందో వాణిజ్య ప్రకటన. మరి ‘మార్పు’ కూడా మంచిదేనా? మంచిదో చెడ్డదో కానీ మార్పు అనేది అనివార్యం. తరాలు మారుతున్నప్పుడు, వర్తమాన తరం వెనుకటితరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తున్నది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పునకున్న ప్రథమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే రాజకీయ నాయకులు పుడతారు. మేధావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు, రచయితలు పుడతారు. పాఠకులు, శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ల సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకు తగ్గట్టుగానే మారిపోతుంటాయి.
మార్పును అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే, ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకొనే తత్వం లేక నవతరం ముందుకుసాగుతూ ఉంటుంది. తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వైరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే నేడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకొని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. అమ్మను ‘ఒసే’ అనడం, నాన్నను ‘ఒరే’ అనడం వంటి కొత్త ధోరణులను ఆవిష్కరిస్తున్నాయి. ముందే చెప్పినట్టు.. ఇది క్రమంగా సినిమాల నుంచి ఛానళ్లకు, పత్రికలకు, పుస్తకాలకు, చట్టసభలకు విస్తరించి.. సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెప్తున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజాప్రతినిధులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు చెప్పే మాటల్లో, ప్రవచించే పలుకుల్లో, రాసే రాతల్లో సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి.
వెనుకటి రోజుల్లో పిల్లలు ఒకర్నొకరు సరదాగా ‘గురూ, గురూ’ అని పిల్చుకుంటూ ఉంటే విని పెద్దలు గుర్రుమనేవారు. కొందరైతే తొడపాశం పెట్టేవారు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇండ్లల్లో మాట్లాడుకునే దానికి, బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది. ఇంట్లో అమ్మా అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం ‘మా అమ్మ గారు’ అంటూ గౌరవంగా చెప్పుకొనేవారు. ఉత్తరాలు రాసేటప్పుడు, గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి అనో, పూజ్యులైన తాతయ్యగారికి అనో వినమ్రత కనబరిచేవారు. వినయాన్ని సంస్కారంగా, విధేయతను సభ్యతగా పరిగణించే వారు. ఒదిగి ఉండటాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణుకువగా అనుకునే వారు. సభ్యతా, సంస్కారాలకు అదే కొలమానంగా భావించేవారు.
ఇక, పత్రికల్లో వాడే భాష, సినిమాల్లో వినిపించే సంభాషణలు, చట్టసభల్లో జరిగే చర్చలు, చాలావరకు పరిధులకు, ప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలు, వార్తలు గిరి గీసుకొని, మడికట్టుకొని తయారు చేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానంగా చెప్తాయన్న నింద తప్ప, సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రథను అవి ఏనాడు మోయలేదు.
కానీ, కాలం ఒక్కతీరుగా ఉండదు కదా! జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టి మారిపోతుంటాయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు నేడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడం, ఆమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పును మరింత ‘వేగవం తం’ చేయడంలో నేటి ఏ టూ జెడ్ ఛానె ళ్లు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. వాటి శ్రమకు నేటి రాజకీయ నాయకులు యథాశక్తి ఆజ్యం పోస్తున్నారు. మాటకున్న ‘పవర్’ ఏమిటో నేటితరం రాజకీయ నాయకులకు బాగా తెలుసు. మాటను ఎలా తిప్పి ఒదిలితే అది మీడియా దృష్టిని ఆకట్టుకుంటుందో వారికి వెన్నతో పెట్టిన విద్య. ఎలాంటి మాటలు రువ్వితే అవి సంచలనాన్ని సృష్టిస్తాయో వారికి కరతలామలకం. ఆ సంచలనాలు కలిగించే పెను ముప్పులతో వారికి నిమిత్తం లేదు. అవి ప్రజల్లో ప్రేరేపించే భయ సందేహాలతో వారికి సంబంధం లేదు. వారి వార్త మీడియాలో పేలాలి.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటారా! సందర్భం ఏమిటంటారా?.. తెలంగాణలోని కొన్ని రాజకీయపార్టీల నాయకుల నోటివెంట తరచుగా వినవస్తున్న మాటలే! ఎవరు వీరన్నది టీవీలు చూసే చిన్నపిల్లలు కూడా చెప్పగలుగుతారు. వారి మాటలు సభ్యతకు, సంస్కారానికి దూరంగా ఉంటున్నాయని ఒప్పుకోకతప్పదు. ఈ బాపతు నాయకులకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఓ హితవాక్యం చెప్పక తప్పదు. ‘జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి: జిహ్వాగ్రే మిత్ర బాంధవా: జిహ్వాగ్రే బంధన ప్రాప్తి: జిహ్వాగ్రే మరణం ధృవం’ అన్నారు. జిహ్వ అంటే నాలుక. ఇక్కడ నాలుక అంటే మాట. మాట వల్లనే స్నేహాలు, బాంధవ్యాలు. మాటను బట్టే మరణం కూడా. మాటకు ఉన్న అసలు శక్తి ఇది. సంచలనాలు సృష్టించడం కాదు. ‘వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రల్లదనం’ అంటూ ‘చేయకూడని’ కార్యాల జాబితాలో కూడా ‘చెడు పలుకు’ను చేర్చింది అందుకే. సభ్యసమాజంలో జీవిస్తున్న కొందరు రాజకీయ నాయకులు తమ నోటిని అదుపులో ఉంచుకుంటూ, ఇలాంటి ‘ప్రల్లదనపు’ పలుకులకు స్వస్తి చెప్తారని ఆశిద్దాం!
భండారు శ్రీనివాసరావు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?