ఇష్టంతో చదివారు.. ఇలా గెలిచారు
ర్యాంకర్స్ వాయిస్
కష్టపడటంతో పాటు ఇష్టపడ్డారు. సరైన ప్రణాళిక సిద్ధం చేసుకొని.. దానిని ఆచరించారు.
ఫలితంగా టాప్ ర్యాంకులు సొంతం చేసుకొని విజేతలుగా నిలిచారు. తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు, ఆశయాల్ని సాధించుకునేందుకు మార్గాన్ని సుగమం చేసుకొన్నారు. ఇటీవల విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థులు తమ మనోగతాన్ని ‘నమస్తే తెలంగాణనిపుణ’తో పంచుకున్నారు. నూతన ఆవిష్కరణలు చేపడతామని కొందరు విద్యార్థులు చెపుతుండగా… సైంటిస్ట్, కంపెనీలకు సీఈవో, ఉన్నత చదువుల కోసం ఫారిన్ వెళ్తామని మరికొందరు చెబుతున్నారు. ఆంకాలజీ, న్యూరో, హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అవుతామని అగ్రికల్చర్,మెడికల్ విభాగం విద్యార్థులు పేర్కొంటున్నారు. ఆ వివరాలు…
కొత్త ఆవిష్కరణలే లక్ష్యం: సత్తి కార్తికేయ
ఎల్ఆర్ పేట్, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్ల్లా, ఏపీ
ఎంసెట్ ఇంజినీరింగ్ ర్యాంక్- 1
మార్కులు- 158.497905
విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం
నాన్న త్రినాథరావు. పాలకొల్లులో కొబ్బరి పీచు వ్యాపారం. అమ్మ మోహన కృష్ణకుమారి గృహిణి. పదవ తరగతి వరకు గుడివాడలో, ఇంటర్ విజయవాడలో చదివాను.
ఎంసెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు
ఎలా ఫీలవుతున్నారు? ప్రిపరేషన్ ఎలా సాగింది?
తెలంగాణ ఎంసెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. నా లక్ష్యసాధనలో ఈ విజయం ఓ మలుపుగా భావిస్తున్నాను. అమ్మానాన్నల ప్రోత్సాహం, టీచర్ల సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ ర్యాంకు సాధిస్తానన్న నమ్మకం ఉంది. జేఈఈ కోసం చదువుతూనే ఎంసెట్ రాశాను. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నాను. నేర్చుకోవాల్సిన అంశాలను ఉదయమే రాసుకుని ఒక టైం టేబుల్ రూపొందించుకున్నాను. నిర్దేశించుకున్న అంశాలను అదే రోజు తప్పనిసరిగా పూర్తిచేస్తాను. చదివిన అంశాలపై పట్టుకోసం ఫ్రెండ్స్‌తో చర్చించుకునేవాడిని. ఏ చిన్న సందేహం వచ్చినా ఎప్పటికప్పుడు లెక్చరర్ల సహాయం తీసుకుని వాటిని నివృత్తి చేసుకునేవాడిని. ఈ లక్షణమే ఈ ర్యాంకు రావడానికి కారణం.
ఇప్పటి వరకు మెరిట్ టెస్టులు అంటే ఒలింపియాడ్ స్కాలర్షిప్ లాంటి టెస్టులు రాశారా? అందులో ఏమైనా ర్యాంకులు సాధించారా?
ఆలిండియా ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో ఐదో ర్యాంక్ సాధించాను. ఈ ఏడాది ఫిలిప్పీన్స్‌లోని మనీలా పోటీలో పాల్గొనాల్సి ఉంది.
జేఈఈ అడ్వాన్స్, మెయిన్స్?
ఇప్పటి వరకు జరిగిన జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష మూడుసార్లు రాశాను. 99.9933 శాతం మార్కులు సాధించాను. చివరి అవకాశంగా నాలుగోసారి 100 శాతం మార్కులు సాధించాలని సన్నద్ధం అవుతున్నాను. జేఈఈ అడ్వాన్స్ పరీక్షలకు కూడా సిద్ధం అవుతున్నాను. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ప్రిపరేషన్ సాగిస్తున్నాను. దీనిలో కూడా మంచి ర్యాంక్ సాధిస్తాను.
భవిష్యత్ లక్ష్యం ఏంటి?
జేఈఈ అడ్వాన్స్‌లో బెస్ట్ ర్యాంకు సొంతం చేసుకొని ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవాలన్నదే నా లక్ష్యం. తరువాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)లో శాస్త్రవేత్తగా రాణించాలన్నదే ఆశయం. ఏఐలో కొత్త ఆవిష్కరణలు సృష్టించాలన్నదే కోరిక.
సైంటిస్ట్ కావాలన్నదే లక్ష్యం: దుగ్గినేని వెంకట పనీష్
రాజంపేట, కడప జిల్లా, ఏపీ
ఎంసెట్ ఇంజినీరింగ్ ర్యాంక్- 2
మార్కులు- 156.583675
విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం ?
నాన్న దుగ్గినేని యుగంధర్ నాయుడు, ఏపీఎస్ఈబీలో ఏఏఓగా పనిచేస్తున్నారు. అమ్మ లక్ష్మీదేవి గృహిణి. స్కూల్ విద్య అంతా కూడా రాజంపేట, ఇంటర్ విజయవాడలో సాగింది.
ఎంసెట్‌లో స్టేట్ రెండవ ర్యాంక్ సాధించి నందుకు ఎలా ఫీలవుతున్నారు?
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో రెండవ ర్యాంకు సాధించాను. చాలా సంతోషంగా ఉంది. కొవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా లెక్చరర్లు ధైర్యం చెప్పారు. ఆన్లైన్ క్లాసుల ద్వారా చదివించారు. ఇంకా ఆన్లైన్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల ప్రిపరేషన్ బాగా సాగింది. ఇచ్చిన షెడ్యూల్ ఏదీ మిస్ కాకుండా.. ఏకాగ్రతతో ప్రతిరోజు చదివాను. అనుకున్నది సాధించాను.
జేఈఈ అడ్వాన్స్, మెయిన్స్?
జేఈఈ మెయిన్స్‌లో 100 పర్సంటైల్ సాధించాను. అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ర్యాంకు సాధిస్తాననే నమ్మకం ఉంది.
మెరిట్ టెస్టులు రాశారా? ఏమైనా ర్యాంకులు సాధించారా?
NTSEకు ఎంపికయ్యాను. KVPY స్కాలర్షిప్ తీసుకుంటున్నాను.
భవిష్యత్ లక్ష్యాలు ఏంటి?
విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేసి.. ఆ తర్వాత ఎంఎస్ చదివి గొప్ప సైంటిస్ట్ కావాలన్నదే లక్ష్యం. విద్యార్థులకు నేనిచ్చే సలహా కష్టపడి, ఇష్టపడి ప్రణాళికతో చదివితే అనుకున్న లక్ష్యాలు ఈజీగా సాధించవచ్చు. ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు.
సొంతంగా ఆవిష్కరణలు చేయాలనేది లక్ష్యం:ఎండీ అబ్దుల్ ముఖీత్
టోలిచౌకి, హైదరాబాద్
ఎంసెట్ ఇంజినీరింగ్ ర్యాంక్- 3
మార్కులు- 156.450694
విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం ?
నాన్న అబ్దుల్ హమీద్, టీచర్. అమ్మ రేష్మ తబుస్సుమ్ గృహిణి. మా నేటివ్ ప్లేస్ నల్లగొండ పట్టణం. నా చదువుల కోసం హైదరాబాద్‌లోని టౌలిచౌకీలో స్థిరపడ్డాం. స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ హైదరాబాద్‌లోనే సాగింది.
ఎంసెట్‌లో స్టేట్ 3వ ర్యాంక్ సాధించినందుకు ఎలా ఫీలవుతున్నారు?
చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా తాతయ్య, తల్లిదండ్రులు, మామయ్యల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారంతో ఈ ర్యాంకు సాధించాను. కరోనా నేపథ్యంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాను. ఆన్లైన్ క్లాసులతో ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల ప్రిపరేషన్ బాగా సాగింది. కాలేజీలో ఇచ్చిన షెడ్యూల్, టెస్టులు మిస్ కాకుండా చూసుకునేవాడిని.
ఎంసెట్‌కు కోచింగ్ తీసుకున్నారా? ప్రిపరేషన్ ఎలా సాగింది? మెరిట్ టెస్టులు ఏమైనా రాశారా?
ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. సరైన ప్రణాళిక సిద్ధం చేసుకొని ఏకాగ్రతతో రోజుకు 8 నుంచి 10 గంటలు చదివాను. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ ప్రిపరేషన్‌తో పాటు ఎంసెట్ ప్రిపరేషన్ కొనసాగించాను. ఐఎన్ఎంలో మెరిట్ సర్టిఫికెట్ వచ్చింది. ఒలింపియాడ్ పరీక్ష రాశాను. ఇంటర్లో 982 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో 99.97 మార్కులు సాధించాను.
భవిష్యత్ లక్ష్యాలు, విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
టాప్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదవాలన్నదే నా లక్ష్యం. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించి ఐఐటీలో చేరతాను. నూతన ఆవిష్కరణలు చేపడతాను. చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి, ఇష్టపడి చదివితే విజయం తప్పకుండా లభిస్తుంది.
ఐఐటీ బాంబేలో చేరుతా: మిడతన ప్రణయ్
కామాక్షీ నగర్, విజయనగరం, ఏపీ
ఎంసెట్ ఇంజినీరింగ్ ర్యాంక్- 7
మార్కులు- 153.306697
విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం
నాన్న ఎంవై రామారావు, తల్లి జ్యోతి ఇద్దరు కూడా ఉపాధ్యాయులు. నాన్న ఇంగ్లిష్ టీచర్, అమ్మ తెలుగు టీచర్. స్కూల్ విద్య విజయనగరం, ఇంటర్మీడియట్ విజయవాడలో చదివాను.
ఎంసెట్‌లో స్టేట్ ఏడవ ర్యాంక్ సాధించినందుకు ఎలా ఫీలవుతున్నారు?
చాలా సంతోషంగా ఉంది. అమ్మ, నాన్నల సహాయ సహకారంతో పాటు మా లెక్చరర్ల మార్గనిర్దేశం ర్యాంకు సాధనలో ఎంతో దోహదపడ్డాయి. కరోనా పరిస్థితుల్లో కాలేజీలు మూతపడటం కొంత ఇబ్బంది అయినా కూడా ఆన్లైన్ క్లాసుల ద్వారా లెక్చరర్లు చదివించారు. ఏకాగ్రతతో చదివి ఈ ర్యాంకు సాధించాను.
ఎంసెట్ ప్రిపరేషన్, కోచింగ్,మెరిట్ టెస్ట్‌లు, జేఈఈ ?
ఎంసెట్‌కు ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. NTSEకు ఎంపికయ్యాను. KVPY స్కాలర్షిప్ తీసుకుంటున్నాను. INJSO, IAPT (ఇండియన్ నేషనల్ జూనియర్ సైన్స్) ఒలింపియాడ్ జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో పాల్గొన్నాను. జేఈఈ మెయిన్స్‌లో 99.985 పర్సంటైల్ సాధించాను.
భవిష్యత్ లక్ష్యాలు ఏంటి?
బాంబే ఐఐటీలో కంప్యూటర్స్ చదివి యునైటెడ్ స్టేట్స్లో ఎంఎస్ చేయాలన్నదే నా కోరిక. నూతన ఆవిష్కరణలు చేయాలన్నది నా లక్ష్యం. ఇష్టపడి చదివితే ఏదైనా సాధ్యమే.
జోస్యుల వెంకట ఆదిత్య
హైదర్‌నగర్, హైదరాబాద్
ఎంసెట్ ఇంజినీరింగ్ ర్యాంక్- 5
మార్కులు- 154.746763
మా నాన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి. అందుకే నాక్కూడా సాఫ్ట్వేర్ రంగంపై ఆసక్తి పెరిగింది. ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేయాలనుకుంటున్నా
ఢిల్లీ ఎయిమ్స్ సీటే లక్ష్యం:మండవ కార్తికేయ
బాలానగర్, హైదరాబాద్
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ర్యాంక్- 1
మార్కులు- 151.992203
విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం?
నాన్న డాక్టర్ మోహన్‌రావు, బీహెచ్ఈఎల్ (R&D) జనరల్ మేనేజర్. అమ్మ శాంతిశ్రీ గృహిణి. పదవ తరగతి వరకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్, ఇంటర్ ఓ ప్రైవేటు కాలేజీలో పూర్తిచేశాను.
ఎంసెట్ మెడికల్ స్ట్రీమ్‌లో స్టేట్ 1వ ర్యాంక్
సాధించినందుకు ఎలా ఫీలవుతున్నారు?
చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు. ఆన్లైన్ క్లాసులతో పాటు టీచర్ల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి.
భవిష్యత్ లక్ష్యాలు?
డాక్టర్ కావాలన్నదే కోరిక. నీట్లో మంచి ర్యాంకు సాధించి ఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఎందులో స్పెషలైజేషన్ చేయాలనేది తర్వాత నిర్ణయించుకుంటాను.
డాక్టర్ కావాలన్నదే లక్ష్యం:బండగొర్ల రామకృష్ణ
చిత్తలూరు, శాలిగౌరారం మండలం, నల్లగొండ
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ర్యాంక్- 10
మార్కులు- 148.076915
విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం ?
నాన్న వీరస్వామి, రైతు. అమ్మ పద్మ. అమ్మానాన్న ఇద్దరూ కూడా వ్యవసాయం చేసుకునేవారే. తల్లిదండ్రులు పెద్దగా విద్యావంతులు కాకపోయినా నన్ను, అక్కయ్యను బాగా చదివిస్తున్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థానికంగా సాగింది. 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు సూర్యాపేటలోని ఓ ప్రైవేటు స్కూల్లో, ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లో పూర్తిచేశాను.
10వ ర్యాంకు రావడం ఎలా ఫీలవుతున్నారు? ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారా?
చాలా సంతోషంగా ఉంది. అమ్మానాన్నల ప్రోత్సాహం, కాలేజీ లెక్చరర్ల సహకారంతో ఈ ర్యాంకు సాధించాను. ఎంసెట్‌కు ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. కాలేజీ ఆన్లైన్ క్లాసులతో పాటు, టెస్టులు పెట్టి పరీక్షలకు ప్రిపేర్ చేశారు. కాలేజీ లెక్చరర్ల సలహాలు, సూచనలు ఎంతగానో ఉపకరించాయి.
భవిష్యత్ లక్ష్యాలు, విద్యార్థులకు మీరిచ్చే సలహాలు సూచనలు?
డాక్టర్ అవ్వాలన్నదే లక్ష్యం. మా పెద్దనాన్న టీచర్, ఇద్దరు బాబాయిల్లో ఒకరు అమెరికాలో డాక్టర్. వారిని స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ కావాలనే లక్ష్యంతో నీట్‌కు సిద్ధమవుతున్నాను. ఎంసెట్ ర్యాంకుతో ఢిల్లీ ఎయిమ్స్‌లో మెడిసిన్ సీటు సాధిస్తానన్న నమ్మకం కలిగింది.
గొప్ప డాక్టర్ అవుతా : తేరుపల్లి సాయికౌశల్ రెడ్డి
కూకట్పల్లి, హైదరాబాద్
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ర్యాంక్- 3
మార్కులు- 150.124273
విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం ?
నాన్న విష్ణువర్ధన్ రెడ్డి విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజినీర్. అమ్మ రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్. స్కూల్ స్థాయి నుంచి ఇప్పటివరకు విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లో సాగింది.
ఎంసెట్ మెడికల్ స్ట్రీమ్‌లో స్టేట్ 3వ ర్యాంక్
సాధించినందుకు ఎలా అనిపిస్తుంది?
చాలా చాలా సంతోషంగా ఉంది. ఇందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించారు. కాలేజీ లెక్చరర్లు అన్ని విధాలా సహకరించారు. ముందే లక్ష్యాన్ని నిర్దేశించుకొని తగిన ప్రణాళిక ప్రకారం చదవడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
ఎంసెట్‌కు కోచింగ్ తీసుకున్నారా? ప్రిపరేషన్
ఎలా సాగింది? మెరిట్ టెస్టులు ఏమైనా రాశారా?
ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. సొంతంగానే ప్రిపరేషన్ సాగింది. రోజుకు 8 గంటల నుంచి 10 గంటలు చదివాను. నీట్‌కు ప్రిపేరవుతూనే ఎంసెట్‌కు కూడా చదివాను. కాలేజీ ఆన్లైన్ క్లాసులతో పాటు టెస్టులు పెట్టి పరీక్షలకు ప్రిపేర్ చేశారు. ప్రాక్టీస్ టెస్టులు బాగా రాశాను. కొవిడ్ నేపథ్యంలో అధైర్యపడకుండా దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. కేవైపీవైలో ఆలిండియా 95వ ర్యాంకు వచ్చింది.
భవిష్యత్ లక్ష్యాలు, విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
ఇంట్లో ఎవరూ డాక్టర్లు లేరు. అందుకే డాక్టర్ కావడమే లక్ష్యంగా పట్టుదలతో చదువుతున్నాను. ఇందుకు తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. నీట్‌కు ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటున్నాను. నీట్లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు సాధిస్తాను. గొప్ప డాక్టర్ కావాలన్నదే లక్ష్యం. సాధించాల్సిన లక్ష్యం కోసం నిరంతరం కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు సరైన ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్లాలి.
డాక్టర్ కావాలన్నదే లక్ష్యం :కన్నెకంటి లాస్య చౌదరి
వైరా రోడ్, ఖమ్మం
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ర్యాంక్- 7
మార్కులు- 149.202476
విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం ?
మాది ఖమ్మం పట్టణం. నాన్న పేరు శివరామకృష్ణ. అమ్మ అరుణ. అమ్మ, నాన్న ఇద్దరూ కూడా వైద్యులే. ఇద్దరం అక్కాచెల్లెళ్లం. అక్క లావణ్య ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేసి హౌస్‌సర్జన్‌గా చేస్తున్నది. నా స్కూల్ విద్య ఖమ్మం, ఇంటర్ హైదరాబాద్‌లో సాగింది.
ఎంసెట్ ప్రిపరేషన్, కోచింగ్ ఏ విధంగా సాగింది?
ర్యాంకు రావడం ఎలా ఫీలవుతున్నారు?
చాలా హ్యాపీగా ఉంది. స్కూల్ స్థాయి నుంచే ఎంబీబీఎస్ చదవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాను. కాలేజీలో చెప్పిన పాఠాలు శ్రద్ధగా వింటూ ఉపాధ్యాయులు ఇచ్చిన మెటీరియల్స్ ఫాలో అయ్యాను. కాలేజీలో నిర్వహించిన అనేక టెస్టుల్లో మంచి మెరిట్ కనబరిచాను. లెక్చరర్స్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రిపేరయ్యాను. ఏవైనా సందేహాలు వస్తే ఎప్పటికప్పుడు లెక్చరర్లు వాటిని తీర్చేవారు. ఈ విజయంలో అమ్మ, నాన్న, లెక్చరర్ల పాత్ర ఎంతో ఉంది.
ఇప్పటి వరకు మెరిట్ టెస్టులు అంటే ఒలింపియాడ్ స్కాలర్షిప్ లాంటి టెస్టులు రాశారా?
అందులో ఏమైనా ర్యాంకులు సాధించారా?
పాఠశాల స్థాయిలో అనేక ఒలింపియాడ్ పరీక్షల్లో పాల్గొన్నాను. ప్రైమరీ స్కూల్ లెవల్లో SOF నిర్వహించే IMO, IEO, NSO పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాను. కొన్ని IIT, NITలు నిర్వహించే మెంటల్ ఎబిలిటీ పరీక్షల్లో కూడా
పాల్గొన్నాను.
NSEJS ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ లెక్చరర్స్‌లో జాతీయస్థాయిలో టాప్ 1 ర్యాంక్, ఏఎస్ రావు స్కాలర్ షిప్ టెస్ట్‌లో స్టేట్ 4, 7వ ర్యాంకులు సాధించాను. KYPY ఫైనల్ స్టేజ్‌కు ఎంపికయ్యాను.
భవిష్యత్ లక్ష్యాలు ?
వచ్చే నెలలో జరిగే నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం నా లక్ష్యం. నీట్లో ర్యాంకు ఆధారంగా మంచి వైద్యకాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేసి ఆంకాలజీ (క్యాన్సర్ వైద్యం)లో స్పెషలైజేషన్ చేస్తాను. క్యాన్సర్ రోగులకు అత్యుత్తమమైన వైద్యం అందించాలన్నదే ఆశయం.
విద్యార్థులకు సూచన
తల్లిదండ్రుల మాటలు, లెక్చరర్లు బోధించే విషయాలపై దృష్టిపెట్టండి. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకొని ఫాలో అవ్వాలి. ప్రతిరోజూ 10 గంటలు చదివేందుకు కేటాయించండి. ఇంకా వీటి తో కొంత సమయం క్రీడలకు కేటాయించా లి. కష్టపడి, ఇష్టపడి చ దివితే అనుకున్న లక్ష్యా లు సాధించవచ్చు.
ఎయిమ్స్లోసీటు సాధించడమే లక్ష్యం :రంగు శ్రీనివాస కార్తికేయ
రామచంద్రానగర్, అనంతపూర్, ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్,
మెడికల్ ర్యాంక్- 4
మార్కులు- 150.047578
విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం ?
నాన్న సుదీంద్ర, డాక్టర్. అమ్మ కూడా వైద్యురాలు. ఇద్దరూ అనంతపురంలోనే వైద్యులుగా పనిచేస్తున్నారు. స్కూల్ విద్య అనంతపూర్‌లో పూర్తిచేశాను. పదవ తరగతిలో జీపీఏ పదికి పది సాధించాను. ఇంటర్ విజయవాడలో చదివాను.
ఎంసెట్ మెడికల్ స్ట్రీమ్‌లో స్టేట్ 4వ ర్యాంక్ సాధించినందుకు
ఎలా ఫీలవుతున్నారు? ఇంటర్లో మార్కులు ఎన్ని,
ఎంసెట్ ప్రిపరేషన్ ఏ విధంగా సాగింది?
తెలంగాణ మెడికల్ స్ట్రీమ్‌లో స్టేట్ 4వ ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. జేఈఈ కోసం ప్రిపేరవుతూ ఎంసెట్‌కు ప్రిపేరయ్యాను. రోజుకు 10 గంటలు చదివాను. ఇంటర్లో 976 మార్కులు సాధించాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, లెక్చరర్ల సలహాలు, సపోర్ట్ అందించారు. కొవిడ్ నేపథ్యంలో కాలేజీ ప్రత్యక్ష క్లాసులు లేకపోయినా ఆన్లైన్ క్లాసులతో పాటు, టెస్టులు పెట్టి పరీక్షకు ప్రిపేర్ చేశారు.
ఎంసెట్ ప్రిపరేషన్, కోచింగ్, మెరిట్ టెస్ట్‌లు ఏమైనా రాశారా?
ఎంసెట్‌కు ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. KVPY స్కాలర్షిప్కు ఎంపికయ్యాను.
భవిష్యత్ లక్ష్యాలు, విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
డాక్టర్ కావాలన్నదే ఆశయం. నీట్లో మంచి ర్యాంకు సాధించి ఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. చదివే ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి అది ఎందుకు సరైనదో ప్రశ్నించుకోవడం చాలా ముఖ్యం. అలా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు సరైన దారిలో వెళ్తున్నామని నా భావన. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదివితే చాలా మంచిది.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు